పునరావాస కేంద్రంలో బాధితుల కోసం ఏర్పాటు చేసిన మంచాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/దేవీపట్నం/కుక్కునూరు: ఉభయ గోదావరి జిల్లాలకు వరద వస్తే అక్కడి ప్రజలకు తట్టాబుట్టా చేత పట్టుకుని పిల్లాపాపలతో ఎక్కడికి వెళ్లాలా అనే రోజులు పోయాయి. ఇప్పుడు ముందస్తుగానే సమాచారం ఉండటం, ప్రభుత్వం అన్ని సదుపాయాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారికి ముంపు చింత తప్పింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారాయని తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం ప్రాంత వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ కళాశాల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసింది. వరద ముంపులో ఉన్న దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం, పశ్చిమగోదావరి కుక్కునూరు మండలంలోని గ్రామాల్లో బాధితులను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది.
అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం
► దేవీపట్నం, మూలపాడు, అగ్రహారం ముంపులో ఉన్నాయి.
► కొండపై ఉన్న శివాలయం, తొయ్యేరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో కొంతమంది తలదాచుకున్నారు.
► ఈ గ్రామాల్లో బాధితుల కోసం ప్రభుత్వం రంపచోడవరంలో అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, మంచాలు ఏర్పాటు చేశారు.
► వరదలు వచ్చే రెండు రోజులు ముందుగానే ఆ గ్రామాల్లోని 14 మంది గర్భిణులు, బాలింతలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఆగస్టు 16న వరద ముంచెత్తడంతో సుమారు 80 మందిని ఈ కేంద్రానికి తీసుకువచ్చారు.
గతంలో బిక్కుబిక్కుమంటూ..
గతంలో వరద వచ్చినప్పుడు కొండపై పునరావాసం కల్పించినా కనీస వసతులు లేక బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేదని పునరావాస కేంద్రంలో ఉన్న వెంకన్న చెప్పాడు. ఈసారి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపాడు. అధికారులు కంటికి రెప్పలా చూసుకున్నారని ఆ కేంద్రంలో ఉన్న వారు ముక్తకంఠంతో తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు మూడు రకాల వంటకాలతో రుచికరమైన భోజనం, 3 గంటలకు టీ,
రాత్రి ఏడయ్యేసరికి వేడివేడి భోజనం పెడుతున్నారని అక్కడి వారు చెప్పారు.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో
► పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు మండలంలో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
► ప్రతి పునరావాస కేంద్రానికి స్పెషల్ ఆఫీçసర్‌ను కేటాయించి అన్ని సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, నీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు అందుబాటులో ఉంచారు.
► మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అక్కడ తలదాచుకుంటున్న వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో దారుణమైన పరిస్థితులుండేవి
గతంలో పునరావాస కేంద్రంలో చాలా దారుణమైన పరిస్థితులుండేవి. చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. తేళ్లు, పాములతో సావాసం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమయానికి అన్నీ అందుతున్నాయి. వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
– బుర్రే ఆనందరావు, వరద బాధితుడు, దేవీపట్నం
ఇక్కడే మెడికల్ క్యాంప్
పునరావాస కేంద్రం చాలా శుభ్రంగా ఉంది. రోజుకు రెండుసార్లు గదులను శుభ్రం చేస్తున్నారు. ఇక్కడే మెడికల్ క్యాంపు నిర్వహిస్తుండటంతో ఎటువంటి ఇబ్బందీ లేదు. వరద సమయంలో ఇక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి.
– కెచ్చెల భూలక్ష్మి, వరద బాధితురాలు, అగ్రహారం
Comments
Please login to add a commentAdd a comment