
సాక్షి, హైదరాబాద్: పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయకుండా ప్రభుత్వం పండుగ (దసరా) నాడు కూడా పస్తులు ఉంచుతుందా అని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేడిపల్లి సత్యం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటయ్యేదాకా రేషన్ ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేదని.. కానీ ఇప్పుడు అన్ని సరుకుల పంపిణీ జరగటం లేదని ఆరోపించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రూ.220 కోట్లు ఖర్చుచేసిన సీఎం.. పేదలకు మాత్రం రూ.50 నాసిరకం చీరలను పంచారని విమర్శించారు. ఇందులో కమీషన్ల పేరిట రూ.150 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడం లేదని, పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని విమర్శించారు.