వైఎస్సార్ జిల్లా పులపత్తూరులోని పునరావాస కేంద్రంలో బాధితులను ఓదార్చుతున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, కడప:
సీఎం వైఎస్ జగన్: ఏమ్మా తల్లీ బాగున్నావా? కలెక్టర్ హరి బాగా చూసుకున్నారా? ప్రభుత్వ సాయం అందిందా? బియ్యం ఇచ్చారా? పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, రెండు వేలు ఇచ్చారా? ఇంటి పట్టా ఇచ్చారా?
మునెమ్మ: మా కుటుంబాలను దేవుడిలా ఆదుకున్నావన్నా. మాకు అన్నీ ఇచ్చారు. ఇంటి పట్టా కూడా ఇచ్చారన్నా.. ఇల్లు కావాలన్నా..
సీఎం: ఇక్కడ వద్దమ్మా.. పక్కనే కాలువ ఉంది. మళ్లీ వరదొస్తే ఇబ్బంది అవుతుంది. వేరే చోట శాశ్వతంగా ఉండేలా పక్కా ఇళ్లు కట్టిస్తాను తల్లీ.
మునెమ్మ, ఇతర బాధితులు: సంతోషం అన్నా.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో వరద బాధితులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇది. గురువారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా నుంచి ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి.. కాలనీలో నడుచుకుంటూ.. బాధితులు దేశమ్మ, మునెమ్మ, అమ్ములు, గంగమ్మ, నాగమ్మ, మునిరత్న, జరతమ్మ, ఆదిలక్ష్మి, శివరంజని తదితరుల నివాసాలకు వెళ్లి పలకరించారు. దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. సాయం అందిందా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మునెమ్మ స్పందిస్తూ... ‘వరదలకు నష్టపోయిన మా కుటుంబాలను దేవుడిలా ఆదుకున్నావన్నా. మీ మేలు మర్చిపోలేమన్నా’ అంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు. వెదళ్లచెరువు గిరిజన కాలనీ వాసులు అడవి పుష్పాలతో గుచ్ఛం తయారు చేసి, దానిని ఓ చెంబులో పెట్టి సీఎంకు అందజేశారు. ఇల్లు లేదని చెప్పిన పలువురికి మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
చిన్నారికి పెన్ను
తూకివాకం గ్రామానికి చెందిన ఊహ అనే మహిళ తన బిడ్డతో సీఎం వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఏడుస్తున్న పాపను సీఎం తన భుజంపై పడుకోబెట్టుకుని ‘ఏమ్మా తల్లీ’ అంటూ ఓదార్చేందుకు ప్రయత్నించారు. చిన్నారి సీఎం జేబుకు ఉన్న పెన్నును లాగుతుండడం గమనించి.. ‘పెన్ను కావాలా?’ అంటూ తీసి ఆ చిన్నారి చేతికి అందించారు.
జగన్ మామయ్యా.. కాలు బాగుందా?
గుత్తివారిపల్లె జిల్లా పరిషత్ విద్యార్థినులు ‘జగన్ మామయ్యా.. మీ కాలుకు దెబ్బ తగిలింది కదా? ఎలా ఉంది’ అని అడిగారు. ‘తల్లీ బాగుందమ్మా. థ్యాంక్యూ తల్లీ’ అంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు సీఎంతో సెల్ఫీ దిగారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు.
ఆ వీఆర్వోను సస్పెండ్ చెయ్యండి
తన భూమిని స్థానిక వీఆర్వో చలపతి వేరొకరికి పట్టా చేసి ఇచ్చారని వరదయ్యపాళెం మండలం ఇందిరానగర్‌కు చెందిన సుజాత సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు. ఆ వీఆర్వోను సస్పెండ్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని సీఎం కలెక్టర్ హరినారాయణన్‌ను ఆదేశించారు.
ఆపదలో ఆదుకున్న యువకులకు అభినందన
► అన్నమయ్య కట్ట తెగగానే గ్రామంలోకి వరద ఎలా వచ్చిందో గంధం శివప్రసాద్ అనే యువకుడు సీఎంకు వివరించాడు. ఆరేడు నిమిషాలు పూర్తిగా అందరం నీటిలో ఉండిపోయామని, తర్వాత కొద్దిగా నీటిమట్టం తగ్గడంతో ఏడుగురు బతికామని, మిగిలిన ఇద్దరు ఊపిరి ఆడక మరణించారని చెప్పాడు. వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన సుజయ్, తల్లిని కోల్పోయిన అశోక్‌లను సీఎం పరామర్శించారు.
► ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ బాధితులను ఆదుకోవడంలో గ్రామ సర్పంచ్ కుమారుడు భీం జగన్‌మోహన్‌రెడ్డి మంచి పని తీరు కనబరిచారంటూ గ్రామస్తులు చెప్పగా, సీఎం అతన్ని అభినందించారు. పులపత్తూరులో తనను కలిసిన, ఇటీవల గుండె చికిత్స చేయించుకున్న ప్రతాప్‌రెడ్డి అనే వృద్ధుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించాలని ఆదేశించారు.
► పులపత్తూరుకు సమీపంలోని చింతలకోన గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
► తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారితో, ఏఎన్‌ఎంలతో, గ్రామ సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ఎంతోమందిని కాపాడిందని ఉద్యోగులు సీఎంకు వివరించారు.
► ఎగువ మందపల్లెలో 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి కొర్రపాటి రామ్మూర్తి కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. ఇదే గ్రామంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఈశ్వరయ్య, రమణలను పరామర్శించారు.
► దిగువ మందపల్లె దళిత కాలనీ వాసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోçహన్‌రెడ్డి పలకరించారు. జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థినులు అందించిన చిత్రపటాన్ని స్వీకరించారు.
ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
వైఎస్సార్ జిల్లా పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో సీఎం వైఎస్ జగన్ కలియదిరిగారు. పులపత్తూరులో వరద కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, విధ్వంసానికి గురైన రోడ్లు, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులైన నాగేశ్వరమ్మ, సుబ్బరాయమ్మ, లక్ష్మిదేవి, శ్రీనివాసరావు, ఆదిలక్ష్మిలతో మాట్లాడారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వెంకటరాజు, శంకరమ్మ, ఆదెమ్మ కుటుంబాలను కలుసుకున్నారు. అధికారులు ఎలా స్పందించారు? సహాయం అందిందా? ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందిందా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. సాయం అందిందని.. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు బాగా స్పందించారని బాధితులు సీఎంకు వివరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment