
సాక్షి, అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులత(తిరుపతి)ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోలేదన్నారు. వినోద కార్యక్రమం జరుగుతున్నందున అందరూ లైఫ్ జాకెట్లు తీసేసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు.
బోటుకు అనుమతి లేదన్న విషయం తమకు తెలియదన్నారు. బోటులో అందరూ విద్యావంతులే ఉన్నారని, బోటుకు పర్మిషన్ లేదన్న విషయం తెలిస్తే ఒక్కరు కూడా బోటు ఎక్కేవాళ్లు కాదన్నారు. బోటు బోల్తా పడిన వెంటనే భర్త సుబ్రహ్మణ్యం తనను నీళ్లలో నుంచి పైకి నెట్టి కాపాడరని చెప్పారు. ఆదే సమయంలో తన కాళ్లు పట్టుకున్న కుమార్తె హాసినిని పైకి నెట్టి రక్షించేందుకు ప్రయత్నించి ఆయన నీటిలో ముగినిపోయారని తెలిపారు. బిడ్డ తన కాళ్లను పట్టుకున్నా కాపాడుకోలేకపోయానంటూ మధులత ఆవేదన చెందారు.
(చదవండి : ‘నేను రాను డాడీ.. జూ పార్క్‌కు వెళ్తా’)
కాగా,తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి పాపికొండలు విహారయాత్ర వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు.
( చదవండి : మీరొచ్చి నాలో ధైర్యం నింపారు: మధులత)
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ
ప్రమాదానికి గురైన లాంచీని వీలైనంత త్వరగా వెలికి తీస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందుకోసం దేశంలో ఏ అత్యాధునిక టెక్నాలజీ అయినా వినియోగిస్తామని చెప్పారు. లాంచీ బయటకు వస్తే మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని డీపీపీ సవాంగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment