మునిగిపోయిన బోటును గుర్తించిన చోట ఏర్పాటు చేసిన బెలూన్లు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం : పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొన్న రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ బోటు కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని గుర్తించి ఆ ప్రాంతాన్ని కంప్యూటరైజ్డ్ మార్కింగ్ చేశారు. ఉత్తరాఖాండ్‌కు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంలోని ఒక నిపుణుడిని ఆక్సిజన్ సిలెండర్ల సాయంతో బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రదేశానికి పంపించారు. అయితే 40 అడుగులకు వెళ్లేసరికి గోదావరి ఉధృతిని అధిగమించలేని పరిస్థితుల్లో వెనుదిరిగి బయటకు వచ్చేశారు.
214 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా గుర్తించిన సోనార్ కెమెరా
సహజంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ వద్ద 10, 20, 40 అడుగులకు వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సిలెండర్‌లు ఉన్నాయి. కానీ ఇక్కడ గోదావరి ఉధృతితో పాటు సుడిగుండాలు ఎదురవుతుండటంతో అంతకు మించి లోతుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నామని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. తమ కెరీర్‌లో ఇంతటి చాలెంజింగ్‌తో కూడుకున్న టాస్క్‌ను మునుపెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్స్ కంపెనీ నుంచి గౌర్ బక్సీ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వచ్చి కచ్చులూరులో పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. బోటును వెలికితీసేందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక రూట్‌మ్యాప్ రూపొందించే పనిలో ఉంది. బక్సీ బృందం ముంబై నుంచి శుక్రవారం కచ్చులూరుకు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
అంబులెన్స్‌లో తమ వారి మృతదేహం ఉందేమోనని చూస్తున్న కుటుంబ సభ్యులు
కీలకంగా ఉత్తరాఖాండ్ నివేదిక..
గోదావరి అడుగున ఉన్న బోటును గుర్తించి సోనార్ స్కానర్ కెమెరా తీసిన చిత్రాలను పరిశీలన కోసం ఉత్తరాఖండ్‌కు పంపించారు. ఆ నివేదిక సైతం శుక్రవారం చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నివేదిక బోటు వెలికితీత ఆపరేషన్‌లో కీలకంగా కనిపిస్తోంది.
రంగంలోకి ధర్మాడి బృందం...
లోతైన జలాల్లో సంప్రదాయ పద్ధతుల్లో మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో దిట్ట అయిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ముందుగా బోటు మునిగిపోయినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్ధారించిన కచ్చులూరు మందం వద్ద భారీ లంగరు వేసింది. అయితే దురదృష్టవశాత్తు లంగరు తెగిపోయింది. దీంతో గురువారం మరోసారి ఇదే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవ్వగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వర్షం పడటంతో ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ధర్మాడి బృందానికి సేఫ్టీ మెజర్స్‌పై శుక్రవారం క్లియరెన్స్ లభించనుంది. అవి చేతికి వచ్చాక కాకినాడ పోర్టు అధికారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టనుంది.
భారీ ఇనుప గొలుసులు సిద్ధం
బోటు బరువు 25 టన్నులు ఉన్నప్పటికీ గోదావరిలో ఉన్న సుడిగుండాలతో బోటు బయటకు తీసుకువచ్చేటప్పుడు దాని బరువు రెట్టింపు అయిపోతుందని చెబుతున్నారు. ఇందు కోసమే ముందస్తుగా 100 టన్నుల బరువును అవలీలగా బయటకు తీయగలిగే సామర్థ్యం ఉన్న భారీ ఇనుప తాళ్లను సిద్ధం చేశారు. అలాగే నాలుగు అంగుళాల మందం కలిగిన నైలాన్ తాడు, 22 మిల్లీ మీటర్ల మందం కలిగిన ఇనుప గొలుసు, కాకినాడ పోర్టులో ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు వినియోగించే బలమైన తాళ్లు, యాంకర్లు, డీలింక్‌లను అక్కడికి చేర్చారు.
వెలికి తీసే ప్రక్రియ ఇలా...
బోటును వెలికితీసేందుకు రంగంలోకి దిగే ధర్మాడి బృందం తొలుత ఇనుప తాళ్లకు యాంకర్లను కడుతుంది. ఆ తాళ్లను బోటు ఉన్నదని నిర్థారించిన ప్రాంతంలో వలలా గోదావరిలోకి విడిచిపెడతారు. 214 అడుగుల దిగువున ఉన్న బోటుకు యాంకర్లు తగిలిన వెంటనే భారీ క్రేన్‌ల ద్వారా బోటును బయటకు లాగుతారు. ఇందుకోసం కొంత శ్రమ అయినా కచ్చులూరు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపైకి క్రేన్‌లను తీసుకువస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment