తొత్తరమూడివారిపేటలో సీఎం జగన్‌కు హారతులిస్తున్న మహిళలు
సాక్షి అమలాపురం/అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఆంక్షలు పక్కన పెట్టి బాధితులతో మమేకమయ్యారు. అభిమానంతో చొచ్చుకువస్తున్న మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులను భద్రతా సిబ్బంది అడ్డుకోగా.. వారిని వారించి తన దగ్గరకు రప్పించుకుని మరీ మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. జగనన్నా.. అని ఆప్యాయంగా పిలుస్తూ వచ్చిన వారిని అక్కన చేర్చుకున్నారు. ‘జగన్ మావయ్యా’ అని బిగ్గరగా అరిచిన చిన్నారులను పిలిపించుకుని సెల్ఫీలు తీయించుకున్నారు.
మండుటెండను సైతం లెక్క చేయకుండా, చెమటలు కక్కుతూన్నా బాధితుల బాధలు ఓపికగా విన్నారు. వరద బాధతులను స్థానిక వలంటీర్లు సీఎం జగన్‌కు పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అని వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంకాఫ్ ఠాన్నేలంకకు చెందిన జయలక్ష్మి అనే మహిళ తన పెన్షన్ వేరే ఊరిలో ఉందని, ఇబ్బంది పడుతున్నానని చెప్పగానే సీఎం స్పందించి.. స్థానిక వలంటీర్‌ను పిలిచి దరఖాస్తు చేయించాలని చెప్పారు. తనను కలిసిన విద్యార్థులను విద్యా కానుక వచ్చిందా? అని అడిగారు. వరద సాయం పంపిణీలో పొరపాటులుంటే చెబితే సరిదిద్దుకుంటామన్నారు. ప్రభుత్వం, అధికారులు, వలంటీర్లు ఇంటింటికీ వచ్చి వరద సాయాన్ని అందించారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకుందని ముంపు గ్రామాల ప్రజలు సీఎంకు తెలిపారు.
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రామాలయంపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మీరే మా ధైర్యం
వరదలతో చాలా కష్టపడుతున్నాం. నష్టపోతున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వరద వచ్చిన ప్రతిసారీ ఎంతో సాయం చేస్తోంది. ఊరు చుట్టూ వరదనీరు చేరినా పడవల్లో వచ్చి మరీ అధికారులు మాకు భోజనాలు, తాగునీరు అందించారు. గ్రామస్తులకే కాదు పశువులకు సైతం దాణా అందజేశారు. పేద, ధనిక తేడా లేకుండా ఇంటింటికీ రెండు వేల సాయం చేసి, దెబ్బతిన్న పూరిగుడిసెలకు 10 వేలు అందించారు. మీరే మా ధైర్యం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం.
– దుర్గాదేవి, కూనలంక, ముమ్మిడివరం మండలం
మాకేం లోటు లేదు
ఈ నాలుగేళ్లలో జగనన్న వచ్చిన దగ్గర నుండి మా పేదలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకేం లోటు లేదు. కలెక్టర్ నుండి వలంటీర్ వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి సాయం అందించారు. నిత్యావసరాలు మొదలు భోజనాలు, తాగునీళ్ల దాకా సమస్తం మాకు లోటు లేకుండా పంపించారు. డ్యామేజ్ అయిన ఇళ్లకు రూ.10 వేలు అందించారు. మా లంక గ్రామాల ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– పోతుల భారతి, కొండుకుదురులంక గ్రామం, తొత్తరమూడివారిపేట, అయినవిల్లి మండలం
మాట నిలబెట్టుకున్నారు
జగనన్న పాలనలో మాకెప్పుడూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమ్మ ఒడి, విద్యాదీవెన వస్తున్నాయి. ఎంత వరకూ కావాలన్నా చదువుకోండి చదివిస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. వరద సహాయక చర్యల్లో ఏ లోపం లేకుండా సమస్తం మాకు అందించి ఆదుకున్నందుకు ప్రభుత్వానికి, జగనన్నకు ధన్యవాదాలు.
– పట్టా రజనీ, పొట్టిలంక
మళ్లీ మీరే సీఎం కావాలి
మీ నాన్నగారు నాకు చాలా మేలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే అటెండర్లను పంపించారు. 16 ఏళ్లు అయ్యింది. బాగా ఉన్నాను. మీరు వచ్చాక íపింఛన్ అందుతోంది. వరద వచ్చినప్పుడల్లా వెంటనే 25 కేజీల బియ్యం, పప్పు, ఆయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలిచి మళ్లీ సీఎంగా రావాలి.
– నల్లా వెంకాయమ్మ, కూనలంక, ముమ్మిడివరం మండలం
జగనన్న పాలన ఒక వరం
జగనన్న పంపిన అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి వరదల సమయంలో మమ్మల్ని ఆదుకుంది. అందుకు మా కొండుకుదురు ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మా ఎమ్మెల్యే, కలెక్టర్, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అందరూ మాకు వెన్నంటి నిలిచారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న పాలన మావంటి వారికి ఒక వరం.
– నక్కా శ్రీనివాస్, పొట్టిలంక
మీరే వస్తారని అనుకోలేదు
వరదల సమయంలో చాలా కష్టపడుతున్నాం. పశువులకు మేత అందక మా మగవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి మేత తెస్తున్నారు. అప్పుడు మీరే మేత పంపి చాలా మంచి పని చేశారు. ఈసారి రెండు రోజులు అన్నం పెట్టారు. తినని వాళ్లకు బతిమాలి అన్నం పెట్టారు. మా జగన్ ఉండగా మాకు లోటు ఉండదు. గతంలో ఎంతోమంది వచ్చి రోడ్డు మీద నుంచే వెళ్లేవారు. మా బిడ్డ మా దగ్గరకు ఇలా వస్తారని అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది.
– బుద్దా నాగవేణి, కూనలంక, ముమ్మిడివరం మండలం
మా గ్రామానికి వచ్చిన తొలి సీఎం మీరే
ఎన్నిసార్లు వరద వచ్చి మా ఊళ్లు మునిగినా ఒక్క ముఖ్యమంత్రి కూడా మా గ్రామానికి వచ్చిన పాపాన పోలేదు. మా దగ్గరకు వచ్చి మా బాగోగులు అడిగిన తొలి ముఖ్యమంత్రి మీరే. మాకు ఏం కావాలో అది ఇచ్చారు. నవరత్నాలన్నింటిని ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. చమురు సంస్థల నుంచి మత్స్యకార భరోసా ఇచ్చిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము.
– శేరు గంగ, లంకాఫ్ ఠానేల్లంక,ముమ్మిడివరం మండలం
Comments
Please login to add a commentAdd a comment