సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు.
కాగా రాయల్ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment