మిర్యాలగూడ: ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు సొంతింటికి దూరంగా ఉన్న ఓ మావోయిస్టు నేత ఇన్నేళ్లకి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గజ్జల సత్యంరెడ్డి అలియాస్ గోపన్న పీపుల్స్‌వార్ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేశారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1980లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు కీలకంగా పని చేశారు.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించిన సత్యంరెడ్డి 26 ఏళ్లు అడవిలో ఉండి.. 17 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీసులు మోపిన అన్ని కేసులనూ కోర్టులు కొట్టివేయడంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తమ్ముడితో కలిసి సొంత ఊరైన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సత్యంరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
అజ్ఞాతంలో ఉండగానే సత్యంరెడ్డి తోటి పార్టీ సభ్యురాలిని వివాహం చేసుకోగా ఆమె ఎన్‌కౌంటర్‌లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియరాలేదు. సత్యంరెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరిని సందర్శించి.. చిన్నప్పుడు తాను తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి గుర్తుచేసుకున్నారు. తాను జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన చెందారు.
అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబసభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగపూరిత వాతావరణంలో కంటతడిపెట్టారు. ఇక మీదట తన జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లేది లేదని సత్యంరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment