Devipatnam
-
ఫజుల్లాబాద్‌కు విదేశీ పక్షులు.. ప్రాణంగా చూసుకుంటాం..
రంపచోడవరం: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది. సుమారు వెయ్యికి పైగా సైబీరియా పక్షులు గ్రామానికి తరలివచ్చాయి. గ్రామంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో ఇవి ఏటా ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండటం వీటి సంతానోత్పత్తికి అనుకూలం. అందువల్ల ఏటా జూలై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడే ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలిపారు. ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలపాటు ఉంటాయి. వీటిని అతిథులు మాదిరిగా గ్రామస్తులు చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గ్రామంలోని పక్షులకు ఎవరైనా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏటా గ్రామానికి వస్తుండటంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నారు. ఐదు నెలలపాటు గ్రామంలో చింతచెట్లపైనే ఉంటున్నాయి. గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జూలై నెలలో వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబరు నెలాఖరులోపు వెళ్లిపోతాయి. ఫజుల్లాబాద్ గ్రామానికి చుట్టుపక్కల పంటపొలాలు, చెరువులు ఉన్నందున ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోతుల బెడద ఎక్కువైంది. పక్షలు గూళ్లను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాణంగా చూసుకుంటున్నాం గ్రామంలో ఉండే కొంగలకు ఎవరు హాని తలపెట్టారు. మొదట్లో వాటిని పట్టుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నించారు. గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎవరూ హాని తలపెట్టరు. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. – ధర్మరాజు, ఫజుల్లాబాద్, దేవీపట్నం మండలం -
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్‌డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
ఎమార్వో చేతివాటం
-
ఆ జ్ఞాపకం... ఓ విషాదం
రంపచోడవరం : దేవీపట్నానికి సమీపంలోని కచ్చులూరు వద్ద పాపికొండలకు చేరువలో పర్యాటకులతో వెళ్తున్న వశిష్ట బోటు గోదావరిలో మునిగి మంగళవారానికి ఏడాది అవుతోంది. నాటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అప్పటి నుంచీ పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. మునిగిపోయిన ఈ బోటును వెలికి తీసేందుకు 38 రోజులు పట్టింది. కచ్చులూరు గిరిజనుల సాహసం ఫలితంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. 46 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. (వారిని గోదారమ్మ మింగేసిందా?) బోటు బయలుదేరినప్పటి నుంచీ...సెప్టెంబరు 15న పోచమ్మ గండి నుంచి రాయల్ వశిష్ట బోటు ఉదయం 9.30కు బయలుదేరింది. అక్కడి నుంచి దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు చేరిన సమయంలో అనుమతుల విషయంలో పోలీసులతో వాగ్వివాదం జరిగి, తిరిగి బోటు ప్రయాణం పాపికొండల వైపు సాగింది. మధ్యాహ్నం 1.48 గంటలకు కచ్చులూరు మందం వద్దకు చేరింది. అక్కడ కొండ మలుపు వద్ద కచ్చులూరు మందంలో బోటు ఒక్కసారిగా కుదుపునకులోనై మునిగిపోయింది. కచ్చులూరు, తూటిగుంట గిరిజనులు బోటు మునిగిపోతుండంగా 26 మందిని కాపాడారు. (6.3 లక్షల చొప్పున సాయం) 24 గంటలు గడవక ముందే గోదావరిలో బోటు మునిగిన ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అధికారులు అందజేశారు. ప్రమాదం జరిగిన 24 గంటలలోపే బోటు మునిగిన ప్రాంతాన్ని ఏరియాల్ వ్యూ ద్వారా గుర్తించారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతుల వద్దకు వెళ్లి పరామర్శించారు. బోటును వెలికితీసేందుకు... కచ్చులూరు మందంలో మునిగిన వశిష్ట బోటును వెలికితీసేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించాయి. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా బోటు జాడను కనిపెట్టలేకపోయారు. బోటు వెలికితీతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్స్ ధర్మాడి సత్యం బృందానికి అప్పగించారు. గోదావరిలో మునిగిన బోటును ఐరన్ రోప్, క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలం కావడంతో, ప్రైవేట్ డైవర్లు బోటు అడుగు భాగానికి వెళ్లి బోటుకు రోప్ బిగించడంతో కథ సుఖంతామైంది. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాల గాలింపు, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు, వారి బంధువులకు మృతదేహాలు అప్పగింత వరకు అధికారులు ఎంతో శ్రమించారు. -
మునుపెన్నడూ చూడలేదు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/దేవీపట్నం/కుక్కునూరు: ఉభయ గోదావరి జిల్లాలకు వరద వస్తే అక్కడి ప్రజలకు తట్టాబుట్టా చేత పట్టుకుని పిల్లాపాపలతో ఎక్కడికి వెళ్లాలా అనే రోజులు పోయాయి. ఇప్పుడు ముందస్తుగానే సమాచారం ఉండటం, ప్రభుత్వం అన్ని సదుపాయాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారికి ముంపు చింత తప్పింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారాయని తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం ప్రాంత వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ కళాశాల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసింది. వరద ముంపులో ఉన్న దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం, పశ్చిమగోదావరి కుక్కునూరు మండలంలోని గ్రామాల్లో బాధితులను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ► దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం ముంపులో ఉన్నాయి. ► కొండపై ఉన్న శివాలయం, తొయ్యేరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో కొంతమంది తలదాచుకున్నారు. ► ఈ గ్రామాల్లో బాధితుల కోసం ప్రభుత్వం రంపచోడవరంలో అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, మంచాలు ఏర్పాటు చేశారు. ► వరదలు వచ్చే రెండు రోజులు ముందుగానే ఆ గ్రామాల్లోని 14 మంది గర్భిణులు, బాలింతలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఆగస్టు 16న వరద ముంచెత్తడంతో సుమారు 80 మందిని ఈ కేంద్రానికి తీసుకువచ్చారు. గతంలో బిక్కుబిక్కుమంటూ.. గతంలో వరద వచ్చినప్పుడు కొండపై పునరావాసం కల్పించినా కనీస వసతులు లేక బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేదని పునరావాస కేంద్రంలో ఉన్న వెంకన్న చెప్పాడు. ఈసారి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపాడు. అధికారులు కంటికి రెప్పలా చూసుకున్నారని ఆ కేంద్రంలో ఉన్న వారు ముక్తకంఠంతో తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు మూడు రకాల వంటకాలతో రుచికరమైన భోజనం, 3 గంటలకు టీ, రాత్రి ఏడయ్యేసరికి వేడివేడి భోజనం పెడుతున్నారని అక్కడి వారు చెప్పారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ► పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు మండలంలో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► ప్రతి పునరావాస కేంద్రానికి స్పెషల్ ఆఫీçసర్‌ను కేటాయించి అన్ని సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, నీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు అందుబాటులో ఉంచారు. ► మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అక్కడ తలదాచుకుంటున్న వారు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో దారుణమైన పరిస్థితులుండేవి గతంలో పునరావాస కేంద్రంలో చాలా దారుణమైన పరిస్థితులుండేవి. చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. తేళ్లు, పాములతో సావాసం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమయానికి అన్నీ అందుతున్నాయి. వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. – బుర్రే ఆనందరావు, వరద బాధితుడు, దేవీపట్నం ఇక్కడే మెడికల్ క్యాంప్ పునరావాస కేంద్రం చాలా శుభ్రంగా ఉంది. రోజుకు రెండుసార్లు గదులను శుభ్రం చేస్తున్నారు. ఇక్కడే మెడికల్ క్యాంపు నిర్వహిస్తుండటంతో ఎటువంటి ఇబ్బందీ లేదు. వరద సమయంలో ఇక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. – కెచ్చెల భూలక్ష్మి, వరద బాధితురాలు, అగ్రహారం -
బోటు ప్రమాదం : 6.3 లక్షల చొప్పున సాయం
సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. కార్మిక శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.6.30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ బాధిత కుంటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. పడవ ప్రమాదంలో చనిపోయిన గొర్రె రమాదేవి, బస్కె రేణుక, కొమ్ముల పుష్ప, కొండూరు కౌసల్య, బస్కె లలితకు కార్మిక శాఖ తరపున గుర్తింపు కార్డులు ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. అయినా వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం కొంత ఊరట. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారం మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.6.30 లక్షలకు పెంచారు. సీఎం ఆదేశాల మేరకు పడవ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉన్నాం. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ రాష్ట్రం వారితో సమానంగా పరిహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బోటు ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు గుర్తింపు కార్డులు వచ్చేలా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ప్రీమియం మొత్తం చెల్లించి కార్మికులకు అండగా ఉన్నారు’అని చెప్పారు. -
వారిని గోదారమ్మ మింగేసిందా?
సాక్షి , విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపాన గత నెల 15న గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 17మంది గల్లంతయ్యారు. ఆ దుర్ఘటనలో గల్లంతైన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఘటన జరిగిన రోజు నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో 13మంది మృతదేహాలను గుర్తించి జిల్లాకు తీసుకువచ్చారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర), రామలక్ష్మీ కాలనీకి చెందిన దివంగత మధుపాడ రమణబాబు. అరుణకుమారిల కుమారుడు అఖిలేష్(9), గాజువాకకు చెందిన దివంగత మహేశ్వరరెడ్డి, స్వాతిల కుమారుడు విఖ్యాత్‌రెడ్డి(6).. మొత్తంగా ఈ నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం లభించలేదు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా నెల కిందట గాలింపు చర్యలు నిలిపివేసిన దరిమిలా.. మళ్ళీ రెండు రోజుల కిందట ఏకంగా బోటును ఒడ్డుకు తీసుకువచ్చి దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తూ వచ్చారు. ఇందులో గాజువాకకు చెందిన విఖ్యాత్‌రెడ్డి మృతదేహం మాత్రం లభ్యమైంది. విఖ్యాత్‌రెడ్డి తల్లిదండ్రులు మహేశ్వరరెడ్డి, స్వాతిలతో పాటు సోదరి హన్సిక కూడా అదే బోటు ప్రమాదంలో మృతిచెందారు. వారి మృతదేహాలను గత నెల 23వ తేదీన బంధువులకు అప్పగించారు. ఇద్ద రు పిల్లలతో సహా మహేశ్వరరెడ్డి కుటుంబం మొత్తం బోటు ప్రమాదానికి బలైపోయిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ ముగ్గురూ అంతేనా.. కనీసం విఖ్యాత్‌రెడ్డి చివరిచూపైనా దక్కిందనుకుంటే మిగిలిన ముగ్గురు చిన్నారుల జాడ కానరాకపోవడంతో వారి రక్తసంబంధీకులు తల్లిడిల్లిపోతున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియని అఖిలేష్(9) తల్లిదండ్రులు మధుపాడ రమణబాబు. అరుణకుమారి, సోదరి కుశాలి.. ఈ ముగ్గురూ ఆ బోటు ప్రమాదంలో మృతిచెందారు. అఖిలేష్ ఆచూకీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాం... పోనీ బాడీ దొరికినా చాలని అనుకుంటున్నాం... అని అతని చిన్నాన్న రామకృష్ణ గద్గదస్వరంతో అన్నారు. ఆ ముగ్గురికీ దహన సంస్కారం చేశాం.. చివరికి అఖిలేష్‌కి ఆ కర్మక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటూ విలపించారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మిలది నిజంగా గుండెలు పిండే విషాదం. ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర)లను రెండు కళ్ళల్లా అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చారు. నానమ్మ అప్పలనర్సమ్మ, బంధువులతో కలిసి ఆ రోజు గోదావరి బోటు షికారుకు వెళ్ళారు. అప్పలనర్సమ్మ మృతదేహం బయటపడినా పసి పిల్లల ఆచూకీ మాత్రం నేటికీ తెలియలేదు. మా కంటిపాపలు కానొస్తే చాలు.. మేమే పాపం చెయ్యలేదు. కానీ భగవంతుడు ఎందుకు ఇంత విషాదం కలిగించాడో.. అర్థం కావడం లేదు. 30 రోజులకు పైగా మా మరిది శ్రీనివాస్ గోదావరి ఒడ్డునే ఉంటున్నాడు. ఎక్కడైనా కానొస్తారేమో లేదా.. పోనీ.. పోయిన ప్రాణాలతోనైనా కనిపిస్తారేమోనని అక్కడే పడిగాపులు కాస్తూ వచ్చాడు. కానీ.. ఇక కడచూపు ఆశ కూడా దక్కనట్టేనని అనిపిస్తోంది.. అని ఆ చిన్నారుల తల్లి భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పింది. చదవండి : కడసారి చూపు కోసం.. చదవండి : ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు -
బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు
రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం క్రైం: తమ వారి మృతదేహాల కోసం 38 రోజులపాటు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కడచూపు దక్కకపోయినా.. ఇన్నాళ్లకు తమ వారి మృతదేహపు ఆనవాళ్లయినా దొరికాయని కొందరు.. తమ వారి ఆచూకీ నేటికీ దొరక్క మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గతనెల 15న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాద ఘటనలో.. బోటు వెలికితీత చివరి రోజైన మంగళవారం బోటులోనే 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో బుధవారం ఉదయం వారంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. తల ఉంటే మొండెం లేకపోవడం, మొండెం ఉంటే తల లేకపోవడంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. లభ్యమైన ఏడు మృతదేహాలలో ఐదింటిని కాకినాడకు చెందిన సంగాడి నూకరాజు (55), మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ (62), నల్గొండ జిల్లా హలియా గ్రామానికి చెందిన సురభి రవీంద్ర (25), వరంగల్ జిల్లా కడిపి కొండ గ్రామానికి చెందిన కొమ్ముల రవి (40), బస్కే ధర్మరాజు (48) మృతదేహాలుగా గుర్తించారు. ఆరో మృతదేహం తల, మొండెం లేకుండా కింది భాగం మాత్రమే ఉండగా.. అది మంచిర్యాలకు చెందిన కారకూరి రమ్యశ్రీ (24)దని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అతి పాత పట్టిసీమకు చెందిన బోటు సహాయకుడు కర్రి మణికంఠదని అతని తండ్రి నరసింహారావు చెప్పారు. ఎటూ తేల్చకోలేని అధికారులు దాని శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. దుస్తులు, తాయెత్తు ఆధారంగా.. కాకినాడకు చెందిన బోటు సరంగు (డ్రైవర్) సంగాడి నూకరాజు మృతదేహాన్ని ఆయన వేసుకున్న టీషర్ట్ ఆధారంగా అతని కుమారుడు ధర్మారావు గుర్తించారు. వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కే ధర్మరాజును అతను వేసుకున్న బ్లూషర్ట్, బ్లాక్ ప్యాంట్ ఆధారంగా అతని బంధువులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కొమ్ముల రవి మృతదేహాన్ని జేబులో ఉన్న ఆధార్ కార్డు, పర్సు ఆధారంగా, కాకినాడకు చెందిన బోటు అసిస్టెంట్ డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ మృతదేహాన్ని మెడలో తాయత్తు, వేసుకున్న టీషర్ట్ ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నల్గొండ జిల్లా హాలియాసాగర్‌కు చెందిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ సురభి రవీంద్ర మృతదేహాన్ని అతడు ధరించిన రెడీమేడ్ షర్ట్ ఆధారంగా అతని సోదరుడు మహేష్ గుర్తించాడు. ఆ పుర్రె ఎవరిదో.. ఏడో మృతదేహానికి సంబంధించి తల (పుర్రె) మాత్రమే ఉండటంతో అది మహిళదా, పురుషునిదా అనే విషయం తేలలేదు. దానిని ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించి డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి ఉందని వైద్యాధికారి సీహెచ్ రమేష్‌కిశోర్ తెలిపారు. ఈ బాలుడెవరో.. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట లభించిన బాలుడి మృతదేహాన్ని విశాఖపట్నానికి చెందిన మధుపాడ అఖిలేష్ (5) లేదా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6)దిగా భావిస్తున్నారు. అఖిలేష్ మేనమామ ఆ మృతదేహం తమ వాడిది కాదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు. మొత్తంగా మూడు మృతదేహాల శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. -
ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్ ప్రశంసలు
సాక్షి, తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటును ఒడ్డుకు చేర్చేందుకు నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ వశిష్ట సక్సెస్’ అయింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మంగళవారం మధ్యాహ్నం బోటును ఒడ్డుకు తరలించింది. కాగా, ఎన్నో సవాళ్లతో కూడుకున్న బోటు ఆపరేషన్‌లో పాల్గొన్న ధర్మాడి సత్యం బృందం, స్కూబా డ్రైవర్ల బృందంపై జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి సత్యంకు శాలువ కప్పి స్వీట్ తినిపించారు. దాంతో పాటు రూ.20 లక్షల చెక్కు అందజేశారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్లు కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. గోదావరిలో రాయల్ వశిష్ట బోటు 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని సాంకేతిక పరిఙ్ఞానం ద్వారా తొలుత గుర్తించిన సంగతి తెలిసిందే. (చదవండి : ఒడ్డుకు ‘వశిష్ట’) -
కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించి బయటకు తీసిన సంగ తెలిసిందే. బోటు వెలికితీయగా అందులో 8 మృతదేహాలు లభించాయి. అందులో వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ, ప్రర్యాటకులు.. వరంగల్ జిల్లాకు చెందిన బసికి ధర్మారాజు, నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్, వరంగల్ అర్బన్ జిల్లా కొమ్మల రవి, నంద్యాలకు చెందిన బసిరెడ్డి విఖ్యాత రెడ్డిల మృతదేహాలను కుటుంబీకులు గుర్తుపట్టారు. దీంతో 7 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. బోటులో దొరికిన మరో మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉంది. బోటు ప్రమాదంలో జల సమాధి అయిన మరో 5 గురు పర్యాటకుల మృతదేహాలు ఆచూకీ ఇంకా దొరకలేదు. కాగా, సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. అందులో ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. మొత్తంగా ఆచూకీ తెలియాల్సిన మృతుల వివరాలు.. 1. తలారి గీతా వైష్ణవి(4), విశాఖపట్నం జిల్లా 2. తలారి ధాత్రి అనన్య(6), విశాఖపట్నం జిల్లా 3. మధుపాడ అఖిలేష్(6), విశాఖపట్నం జిల్లా 4. కారుకూరి రమ్యశ్రీ(25), మంచిర్యాల 5. కోడూరి రాజ్‌కుమార్, వరంగల్ 6. కొండే రాజశేఖర్, వరంగల్ -
బోట్ వెలికితీతతో బయటపడ్డ మృతదేహాలు
-
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సాక్షి, రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ డెస్క్‌ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్‌కు చెందిన కొమ్ముల రవి ఆధార్ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు. సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. -
ఆపరేషన్ వశిష్ట సక్సెస్
-
ఒడ్డుకు ‘వశిష్ట’
సాక్షి, కాకినాడ/దేవీపట్నం/రంపచోడవరం: నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న అన్వేషణకు తెరదించుతూ రాయల్ వశిష్ట బోటు మంగళవారం ఒడ్డుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్స్ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. నీట మునిగిన రాయల్ వశిష్ట బోటులో 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆపరేషన్ ఇలా .. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికి తీసేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ నిర్వాహకుడు ధర్మాడి సత్యానికి రాయల్ వశిష్ట వెలికితీత పనులను రూ. 22.70 లక్షలకు అప్పగించారు. ప్రమాదానికి గురైన సమయంలో గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కచ్చులూరు మందం వద్ద ఆ సమయంలో గోదావరిలో 300 అడుగుల లోతు నీరు ఉంది. ధర్మాడి బృందం 25 మంది సభ్యులతో సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి జారిపోయినా పట్టు వీడలేదు. పలు దఫాలు విఫలమైనా ప్రయత్నాలు కొనసాగించింది. ధ్వంసమైన బోటు... మట్టి, ఒండ్రులో చిక్కుకుపోవడంతో సోమవారం బోటు పైకప్పు మాత్రమే ఊడి వచ్చింది. దీంతో మంగళవారం మరోసారి ప్రయత్నించారు. బోటు పంటుకు ఇనుప తాడు కట్టారు. ఆరుగురు గజ ఈతగాళ్లు బోటు చుట్టూ తిరిగి వెనుక భాగంలో ఉన్న ఫ్యాన్‌కు లంగరు వేశారు. అనంతరం పొక్లెయిన్ సాయంతో భారీ ఇనుప తాడు ద్వారా రాయల్ వశిష్ట బోటును గోదావరి నుంచి గట్టుకు తీసుకురాగలిగారు. అయితే ప్రమాదానికి గురైన బోటు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతో దుర్వాసన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మాడి సత్యంతోపాటు కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ కచ్చులూరు వద్దే ఉండి బోటు వెలికితీత పనులును పర్యవేక్షించారు. దారి కూడా లేని చోటుకు భారీ యంత్రాలు.. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికితీత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులను వినియోగించారు. సీఎం జగన్ స్వయంగా ప్రతి రోజూ సహాయక చర్యలపై ఆరా తీస్తూ వచ్చారు. మంత్రులను పంపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. దారి కూడా లేని కచ్చులూరు మందానికి భారీ క్రేన్ తరలించే ఏర్పాట్లు చేశారు. సీఎం వచ్చి మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. చివరి మృతదేహం లభ్యమయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సైతం వెంటనే సమకూర్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పలకరించి కొండంత ధైర్యాన్నిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించారు. ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కష్టమే అయినా సమష్టిగా సాధించాం ‘ఆరంభంలో రాయల్ వశిష్ట బోటు వెలికితీత కష్టంగా అనిపించింది. తొలుత ఐరన్ రోప్ గోదావరిలో తెగిపోయింది. లంగర్లు, ఐరన్ రోప్‌లతో ఉచ్చు వేసి పలుమార్లు లాగడంతో నది అడుగు భాగంలో ఉన్న బోటు కొద్దికొద్దిగా ఒడ్డు వైపు వచ్చింది. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. తరువాత చేపట్టిన ఆపరేషన్‌లో ప్రైవేట్ డైవర్లను రంగంలోకి దించాం. మూడు రోజుల పాటు నదిలోకి దిగి బోటుకు రోప్ కట్టడంలో విజయం సాధించాం. బోటు ఆపరేషన్‌కు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. అధికారులు, బృందం సభ్యులు, విశాఖ డైవర్ల సమష్టి కృషి ఫలితంగా బోటును ఒడ్డుకు తీసుకు రాగలిగాం’ – ధర్మాడి సత్యం (బాలాజీ మెరైన్స్ యజమాని) ఇప్పటిదాకా 46 మృతదేహాలు లభ్యం రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. అందులో 39 మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. తాజాగా బోటు వెలికితీత సమయంలో 7 మృతదేహాలు లభించాయి. మరో ఐదు మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది. శభాష్ కలెక్టర్.. మురళీధర్‌రెడ్డిని అభినందించిన సీఎం రాయల్ వశిష్ట బోటు వెలికితీత, సహాయక చర్యల పర్యవేక్షణలో చురుగ్గా వ్యవహరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ మేరకు సీఎం మంగళవారం కలెక్టర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ఆ నిర్ణయమే కీలకం! రంపచోడవరం: గతంలో పలు చోట్ల నీట మునిగిన బోట్లను వెలికి తీసిన అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం రాయల్ వశిష్ట బోటు వెలికితీతను సవాల్‌గా తీసుకుంది. వెలికితీత ఆపరేషన్ 13 రోజులు కొనసాగింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం బోటు వెలికితీతకు అనుకూలంగా మారింది. 50 అడుగుల లోతులో ఉన్న బోటును ఐరన్ రోప్‌తో లాగే ప్రయత్నం తొలుత సఫలం కాకపోవడంతో విశాఖపట్నం నుంచి డైవర్స్‌ను రప్పించారు. డైవర్స్ నదీ గర్భంలోకి వెళ్లి బోటు అడుగు భాగంలో ఇనుప రోప్‌లు కట్టాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించడం ఫలితాన్ని ఇచ్చింది. ఆపరేషన్ ఇలా... - సెప్టెంబర్ 15: రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయింది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ సహాయ చర్యలకు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హెలికాప్టర్లు, నేవీ, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. - సెప్టెంబర్ 16: ప్రమాద స్థలాన్ని సీఎం వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతులకు నివాళులు అర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. - సెప్టెంబర్ 18: కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం దేవీపట్నం చేరుకుని బోటులో కచ్చులూరు మందం వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలించింది. గోదావరి వడి ఎక్కువగా ఉండడంతో బోటు వెలికితీత ప్రక్రియకు దిగలేదు. - సెప్టెంబర్ 30: బోటు వెలికితీతకు ఆపరేషన్ రాయల్ వశిష్టను ప్రారంభించారు. భారీ ఇనుప తాళ్లు, లంగర్లు సిద్ధం చేసుకున్నారు. - అక్టోబరు 4: బోటు ఉందని గుర్తించిన ప్రాంతంలో 4 రోజులపాటు లంగర్లు వేసి తెగిపోతున్నా ప్రయత్నం కొనసాగించారు. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. - అక్టోబర్ 15: ధర్మాడి బృందం తిరిగి దేవీపట్నం చేరుకుంది. ఈనెల 16న రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ –2 తిరిగి ప్రారంభించి ఆచూకీ గుర్తించారు. మొదటి రోజు ఐరన్ రోప్ ఖాళీగా రావడంతో రెండో రోజు బోటు మునిగిన ప్రాంతంలో ఐరన్ రోప్‌ను ఉచ్చుగా వేశారు. - అక్టోబర్ 18: బోటు ముందు భాగంలోని రైలింగ్ ఊడి వచ్చింది. - అక్టోబర్ 19: బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన రోప్ జారిపోయింది. నదీ గర్భంలో బోటుకు బలమైన రోప్‌ను బిగిస్తేగానీ వెలికి తీసే పరిస్ధితి లేదని ధర్మాడి నిర్ధారణకు వచ్చారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది డైవర్స్‌ను రంగంలోకి దింపారు. - అక్టోబర్ 20: బోటు ముందు భాగం ఒడ్డువైపునకు 40 అడుగులు, వెనుకభాగం నదివైపు 70 అడుగుల లోతులో పక్కకు ఒరిగి ఒడ్డు ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు డైవర్స్ గుర్తించారు. - అక్టోబర్ 21: బోటుకు ఐరన్ రోప్ కట్టి ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేయగా ముందు భాగం కొద్దిగా మాత్రమే ఊడి వచ్చింది. - అక్టోబర్ 22: బోటు కింది భాగానికి రోప్‌లు వేసి లాగి ఒడ్డుకు చేర్చారు. -
‘బోటు ఆపరేషన్‌తో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైంది’
సాక్షి, అమరావతి: ఆపరేషన్ రాయల్ వశిష్టతో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘గత నెల 15న దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది. 250 అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయించాం. బోటు నుంచి 7 మృతదేహాలను బయటకు తీసారు. చివరి మృతదేహం దొరికే వరుకూ మనదే బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. బోటు ప్రమాదం జరిగిన రోజునే సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ మృతుల కుటుంబాలకు కూడా సాయం అందించాలని సీఎం ఆ రోజే చెప్పారు. బాధిత కుటుంబాలకు సాయం అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి పేర్కొన్నారు. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసిన దర్మాడి సత్యం బృందాన్ని మంత్రి కన్నబాబు అభినందించారు. బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేసారని..ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. బోటు ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ వేసామని వెల్లడించారు త్వరలోనే కమిటీ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ప్రమాదాల నివారణకు శాశ్వత విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఆపరేషన్ రాయల్ వశిష్టలో భాగస్వాములైన అధికారులను కూడా మంత్రి అభినందించారు. -
బోటు వెలికితీత.. అత్యంత బాధాకరం
-
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత
-
బోటు వెలికితీత.. హృదయ విదారక దృశ్యాలు
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు.అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును బయటకు తీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ధర్మాడి బృందం బోటును ఒడ్డుకు చేర్చింది. బోటును వెలికితీయడంతో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి. (చదవండి : కచ్చులూరు వద్ద బోటు వెలికితీత) ప్రమాదం జరిగి 38 రోజు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బోటు శిథిలాల్లో మృతదేహాలు చిక్కిపోయాయి. ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు,కుటుంబ సభ్యులు విచారంలో మునిగారు. దుర్వాసన వస్తుండంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆచూకీ లభించనివారి వివరాలు: కర్రి మణికంఠ, తండ్రి నరసింహారావు, పట్టిసీమ పోలవరం.. మధుపాడ కుశాలి, తండ్రి రమణబాబు, విశాఖపట్నం మధుపాడ అఖిలేష్ (5), తండ్రి రమణబాబు, విశాఖపట్నం తలారి గీతా వైష్ణవీ (5), తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం,. తలారి ధాత్రి (18నెలల) తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), తండ్రి,మహేశ్వరరెడ్డి, నంద్యాల.. సంగాడి నూకరాజు (58), (బోటు డ్రైవర్) తండ్రి కామరాజు, జగన్నాధపురం, కాకినాడ పోలాబత్తుల సత్యనారాయణ (50) (డ్రైవర్), తండ్రి, అప్పారావు, కాకినాడ, చిట్లపల్లి గంగాధర్ (35), తండ్రి సత్యనారాయణ, నర్సాపురం.. కొమ్ముల రవి (40), తండ్రి శామ్యూల్, కడిపికొండ వరంగల్ కోడూరి రాజకుమార్(40), తండ్రి గోవర్ధన్, కడిపికొండ, వరంగల్ బస్కీ ధర్మరాజు, తండ్రి కొమరయ్య, వరంగల్.. కారుకూరి రమ్యశ్రీ (22), తండ్రి సుదర్శన్, నన్నూరు మంచిర్యాల్. సురభి రవీందర్ (25), తండ్రి వెంకటేశ్వరరావు, హాలీయా నల్గొండ -
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత
-
రాయల్ వశిష్ట బోటు వెలికితీత
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. రోప్ సాయంతో బయటకు తీశాం : ధర్మాడి సత్యం రోప్‌ల సాయంతోనే బోటును బయటకు తీశామని ధార్మడి సత్యం అన్నారు. బోటు బయటకు తీయడంలో తన బృందంతో పాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
చిక్కినట్టే చిక్కి.. పట్టుజారిన బోటు
-
బోటు ముందుకు.. శకలాలు బయటకు
రంపచోడవరం/దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనుల్లో సోమవారం మరికొంత పురోగతి కనిపించింది. బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్‌ఫామ్, బోటు క్యాబిన్‌లోని కొంత భాగం, హైడ్రాలిక్ గేర్‌రాడ్, రెయిలింగ్‌లోని కొంత భాగం, బోటు టాప్‌పై ఉండే ప్లాస్టిక్ షీట్, బోటు నేమ్ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారటంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు. పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బోటు ముందు భాగం 30 అడుగులు, వెనుక భాగం నది వైపు 50 అడుగుల లోతులో ఉన్నట్లు వారు చెప్పారు. -
రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..
-
రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..
సాక్షి, తూర్పుగోదావరి: దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి టూరిజం బోటు వెలికితీత పనులు కీలక దశకు చేరుకున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం రెండు రోప్‌ల ద్వారా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేయగా.. బోటు పైభాగం రోప్‌తో పాటు ఊడొచ్చింది. ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు చుట్టూ రోప్ వేసి బోటు వెలికితీతకు ప్రయత్నాలు చేయనుంది. మైరన్ డైవర్లు గర్భంలోకి ఆక్సిజన్ తో దిగి బోటు వెనుక భాగానికి ఐరన్ రోప్ కట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నం సఫలమైతే బోటును ఫొక్లైన్ తో బయటకు లాగొచ్చని భావిస్తున్నారు. ఆదివారం ధర్మాడి సత్యం బృందం ఐరన్ రోప్‌ల ద్వారా ఉచ్చు, లంగరు వేసి బోటు వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విశాఖ నుంచి మైరన్ డ్రైవర్లను రప్పించారు. 16 రోజులుగా బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం శ్రమిస్తోంది. వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో బోటును తప్పకుండా తీస్తామని ధర్మాడి బృందం, మైరన్ డ్రైవర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది) -
ఆ మృతదేహం ఎవరిది..?
సాక్షి, వరంగల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో గత నెల 15న చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో ఆదివారం మరో తల లేని మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఆ మృతదేహానికి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిసింది. అయితే కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది గత నెల 14న పాపికొండల టూర్ నిమిత్తం బయలుదేరి 15న జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న విషయం విధితమే. ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఐదుగురు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం లభించిన తల లేని మొండెం ఎవరిదనే ఉత్కంఠ కడిపికొండకు చెందిన ఆచూకి లభించని మూడు కుటుంబాల్లో నెలకొంది. -
బోటు వెలికితీత నేడు కొలిక్కి!
రంపచోడవరం/దేవీపట్నం/కాకినాడ రూరల్: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనులు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి వచ్చిన మెరైన్ డైవర్లు ఆదివారం నదీ గర్భంలో చిక్కుకున్న బోటు వద్దకు పలుమార్లు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి ప్రమాద ప్రాంతంలో పైకి తేలింది. నల్ల జీన్ ప్యాంట్, తెల్ల టీషర్ట్‌తో ఉన్న ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది. ఇదిలావుంటే.. నదీ గర్భంలోకి వెళ్లిన మెరైన్ డైవర్లు నీటి అడుగున బోటు ఏ పరిస్థితిలో ఉంది, ఎంత లోతులో ఉందనే విషయాలను కనుగొని అధికారులకు, ధర్మాడి సత్యం బృందానికి వివరించారు. నీటి అడుగున 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు ముందు భాగం 35 అడుగుల లోతున నదీ ప్రవాహానికి అడ్డంగా ఉందని, వెనుక భాగం 70 అడుగుల లోతులో ఉందని మెరైన్ డైవర్స్ అంచనా వేశారు. బోటు ముందు భాగం కొంతమేర బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతమైన కచ్చులూరు మందం నుంచి దాదాపు వంద మీటర్ల దిగువకు కొట్టుకెళ్లిందని తెలిపారు. బోటు వెలికితీత పనులు చేపట్టిన ప్రతిసారి కచ్చులూరు మందం వద్ద భారీగా వర్షం పడుతుండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. నదీ గర్భంలోని బోటుకు ముందు భాగంలో ఐరన్ రోప్ చుట్టేందుకు ఆదివారం మెరైన్ డైవర్లు ప్రయత్నించగా.. వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. భారీగా వర్షం కురవడంతో సాయంత్రం 5 గంటలకు పనులను నిలిపివేశారు. తిరిగి సోమవారం పనులు ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్ డైవర్లు చెప్పారు. బోటు వెలికితీతలో ప్రగతి రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీతలో ప్రగతి కనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కాకినాడ ఏపీఎస్పీలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. గోదావరిలో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం, భారీ సుడిగుండాల వల్ల బోటును బయటకు తీయడం సాధ్యం కాలేదని చెప్పారు. ధర్మాడి సత్యం బృందం 15 రోజులుగా దీనిని వెలికితీసేందుకు శ్రమిస్తోందన్నారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సత్యం బృందానికి బోటు ఆనవాళ్లు లభించాయని, విశాఖ నుంచి మెరైన్ డైవర్లను రప్పించి బోటుకు లంగర్లు అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బోటును తప్పకుండా బయటకు తీస్తామన్నారు. -
బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది
-
బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది
దేవీపట్నం (రంపచోడవరం): తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొలిక్కి రావడం లేదు. ఆదివారం కూడా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. తీరానికి అతి సమీపంలో బోటు ఉండటంతో డీప్ వాటర్ డ్రైవర్లతో బోటుకు యాంకర్లు బిగించి ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం నిన్న కూడా విఫలయత్నం చేసింది. బోటు ఆచూకీ గుర్తించి అయిదు రోజులు గడిచిపోగా.. గురు, శుక్ర, శనివారాల్లో బోటును ఒడ్డు వైపునకు 70 అడుగుల మేర చేర్చారు. శనివారం మూడుసార్లు వృత్తాకారంలో ఐరన్ రోప్‌ను బోటు ఉన్న ప్రాంతంలో నదిలోకి విడిచిపెట్టి ఉచ్చు మాదిరిగా బిగించి బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయితే, ఖాళీ రోప్ మాత్రమే బయటకు వచ్చింది. బోటు ఉన్న ప్రాంతంలో నదీగర్భం ‘వి’ ఆకారంలో ఉండటం వల్ల బోటు బయటకు రావటం కష్టంగా మారిందని చెబుతున్నారు. రోప్‌తో లంగరు వేసినప్పటికీ బోటుకు సరిగా తగులుకోకపోవడంతో జారిపోతోంది. శనివారం బోటుకు సంబంధించి లైఫ్‌బాయ్ (నీటిలో ప్రయాణికుల రక్షణకు ఉపయోగించే ట్యూబు లాంటి పరికరం) ఒకటి బయటకు వచి్చంది. ఐరన్ రోప్‌ను పొక్లెయిన్ సాయంతో లాగుతున్న సమయంలో బోటుకు తగిలించిన రెండు లంగర్లకు కట్టిన తాడు తెగిపోయి లంగర్లు గోదావరి పాలయ్యాయి. 38 అడుగుల లోతులో.. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉందని వెలికితీత పనులకు నాయకత్వం వహిస్తున్న పోర్టు అధికారి కెపె్టన్ ఆదినారాయణ చెప్పారు. బోటును మరో ఇరవై మీటర్లు మేర ఒడ్డు వైపునకు తీసుకొస్తే బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చని తెలిపారు. ఇదిలావుంటే.. బోటు వెలికితీత పనులు కొలిక్కి రాకపోవడంతో అండర్ వాటర్ సరీ్వస్ కారి్మకుల(దుబాస్)ను కచ్చులూరు తీసుకొచ్చేందుకు ధర్మాడి సత్యం విశాఖపట్నం వెళ్లారు. మరోవైపు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి బంధువులు నిన్న కచ్చులూరు చేరుకుని వారి ఆచూకీ కోసం ఎదురు చూశారు. ఇదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. -
పట్టు జారిన లంగరు
రంపచోడవరం/దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం ఉదయం పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసేందుకు లంగరు, ఐరన్ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్ సాయంతో లాగారు. అయితే, లంగరు బోటుకు తగులుకుని పట్టు జారిపోయింది. సాయంత్రం మరోసారి లంగరును నీటిలోకి వదిలి ఐరన్ రోప్‌ను రెండుసార్లు బోటు చుట్టూ గోదావరిలో విడిచిపెట్టారు. అదే సమయంలో వర్షం కురవడంతో వెలికితీసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. శనివారం తిరిగి పనులు ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు చేపట్టిన ఆపరేషన్‌లో పలుమార్లు లంగరు, ఐరన్ రోప్ బోటుకు తగులుకోవడంతో.. పట్టు జారినప్పటికీ నదీగర్భం నుంచి సుమారు 70 అడుగుల మేర ఒడ్డు వైపునకు బోటు జరిగినట్లు పోర్టు అధికారి తెలిపారు. లంగరు, రోప్ లాగుతున్న సమయంలో బోటు ఉన్న ప్రాంతంలో బుడగలతో కూడిన డీజిల్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దుర్వాసన వస్తోందని తెలిపారు. బోటులో ఉన్న డిస్పోజబుల్ గ్లాసుల కట్ట శుక్రవారం పైకి తేలింది. ప్రస్తుతం బోటు 40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నది ఒడ్డు నుంచి సుమారు 250 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లు తెలిపారు. మరో పది మీటర్లు ఒడ్డు వైపు చేర్చగల్గితే బోటును సునాయాసంగా వెలికితీయవచ్చని చెబుతున్నారు. లంగరు వేసిన ప్రతిసారి బోటు ఇంచుమించు పది నుంచి ఇరవై మీటర్లు మేర ముందుకు వస్తోందని, బోటు ఆపరేషన్‌లో జాప్యం జరుగుతోంది తప్ప, దానిని వెలికి తీయడం తథ్యమని ధర్మాడి సత్యం చెప్పారు. బోటుకు లంగరు తగిలించే పని చేసేందుకు విశాఖపట్నానికి చెందిన అండర్ వాటర్ సర్వీస్ బృందాన్ని ధర్మాడి సత్యం సంప్రదించగా>.. నదిలో దిగేందుకు ఆ బృందం విముఖత వ్యక్తం చేసింది. -
బయటపడ్డ రాయల్ వశిష్ట బోటు ఆనవాళ్లు
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. బోటు వెలికితీతకు యత్నిస్తున్న ధర్మాడి సత్యం బృందం బోటు ఆచూకీని కనుగొంది. ఈ క్రమంలోనే సత్యం బృందం వేసిన యాంకర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. యాంకర్ లాగడంతో బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. దీంతో సత్యం బృందం మరోసారి తన ప్రయత్నించింది. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో బోటు ఉన్నట్టు గుర్తించామని సత్యం బృందం తెలిపింది. అయితే చీకటి పడటంతో మూడో రోజు బోటు వెలికితీత పనులను నిలిపివేశారు. మరోవైపు కాకినాడు పోర్ట్ అధికారులు బోటు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని అడిగి బోటు ఆచూకీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కచ్చులూరు బోటు వెలికితీత అప్డేట్
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో బోటు వెలికితీత పనులను ముమ్మరం చేసింది. ఇందుకోసం భారీ లంగరు, 3 వేల అడుగుల ఐరన్ రోప్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బోటు మునిగిన ప్రాంతంలో వేసిన ఐరన్ రోప్‌కు బలమైన వస్తువు తగలడంతో.. దానిని సత్యం బృందం బోటుగా భావించింది. భారీ నైలాన్ తాడుతో పొక్లెయిన్ సాయంతో బోటును వెలికితీసేందకు ప్రయత్నించారు. అయితే బలంగా లాగడంతో లంగరు జారిపోయినట్టగా సత్యం బృందం వెల్లడించింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి బోటు ముందకు వచ్చినట్టు సత్యం బృందం తెలిపింది. బోటుకు సంబంధించిన తెల్లని రంగు నీళ్లపై కి తేలిందని పేర్కొంది. కొద్ది రోజుల కిందట సత్యం బృందం బోటు వెలికితీత పనులు ప్రారంభించినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పనులను నిలిపివేసింది. -
మూడోరోజు కూడా నిరాశే...
సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు మూడోరోజు కూడా విఫలమయ్యాయి. మంగళవారం(రెండోరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్ సహాయంతో బోటును వెలికి తీసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరన్ రోప్ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచి బోటు వెలికితీత పనుల్లో నిమగ్నమైన సత్యం బృందానికి వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురవడంతో ఆపరేషన్‌కు అంతరాయం కలిగింది. గోదావరిలో నీటి స్థాయి మూడు అడుగులు పెరిగినట్లుగా భావించడంతో ప్రస్తుతానికి వెలికితీత పనులను నిలిపివేశారు. కాగా పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. -
చిక్కినట్టే చిక్కి.. అంతలోనే పట్టు తప్పి..
దేవీపట్నం (రంపచోడవరం): కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట పున్నమిని ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆశనిరాశల మధ్య రెండోరోజు బోటు వెలికితీత పనులు కొనసాగాయి. గోదావరి ప్రవాహం ఉరుకులు తగ్గి సాఫీగా సాగిపోతున్నా కచ్చులూరు మందం నుంచి బోటు వెలికి తీసుకురావడం ధర్మాడి బృందానికి పెనుసవాల్‌గా మారింది. జిల్లా యంత్రాంగం బాలాజీ మెరైన్స్ సంస్థకు బోటు వెలికితీత పనులు అప్పగించిన తరువాత రెండో రోజు ఆ బృందం సభ్యులు రంగంలోకి దిగారు. 900 మీటర్ల ఐరన్ రోప్‌తో వెలికితీసే ప్రయత్నం కచ్చులూరు మందంలో గల్లంతైన బోటును వెలికితీసేందుకు ధర్మాడి బృందం సోమవారం రెండు వేల మీటర్ల ఐరన్ రోప్‌ను గోదావరిలో బోటు ఉన్న ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతంలో వలయకారంలో ఉచ్చుగా చేశారు. ఐరన్ రోప్ రెండు కొనలను పొక్లెయిన్‌తో లాగే ప్రయత్నం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించారు. గోదావరి నుంచి ఒడ్డుకు తీసుకువచ్చిన ఐరన్ రోప్‌ను సులభంగా లాగేందుకు కప్పీలను అమర్చారు. గోదావరిలో ఐరన్ రోప్ మునిగిన బోటుకు తగిలింది అనే అంచనాలో బోటు పైకి వస్తుందనే ప్రయత్నాల్లో ఐరన్ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది. పది నిమిషాల పాటు రోప్ తెగకుండా ఉంటే గోదావరిలో జత చేసి ఉన్న బలమైన ఐరన్ రోప్ పొక్లెయిన్ లాగే అవకాశం వచ్చేది. ఐరన్ రోప్ తెగిపోవడంతో ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం విఫలమైంది. పొక్లెయిన్ లాగేందుకు ఉపయోగించిన ఐరన్ రోప్ సుమారు 50 టన్నుల బరువును లాగేందుకు ఉపయోగపడుతోంది. గోదావరిలో మునిగిన బోటు 24 టన్నులు కాగా మరో 25 టన్నులు అదనపు బరువును లెక్కించి ఐరన్ రోప్‌ను ఉపయోగించినా వారి అంచనా తప్పింది. రోప్ బండరాయికు తగులుకోవడంతో తెగిపోయినట్టు సత్యం వెల్లడించారు. అప్పటికే సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో మరో వ్యూహంతో తమ వద్ద అందుబాటులో ఉన్న 900 మీటర్ల ఐరన్ రోప్‌తో ఆపరేషన్ తిరిగి ప్రారంభించారు. 900 మీటర్ల ఐరన్ రోప్‌కు చివర లంగరు కట్టి బోటు ఉన్నట్టు భావిస్తున్న ప్రాంతంలో వదిలి పెట్టి ఒడ్డుకు ఐరన్ తీసుకువచ్చారు. లంగరుకు ఎక్కడా బలమైన వస్తువు తగల్లేదు. ఖాళీ లంగరును బయటకు లాగారు. కొనసాగనున్న వెలికితీత పనులు కచ్చులూరు మందం వద్ద మూడో రోజు మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ కొనసాగుతుంది. బాలాజీ మెరైన్స్ సంస్థ యాజమాని ధర్మాడి సత్యం మాట్లాడుతూ బోటు ఉన్న ప్రాంతంలో గోదావరిలో దుర్గంధం వస్తోంది. ఐరన్ రోప్ బండరాయి, బోటుకు కలిపి తగలడంతో రోప్ తెగిపోయింది. బోటును వెలికి తీసేందుకు బుధవారం మరో ప్రయత్నం జరుగుతుందన్నారు. -
ఇంకా చిక్కని బోటు
దేవీపట్నం (రంపచోడవరం): గోదావరిలో కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం రెండో రోజు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. బోటు మునిగిన ప్రాంతంలో సోమవారం వలయాకారంలో నదిలోకి వదిలిన ఐరన్ రోప్‌ను మంగళవారం పొక్లెయిన్ సాయంతో ఒడ్డుకు లాగుతుండగా రాతి బండలకు చుట్టుకుని తెగిపోయింది. దీంతో వ్యూహం మార్చారు. ఏపీ టూరిజం బోటుకు పంటును జత చేసి.. 800 మీటర్ల పొడవైన ఐరన్ రోప్‌కు చివరన లంగరు కట్టారు. దానిని మునిగిన బోటు ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతంలో వదులుకుంటూ వచ్చారు. తరువాత ఆ రోప్‌ను లాగగా.. లంగరు మాత్రమే బయటకొచ్చింది. దీంతో రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. మునిగిన బోటును పైకి తెచ్చేవరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని వెలికితీత బృందానికి నాయకత్వం వహిస్తున్న ధర్మాడి సత్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తొలి వ్యూహంలో భాగంగా గోదావరిలో 2 వేల మీటర్లు ఐరన్ రోప్‌ను వలయంగా వేశామని తెలిపారు. అది నదిలోని రాతిబండలకు చుట్టుకోవడంతో తెగిపోయిందన్నారు. సుమారు వెయ్యి మీటర్లు రోప్ గోదావరిలో ఉండిపోయిందన్నారు. దాని విలువ రూ.2 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
గోదావరి: కొనసాగుతున్న లాంచీ వెలికితీత ప్రక్రియ
సాక్షి, రాజమండి: తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిన లాంచి వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఉదయాన్నే బోటు మునిగిన ప్రాంతంలో మరోసారి ఐరన్ రోప్‌ను నదిలో దించారు. దానిని ప్రొక్లైయిన్‌కు కట్టి లాంచీ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బోటు ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకుంటే బయటకు తీసుకురావచ్చని బాలాజీ మెరైన్ సంస్థ భావిస్తోంది. ఒకటి రెండురోజుల్లో లాంచి ఆచూకీ తెలుసుకున్నాక, బయటకు తీస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
లంగరుకు చిక్కింది బోటా.. కొండ రాయా!
రంపచోడవరం/దేవీపట్నం: గోదావరిలో గల్లంతైన ప్రైవేట్ టూరిజం బోటు ‘రాయల్ వశిష్ట పున్నమి’ వెలికితీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దేవుడు గొంది వద్ద గోదావరి వైపు గల ఇసుక మేటను వేదికగా చేసుకుని ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనులు చేపట్టింది. బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతానికి ఐరన్ పంటు, ఏపీ టూరిజం బోటు సహాయంతో వెళ్లి ఐరన్ రోప్‌లను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతంలో వలయం మాదిరిగా నదిలోకి జారవిడిచి ఉచ్చులా బిగించారు. దానికి బలమైన వస్తువు చిక్కుకున్నట్టు గుర్తించారు. ఆ వస్తువు బోటా లేక కొండ రాయా అనేది ఇంకా తేలలేదు. అది ఏమిటనేది మంగళవారం తేలుతుందని చెబుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు బోటును వెలికి తీసేందుకు అవసరమైన రోప్‌లు, కప్పీలతో దేవీపట్నం నుంచి సత్యం బృందం బయలుదేరింది. దేవుడు గొంది ఇసుక దిబ్బల నుంచి ఏపీ టూరిజం బోటు, ఐరన్ పంటు సహాయంతో రెండు వేల అడుగుల పొడవున్న ఐరన్ రోప్‌ను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతం మీదుగా వలయంలా గోదావరిలోకి విడిచిపెట్టారు. రోప్‌కు ఒకవైపు గల చివరి భాగాన్ని (కొస) గోదావరి ఒడ్డున ఉన్న బలమైన చెట్టుకు కట్టారు. రెండో కొసను ఒడ్డున ఉన్న మెషిన్ సహాయంతో బిగించుకుంటూ వచ్చారు. అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో బోటును వెలికి తీసే పనులు నిలిపివేశారు. గోదావరి శాంతించడంతో భయంకరమైన సుడులు తగ్గాయి. నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉండటంతో బోటును వెలికి తీసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. -
కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..
సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు. కాగా రాయల్ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. -
కచ్చులూరు హీరోలకు సర్కారు కానుక
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం : ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన గిరిజన మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసినట్లు వివరించారు. ఈ దుర్ఘటనపై శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కచ్చులూరు గ్రామస్తులు ఇంతటి సాహసానికి ఒడిగట్టకపోయి ఉంటే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. కష్టతరమైనప్పటికీ బోటును వెలికితీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. కాగా, ప్రమాదంలో గల్లంతైన ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. గాలింపు చర్యలు నేటికీ కొనసాగుతున్నాయని.. ఆచూకీ తెలియని వారి డెత్ సర్టిఫికెట్లను కుటుంబసభ్యులు అడుగుతున్నందున దానిని పరిశీలించి జీవో తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రమాదంపై త్వరలో నివేదిక ఇదిలా ఉంటే.. రెండు మూడు వారాల్లో బోటు ప్రమాదంపై నివేదిక వస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. బోటును తీసే సామర్థ్యం ఉందని కొందరు ముందుకు వస్తున్నందున వారి ప్రతిపాదనలను పరిశీలించి అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎవరైనా బోటు తీస్తామని ముందుకు వస్తే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు అస్పష్టమైన జీవో జారీచేశారని.. కానీ, స్పష్టమైన జీవోను తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా పాల్గొన్నారు. మరో మృతదేహం లభ్యం కాగా, బోటు ప్రమాదానికి సంబంధించి శుక్రవారం మరో మృతదేహం లభించడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. కడియపులంక వద్ద గోదావరిలో లైఫ్ జాకెట్‌తో ఉన్న పురుషుడి మృతదేహాన్ని బురదలో గుర్తించారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు.. తెలంగాణ విద్యుత్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న కారుకూరి రమ్యశ్రీ (24) ఆచూకీ కోసం ఆమె సోదరుడు, బావ ఎదురుచూస్తుండగా, మరికొందరి కుటుంబ సభ్యులు కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్నారు. డెత్ సర్టిఫికెట్లు ఇస్తే వెళ్లిపోతామని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
ఎన్డీఆర్ఎఫ్ బోటుకు తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. గత రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లుగా వాతావారణ శాఖ హెచ్చరించింది. బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బోటు మునిగిపోయింది. కాగా అందులో ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్ ధరించడంతో వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సెప్టెంబర్ 15వ తేదీన 71 మంది ప్రయాణికులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన విషయం విదితమే. లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెలికితీయడానికి 10 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
రమ్యశ్రీ కడసారి చూపు కోసం..
కన్నతండ్రి ఎదురు చూపులు నేడు కోటిలింగాలఘాట్లో రమ్యశ్రీ కర్మకాండ మరో రెండు మృతదేహాలు లభ్యం మృతుల వస్తువులైనా అప్పగించాలని వేడుకోలు తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కన్న కూతురి కడసారి చూపు కోసం కన్న తండ్రి పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన కాకునూరి రమ్యశ్రీ(24) కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైంది. ఆ యువతి జాడ కోసం కన్న తండ్రి సుదర్శన్ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తున్నాడు. తొలిరోజు 50 మంది కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు 16 మంది రాజమహేంద్రవరంలో మకాం వేసి ఆమె ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఒక మృతదేహం వాడపల్లి వద్ద, రెండో మృతదేహం సీతానగరం మండలం ఇనుగంటివారిపేట లంకభూమి వద్ద గుర్తించారు. అయితే వాడపల్లి వద్దకు మృతుల బంధువులను బస్సులో తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. తీరా ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండిపోయారు. మృతదేహం మార్చురీకి తీసుకురాగా, దాని గుర్తింపు కోసం అక్కడికి బంధువులను తీసుకువచ్చారు. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా భావించారు. రమ్యశ్రీ తండ్రి, బంధువులు మార్చురీకి వద్ద మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు, ఇతర వస్తువులు ఉన్నాయేమోనని చూసుకున్నారు. ఆ మృతదేహంపై పూర్తిగా మట్టిపేరుకుపోయి, దుస్తులు లేకపోవడం, పూర్తిగా ఎముకల గూడులా ఉండడంతో మట్టిని శుభ్రం చేసి చూసిన తరువాత ఆ మృతదేహం పురుషుడిదని గుర్తించారు. కానీ మృతుడు ఆచూకీ లభించకపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని మృతుల బంధువులు కోరారు. నేడు రమ్యశ్రీ కర్మకాండ నిర్వహణకు ఏర్పాట్లు రమ్యశ్రీ మృతదేహం కోసం పది రోజులుగా నిరీక్షించిన మృతురాలి తండ్రి సుదర్శన్, తల్లి భూలక్ష్మి, ఇతర బంధువులు మంగళవారం వరకు చూసి మృతదేహం లభిస్తే బుధవారం తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని, లేకుంటే వెళ్లిపోయి 11వరోజు కర్మకాండ నిర్వహించాలని అనుకున్నారు. మంగళవారం మ«ధ్యాహ్నం చానళ్లలో మహిళ మృతదేహం లభ్యమైనట్టు స్క్రోలింగ్‌లు రావడంతో చూసి రాజమహేంద్రవరంలోనే ఆగిపోయారు. మృతదేహం పరిశీలించిన అనంతరం మహిళ మృతదేహం కాకపోవడంతో 11వ రోజు బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌లో కర్మకాండ ఏర్పాట్లలో ఉన్నారు. ఏరోజు చేయాలా అనేది తర్జనభర్జన పడుతున్నారు. పదకొండో రోజు కర్మకాండ నిర్వహించి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు రమ్యశ్రీ మేనమామ వెంకటేష్ చెప్పారు. గుర్తుపట్టలేని విధంగా.. హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన అంకం పవన్ కుమార్, అతడి భార్య వసుంధర భవానీ మృతదేహాల కోసం మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురు చూస్తున్నాడు. మంగళవారం మృతదేహం లభించంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టేందుకు వీలు లేకపోవడంతో డీఎన్ఏ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 10 రోజులుగా నీటిలో ఉండిపోయిన మృతదేహాలు గుర్తు పట్టేందుకు వీలు లేకుండా పోతున్నాయని, దొరికిన వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇనుగంటివారిపేట వద్ద మరో మృతదేహం సీతానగరం (రాజానగరం): కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని మంగళవారం ఇనుగంటివారిపేట లంకభూమికి అవతల వైపున పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎదురుగా లంకభూమి వద్ద గుర్తించారు. తాళ్లపూడి ఎస్సై సతీష్ తన సిబ్బందితో లంకభూమి వద్ద ఉన్న మృతదేహం వద్దకు సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు. అయితే రాత్రి అయినందున వెనక్కి తరలివెళ్లారు. బుధవారం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్సై సతీష్ వెల్లడించారు. ఇప్పటి వరకూ లభించిన మృతదేహాలు 38 దేవీపట్నం మండలం కచ్చులూరులో ప్రైవేటు టూరిజం బోటు ప్రమాదంలో మంగళవారం వరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 లభించాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుర్తించ లేని మూడు మృతదేహాలు ఉన్నాయి. బోటు ప్రమాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభం కాకినాడ సిటీ: దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాద సంఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించామని జాయింట్ కలెక్టర్, మెజిస్ట్రీయల్ ఎంక్వైరీ అధికారి జి లక్ష్మీశ తెలిపారు. మంగళవారం విచారణాధికారిగా తొలిసారి జాయింట్ కలెక్టర్ తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, పోర్టు డైరెక్టర్ ధర్మపాస్థ, అడిషనల్ ఎస్పీ వి.జిందాల్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ ఎన్.కృష్ణ, ఫిషరీస్ జేడీ పి.జయరాజు, బోటు సూపరింటెండెంట్ కె.దొరయ్య, టూరిజం డివిజనల్ మేనేజర్ ప్రకాశ్‌తో పాటు రంపచోడవరం ఆర్డీవో కార్యాలయపు డీఈవో, దేవీపట్నం తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌లను తమ, తమ పరిధిలో జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణ త్వరలో సంబంధిత అధికారులతో చేపట్టనున్నట్టు లక్ష్మీశ తెలిపారు. బోటు ప్రమాదానికి సంబంధించి ఎవరైనా వ్యక్తిగతం, లిఖిత పూర్వకంగా తనను సంప్రదించవచ్చని లక్ష్మీశ తెలిపారు. -
ఆ ఐదు రోజులు మరచిపోలేను..
కాజీపేట అర్బన్ : జిల్లాలోని కాజీపేట మండలంలోని కడిపికొండ, న్యూశాయంపేటకు చెందిన 14 మందితోపాటు జనగామ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఓ యువకుడు మొత్తం పదిహేను మంది పాపికొండల విహార యాత్ర కు వెళ్లి అక్కడ బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. మిగతా వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత గాలింపుల్లో ఏడుగురి మృతదేహాలు లభించినా ఇంకా ముగ్గురి ఆచూకీ తేలలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లిన బృందంలో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఉన్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉన్న అధికారుల బృందం మృతదేహాల ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధిత కుటుంబాలకు సమచారం ఇస్తూ, ఓదార్చారు. ఇటీవలే రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు తహసీల్దార్ మాటల్లోనే... హుటాహుటిన సంఘటనా స్థలానికి.. పాపికొండలు టూర్‌కు వెళ్లిన జిల్లా వాసులు తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ఘ టన గత ఆదివారం(ఈనెల 15వ తేదీన) మ ధ్యాహ్నం 1.15 గంటలకు జరిగింది. ఈ మేరకు సమాచారం మాకు సాయంత్రం 4 గంటలకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనంలో కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, ఆర్ఐ సురేందర్, వీఆర్వో జోసెఫ్‌తో కలిసి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట నుండి బయలుదేరాం. సుమారు 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రికి చేరుకున్నాం. త్వరగా వెళ్లాలనే తపనతో కేవలం ఒంటి మీద బట్టలతోనే వెళ్లాం. అక్కడకు వెళ్లాకే మా అవసరాలు గుర్తుకొచ్చాయి. దుస్తులు, సబ్బులు, టూత్‌పేస్ట్ తదితర వస్తువులన్నీ అక్కడే కొనుగోలు చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేల ఏరియల్ సర్వే కచ్చులూరు సమీపంలో బోటు బోల్తా పడగా తె లంగాణ వాసులు చిక్కుకున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పు వ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూరి ద యాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వచ్చారు. అక్కడ ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులకు భరోసానందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి వెనక్కి.. ప్రమాదంలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ గురు, శుక్రవారం వరకు కూడా లభించలేదు. దీంతో ఇక్కడి మండల ప్రజలకు సేవలందించడంలో అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి బయలుదేరాం. శనివారం ఇక్కడకు చేరుకున్నాం. మరిచిపోలేని ఘటన కలెక్టర్ ఆదేశాలతో రాజమండ్రికి వెళ్లిన మేం గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సంఘటన స్ధలానికి దగ్గరలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సేవలందించాం. ఓ పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాధితులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాలను ఘటనా స్థలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం బ్యారేజి, 120 కిలోమీటర్ల దూరంలోని యానాంలో రెస్క్యూటీం బృందాలు గుర్తించాయి. ఆ వెంటనే మృతులు బంధువులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డు, బోటులో ప్రయాణం ప్రారంభించే సమయంలో దిగిన సెల్ఫీలతో గుర్తుపట్టేందుకు బయలుదేరాం. ఆ సమయంలో బంధువుల ఆర్తనాదాలు, మావారి ఆచూకీ చెప్పండయ్యా అంటూ కాళ్ల మీద పడి రోదిస్తుండడం కలిచివేసింది. మృతదేహాలను గుర్తుపట్టాక బంధువులు రోదించిన తీరు మాకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఆ ఐదు రోజులు తిండి సైతం మరిచిపోయి బాధితుల కోసం పడిన కష్టం మరిచిపోలేను. ఇదంతా జరిగిన పది రోజులు కావొస్తున్నా బాధితుల ఆర్తనాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నా బ్యాచ్‌మేట్ సహకారంతో.... నేను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లగా రాజమండ్రి అర్బన్ తహసీల్దార్‌గా నా స్నేహితుడు సుస్వాగత్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనే మాకు బస ఏర్పాటుచేశాడు. అలాగే, అక్కడికి వచ్చిన బాధితుల బంధువులకు రాజమండ్రిలోని రత్న హోటల్లో వసతి ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాడు. కాగా, నేను తహసీల్దార్‌గా ఆరేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. నా పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన 14 మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఎప్పుడూ జరగలేదు. 14 మంది వివరాలు పంపించాం.. ప్రమాదం జరిగిన రోజు బోటులో ప్రయాణించిన కడిపికొండ, న్యూశాయంపేట, చిన్నపెండ్యాలకు చెందిన 14 మంది బాధితులు, మృతులు, ఆచూకీ లభించని వారి పూర్తి వివరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం పంపించాం. అలాగే, వారి బంధువుల వివరాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వివరాలను సమర్పించాం. ఆ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం అందనుంది. -
బోటును వెలికి తీసేందుకు ముమ్మర చర్యలు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి ప్రైవేట్ బోటు బోల్తా ఘటనలో మంగళవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వైపు పోలవరం మండలం వాడపల్లి వద్ద పురుషుడి మృతదేహాన్ని, అదే జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలోని పంతులు గారి లంక వద్ద రాత్రి పొద్దుపోయాక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. పురుషుడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించగా.. మహిళ మృతదేహాన్ని తరలించాల్సి ఉంది. రెండు మృతదేహాలు పూర్తిగా పాడైపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులెవరనేది గుర్తిస్తామని వైద్యులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం బోటులో ప్రయాణించిన 77 మందిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. మంగళవారం దొరికిన మృతదేహంతో కలిపి ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. భారీ క్రేన్, రోప్‌లు రప్పిస్తున్నాం బోటును వెలికి తీసేందుకు విశాఖ పోర్టు నుంచి యంత్ర సామగ్రి రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. బోటు జాడను గుర్తించిన ప్రాంతంలో గోదావరి ప్రవాహ తీరును, అక్కడి పరిస్థితులను ఆయన బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి కొంతమేర తగ్గిందన్నారు. అయినప్పటికీ అక్కడ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. బోటును వెలికితీసేందుకు భారీ పొక్లెయిన్, 800 మీటర్ల పొడవైన ఐరన్ రోప్‌లను విశాఖ పోర్టు నుంచి రప్పిస్తున్నట్లు తెలిపారు. పోర్టు, జల వనరుల శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన భారీ యంత్రాన్ని ప్రమాద స్థలానికి తరలించేందుకు మంటూరు వైపు నుంచి గల రహదారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బోటు మునిగిన ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించామని, సాంకేతికతకు తోడు సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీసే ఏర్పాట్లు చేస్తున్నామని పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ తెలిపారు. -
కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్
కొత్త లాంచీలే పర్యాటకుల ప్రాణాల్ని హరిస్తున్నాయా. నిండు గోదారిలోనూ దశాబ్దాల తరబడి సాఫీగా ప్రయాణించిన పాత లాంచీ డిజైన్లను పక్కనపెట్టి.. కొత్త డిజైన్లతో రూపొందించటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయా.. అవుననే సమాధానమిస్తున్నారు సీనియర్ సరంగులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదానికి లాంచీ బరువు, డిజైన్ కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. వేలేరుపాడు (పశ్చిమ గోదావరి జిల్లా): రహదారి వ్యవస్థ లేనికాలంలో.. 1986 వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లాంచీలే ప్రజల రవాణా అవసరాలు తీర్చేవి. భద్రాలం నుంచి రాజమండ్రి (150 కిలోమీటర్లు), కూనవరం నుంచి రాజమండ్రి (100 కిలోమీటర్లు), కూనవరం నుంచి భద్రాచలం (50 కిలోమీటర్లు), కూనవరం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంట (15 కిలోమీటర్లు) మధ్య లాంచీలు పెద్దఎత్తున తిరిగేవి. అప్పట్లో ప్రతి లాంచీలో 200 మంది ప్రయాణికులతోపాటు విత్తనాలు, ఎరువులు, కిరాణా సామగ్రి, నిత్యావసర సరుకుల వంటివి టన్నుల కొద్దీ రవాణా చేసేవారు. అధిక లోడు ఉన్నప్పుడు ఫుట్ బోర్డును సైతం గోదావరి నీరు తాకుతూ ఉండేది. అయినా ఏనాడూ ప్రమాదాలు సంభవించలేదు. ఆ‘రామ్’గా వెళ్లొచ్చేవారు.. 1917లో ఆయిల్ ఇంజిన్‌తో నడిచే ‘శ్రీరామ’ అనే లాంచీ ఉండేది. ఆ తర్వాత చాలా లాంచీలు గోదావరిలోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనవి ఝాన్సీరాణి, ఉదయ భాస్కర్, శ్రీరాములు, రాజేశ్వరి, ముద్దుకృష్ణ, మురళీకృష్ణ, సావిత్రి, విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి పేర్లతో లాంచీలు నడిచేవి. గోదావరిలో సుడిగుండాలు కొత్త కాదు. పాత లాంచీలు ఉన్నప్పుడు ఏనాడూ సుడిగుండాల ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతి అధికారులు కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త బోటు తయారు చేయించేటప్పుడు సదరు యజమాని పోర్టు అధికారులకు దరఖాస్తు చేయాలి. బోటు డిజైన్‌ను పోర్టు అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఎలాంటి డిజైన్ ఉన్నా గుడ్డిగా అనుమతులు ఇస్తున్నారు. బోటు బరువు ఎంత ఉండాలన్నది చెప్పడం లేదు. ఫలితంగా పర్యాటకుల ప్రాణాలు గంగ పాలవుతున్నాయి. మారిన డిజైన్లతో కొత్త చిక్కులు పూర్వం లాంచీలు ‘యూ’ ఆకారంలో ఉండేవి. వాటి ముక్కు సూదిగా ఉండేది. లాంచీ తయారీకి ఎక్కువగా టేకు. ఇనుము తక్కువగా వినియోగించేవారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చాక లాంచీలన్నీ పర్యాటక రంగానికే పరిమితమయ్యాయి. వీటి డిజైన్లు మారిపోయాయి. ఇప్పటి బోట్లు, లాంచీల ఎత్తు భారీగా పెంచారు. లాంచీపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పర్యాటకులు లాంచీ పైభాగంలో కూర్చుని సుందర ప్రదేశాలను తిలకించేందుకు వీలుగా సిట్టింగ్ సౌకర్యం కల్పించారు. దిగువ భాగంలో ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో వాటి బరువు భారీగా ఉంటోంది. ఎత్తు పెరగడం వల్ల బ్యాలెన్స్ లేకుండా పోతోంది. ఎటు బరువు పెరిగితే అటు ఒరిగే పరిస్థితి తలెత్తుతోంది. పాత లాంచీల బరువు 15 నుంచి 20 టన్నులకు మించి ఉండేవి కావు. ప్రస్తుత లాంచీలు 35 నుంచి 40 టన్నుల వరకు బరువుంటున్నాయి. సరంగు నిర్లక్ష్యం.. డిజైన్ లోపాలే కారణం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీని అనుభవం లేని సరంగు నడిపాడు. అతడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. లాంచీ డిజైన్ లోపం కూడా ప్రమాదానికి మరో కారణం. ఆ లాంచీకి తల బరువు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రమాద ప్రాంతంలో రెండు కొండలు దగ్గరగా ఉంటాయి. అక్కడ నదిలో నీటి వడి ఎక్కువ. సరంగు ఈ విషయాలను గమనించకుండా నడపడం వల్లనే లాంచీ పల్టీ కొట్టింది. పాత లాంచీలు బరువు తక్కువ కావటం వల్ల సునాయాసంగా ప్రయాణిస్తాయి. 1986, 1990 సంవత్సరాల్లో సంభవించిన వరదల్లో వేల కుటుంబాలను పాత లాంచీలతోనే కాపాడాం. – చవ్వాకుల ప్రకాశరావు, సీనియర్ సరంగు, కూనవరం -
బోటు ప్రమాదం; మృతుల కుటుంబాలకు బీమా
సాక్షి, రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ హష్మి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించారని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటకు వచ్చారని, 36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. మరో 15 మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా తనిఖీలు చేసిన తరువాతే బోటు ప్రయాణానికి అనుమతిచ్చారని వెల్లడించారు. సహాయక చర్యలు ముగిసే వరకు దేవీపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో దీనికి సంబంధం లేదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మృతుల బంధువులు నేరుగా ఇక్కడకు వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించి బీమా డబ్బు పొందవచ్చన్నారు. న్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకరిస్తారని ఎస్పీ తెలిపారు. బీమాకు సంబంధించిన సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు ♦ రజనీకుమార్ సిఐ: 9440796395 ♦ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకాష్: 9700001818 ♦ ల్యాండ్ లైన్ నెంబరు: 08854 254073 ఇన్సూరెన్స్ కోసం సమర్పించాల్సిన పత్రాలు ♦ ఎఫ్ఐఆర్ కాపీ ♦ మరణ ధ్రువీకరణ పత్రం ♦ పోస్ట్‌మార్టమ్ నివేదిక ♦ బ్యాంకు ఖాతా వివరాలు ♦ వారసుల సర్టిఫికెట్ -
‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ
సాక్షి , రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎటునుంచి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా అందులో తమవారి మృతదేహం వచ్చిందేమోనని ఆశతో పరుగులు తీయడం పలువురిని కలచి వేస్తోంది. ‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు మంచిర్యాల గ్రామానికి చెందిన కాకునూరు రమ్యశ్రీ ఇంజినీర్ చదివి హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. తండ్రిపై ప్రేమతో తన చేతిపై ‘డాడీ’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనిని తలుచుకుంటూ రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఉద్యోగం వచ్చింది కదా డాడీ...అమ్మ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుతున్నానని’ చెప్పిన తన చిట్టి తల్లి విహార యాత్రకు వచ్చి కనీసం కడచూపుకు కూడా నోచుకోకుండా చేస్తుందని అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ బోరున విలపిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి, తండ్రి దర్శన్, కలసి కంటతడిపెట్టుకున్నారు. తమ కుమార్తె మృతదేహం కోసం ఎనిమిది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తునే ఉన్నారు. చదవండి: రమ్య కోసం ఎదురుచూపులు నా తండ్రి ఆచూకీ తెలపండి బోటు డ్రైవర్ నూకరాజు కుమారుడు ధర్మారావు, బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. తన తండ్రికి బోటు నడపడంలో నైపుణ్యం ఉందని, ఇలా జరిగిందని, తమ తండ్రి మృతదేహం ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కుటుంబీకులు కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. మా మేనల్లుడేడండీ బోటు ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచీ హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. తన మేనల్లుడు అంకెం పవన్ కుమార్, అతని భార్య అంకెం భవానీల ఆచూకీ తెలియజేయాలంటూ వేడుకుంటున్నాడు. ఆదివారం రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి రోదిస్తుండగా అక్కడకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దుఖాన్ని దిగమింగుకోవాలని సముదాయించిన తీరు అక్కడున్నవారికి కన్నీళ్లను రప్పించింది. మా కుమారుడి ఆచూకీ చెప్పరూ బోటులో సహాయకుడిగా పని చేసిన పాతపట్టి సీమకు చెందిన మణికంఠ ఆచూకీ చెప్పరూ అంటూ అతని తండ్రి నరసింహారావు, బాబాయిలు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. అంబులెన్స్ వచ్చిందంటే దానిలో మృతదేహాలు ఉంటాయేమో అని పరుగులు తీసుస్తున్నారు. మేనల్లుడి కోసం... విహారయాత్రలో కుటుంబం మొత్తం గల్లంతుకాగా అందులో బావమరిది, అతని భార్య, కుమార్తెల మృతదేహాలు లభ్యమైనా మేనల్లుడు కర్నూల జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి(6) మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదని అతని మేనమామ చంద్రశేఖరరెడ్డి ఎదురుచూస్తున్నాడు. ఇంటి నుంచి తన మామ అస్తమానూ ఫోన్ చేస్తున్నాడని ఏమి సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే ప్రాణగండం
‘సాక్షి’ ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం/ఐ.పోలవరం(రంపచోడవరం): గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటులో టూరిస్టులు లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడానికి ముందు బోటులో ఉన్న వారంతా లైఫ్‌జాకెట్లు వేసుకున్న ఫొటోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 15న బోటు పోశమ్మగండి వద్ద బయలుదేరి దేవీపట్నం పోలీసు స్టేషన్ దాటి ముందుకు వెళ్లిపోయింది. బోటు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించి అక్కడి ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ వెనక్కు తీసుకొచ్చి తనిఖీ చేశారు. ఆ సమయంలో బోటులో ఉన్న ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా లైఫ్‌జాకెట్లు ధరించే ఉన్నారు. బోటుకు అనుమతి ఉందని బోటు పర్యవేక్షకుడు ఉత్తర్వులు చూపించడంతో మిగిలిన వారు లైఫ్ జాకెట్లు వేసుకోవాలని చెప్పి ఎస్ఐ స్టేషన్‌కు వచ్చేశారు. తనిఖీ పూర్తయిన అరగంటలోనే బోటు కచ్చులూరు మందం వద్దకు వెళ్లేసరికి సుడిగుండంలో మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. తనిఖీ అనంతరం టూరిస్టుల్లో సగం మందికి పైగానే లైఫ్‌జాకెట్లు తీసేశారని ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఆరోజే చెప్పారు. బోటులో డ్యాన్స్ ప్రోగ్రాంను ఆస్వాదించేందుకు లైఫ్ జాకెట్లు తీసేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 15 మంది ఆచూకీ కోసం గాలింపు బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు మందం సమీపంలో ఆదివారం మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ బోటులో మొత్తం 77 మంది ప్రయాణించినట్టు అధికారులు నిర్ధారించారు. వీరిలో 26 మంది బయటపడగా, గత వారం రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఆదివారం గోదావరిలో లభ్యమైన మరో పురుషుని మృతదేహాన్ని పోలీసులు బోటు ప్రమాదానికి సంబంధించినదై ఉంటుందనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మృతదేహంపై వెంట్రుకలన్నీ పూర్తిగా ఊడిపోయాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో గుర్తించలేని 2 మృతదేహాలున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ నిలిచిపోయిందంటూ పలు పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. హర్షకుమార్కు నోటీసు మాజీ ఎంపీ హర్షకుమార్కు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ శనివారం నోటీసు జారీ చేశారు. బోటు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే వాటితో రంపచోడవరం వచ్చి అందజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
బోటు యజమాని వెంకట రమణ అరెస్ట్
సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కల్లూరు వద్ద గోదావరిలో బోటు బోల్తా ప్రమాద ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ మాట్లాడుతూ...‘ఈ కేసులో బోటు యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. లాంచీ యజమానుల్లో ప్రధానంగా ఏ-వన్ గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశాం. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ...దానిపై విచారణ చేస్తున్నాం. చదవండి: ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’ గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్ అంచనా వేయలేకపోవడం, సుడులు తిరుగుతున్న నీటి నుండి తప్పించుకుని, సురక్షిత మార్గంలో బోటును ముందుకు తీసుకువెళ్లే విషయంలో బోటు డ్రైవర్‌కు సరైన అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎడమ పక్కకు వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్ జాకెట్లు తీసేయవచ్చని బోటు సిబ్బంది చెప్పారు. బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8మంది బోటు సిబ్బంది సహా 75మంది ఉన్నారు. బోటును బయటకు తీసుకు వచ్చేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీశాం’ అని తెలిపారు. -
తప్పని ఎదురుచూపులు..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): చిన్ననాటి నుంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించిన కన్నపేగు ఇన్నాళ్లు తమ మధ్య ఉంటూ నిత్యం నవ్వులతో ఆనందంగా ఉండే కన్నబిడ్డ జాడ కరువయ్యింది. మొన్నటి వరకు సంతోషాల మధ్య సాగిన ఆ కుటుంబంలో అంతుచిక్కని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇక కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం మొదటి నెల జీతం కూడా తీసుకుంది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. రోజు రోజుకూ గోదావరిలో లభిస్తున్న మృతదేహాల్లో తమ రమ్య మృతదేహం ఉందేమోనని ఆందోళన ఒకవైపు... రమ్య ఆచూకీ తెలియడం లేదని మరోవైపు రమ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నేటికి ఆరు రోజులైనా కన్నబిడ్డ జాడ లేదు సరికదా ఏం జరిగిందోనని అంతుచిక్కని ఆవేదనలో పెడుతున్న కన్నీరు మున్నీరు అవుతున్న వారి తీవ్ర ఆవేదన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తుంది. ఏది ఏమైనా రమ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు తెలియరాలేదు. ఇంకా దాదాపు పది మంది వరకు గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రమ్య గల్లంతు ఇంత వరకు తెలియక పోవడంతో ఇటు నంనూర్‌లో తల్లి భూలక్ష్మి తీవ్ర ఆవేదనలో ఉండగా సంఘటనా స్థలంలో తండ్రి సుదర్శన్, సోదరుడు రఘులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా గల్లంతైన రమ్య ఆచూకీ త్వరగా లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. -
‘నన్ను రక్షించి’.. గుండెల్లో ‘గోదారి’ సుడి
సాక్షి,తిరుపతి: అందమైన పొదరిల్లులాంటి కుటుంబం. భర్త, పాపే ఆమె లోకం. ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. గోదావరిలో బోటు రూపంలో మృత్యువు వెంటాడింది. సుడిగుండాలు ఒక్కసారిగా వారిని లాగేసుకుని ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. బోటు మునక ప్రమాదంలో భర్త సుబ్రహ్మణ్యం, కూతురు హాసిని తిరిగి రాని లోకాలకు చేరుకోవడం తిరుపతి వాసి మధులతకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. పీడకలలా వెంటాడుతున్న ఆ విషాదాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... సెలవులు కలిసి రావడంతో... మా మామగారు చనిపోయి 9నెలలైంది. ఆయన అస్థికలను గోదావరిలో కలిపేందుకు రాజమండ్రికి శనివారం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్లో బస చేశాం. ఆదివారం ఉదయం 9గంటల వరకు హోటల్ గదిలోనే ఉన్నాం. అప్పటికే బోటు వారు పదేపదే ఫోన్లు చేశారు. బోటు బయలుదేరుతోంది త్వరగా రమ్మంటూ.. అస్థికలు కలిపి... బోటు బయల్దేరి ఉంటుంది. ఇక ఇప్పుడు వెళ్లి నా బోటును అందుకోలేమని అనుకున్నాం. కోటిలింగాలరేవు వద్ద అస్థికలను కలిపి గల్లిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని వద్దామని నిర్ణయించుకున్నాం. 11.30గంటల ప్రాంతంలో అస్థికలను కలిపేశాం. అయితే అప్పటికి బోటు(మృత్యువు) మా కోసం ఎదురుచూస్తోంది. పోలీసులు ప్రయాణికుల వివరాలను సేకరించుకున్నాక 11.40 గంటల ప్రాంతంలో బోటులో బయల్దేరాం. సరదాగా గడిపాం... బోటులో అందరూ సంతోషంగా ఉన్నారు. డ్యాన్సులు వేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మా పాప హాసిని వాళ్ల నాన్నను కూడా డ్యాన్స్ చేయాలని పట్టుబట్టింది. మా ఆయన ఎప్పుడూ రిజర్వ్‌డుగా ఉంటారు. అలాంటి ఆయన పాప కోసం డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. మరో పది నిమిషాల్లో... మరో పది నిమిషాల్లో ఒడ్డున చేరి భోజనం చేయాల్సి ఉంది. ఇంతలో ఒకతను(గైడ్) గోదావరిలోనే ప్ర మాదకరమైన ప్రాంతం ఇది. ఇక్కడ దాదాపు 300అడుగులకు పైగా లోతు ఉంటుంది. సుడిగుండాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో బోటు కాస్త కుదుపులకు లోనవుతుంది. అయితే ఎవరూ కంగారు పడకండి అని చెప్పిన నిమిషంలోనే బోటు ఒక వైపు ఒరిగిపోయింది. అంతవరకు సంతోషంగా గడిపిన మాకు ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగిపోయింది. నన్ను రక్షించి... బోటు ఒక వైపు ఒరిగిపోవడంతో అందరూ నీళ్లలో పడిపోయారు. మా ఆయన నన్ను అమాంతంగా పైకి లాగారు. పాపను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే భయంకరమైన అలలు, సుడిగుండం వల్ల వారు గల్లంతయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కళ్ల ముందే కకావికలం అయ్యింది. తేరుకునేలోపు అంతా అయిపోయింది. ప్రాణాలను పణంగా పెట్టారు బోటు మునిగిపోతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కచ్చలూరు గ్రామస్తులు గమనించి వెంటనే∙స్పందించారు. చిన్నచిన్న పడవలలో వచ్చి చేరుకున్నారు. నీటిలో మునిగిపోతున్న వారిని ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారు. వారి సాహసంతోనే 16మంది ప్రాణాలతో బయటపడ్డాం. భద్రతా ప్రమాణాలు పాటించలేదు ఇదివరకే గోదావరిలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. చాలా మంది మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బోటు నడిపేవారు భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. స్కూల్ ట్రిప్‌కు వెళ్తాను.. ‘సుబ్బూ’! హాసిని వాళ్ల నాన్నను నాన్న, డాడీ అని సంభోదించదు. సుబ్బూ..! అని పిలుస్తుంది. వారిద్దదూ అంత స్నేహంగా ఉండేవారు. అలా పిలవద్దని మందలించినా ఆయన మాత్రం తనని అలాగే పిలవనీ బాగానే ఉందంటూ నవ్వేవారు. ఈ నెల 14న శనివారం స్కూల్లో ట్రిప్ ఏర్పాటుచేశారు. స్నేహితులతో కలిసి వెళ్తాను సుబ్బూ అని చెప్పింది. అయితే ఆయన మాత్రం వద్దని చెప్పారు. తాతయ్య అస్థికలు కలపడం ముఖ్యమా.. స్కూల్ ట్రిప్ ముఖ్యమా? అని అడిగారు. ఎక్కడ తండ్రి నొచ్చుకుంటాడోనని సరేనంది. ఒక వేళ స్కూల్ ట్రిప్‌కు వెళ్లమని ఉన్నా... లేక మా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉన్నా.. మా అందమైన జీవితం మరోలా ఉండేది అని చెబుతుంటే.. దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. మళ్లీ ఆమె నోట మాట పెగల్లేదు..ధారాపాతంగా కళ్లు వర్షించసాగాయి.. వేదన గోదావరి సుడిగుండమై గుండెలో జ్ఞాపకాలు సుడులు తిరుగుతుంటే..!! చదవండి : ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’ -
ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం : పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొన్న రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ బోటు కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని గుర్తించి ఆ ప్రాంతాన్ని కంప్యూటరైజ్డ్ మార్కింగ్ చేశారు. ఉత్తరాఖాండ్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందంలోని ఒక నిపుణుడిని ఆక్సిజన్ సిలెండర్ల సాయంతో బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రదేశానికి పంపించారు. అయితే 40 అడుగులకు వెళ్లేసరికి గోదావరి ఉధృతిని అధిగమించలేని పరిస్థితుల్లో వెనుదిరిగి బయటకు వచ్చేశారు. 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా గుర్తించిన సోనార్ కెమెరా సహజంగా ఎన్డీఆర్ఎఫ్ వద్ద 10, 20, 40 అడుగులకు వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సిలెండర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ గోదావరి ఉధృతితో పాటు సుడిగుండాలు ఎదురవుతుండటంతో అంతకు మించి లోతుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నామని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. తమ కెరీర్లో ఇంతటి చాలెంజింగ్‌తో కూడుకున్న టాస్క్‌ను మునుపెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్స్ కంపెనీ నుంచి గౌర్ బక్సీ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వచ్చి కచ్చులూరులో పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. బోటును వెలికితీసేందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక రూట్‌మ్యాప్ రూపొందించే పనిలో ఉంది. బక్సీ బృందం ముంబై నుంచి శుక్రవారం కచ్చులూరుకు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అంబులెన్స్‌లో తమ వారి మృతదేహం ఉందేమోనని చూస్తున్న కుటుంబ సభ్యులు కీలకంగా ఉత్తరాఖాండ్ నివేదిక.. గోదావరి అడుగున ఉన్న బోటును గుర్తించి సోనార్ స్కానర్ కెమెరా తీసిన చిత్రాలను పరిశీలన కోసం ఉత్తరాఖండ్‌కు పంపించారు. ఆ నివేదిక సైతం శుక్రవారం చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నివేదిక బోటు వెలికితీత ఆపరేషన్‌లో కీలకంగా కనిపిస్తోంది. రంగంలోకి ధర్మాడి బృందం... లోతైన జలాల్లో సంప్రదాయ పద్ధతుల్లో మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో దిట్ట అయిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ముందుగా బోటు మునిగిపోయినట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్ధారించిన కచ్చులూరు మందం వద్ద భారీ లంగరు వేసింది. అయితే దురదృష్టవశాత్తు లంగరు తెగిపోయింది. దీంతో గురువారం మరోసారి ఇదే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవ్వగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వర్షం పడటంతో ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ధర్మాడి బృందానికి సేఫ్టీ మెజర్స్పై శుక్రవారం క్లియరెన్స్ లభించనుంది. అవి చేతికి వచ్చాక కాకినాడ పోర్టు అధికారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టనుంది. భారీ ఇనుప గొలుసులు సిద్ధం బోటు బరువు 25 టన్నులు ఉన్నప్పటికీ గోదావరిలో ఉన్న సుడిగుండాలతో బోటు బయటకు తీసుకువచ్చేటప్పుడు దాని బరువు రెట్టింపు అయిపోతుందని చెబుతున్నారు. ఇందు కోసమే ముందస్తుగా 100 టన్నుల బరువును అవలీలగా బయటకు తీయగలిగే సామర్థ్యం ఉన్న భారీ ఇనుప తాళ్లను సిద్ధం చేశారు. అలాగే నాలుగు అంగుళాల మందం కలిగిన నైలాన్ తాడు, 22 మిల్లీ మీటర్ల మందం కలిగిన ఇనుప గొలుసు, కాకినాడ పోర్టులో ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు వినియోగించే బలమైన తాళ్లు, యాంకర్లు, డీలింక్లను అక్కడికి చేర్చారు. వెలికి తీసే ప్రక్రియ ఇలా... బోటును వెలికితీసేందుకు రంగంలోకి దిగే ధర్మాడి బృందం తొలుత ఇనుప తాళ్లకు యాంకర్లను కడుతుంది. ఆ తాళ్లను బోటు ఉన్నదని నిర్థారించిన ప్రాంతంలో వలలా గోదావరిలోకి విడిచిపెడతారు. 214 అడుగుల దిగువున ఉన్న బోటుకు యాంకర్లు తగిలిన వెంటనే భారీ క్రేన్ల ద్వారా బోటును బయటకు లాగుతారు. ఇందుకోసం కొంత శ్రమ అయినా కచ్చులూరు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపైకి క్రేన్లను తీసుకువస్తున్నారు. -
బోటు యజమాని.. జనసేనాని!
సాక్షి, విశాఖ సిటీ: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వేనం. 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో 308/2017 చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అలాగే 238/2009లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కొట్లాట కేసు నమోదు కాగా 2013 మే నెలలో కోర్టులో రాజీ పడ్డారు. గ్రామంలో సర్వే నెంబర్ 267లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారన్న ఆరోపణలపై 117/2011లో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసులో ఇదే పోలీస్‌స్టేషన్‌లో 147/2019 ద్వారా వెంకటరమణతో పాటు మరి కొందరిపై బైండోవర్ నమోదుచేశారు. నిబంధనలంటే లెక్కలేదు.. 2012 నుంచి రాజమండ్రిలో బోటు ద్వారా జలరవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వెంకటరమణ కొద్దిరోజులకే కుటుంబంతో సహా అక్కడికి మకాం మార్చాడు. గోదావరి నదిలో కేవీఆర్ ట్రావెల్స్ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. అయితే రెండింటికీ ప్రభుత్వ శాఖల తరపున ఎలాంటి అనుమతులూ లేవు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో అంటకాగడంతో వెంకటరమణ వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. కాగా గత ఎన్నికల్లో జనసేన క్రియాశీల సభ్యుడిగా వెంకటరమణ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. రాజమండ్రితో పాటు సొంత ప్రాంతం విశాఖలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సంబంధిత కథనాలు : నిండు గోదారిలో మృత్యు ఘోష 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత కన్నీరు మున్నీరు అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు -
మరో ఆరు మృతదేహాలు లభ్యం
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: ప్రైవేట్ టూరిజం బోటు ప్రమాద ఘటనలో నాలుగో రోజు బుధవారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఒక మృతదేహం లభించాయి. గాలింపు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నాలుగో రోజు కూడా జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధం బోటులో ప్రయాణించిన పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధత నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం బోటులో 73 మంది ప్రయాణించగా.. తొలిరోజు 8, మూడో రోజు 20, నాలుగో రోజు బుధవారం 6 కలిపి ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీని బట్టి చూస్తే మరో 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీ లభించని వారి వివరాలుంటే తెలియజేయాలని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెవెన్యూ అధికారులు మైక్ ప్రచారం చేశారు. గల్లంతైన వారి బంధువులు ఇచ్చిన మరో 5 పేర్లను కలుపుకుని మరో 18 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రకారం చూస్తే బోటులో ప్రయాణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుందంటున్నారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎంపీ భరత్, ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. బోటు వెలికితీతకు అధిక ప్రాధాన్యం బోటును వెలికి తీసి.. అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నదులు, సముద్రాల్లో మునిగిపోయిన బోట్లను వెలికి తీయడంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వం రప్పించింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ఫైర్ సిబ్బంది మృతదేహాలను గాలిస్తున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఒక బృందం వచ్చింది. కాకినాడ పోర్టు డైరెక్టరేట్ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో మునిగిన బోటును వెలికితీసేందుకు కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం ఆధ్వర్యంలో మరో బృందం రంగంలోకి దిగింది. 2 వేల అడుగుల పొడవైన బలమైన నైలాన్ తాడు, ఐరన్ రోప్, కప్పీలు ఇతర సామగ్రితో బోటును వెలికితీసే పనులు సాగుతున్నాయి. వడి నొక్కేస్తోంది.. సుడి తిప్పేస్తోంది ‘గోదావరిలో వడి ఎక్కువగా ఉంది. ప్రమాద ప్రదేశంలో సుడిగుండాలు తిప్పేస్తున్నాయి. నీటి అడుగున ఉన్న లాంచీ సమీపంలోకి వెళ్లడమే కష్టంగా ఉంది. దీనిని బయటకు తీయడం సవాల్‌గా మారింది’ అని కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం చెప్పారు. కచ్చులూరు వద్ద మునిగిన బోటును సంప్రదాయ పద్ధతిలో వెలికితీసేందుకు సత్యం బృందం రంగంలోకి దిగింది. గతంలో నాగార్జున సాగర్, బలిమెలలో మునిగిన లాంచీలను ఆ సంస్థ వెలికి తీసింది. దాంతో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే పనిని సత్యంకు అప్పగించారు. కచ్చులూరు వద్ద బోటును వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమైన సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అక్కడి సుడిగుండాలు మా బోట్ల కూడా తిప్పేస్తున్నాయి. చాలా రిస్క్ చేయాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు పనిచేశాం. గురువారం ఉదయం మళ్లీ పనులు ప్రారంభిస్తాం. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడితేగానీ బోటును తీయడం సాధ్యం కాదు’ అని వివరించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా గోదావరి పడవ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.3 లక్షలు, స్వల్ప గాయాలకు గురైన వారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి విచారణా ధికారిగా తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. బోటు ప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలు, అసలు ఏం జరిగిందనే దానిపై వాస్తవ పరిస్థితులు విచారణ చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!
అంతటి గోదావరి సుడిలో దిగితే ఏటికి ఎదురీదినట్టే! అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి. కానీ ఆ గిరిజనులు గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తోన్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు. ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం. అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు. మునిగిపోతున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు. ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. – సాక్షి ప్రతినిధి బృందం, దేవీపట్నం తెలిసినా తెగించాం కచ్చులూరు వద్ద గోదావరి ఒడ్డున ర్యాంపు ఉంది. బోటు ప్రమాదం జరిగే సమయంలో సుమారు ముప్ఫై మందిమి ఒడ్డున కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బోటు ఒక పక్కకు ఒరిగిపోవడం గమనించాం. చూస్తుండగానే కళ్లెదుటే బోటు మునిగిపోతోంది. మునిగిపోతున్న వారిని రక్షించాలని ప్రాణాలు లెక్కచెయ్యకుండా వెళ్లాం. ప్రమాదకరమని తెలిసినా వారి ప్రాణాలు కాపాడాలనే అనుకున్నాం. – నేసిక లక్ష్మణ్‌రావు కొందరినే రక్షించగలిగాం నదిలో తేలుతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. మా ప్రాణాలు ఫణంగా పెట్టయినా వారిని రక్షించాలని అనుకున్నాం. వెంటనే బోట్లు తీసుకుని ప్రమాద స్థలానికి వెళ్లాం. అయితే నీటిపై తేలుతున్న వారిని మాత్రమే రక్షించగలిగాం. బోటు గోదావరిలోకి మునిగిపోయినప్పుడు లైఫ్ జాకెట్లు వేసుకోని వాళ్లు నీటిలో మునిగిపోయారు. ఉన్నవారిని రక్షించలేకపోయాం. – కొణతల బాబూరావు ఉండలేక లోపలికి వెళ్లాం బోటు ప్రమాదం జరిగే సమయంలో గోదావరి సుడులు తిరుగుతోంది. ఆ సమయంలో గోదావరిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ నదిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాలనే తపనతో లోపలికి వెళ్లాం. నదిపై తేలుతున్న వారిని కాపాడటానికి చాలా సాహసం చేశాం. – నెరం కృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది వారు మాకేమీ రక్తసంబంధీకులు కారు. వారెక్కడి వారో అసలు తెలియనే తెలియదు. ఆ క్షణాన వారి ఆర్తనాదాలే మమ్మల్ని కదిలించాయి. బోటు ప్రమాదం జరిగిన పావుగంటలోనే గోదావరిలోకి బయలుదేరి వెళ్లాం. నది ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. అయినా ప్రాణాలకు తెగించాం. కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము వెళ్లిన బోటులో ఆరుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. – నేసిక చినబాబు మనసుకు బాధేసింది మా గ్రామం గోదావరి నది ఒడ్డునే కావడంతో చిన్నప్పటి నుంచి గోదావరిలో ఈత కొట్టడం అలవాటు. ఈత రావడంతో బోటు ప్రమాదం జరిగిన వెంటనే బోటులో వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు నా వంతు ప్రయత్నించాను. కొందరైతే కళ్లెదుటే కొట్టుకుపోయారు. అప్పుడు మనసుకు బాధేసింది. కానీ ఏమీ చేయలేకపోయాను. నేను లైఫ్ జాకెట్లు వేసుకున్న ఇద్దర్ని మాత్రమే ఒడ్డుకు చేర్చాను. నాతో పాటు వచ్చిన వారు కూడా కొట్టుకుపోతున్న వారిని రక్షించడం చూసి మనసు కుదుటపడింది. – కానెం నాగార్జున కళ్ల ముందే ఒరిగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. అప్పుడే భోజనాలు చేసి ఎప్పటి మాదిరిగానే గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా గోదావరిలో ఏదో బోటు వెళుతుండటం చూస్తున్నాం. ఇంతలోనే బోటులో హాహాకారాలు వినిపించాయి. అప్పటి వరకూ గ్రామంలో కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్న మేమంతా ఒక్కసారిగా గోదావరి వెంట పరుగుపెట్టి మెకనైజ్డ్ బోట్లు తీసుకుని బయలుదేరాం. చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బోటు ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే మా వద్ద ఉన్న మూడు ఇంజిన్ బోట్లలో గోదావరిలోకి వెళ్లాం. లైఫ్ జాకెట్లు వేసుకుని పైకి తేలుతున్న వారందరినీ రక్షించి ఒడ్డుకు చేర్చాం. – కానెం రామస్వామి మరిచిపోలేని రోజు ఎన్నో ఏళ్లుగా ఆ నది గట్టున కూర్చుంటున్నాం. కానీ ఏనాడూ ఇటువంటి సంఘటన చూస్తామని, మా చేతులతో ఇంతమంది ప్రాణాలు కాపాడతామని అనుకోలేదు. కచ్చులూరు మందంలో బోటు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ గోదావరి నది లోతు సుమారు మూడొందల అడుగులు ఉంటుంది. బోటు డ్రైవర్లు ఇక్కడకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు. దురదృష్టవశాత్తూ బోటు ప్రమాదం జరిగింది. కొందరినైనా రక్షించగలిగాం. మా జీవితంలో మరిచిపోలేని రోజు అది. – నేసిక చినలక్ష్మణ్రావు మా ప్రాణాల కంటే ముఖ్యమనుకున్నాం బోటు ప్రమాదం జరిగిన తరువాత గోదావరి నదిలో మునిగిపోతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. ప్రమాద సమయంలో గోదావరిలో నీరు ఉద్ధృతంగా ఉంది. ప్రమాద స్థలంలో నీరు సుడులు తిరుగుతోంది. నదిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలని తెగించి మూడు బోట్లు తీసుకుని నదిలోకి వెళ్లాం. కొంత మందిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను చెయ్యి పట్టుకుని కాపాడి బోటులోకి చేర్చాను. – సంగాని శ్రీనివాస్ -
బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇక గోదావరిలో మునిగిపోయిన లాంచీని బయటకు తీసేందుకు..రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతంలో బలిమెల రిజర్వాయర్‌తో పాటు నాగార్జున సాగర్‌లో మునిగిపోయిన బోటును వెలికి తీసిన టీమ్‌ను ఇందుకోసం రప్పించారు. ముంబై నుంచి వచ్చిన నిపుణుల బృందం అదే పనిలో ఉన్నట్లు చెప్పారు. బరువు అధికంగా ఉండటంతో బోటును ఒడ్డుకు తీసుకు రాలేమని, ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 700మంది సిబ్బంది పని చేస్తున్నారని, ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి-2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. కాగా మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన రోజే బోటు నుంచి 26మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరోవైపు లాంచీ ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, నేవీ బృందాలు గోదావరిని జల్లెడ పడుతున్నాయి. బుధవారం ఆరు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయని, గల్లంతు అయిన 13మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించైనా సంబంధిత కుటుంబీకులకు అప్పగిస్తామని మంత్రి పేర్కొన్నారు. -
బోటు ప్రమాదం: కొనసాగుతున్న సహాయక చర్యలు
-
పడవ జాడ కోసం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: గోదావరి నదిలో 72 మంది పర్యాటకులతో ప్రయణిస్తున్న ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట గల్లంతై మంగళవారం సాయంత్రానికి 53 గంటలు గడిచాయి. ప్రమాదానికి గురైన బోట్‌ను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావికాదళం బృందాలు శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రైవేట్ బోటు ఆదివారం గోదావరిలో మునిగిపోయింది. అదే రోజు సాయంత్రం విపత్తుల నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు, నేవీ హెలికాప్టర్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంట తీసుకొచ్చిన అత్యాధునిక కెమెరా సహాయంతో నీటి అడుగున బోటు జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీకి చెందిన డ్రాగర్ కంపెనీ తయారు చేసిన ఆధునిక యంత్రాన్ని నేవీ అధికారులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఈ యంత్రం ద్వారా రెస్క్యూ టీమ్ సభ్యుడిని బోటు వద్దకు పంపించి, సురక్షితంగా వెనక్కి తీసుకురావొచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. గత మూడు రోజులుగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్ ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఘటనా స్థలంలో ఈదురు గాలులతో కూడిన ››వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మృతదేహాల జాడ వెతికే పనిలో.. కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన ప్రదేశంలో మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. కచ్చులూరు మత్స్యకారులకు చెందిన 17 బోట్లతోపాటు రెస్క్యూ టీమ్ బోట్లు కచ్చులూరు నుంచి పోలవరం కాఫర్ డ్యామ్ వరకు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరికి మూడు సార్లు వరదలు వచ్చాయి. బోటు బోల్తా పడిన సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి గోదావరిలో నీటి మట్టం పది అడుగుల మేర తగ్గింది. దీంతో గల్లంతైన వారి మృతదేహాలు గోదావరి ఒడ్డున పొదల్లో చిక్కుకునే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూడవ రోజు 20 మృతదేహాలు లభ్యం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మృతదేహాల వెలికితీత ఓ కొలిక్కి వస్తోంది. బోటును వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ కొనసాగిస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకోగా మూడో రోజు మంగళవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదటి రోజు ఆదివారం సాయంత్రానికే 8 మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. విశాఖపట్నం నావికాదళం, డైరెక్టరేట్ ఆఫ్ కాకినాడ పోర్టు సాంకేతిక సిబ్బంది కూడా గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన మరో 18 మంది ఎక్కడున్నారో? మునిగిపోయిన బోటులో మొత్తం 72 మంది ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన రోజే బోటు నుంచి 26 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మంగళవారం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 14 మృతదేహాలు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరివాహక ప్రాంతంలో 3 మృతదేహాలు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటి, ఆత్రేయపురం పరిధిలోని ర్యాలీ బ్యారేజీ వద్ద ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 11 మంది, తెలంగాణకు చెందినవారు 8 మంది ఉన్నారు. యానాం వద్ద లభించిన బాలిక మృతదేహం ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది. ఇప్పటిదాకా లభ్యమైన మృతదేహాల సంఖ్య 28కు చేరుకుంది. గల్లంతైన మరో 18 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం.. బంధువులకు అప్పగింత బోటు ప్రమాదంలో మొదటి రోజు లభ్యమైన 8 మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం లభ్యమైన 20 మృతదేహాల్లో 18 మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మృతదేహాలు ఒకేసారి రావడంతో వారి బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం, స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ఏమాత్రం జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాల పోస్టుమార్టం వేగంగా పూర్తి చేశారు. వెంటనే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆస్పత్రి వద్దనే ఉండి అధికారులకు సహకరించారు. 214 అడుగుల లోతున బోటు ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి–2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. బోటు ఉన్న ప్రాంతం చుట్టూ గోదావరి నీటిపై వలయాకారాలతో కూడిన రంగుల రబ్బర్ ట్యూబులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బోటు లోపలి పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ నుంచి రప్పించిన ఆల్కార్ స్కానర్ కెమెరాను గోదావరి అడుగు వరకూ తీసుకెళ్లారు. కెమెరా చిత్రీకరించిన దృశ్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందం ద్వారా ఉత్తరాఖండ్‌కు పంపించారు. మంగళవారం లభించిన మృతదేహాల వివరాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 1) వలవల రఘురామ్(39), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 2) గన్నాబత్తుల ఫణికుమార్(28), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 3) అబ్దుల్ సలీమ్(24), వీలేరు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా 4) భూసాల పూర్ణ(11), గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా 5) బాచిరెడ్డి హాసికారెడ్డి(4), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 6) దుర్గం సుబ్రహ్మణ్యం(51), వేపనపల్లి గ్రామం, తిరుపతి, చిత్తూరు జిల్లా 7) మధుపాటి రమణబాబు(34), విశాఖపట్నం 8) బొండా పుష్ప(13), వేపగుంట, విశాఖ జిల్లా 9) మూల వీసాల వెంకట సీతారామరాజు(51), బాజీ జంక్షన్, విశాఖపట్నం 10) బాచిరెడ్డి స్వాతిరెడ్డి(32), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 11) భూసాల సుస్మిత(4), గోపాలపురం, విశాఖ జిల్లా 12) గుర్తు తెలియని బాలిక(యానాం వద్ద లభ్యం) తెలంగాణకు చెందిన వారు 1) గెడ్డమీద సునీల్(29), చినపెండ్యాల, జనగాం జిల్లా 2) వీరం సాయికుమార్(24), మాదాపూర్, హైదరాబాద్ 3) బసికి వెంకట్రామయ్య(65), ఖాజీపేట, వరంగల్ జిల్లా 4) గొర్రె రాజేంద్రప్రసాద్(55), కడిపికొండ, ఖాజీపేట మండలం, వరంగల్ జిల్లా 5) పాడి భరణికుమార్(25), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 6) పాసం తరుణ్‌కుమార్‌రెడ్డి(36), రామడుగు, నల్లగొండ జిల్లా 7) కోదండ విశాల్(23), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 8) లేపాకుల విష్ణుకుమార్(32), నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా మొదటి రోజు ఆదివారం ఆచూకీ లభించిన మృతులు 1) మందపాక కృష్ణకిశోర్(30) నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు 2) తటారి అప్పల నరసమ్మ(45), ఆరిలోవా, విశాఖపట్నం 3) బొండా లక్ష్మి(35) వేపగుంట, విశాఖపట్నం 4) అంకెం శివజ్యోతి(48) స్వరూప్ నగర్, హైదరాబాద్ 5) దుర్గం హాసినీ(21), తిరుపతి 6) బసిక ఆవినాశ్(21) కడిసికోన, ఖాజీపేట 7) బసికి రాజేంద్ర(55) కడిసికోన, ఖాజీపేట 8) బొడ్డు లక్ష్మణ్(26) కర్రలమామాడి, మంచిర్యాల జిల్లా -
బతికి వస్తామనుకోలె..!
కాజీపేట అర్బన్: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం బోటు బోల్తా పడిన ఘటనలో కడిపికొండ గ్రామానికి చెందిన 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు అక్కడి రంపచోడవరం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆ ఐదుగురిని అధికారులు హన్మకొండ తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిలో ఒకరైన బస్కే దశరథంను మంగళవారం ఉదయం ‘సాక్షి’పలకరించగా ప్రమాద ఘటన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కడిపికొండ నుంచి 14 మంది శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి రాజమండ్రి చేరుకున్నాం. ఆది వారం ఉదయం పోచమ్మగుడి వద్ద నుంచి పాపికొండల సందర్శనకు బయలుదేరాం. మొదట్లోనే బోటు నిర్వాహకులు లైఫ్ జాకెట్లు ఇచి్చనా.. ఉక్కపోతగా ఉందని చెప్పడంతో ‘పర్వాలేదు తీసివేయండి.. డేంజర్ జోన్ రాగానే చెబుతాం.. అప్పుడు వేసుకోవచ్చు’అన్నారు. పోచమ్మ గుడి నుంచి కొంత దూరం ప్రయాణం చేయగానే పోలీసు అధికారులు రావడంతో తిరిగి లైఫ్ జాకెట్లు వేసుకున్నాం. వారు వెళ్లగానే తీసివేశాం. ఇంతలో బోటు కచ్చులూరు సమీపంలోని డేంజర్ జోన్‌కు చేరుకుంది. ఆ విషయాన్ని బోటు నిర్వా హకులు చెప్పలేదు. తీరా ఘటనా స్థలం రాగానే అనౌన్స్ చేస్తుండగానే బోటు బోల్తా కొట్టింది. మాకు లైఫ్ జాకెట్లు దొరికాయి బోటు ఒక్కసారిగా నీట మునగడంతో నీళ్లలో పడిన మాపై బోటు పైభాగంలో ఉన్న కూర్చున్న వారు, చైర్లు ఒక్కసారిగా మీదపడ్డాయి. అలాగే, అందరూ పక్కన పెట్టిన లైఫ్ జాకెట్లు కూడా పడటంతో మేం దొరకపట్టుకున్నాం. బోటుకు ఓ వైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటం.. మరో వైపు 60 నుండి 70 మీటర్ల దూరంలో ఒడ్డు ఉండటంతో లైఫ్ జాకెట్ల సాయంతో నాతోపాటు బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, ధర్శనాల సురేష్, అరెపల్లి యాదగిరి ఈదడం మొదలుపెట్టాం. మాతో పాటు టూర్‌కు వచ్చిన బస్కే అవినాష్‌ను దర్శనాల సురేష్ లైఫ్ జాకెట్ సాయంతో కాపాడాలని యత్నించాడు. కానీ అప్పటికే బోటు బోల్తా పడి నీళ్లలో పడిన ఆందోళనతో అవినాష్ నీళ్లు తాగడంతో మా నుంచి దూరమయ్యాడు. లైఫ్ జాకెట్ దొరకడంతో బస్కే రాజేందర్‌కు అందించాను. నడుముకు ట్యూబ్ కట్టుకుని వెళ్లూ అని అరుస్తున్నా ఈత రాకపోవడంతో గోదావరిలో మునిగిపోయాడు. నా సునీల్ అల్లుడు చాలా మంచి ఈత గాడు. అయినా లైఫ్ జాకెట్ లేకపోవడం.. వరద ఉధృతంగా ఉండడంతో మునిగిపోయాడని ఆరెపల్లి యాదగిరి చెప్పాడు. అవినాష్ అంతిమయాత్రలో రోదిస్తున్న తల్లి వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులను విషాదఛాయలు వీడలేదు. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న బోటు దుర్ఘటనలో కడిపికొండకి చెందిన 14 మంది చిక్కుకోగా వారిలో ఐదుగురు బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మేరకు బస్కె అవినాష్ బస్కే రాజేందర్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి చేరుకోగా మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అలాగే, సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్ మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
మధులతను పరామర్శించిన డీజీపీ
సాక్షి, అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులత(తిరుపతి)ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోలేదన్నారు. వినోద కార్యక్రమం జరుగుతున్నందున అందరూ లైఫ్ జాకెట్లు తీసేసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. బోటుకు అనుమతి లేదన్న విషయం తమకు తెలియదన్నారు. బోటులో అందరూ విద్యావంతులే ఉన్నారని, బోటుకు పర్మిషన్ లేదన్న విషయం తెలిస్తే ఒక్కరు కూడా బోటు ఎక్కేవాళ్లు కాదన్నారు. బోటు బోల్తా పడిన వెంటనే భర్త సుబ్రహ్మణ్యం తనను నీళ్లలో నుంచి పైకి నెట్టి కాపాడరని చెప్పారు. ఆదే సమయంలో తన కాళ్లు పట్టుకున్న కుమార్తె హాసినిని పైకి నెట్టి రక్షించేందుకు ప్రయత్నించి ఆయన నీటిలో ముగినిపోయారని తెలిపారు. బిడ్డ తన కాళ్లను పట్టుకున్నా కాపాడుకోలేకపోయానంటూ మధులత ఆవేదన చెందారు. (చదవండి : ‘నేను రాను డాడీ.. జూ పార్క్‌కు వెళ్తా’) కాగా,తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి పాపికొండలు విహారయాత్ర వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. ( చదవండి : మీరొచ్చి నాలో ధైర్యం నింపారు: మధులత) కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ ప్రమాదానికి గురైన లాంచీని వీలైనంత త్వరగా వెలికి తీస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందుకోసం దేశంలో ఏ అత్యాధునిక టెక్నాలజీ అయినా వినియోగిస్తామని చెప్పారు. లాంచీ బయటకు వస్తే మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని డీపీపీ సవాంగ్ చెప్పారు. -
బోటు ప్రమాదం : 26 మృతదేహాలు లభ్యం
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. వాటిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. (చదవండి : మరో 14 మృతదేహాలు లభ్యం) మృతుల వివరాలు మూలవెంకట సీతారామరాజు(బాజీ జంక్షన్-విశాఖపట్నం), అబ్దుల్ సలీమ్ (బాపులపాడు మం. పీలేరు, కృష్ణా జిల్లా), బండ పుష్ప(విశాఖ, వేపకొండ), గన్నాబత్తుల బాపిరాజు(నరసాపురం, పశ్చిమగోదావరి), కుసాల పూర్ణ(గోపాలపురం, విశాఖ), మీసాల సుస్మిత(గోపాలపురం, విశాఖ), దుర్గం సుబ్రహ్మణ్యం(తిరుపతి), మధుపాడ రమణబాబు(మహారాణిపేట, విశాఖ), గడ్డమీద సునీల్( చినపెండ్యాల, జనగామ), బస్కి వెంకటయ్య(ఖాజీపేట, వరంగల్), పాశం తరుణ్‌కుమార్ రెడ్డి( రామడుగు, నల్లగొండ), వీరం సాయికుమార్(హైదరాబాద్), గొర్రె రాజేంద్రప్రసాద్(ఖాజీపేట, వరంగల్), రేపకూరి విష్ణు కుమార్ (నేలకొండపల్లి, ఖమ్మం), పాడి ధరణి కుమార్(హయత్‌నగర్, రంగారెడ్డి) -
నా బంగారు తల్లీ.. నేనూ మీతో వస్తా..
-
నా బంగారు తల్లీ.. నేనూ మీతో వస్తా..
‘నాన్నంటే ఇష్టం కదా తల్లి. అందుకే ఆయనతో వెళ్లిపోయావా అమ్మా. మరి నాన్నను తీసుకురాలేదే. నేను మీతో పాటే వస్తా నా బంగారు తల్లి’ అంటూ మధులత గుండె పగిలేలా రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. తన కూతురి శవపేటికపై పడి.. ‘అమ్మ లేకుండానే నిద్రపోయావా బంగారం. భయం వేయడం లేదామ్మా’ అని ఆ తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనసును ద్రవింపజేస్తున్నాయి. పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. వీరిలో తిరుపతికి చెందిన మధులత కుటుంబం కూడా ఒకటి. తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు బయల్దేరిన భర్త సుబ్రహ్మణ్యం.. తనతో పాటు భార్య మధులత, కుమార్తె హాసినిని కూడా వెంట తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. (చదవండి :‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’ ) ఇక గోదావరి పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పట్టిసీమలో ఒకటి, ధవళేశ్వరం వద్ద రెండు, అనుగులూరు కాఫర్ డ్యాం వద్ద రెండు, పోలవరం వద్ద ఒకటి, ఆత్రేయపురం దిగువ ప్రాంతంలో రెండు, తాళ్లపూడి వద్ద ఒక మృతదేహాన్ని మంగళవారం రక్షణా బృందాలు వెలికితీశాయి. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పడవ ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : సీఎం జగన్ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత) -
అయ్యో..! హాసిని.. ప్రయాణం వాయిదా వేసుంటే..
సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి, తిరుపతి:భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా! ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’ – మధులత శ్రీకాళహస్తి : పుణ్యనది గోదావరిలో తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి, ఆఖరి క్రతువును నిర్వహించి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాలని వెళ్లిన తిరుపతికి చెందిన సుబ్ర మణ్యం కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. బోటు మునక ప్రమాదంలో ఆయన తన కుమార్తె హాసినితో పాటు గల్లవంతవగా, ఆయన భార్య మధులత ప్రమాదం నుంచి బైటపడటం విదితమే. హాసిని మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. సుబ్రమణ్యం కోసం ఇంకనూ గాలిస్తున్నారు. దుర్గం సుబ్రమణ్యం తిరుపతిలో కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నా రు. సుబ్రమణ్యం (45)కు శ్రీకాళహస్తి, చిత్తూరులో పెట్రోల్ బంకులున్నాయి. శ్రీకాళహస్తి పెట్రోల్ బంకు బాధ్యతలను ఆయన సతీమణి మధులత చూసేది. హాసిని (12) తిరుపతి స్ప్రింగ్‌డేల్ స్కూలులో 7వ తరగతి చదువుతోం ది. 3నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య, కుమార్తెతో కలిసి సుబ్రమణ్యం రాజమహేంద్రవరం వెళ్లారు. బోటు మునక ప్రమాదంలో తండ్రీ, తనయ గల్లంతవగా, మధులత బైటపడింది. ఈ ఘటన శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బందికి విషాదం మిగిల్చింది. వారి జ్ఞాపకాల తడితో వారి కళ్లు చెమ్మగిల్లాయి. పాప కళ్ల ముందే కదలాడుతోంది ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పాప హాసినితో మా యజమాని సుబ్రమణ్యం, మధులత వచ్చేవారు. హాసిని మాతో కాసేపు మొబైల్ వీడియో గేమ్ ఆడేది. మా యజమాని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వారు. హాసిని మా కళ్లలోనే కదలాడుతోంది. ఆ పాప చనిపోయిందని టీవీలలో న్యూస్ వస్తూంటే దుఃఖం ఆగడం లేదు. చాలా బాధగా ఉంది.–సుమన్, పెట్రోల్ బంక్ మేనేజర్ ప్రమాద ఘటన కలిచి వేసింది గోదావరిలో బోటు మునిగి పోయిందని టీవీలో ఉదయమే చూసాను. అయితే కొంతసేపటికే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా యజమాని బంధువులు ఫోన్ చేసి మా యజమాని సుబ్రమణ్యం, పాప హాసినితో ప్రమాదంలో గల్లంతయ్యారని చెప్పగానే షాక్ గురయ్యాం. ఆయన ఫోన్ నంబర్లకు ప్రయత్నించాం. కానీ సమాధానం లేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.– మురళి, పెట్రోలు బంక్ క్యాషియర్ చాలా బాధ కలిగించింది రెండేళ్లుగా పనిచేస్తున్నా. మా యజమాని సుబ్రమణ్యం చాలా మంచివారు. బంకు దగ్గరికి వస్తే అందరికీ భోజనం తెప్పించేవారు. కూర్చుని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఆయన ప్రమాదంలో గల్లంతయ్యారని, హాసిని మృతదేహాన్ని వెలికి తీశారని టీవీలలో చూశాక దుఃఖం ఆగడం లేదు. – చెంగయ్య, పెట్రోలు బంకు ఉద్యోగి శోక సంద్రమైన స్కూలు తిరుపతి ఎడ్యుకేషన్ : ఎత్తైన కొండలు...వాటి మధ్య గలగల పారే గోదావరి. పాపికొండల్లో బోటు ప్రయాణం మధురానుభూతి. కొండకోనల అందాలను ఆస్వాదించేలోపే ఓ దుర్ఘటన. నది మధ్యలో బోటు కుదుపులకులోనై మునిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో 37మంది గల్లంతయ్యారు. వారిలో తిరుపతిలోని స్ప్రింగ్‌డేల్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న డి.హాసిని ఈ ప్రమాదంలో తండ్రితో పాటు గల్లంతయ్యింది. తిరిగి రాని లోకాలకు చేరుకుంది. ఆ నవ్వుల హాసిని ఇక లేదని తెలియడంతో ఆ చిన్నారి చదువుతున్న స్కూలు శోకసంద్రమైంది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ పాఠశాల ఈ విషాదంతో మూగబోయింది. ఆ పాఠశాల ప్రిన్సిపల్ కెఆర్.ఆనురాధ గోపాల్, క్లాస్ టీచర్ ఎస్.లత హాసిని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విచలితులయ్యారు. వారి మాటల్లోనే...‘‘ హాసిని తండ్రి సుబ్రమణ్యంకు రాచగున్నేరి వద్ద పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. హాసిని ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, మధులత ప్రేమగా చూసుకునేవారు. చదువు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రెండో తరగతిలో హాసిని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో చేరింది. అప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటోంది. చదువులోనూ బాగా రాణించేది. తనకు చిత్రలేఖనం, నృత్యం అంటే చాలా ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. తన మంచి తనంతో తోటి విద్యార్థులు, టీచర్లను కట్టిపడేసేది. దీంతో హాసినీ అంటే అందరికీ ఇష్టం’’. అని చెప్పారు. ఇక, హాసిని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎన్నో విషయాలు పంచుకున్నారు. హాసిని మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. వేపనపల్లెలో విషాద ఛాయలు పూతలపట్టు (యాదమరి): గోదావరి నదిలో బోటు మునక ప్రమాదం సంఘటన పూతలపట్టు మండలం వేపనపల్లెలో విషాదం నింపింది. తిరుపతిలో నివసిస్తున్న సుబ్రమణ్యం కుటుం బాని కి గ్రామంతో సుదీర్ఘ అనుబంధం ఉం ది. వేపనపల్లె గ్రామానికి చెందిన గంగి శెట్టి, రాజమ్మలకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. వీరికి సుబ్రమణ్యం, సురేంద్ర ఇద్దరు కుమారులు. భార్య మరణంతో గంగిశెట్టి అత్తగారిల్లు అయిన తిరుపతికి 3 దశాబ్దాల క్రితం వెళ్లిపోయారు. అక్కడే చిల్లర దుకాణం పెట్టుకుని తన కుమారుల అభ్యున్నతి కోసం శ్రమించారు. కాలక్రమంలో సుబ్రమణ్యం పెట్రోల్ బంకులు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. తమ్ముడు సురేంద్ర వెల్డింగ్ వర్క్ చేసేవారు. తండ్రి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య, కుమార్తెతో వెళ్లిన సుబ్రమణ్యం బోటు మునకతో గల్లంతయ్యారనే వార్తలు టీవీలో రావడం చూసి గ్రామంలో విషాదం అలుముకుంది. వారి తాలూ కు బంధువర్గం హుటాహుటిన రాజమండ్రికి బయల్దేరింది. -
రాత్రంతా జాగారం చేసిన కడిపికొండ
సాక్షి, కాజీపేట: ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయిన కన్నీళ్లు.. తమ వారేమయ్యారోనని అంతు లేని ఎదురుచూపులు.. సురక్షితంగా బయటపడిన వారు ఎలా ఉన్నారోనని ఆవేదన.. వచ్చివెళ్లే వారి పరామర్శలు.. రాత్రి మొత్తం జాగారం.. ఇదీ కడిపికొండ గ్రామంలోని పరిస్థితి! పాపికొండల విహారయాత్రకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు 14 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పాపికొండలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిలో న్యూశాయంపేట వాసి హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో గల్లంతైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటలకు స్వస్థలానికి చేరగా కుటుంబీకులకు అప్పగిం చారు. దీంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. అలాగే, సురక్షితంగా బయటపడిన ఐదుగురికి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్‌లో ఇక్కడకు పంపించగా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం ఉదయం వరకు రంపచోడవరం చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపు, గల్లంతైన వారి గాలింపు చర్యలను సమీక్షించారు. కాజీపేట మండలంలోని కడిపికొండ కన్నీటి సంద్రంగా మారింది.. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. ‘అంతు’చిక్కని తమ వారి ఆచూకీ కోసం రోదనలు.. మృతి చెందినట్లు తేలిసిన వారి కుటుంబాల్లో మిన్నంటిన ఆర్తదానాలు.. సురక్షితంగా బయటపడిన వారి బంధువులు తమ వారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూనే.. సహచరులు గల్లంతు కావడంపై ఆవేదన... ఇదీ గ్రామంలో సోమవారం నెలకొన్న పరిస్థితి! తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో కడిపికొండకు చెందిన 14 మంది చిక్కుకుకోవడం తెలిసింది. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి మృతదేహాలు ఆదివారం రాత్రే బయటపడ్డాయి. ఇక మిగిలిన ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు టీవీలు చూస్తూ.. పరామర్శకు వచ్చిన వారిని ఆరా తీస్తూ రాత్రంగా గడిపారు. వెలగని పొయ్యి గల్లంతైన వారితో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అలాగే, సురక్షితంగా బయటపడిన వారి కుటుంబీకులు తమ వారి కోసం ఎదురుచూడడం కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రామంలోని వారి గృహాల్లో పొయ్యి వెలగలేదు. మిగతా గ్రామస్తులు ముందుండి వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. పాండవుల గుట్టల్లో పాపికొండలు ప్లాన్ కడిపికొండకు చెందిన బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, సివ్వి వెంకటస్వామి, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే అవినాష్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండురి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, గొర్రె ప్రభాకర్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, బస్కే వెంకటస్వామి ఐదేళ్లుగా వాకింగ్ చేస్తున్నారు. వీరిలో సివ్వి వెంకటస్వామి, బస్కే వెంకటస్వామి రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కాగా గొర్రె ప్రభాకర్ రైల్వే బుకింగ్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారిలో కొందరు టీఆర్ఎస్లో కొనసాగుతుండగా.. ఇంకొందరు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ కడిపికొండ నుండి రాజీవ్‌గృహ కల్ప సముదాయం వరకు వాకింగ్ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ మహరాజ్ కుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సంఘం ద్వారా పాపికొండల టూర్‌కు వెళ్లాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ సమయంలో భారీ వర్షాలు కురవడంతో టికెట్లు రద్దు చేసుకున్నారు. అయినా విహారయాత్రకు వెళ్లాలనే కాంక్షతో పాండవుల గుట్టకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడే మాట్లాడుకునే క్రమంలో ఎలాగైనా పాపికొండలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మళ్లీ టూర్‌ను ప్లాన్ చేసుకుని సరదాగా వెళ్లి వచ్చారు. అనంతరం పాండవుల గుట్ట టూర్ నుండి పాపికొండల టూర్‌కు ప్లాన్ వేసారు. ఇటీవల వాతావరణం అనుకూలించగా రైల్వే బుకింగ్ క్లర్క్ గొర్రె ప్రభాకర్ 14 మందికి రైలు టికెట్లు బుక్ చేశారు. కంటిమీద కునుకులేదు.. కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూర్‌కు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తమ వారి ఆచూకి లభిం చిందా లేదా.. మృతి చెందారా, ఏదైనా సమాచారం అందుతుందా అంటూ ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. వీరికి తోడు కడిపికొండ వాసులు కూడా ఉండడంతో ఊరంతా జాగారం చేసినట్లయింది. మృత్యుంజయులు పాపికొండల విహారయాత్రకు వెళ్లిన కడిపికొండకు చెందిన 14 మందిలో సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్‌ను రంపచోడవరం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేయగా... సోమవారం ఉదయకల్లా అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూని దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. తక్షణ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయడంతో పాటు వైద్యులు మాట్లాడారు. అనంతరం వరంగల్ నుంచి వెళ్లిన కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ తదితరులు అంబులెన్స్‌లో తీసుకురాగా.. సోమవారం రాత్రి 11.30 గంటలకు హన్మకొండకు చేరుకోగానే మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. టూర్సాగిందిలా.. కాజీపేట నుంచి శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన వారు శనివారం ఉదయం 5.45 నిమిషా లకు రాజమండ్రి చేరుకున్నారు. ఓ లాడ్జిలో సేద తీరి.. గైడ్ సాయంతో రూ.3వేల టూర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు దేవిపట్నం ప్రాంతానికి చేరుకుని బోటులో పాపికొండల టూర్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు కచ్చులూరుకు బోటు చేరుకోగా గోదావరి ఉగ్రరూపానికి మునిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్లు ధరించిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారు గల్లంతు కాగా.. బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రమాద ఘటనలో న్యూశాయంపేట వాసి గోదావరిలో బోటు మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు సోమవారం సాయంత్రానికి తెలిసింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ గల్లంతైన వారిలో ఉన్నట్లు సమచారం. హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో విధులు కొనసాగిస్తున్న హేమంత్ స్నేహితులతో కలిసి పాపికొండలు టూర్‌కు వెళ్లాడు. బోటు ముగినిపోయినట్లు తెలియడంతో హేమంత్ తండ్రి భూమయ్య, తల్లి పద్మావతి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భూమయ్య టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ముగ్గురు కుమారులను చదివించారు. ఇప్పుడు హేమంత్ గల్లంతైనట్లు తెలియడంతో ఆయన రోదిస్తున్నారు. బస్కే అవినాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ; బస్కే రాజేందర్ కుటుంబీకులు రెండు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృత దేహాలు కూడా కడిపికొండకు చేరుకున్నాయి. ఈ మేరకు రంపచోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఆతర్వాత అంబులెన్స్‌లో కడిపికొండకు తీసుకురాగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలు చేరుకోగానే కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన మంత్రులు గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు సమీక్షిచేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించిన సమయంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకన్నారు. రెండు శాఖలు 13 మంది ఇంజనీర్లు.... వరంగల్: పాపికొండల విహార యాత్రకు రెండు ప్రాంతాలు, రెండు శాఖలకు చెందిన 13 మంది ఇంజనీర్లు వెళ్లిన ట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్ పోలీసు హౌజింగ్ శాఖకు చెందిన ఏఈలు ఏడుగురు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు విద్యు త్ శాఖ ఏఈలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ హౌజింగ్ ఏఈల్లో ప్రమాదం నుంచి నలుగురు బయట పడగా ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఐదు అంబులెన్స్‌లు... అధికారులు తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న జిల్లా వాసులను అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి అధికారులు ఆదివారం రాత్రే వెళ్లారు. జిల్లా నుంచి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ వెళ్లారు. ఈ మేరకు ఓ అంబులెన్స్‌లో బస్కె రాజేందర్, బస్కె అవినాష్ మృతదేహాలతో పాటు సురక్షితంగా బయటపడిన మరో ఐదుగురికి ఇంకో అంబులెన్స్‌లో పంపించారు. నదిలో పడ్డాక లైఫ్ జాకెట్ దొరికింది.. రాజమండ్రి నుంచి పాపికొండలు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లాలన్నది మా ప్లాన్. బోటు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయ్యింది. అందులో ఉన్నవారంతా కేకలు పెడుతుండగానే బోటు మనిగిపోయింది. మునిగిన బోటు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే నాతో పాటు కొందరం బయటపడ్డాం. అప్పటి వరకు నాకు లైఫ్ జాకెట్ లేదు. బోటులో ఉన్న కొన్ని జాకెట్లు నీటిపై తెలియడుతుండగా ఒక్కటి వేసుకుని ఈదడం మొదలు పెట్టాను. సుమారు 15 నిమిషాల తరువాత స్థానిక జాలర్లు నన్ను రక్షించారు. అలా నేను బతికి బయట పడ్డాను. నదిలో పడ్డాక మళ్లీ ఈ లోకాన్ని చూస్తాననని ఊహించ లేదు. – బస్కే వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష -
గోదారి ఘటన:మరో 12 మృతదేహాలు లభ్యం
-
బోటు ప్రమాదం: జీవో అమలు చేసి ఉంటే
సాక్షి, అమరావతి : పడవ ప్రమాదాలు ఎన్ని జరిగినా, ఎందరి ప్రాణాలు నీటిలో కలిసినా గత సర్కారు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన సంఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బోటు ఆపరేటింగ్ నిబంధనలను మార్చుతూ 2018 జూన్ 8న జీవోఎంఎస్ నంబరు 14 జారీ చేసింది. బోటు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలో సూచించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు, జీఓ అమలుపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షించారు. పలు ఫెర్రీల్లో స్థానికులు ఏమాత్రం సురక్షితం కాని బోట్లు నడుపుతున్నారని గుర్తించారు. లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ సామగ్రి లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం బోట్లు నడిపే వారికి తగిన శిక్షణ, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏమి చేయవచ్చో, ఏమి చేయరాదనే అంశాలపై అవగాహన కోసం ఫెర్రీ పాయింట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు. బోట్లలో ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లైఫ్ జాకెట్లు కచ్చితంగా సిద్ధంగా ఉంచాలని, ఫెర్రీల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి : భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్న బోట్లను మాత్రమే అదీ రిజిస్ట్రేషన్ ఉన్న వాటినే అనుమతించాలని 2018 జూన్ 8న ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో భద్రత చర్యల నిమిత్తం బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, నిఘా, పటిష్ట రక్షణ చర్యల అమలు బాధ్యతను ఒకే నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా జీవోలో ఉంది. అయితే గత ప్రభుత్వం వేటినీ పాటించలేదు. జీవో జారీ చేసి గాలికొదిలేసిందని మాత్రం స్పష్టమైంది. -
అమ్మా మాట్లాడమ్మా.. చెల్లి ఎక్కడుందమ్మా..?
పెందుర్తి: ‘అమ్మా లెగమ్మా.. మాట్లాడమ్మా.. నా చెల్లెలు ఏదమ్మా.. ఇప్పుడు నాకు తోడెవరమ్మా.. నెనెవరితో ఆడుకోవాలమ్మా.. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలమ్మా.. చెల్లెప్పుడు వస్తాదమ్మా.. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావమ్మా.. నాన్నకు నాకు దిక్కెవరమ్మా’ అంటూ వేపగుంటకు చెందిన బొండా లక్ష్మి పెద్దకుమార్తె రమ్య తల్లి మృతదేహం వద్ద విలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బొండా లక్ష్మి(37) మృతి చెందింది. ఆమెతోపాటు వెళ్లిన చిన్నకుమార్తె పుష్ప(13) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న బంధువులు లక్ష్మి మృతదేహాన్ని గుర్తించడంతో సోమవారం ఉదయం రామమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో లక్ష్మి మృతదేహాన్ని వేపగుంటకు తరలించారు. శనివారం సాయంత్రం ఇంటిలో అందరికీ జాగ్రత్తలు చెప్పి యాత్రకు బయలుదేరిన లక్ష్మి విగతజీవిగా కనిపించడంతో భర్త శంకరరావు, పెద్ద కుమార్తె రమ్య తల్లడిల్లిపోయారు. లక్ష్మి అత్తామామ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. శంకర్, రమ్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వేపగుంట శ్మశానవాటికలో లక్ష్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ లక్ష్మి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాకు దిక్కెవరమ్మా.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన బొండా శంకరరావు, లక్ష్మి దంపతులు ఇద్దరు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శంకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి కాగా.. చిన్న కుమార్తె పుష్ప ఎనిమిదో తరగతి చదువుతుంది. రమణబాబు కటుంబంతో కలిసి ఆదివారం వేకువజామున రాజమండ్రి రైలులో చేరుకుని బోటు షికారుకు విశిష్ట బోటు ఎక్కారు. ఆ బోటు ప్రమాదంలో మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు సహా లక్ష్మి, పుష్ప గల్లంతయ్యారు. లక్ష్మి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తించారు. ఇంకా పుష్ప ఆచూకీ లభించలేదు. ఓ వైపు లక్ష్మి మృతి.. మరోవైపు పుష్ప గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరంటూ శంకర్, రమ్య రోదిస్తున్నారు. ఈ ఘటనతో వేపగుంటలో తీవ్ర విషాదం అలముకుంది. -
లాంచీ ప్రమాదంలో మరో కుటుంబం!
సాక్షి, విశాఖపట్నం : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మరో కుటుంబం గల్లంతయినట్టు వెల్లడైంది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో ‘మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్ జీరో), హైదరాబాద్’ అనే ఉండేసరికి అంతా తెలంగాణకు చెందిన కుటుంబంగా భావించారు. అయితే.. విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సోమవారం సాయంత్రం రాజేశ్వరమ్మ అనే మహిళ ఫోన్ చేయడంతో బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మరో కుటుంబం గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోనున్న లూఫిన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హన్సిక (4)ను వెళ్లారు. వారి కారులోనే విశాఖలోని బుచిరాజుపాలేనికి చెందిన ఎంవీ సీతారామరాజు (52) కూడా ఉన్నారు. వారంతా రాజమహేంద్రవరంలో ఆగి పాపికొండలకు వెళ్లడానికి లాంచీ ఎక్కారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆందోళన చెందిన మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. -
మరో 12 మృతదేహాలు లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్‌గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా లాంచీలోని మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయిన విషయం తెలిసిందే. -
బోటు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు
-
అంతులేని విషాదం
-
బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు
సాక్షి, నంద్యాల(కర్నూలు) : తూర్పు గోదావరి జిల్లా కట్టలూరు గ్రామ సమీప గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ లాయర్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బోటు ప్రమాదంలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహేశ్వరరెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. శుక్రవారం తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్తునట్లు చెప్పాడు. గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో రామకృష్ణారెడ్డి ఆందోళనకు గురయ్యాడు. మహేశ్వరరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా..సెల్ పనిచేయకపోవడంతో విశాఖపట్టణం గాజువాకలోని వారి బంధువులకు విషయం తెలియజేశాడు. బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి, మహేశ్వరెడ్డికి చెందిన కారు పార్కింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మహేశ్వరెడ్డి జాడ తెలియడం లేదని రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆయన సోమవారం మధ్యాహ్నం దేవిపట్నానికి బయలుదేరాడు. (చదవండి : నిండు గోదారిలో మృత్యు ఘోష) -
ముమ్మరంగా గాలింపుచర్యలు
-
చాలా బాధనిపించింది..
-
‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’
భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయ్యో..! హాసిని ‘నేను రాను డాడీ.. స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి జూ పార్క్‌కు వెళ్తా’నని దుర్గం హాసిని (12) మారాం చేసింది. తాత అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అందరం వెళ్లాలని తండ్రి సుబ్రహ్మణ్యం బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో కలసి బయలుదేరింది. ఆ మరునాడు పడవ ప్రమాదంలో హాసిని ప్రాణాలు కోల్పోగా.. తండ్రి సుబ్రహ్మణ్యం గల్లంతయ్యాడు. ప్రమాదం నుంచి బయటపడిన మధులతకు కుమార్తె హాసిని మృత్యువాత పడిన విషయం సోమవారం తెలిసింది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లి మధులత గుండెలు బాదుకుంటూ తల్లడిల్లుతోంది. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం సొంతూరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి. ఆ చిన్నారి తిరుపతి స్ప్రింగ్ డేల్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ శనివారం జూ పార్క్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు తమతో కలిసి జూ పార్క్‌కు వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా! ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’ – మధులత ప్రయాణం వాయిదా వేసుంటే.. సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. బోటు యజమాని కోసం గాలింపు దేవీపట్నం నుంచి సాక్షిప్రతినిధి బృందం: నిబంధనలకు విరుద్ధంగా బోటును నిర్వహించి.. ఘోర ప్రమాదానికి కారణమైన యజమాని కోడిగుడ్ల వెంకటరమణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అతనిపై సెక్షన్ 304ఏ కింద ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. దేవీపట్నం తహసీల్దార్ మహబూబ్ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరమణను మొదటి నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగినప్పటినుంచి వెంకటరమణ పరారీలో ఉండగా.. అతని ఆచూకీ కోసం రెండు రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
315 అడుగుల లోతులో బోటు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విశాఖ, మంగళగిరి ప్రాంతాల నుంచి 60 మంది, విశాఖ, కాకినాడ నుంచి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఓఎన్జీసీ హెలికాప్టర్, 8 రకాల బోట్లు, 12 ఆస్కా లైట్లు, ఆ ప్రాంతాలకు చెందిన ఈతగాళ్లు గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ప్రమాదానికి గురైన బోటు జాడను గుర్తించేందుకు గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి ప్రవాహంలోనే వెతుకుతున్నారు. వారు కూడా కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు. ఈ పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనంటున్నారు. బోటును గుర్తించేందుకు ‘సైడ్ స్కాన్ సోనార్’: నేవీకి చెందిన డీప్ డైవర్స్‌తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది. వీరి వద్ద ఉన్న ‘సైడ్ స్కాన్ సోనార్’ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు. ధవళేశ్వరం వద్ద 175 గేట్లు మూసివేత ఉభయ గోదావరి జిల్లాల్లోని సరిహద్దుల వెంబడి గాలింపు చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతున్నాయి. మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలను ఏర్పాటు చేశారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. -
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ
బోటు ప్రమాద స్థలి నుంచి సాక్షి బృందం: గోదావరిలో ప్రైవేట్ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. వెళ్లొస్తానని.. ఇలా వెళ్లావా తల్లీ.. ‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రమాద స్థలానికి వచ్చిన ఆ తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. చివరకు బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (24) బోటు ప్రమాదంలో గల్లంతయింది. తండ్రి సుదర్శన్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ కావడంతో ఆదే శాఖలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంది. కష్టపడి చదివి ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే కనపడకుండా పోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రమ్య ఆచూకీ కోసం వచ్చిన ఆమె మామయ్య రామచంద్రయ్య ఈ విషయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేనొక్కడినే బయటపడ్డా.. తాలిబ్ పటేల్, సాయికుమార్, నేను స్నేహితులం. పాపికొండల అందాలను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆదివారం బోటులో ఎక్కాం. మధ్యాహ్నం భోజనం చేద్దామని బోటు కింది అంతస్తుకు చేరుకున్నాం. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఉన్నట్టుండి బోటు డ్రైవర్ గోదావరిలో దూకేశాడు, అతని వెనుకనే నేనూ దూకేశా. మా వాళ్లు లోపల ఉండిపోయారు. గిరిజనులు పడవలు వేసుకొచ్చి నన్ను ఒడ్డుకు చేర్చి కాపాడారు. మా వాళ్లు ఎక్కడున్నారో? తెలియడం లేదు. – తాలిబ్ మజర్‌ఖాన్ జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఇంకేముందిలే జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. ఆదివారం కదా.. అని పాపికొండల అందాలను చూసేందుకు మా అన్న కుమారుడు విష్ణుకుమార్ వచ్చాడు. ప్రమాద విషయం తెలిసి నేను ఇక్కడకు వచ్చాను. ఏ వైపు నుంచి అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నా. – వేపాకులు నాగేశ్వరరావు,నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా చివరి నిమిషం వరకూ సహాయక చర్యలు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తాం. ఘటన స్థలాన్ని పరిశీలించాం. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ కమిషనర్ అనురాధ తొలుత బోటు బయటికి తీస్తే అందులో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై స్పష్టత వస్తుంది. బోటు 300 అడుగుల కంటే లోతులో ఉండటంతో బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసం మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. అప్పుడే మరికొందరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించాల్సి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు.. సమన్వయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బందాన్ని రంగంలోకి దింపాం. – అనురాధ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ -
పునరావృతం కారాదు
భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధుల బృందం, రాజమహేంద్రవరం: ‘భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు. ఎవరింటిలోనూ ఇలాంటి కడుపు కోత ఉండకూడదు. నిబంధనలు ఉన్నా అమలు చేయకుండా జీవోలకు పరిమితం కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకపోతే ఎలా? అవసరమైతే ప్రైవేటు లాంచీలను ఆపేయండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి. మరో మూడు వారాల్లో నివారణ చర్యలు చేపట్టాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం చేరుకుని హెలికాఫ్టర్ ద్వారా ప్రమాద స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రమాదం ఎలా జరిగిందీ, తర్వాత ప్రభుత్వం నుంచి సేవలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. చాలా బాధనిపించింది.. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డానని, బాధితులను పరామర్శించినప్పుడు వారు చెబుతున్న మాటలు విని ఇంకా బాధనిపించిందని సీఎం అన్నారు. ప్రమాదానికి గురైన బోట్లో ఎంత మంది ఉన్నారు.. అందులో తెలంగాణా వారు ఎంత మంది.. ఆంధ్రా వాళ్లు ఎంతమంది? వాళ్లలో ఎంత మంది బయటపడ్డారు.. ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోందని సీఎం కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ మురళీధరరెడ్డి సమాధానం చెబుతూ 73 మంది వెళ్లారని, అందులో 41 మంది తెలంగాణా వారు, 24 మంది ఆంధ్రపదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉండగా, ఎనిమిది మంది బోట్ సిబ్బంది ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయ్యారని, అందులో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని కలెక్టర్ చెప్పారు. చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ వారున్నారని చెప్పారు. బోటు ప్రమాదానికి గురైన చోట 315 అడుగుల లోతు ఉన్నట్లు రెస్క్యూ టీమ్‌లు గుర్తించాయని, రెండువైపులా కొండలు ఉండటం వల్ల అక్కడికి ఏ విధమైన పరికరాలు తీసుకువెళ్లడానికి వీలు లేకుండా ఉందన్నారు. కాకినాడ పోర్టుకు చెందిన టీమ్ అక్కడికి చేరుకుందని, వారి సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద కూడా లైటింగ్ ఏర్పాటు చేసి వెతికిస్తున్నామని, గేట్లను కూడా దించి వేశామని చెప్పారు. ప్రతి అంశాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఎన్ని బోట్లకు అనుమతులు ఇచ్చారని కాకినాడ పోర్టు అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంకు సంబంధించి 81 బోట్లకు అనుమతి ఇవ్వగా, అందులో 68 బోట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వాటికి ఏడాదికి ఒకసారి లైసెన్స్ ఇస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ లైసెన్స్‌లు ఇచ్చేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఏడాదికోసారి కాకుండా పీరియాడిక్‌గా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎంత వరద వచ్చినప్పుడు బోటు తిరగకూడదన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని సూచించారు. గతంలో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వరకూ బోట్‌కు అనుమతి ఇవ్వవచ్చని, కానీ ఇప్పుడు ఐదు లక్షల క్యూసెక్కులకే బోటు ప్రమాదానికి గురైనందున తగిన పరిశీలన అవసరమన్నారు. కంట్రోల్ రూమ్ లేకపోతే ఎలా? కంట్రోల్ రూమ్ ఉండాలని జీవోలలో ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018 నవంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఈ బోటుకు అనుమతి ఉందని, అయితే వరద ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ బోట్లు ఆపి ఉన్నాయని తెలిసి కూడా పోలీసులు ఆ బోటులోకి వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీసుకుని, బోటు మంచిగా ఉందా లేదా అని తనిఖీలు చేసి ఎలా వదిలిపెట్టారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బోట్లు ఆగినప్పుడు ఈ బోట్లు ఎందుకు తిరుగుతున్నాయో పోలీసులు ప్రైవేటు బోటు వాళ్లు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ‘ఇరిగేషన్, పోలీస్, టూరిజం కలిపిన కంట్రోల్ రూమ్ అన్నదే లేదు.. లైసెన్స్‌లు ఇచ్చేవారు లైసెన్స్‌లు ఇస్తారు.. కంట్రోల్ రూమ్ ఉండదు. ప్రభుత్వ బోట్లను నియంత్రించే పరిస్ధితి ఉంది గానీ, ప్రైవేటు బోట్లను నియంత్రించే పరిస్థితి మాత్రం లేదు.. లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ బోటు పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకోనక్కరల్లేదా?’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేం అనుకున్నప్పుడు ఈ కంట్రోల్ రూములు ఎందుకని ప్రశ్నించారు. ‘ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం, ప్రస్తుత ఘటనపై విచారణకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నా. సభ్యులుగా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, కమిటీ కన్వీనర్‌గా తూర్పు గోదావరి కలెక్టర్ ఉంటారు’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజులలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను మరోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, దానిని తానే ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. పోర్టులను కూడా ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం ఈ ప్రమాదం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ నిర్వాకం కనిపిస్తోందని తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చారని, చాలా వరకు మృతదేహాలు కూడా దొరకలేదన్నారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు బావుందని ప్రశంసించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, హోం మంత్రి సుచరిత, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొట్టేటి మాధవి, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ నాయకులు అనంతబాబు, దవులూరి దొరబాబు, బొంతు రాజేశ్వరరావు, కవురు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, రౌతు సూర్య ప్రకాశరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏఆర్ అనురాధ, అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మిన్ తదితరులు పాల్గొన్నారు. భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు నాకు సంబంధం లేదనుకోవడం ఒక పద్ధతి అయితే, దానిని సరిదిద్దుకోవడం మరో పద్ధతి. నేను రెండో పద్ధతినే ఎంచుకుంటున్నా. అందుకే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇంతమంది ప్రాణాలు పోయాయంటే దీనికి కారణం ఎవరు? 2018లో ఇచ్చిన జీవోను గత ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇందులో మన బాధ్యత కూడా ఉంటుంది. మన తప్పు మనం తెలుసుకోవాలి. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. నేను ఇంకోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. దానిని నేనే ప్రారంభిస్తాను. ప్రతి బోటును చెక్ చేసిన తర్వాతే పంపించాలి. -
ప్రమాదంపై సీరియస్