
‘‘పరిటాల కుటుంబం ఉద్యమాన్ని స్వార్థానికి వాడుకుంటోంది. అణగారిన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తోంది. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు...రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’’ అని మాజీ నక్సలైటు, 2004లో పోలీసుల తూటాలకు బలైన నక్సల్ ఉద్యమ నేత ఎర్రసత్యం సతీమణి అరుణక్క అలియాస్ జ్యోతక్క అభిప్రాయపడ్డారు. నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె...ఆ తర్వాత వైఎస్సార్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె... బుధవారం తనకల్లు మండలం ఉస్తినిపల్లిలోని తన స్వగృహంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు.
అనంతపురం, కదిరి: నక్సల్ ఉద్యమం...ప్రస్తుత రాజకీయాలపై జ్యోతక్క తన అభిప్రాయాలను సాక్షితో ఇలా పంచుకున్నారు.
‘సాక్షి’: నక్సల్ ఉద్యమానికి ఎలా ఆకర్షితులయ్యారు..?
జ్యోతక్క: మా పుట్టిల్లు తాడిపత్రి. మా నాన్న నక్సల్ ఉద్యమంలో రైతు కూలీ సంఘ నాయకుడిగా ఉండేవారు. అలా నేను కూడా ఆకర్షితురాలినై చిన్నప్పుడే జననాట్య మండలిలో చేరి ఉద్యమంలోకి వెళ్లాను. గణపతి వర్గంలో జిల్లా కమిటీలో పనిచేశాను. నా భర్త ఎర్రసత్యం ఎంఏ గోల్డ్‌మెడలిస్ట్. ఆయన ఎస్కేయూలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ.. నక్సల్ ఉద్యమంలో చేరి రాష్ట్ర కమిటీలో చురుగ్గా ఉండేవారు.
‘సాక్షి’: పరిటాల కుటుంబీకులు కూడా నక్సల్ ఉద్యమంలో పనిచేశారు కదా..!
జ్యోతక్క: రవి తండ్రి శ్రీరాములు, రవి సోదరుడు హరి వీరిద్దరూ పనిచేశారు. వారి గురించి ప్రస్తావించలేము. కానీ పరిటాల రవితో పాటు ఆయన సతీమణి సునీత చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు...మా కుటుంబం అణగారిన వర్గాల కోసం పనిచేస్తోందని ప్రజల్ని నమ్మిస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నక్సల్ ఉద్యమాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. వారికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
‘సాక్షి’: వైఎస్సార్, చంద్రబాబు..వీరిద్దరిలో ఎవరు ప్రజల మనిషి..?
జ్యోతక్క: వైఎస్ రాజ శేఖరరెడ్డికి, చంద్రబాబుకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు ఏమీ లేకపోయినా హంగామా ఉంటుంది. కానీ వైఎస్సార్ ప్రజల మనిషి. ఆయన అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డారు. ఆఖరుకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ఎక్కువ రోజులు పరిపాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అదే వైఎస్సార్ ఎక్కువ రోజులు పరిపాలించినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది.
‘సాక్షి’: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు?
జ్యోతక్క: ఇప్పుడున్న పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్ అన్పించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. గత ఎన్నికల్లోనే ఆయన ఒక్క అబద్ధం చెప్పింటే అధికారంలోకి వచ్చేవారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ జగన్ అని చెప్పచ్చు. ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరగాలంటే జగనన్నే కరెక్ట్. అందుకే నేను కూడా ఎంతో కొంత ప్రజలకు నా వంతు ప్రజా సేవ చేయాలని భావించే వైఎస్సార్‌సీపీలో చేరాను.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ప్రజలను పలకరించిన తీరుగానీ..ప్రజల కోసం ఆయన పడుతున్న తపన గానీ చూస్తే ఆయన జనం కోసమే పుట్టారేమో అనిపిస్తోంది
Comments
Please login to add a commentAdd a comment