సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నిరుపేదలకు అండగా ఉండటంలో, వారిలో భరోసా నింపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎవరూ సాటిరారు. సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని కుకునూరు మండలం గొమ్ముగూడెం గ్రామానికి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ రాలేదు. ఇక్కడి ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సీఎం గ్రామానికి రాలేదు.
తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చారు. నిర్వాసితుల చేతుల్లో చేయి కలిపి గ్రామంలో వీధి వీధీ నడిచారు. కిలోమీటరున్నర దూరం కాలినడకన గ్రామంలో తిరిగారు. కష్టాల్లో ఉన్న గ్రామస్తులను పలకరించారు. వారి కష్టాలు విన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు.
సీఎం వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెలిప్యాడ్ నుంచి నేరుగా గ్రామానికి వెళ్ళారు. కాలినడకన గ్రామంలో తిరిగారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడారు. వారికి అందుతున్న ప్రభుత్వ సాయం గురించి తెలుసుకున్నారు.
కందిపప్పు, బియ్యం, పాలు, కూరగాయలు, రూ.2 వేల నగదు అందరికీ అందాయా? ఇంకా ఎవరైనా అందని వారున్నారా? అధికారులు పూర్తిగా సాయం చేస్తున్నారా? లేదా? అని ప్రజలను సీఎం ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో అన్నీ బాగా అందాయని చెప్పారు. ఈ గ్రామంలో మొత్తం 250 కుటుంబాలున్నాయి. వీరందరికీ ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత పరిహారం రూ.6.36 లక్షలు, ఇంటి విలువలు (స్ట్రక్చర్ వాల్యూస్) మొత్తం రూ.18 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి.
ఏలూరు జిల్లా గొమ్ముగూడెంలో వరదల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
అన్నీ ఇచ్చారు
మా గ్రామం మారుమూల ప్రాంతం. ఏ ముఖ్యమంత్రీ రాలేదు. ఈ రోజు మీరు వచ్చినందుకు పాదాభివందనాలు. మీరు సీఎంగా వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా వరదల సమయంలో మమ్మల్ని ముందుగానే ఆదుకుంటున్నారు. మీరు చేపట్టిన చర్యల వల్ల మాకే నష్టం జరగలేదు. మాకు అన్నీ వస్తున్నాయి. వరదలకు ముందే ట్రాక్టర్లు పంపించి మా సామాన్లు మొత్తం రాయకుంట కాలనీ, ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు.
అక్కడ మాకు అన్ని సదుపాయాలు వచ్చాయన్నా. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రూ.2 వేల డబ్బు ఇచ్చారు. భోజనాలను ఆర్డీవో, పీవో దగ్గరుండి వండించి పెట్టారు. రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందించారు. మంచి నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. అన్నీ సమకూర్చుతున్న మీరే ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలి.
– కె.ప్రమీల, గొమ్ముగూడెం
ఇంతలా ఎవరూ పట్టించుకోలేదు
మమ్మల్ని ఇంతలా ఎవరూ పట్టించుకోలేదు. సంతోషంగా ఉంది. ఈ రోజు ఆర్ అండ్ ఆర్, స్ట్రక్చర్ వాల్యూ అన్నీ పడ్డాయి. అందరి తరపునా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం ప్రజలు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వరద బాధితుల కోసం వచ్చారు. మీరు అందించే ప్రతి ఒక్కటీ మాకు అందుతోంది. వరద ముంపు బాధలు మాకు లేవు. గతంలో వైఎస్సార్ హయాంలో నష్టపరిహారం అందింది.
మళ్లా ఇప్పుడు మీ హయాంలో అందింది. 18 సంవత్సరాలు ఉన్నవారికి పరిహారం ఇస్తామని చెప్పారు. ఇదే సమయంలో 41 కాంటూరు లెవల్‌లో ఉన్న సుమారు 10 గ్రామాలు వరద ముంపునకు త్వరగా గురవుతున్నాయి. వాటిని ఫస్ట్ ఫేజ్‌లో తీసుకోవాలి. 45 లెవల్‌లో ఉన్న వాటిలో మౌలిక వసతులు కల్పించుకునేలా మాకు అవకాశాలు కల్పించండి. రోడ్లు, డ్రెయిన్‌లు ఏమీ లేవు. మేము ఉన్నంత వరకు ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
– రావు మీనా, కుకునూరు, సర్పంచ్
గొమ్ముగూడెంలో ఓ అవ్వతో సీఎం జగన్
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి: ముంపు గ్రామాలకు సంబంధించి లైడార్ సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వం లైడార్ సర్వే ప్రకారం పరిహారం చెల్లిస్తారు. ఒక సంవత్సరం ఆగితే రెండో ఫేజ్‌లో సమస్య పూర్తవుతుంది. అలాగే 45 లెవల్ ఉన్న వాటిపై పరిశీలిస్తాం.
నా కష్టాలు తీర్చారు
అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, డ్వాక్రా, వెలుగు, రైతు భరోసా పథకాలతో ఆనందం ఇచ్చావు. నాకు కష్టాల్లో ఆదుకుంది ఇద్దరే ఇద్దరు. నన్ను కన్న నా తల్లి, మా అన్న జగనన్న. నా కష్టాలు తీర్చారు.
– ధరాల తరుణ, గొమ్ముగూడెం
ఉద్యోగాలు వచ్చాయంటే ఆ ఘనత మీదే సార్
వేలేరుపాడు వచ్చినప్పుడు మా సమస్యను మీ దృష్టికి తెచ్చాం. ఏడు మండలాల్లో మున్నూరు కాపు రిజర్వేషన్ కోల్పోయి ఉద్యోగాలన్నీ కోల్పోతున్నామని మీకు చెప్పాం. ఆ రోజు స్టేజ్ మీదే అమలు చేయించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చాయంటే అది మీ ఘనతే సార్. మాకు ఒకటే నమ్మకం. మీ దృష్టికి సమస్య వస్తే అది క్షణాల్లో పరిష్కారమవుతుందని మా నమ్మకం. భద్రాచలం – అశ్వారావుపేట రోడ్డు సమస్య మీ దృష్టికి తీసుకువచ్చాం. తక్షణమే జీవో పాస్ చేసి చేశారు. ఈ విషయంలో మీకు రుణపడి ఉంటాం.
– మాదిరాజు వెంకన్నబాబు, కుకునూరు
న్యాయం చేయండి
నాన్ రెసిడెంట్ పేరుతో గత ప్రభుత్వంలో పేర్లు తీసివేశారు. చదువు కోసం, ఉపాధి కోసం వేరే చోటికి వెళ్లాం. గత ప్రభుత్వంలో కక్షసాధింపుగా పేర్లు తీసివేశారు. కట్కూరు, కొయిదా, చిగురుమామిడి తదితర ప్రాంతాలకు చెందిన వారిని పరిహారానికి అనర్హులుగా డిక్లేర్ చేశారు. వారికి ఇక్కడే ఆధార్, రేషన్‌కార్డు, ఇతర పత్రాలు ఉన్నాయి. కటిక పేదరికంతో ఉన్న కుటుంబాలు. వారికి న్యాయం చేయండి.
– కాసగాని శ్రీనివాస గౌడ్, వేలేరుపాడు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి: ఆధారాలు అన్నీ సక్రమంగా ఉంటే రీవెరిఫికేషన్ చేయండని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మానవతా దృక్పథంతోనే ఉండాలని, వారికి న్యాయం జరిగేలా చూడండని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment