Fact Check: మీ రాతలే కల్తీ | People angry on eenadu false writings | Sakshi
Sakshi News home page

Fact Check: మీ రాతలే కల్తీ

Published Sun, Mar 10 2024 2:42 AM | Last Updated on Sun, Mar 10 2024 3:16 PM

People angry on eenadu false writings - Sakshi

జంగారెడ్డిగూడెంలో రెండేళ్ల క్రితం నాటి మరణాలపై ఈనాడు విషపు రాజకీయం

కల్తీ సారా మరణాలంటూ మరోసారి దుష్ప్రచారం 

అవన్నీ సారా మరణాలు కాదని తేల్చిన వైద్య బృందాలు 

అప్పట్లో డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించి నివేదికలిచ్ఛిన ఉన్నతాధికారులు 

మృతుల కుటుంబాలకు బీమాతో పాటు పలు సంక్షేమ పథకాల లబ్ధి 

ఈనాడు విషపు రాతలపై సర్వత్రా మండిపాటు 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అన్న చందంగా ఒక అబద్ధాన్ని పదేపదే రాసి నిజం చేయాలనే రామోజీ తాపత్రయం ఈనాడులో అడుగడుగునా కొట్టొచ్ఛినట్లు కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతమంది మృతిచెందారు. టీడీపీ అనుకూల సోషల్‌ మీడియాలో కల్తీ సారా మరణాలని విష ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, ఇతర అధికారులు ప్రతి మరణంపై సమగ్ర విచారణ చేపట్టారు.

కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం సాధారణ మరణాలని, కల్తీ సారా మరణాలు కావని తేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడి అనారోగ్య మరణాలను చిల్లర రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని పచ్చ మీడియా గోబెల్స్‌ను తిప్పికొట్టారు. అయినా తన ఎల్లో మీడియా ‘ఈనాడు’లో కల్తీ రాతలు రామోజీ ఆపలేదు.  ‘సారాక్షసి మింగినా సాయం అందలేదు’ అంటూ విషపు కథనాన్ని వండివార్చారు.  

ఆరోపణ: కల్తీ సారా వల్ల మరణాలు. 
వాస్తవం: 2022 మార్చి 6 నుంచి 12 మధ్య అనారోగ్య కారణాలు, వృద్ధాప్య కారణాలతో జంగారెడ్డిగూడెంలోని నాలుగు శ్మశాన వాటికల పరిధిలో 18 మంది మృతిచెందారు. మృతుల్లో కొందరికి మద్యం అలవాటు ఉంది. అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో మరణాలు సంభవించాయి. 25 వేల మందికి పైగా జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నెలకు సగటున 20 నుంచి 25 మరణాలు అధికారిక లెక్కల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కల్తీ సారా తాగి ఇద్దరు మరణించారంటూ 2022 మార్చి 4న సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

12న 25 మందికి పైగా మృతి.. అంటూ పోస్టులు పెట్టారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో డోర్‌ టు డోర్‌ హెల్త్‌ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన నలుగురు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మృతికి కారణాలు తెలుసుకోవడంతోపాటు వైద్యుల నివేదికలు పరిశీలించారు.

ఈ విచారణలో అన్నీ అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలేనని, మరణించిన వారిలో కొందరికి మద్యం అలవాటు ఉందని, అయితే మృతికి మద్యం కారణం కాదని తేలింది. చంద్రబాబు వెంటనే శవ రాజకీయాలకు తెరతీశారు. 2022 మార్చి 14న చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పరామర్శ యాత్ర పేరుతో రాజకీయ యాత్ర నిర్వహించారు. 26 మంది చనిపోయారని ప్రతి ఇంటికీ వెళ్లి పరామర్శిస్తానని నానా యాగీ చేశారు.

చివరకు సెంటర్‌లో సభ పెట్టి సభా వేదిక వద్దకే మృతుల కుటుంబాలను పిలిచి చేతిలో కొంత డబ్బు పెట్టి.. సారా తాగి చనిపోయారని చెప్పమని కోరినా.. వారినుంచి స్పందన రాలేదు. బుట్టాయగూడెంలో సత్యనారాయణ (73) పదేళ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతూ మృతి చెందితే జంగారెడ్డిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరణాన్ని కూడా సారా మరణమని ప్రచారం చేశారు. దీనిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  

ఆరోపణ: ఇంతవరకూ సంక్షేమం అందలేదు. 
వాస్తవం: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం గాని, ఎలాంటి సంక్షేమ పథకాలు గాని అందలేదని, వారు బాగా ఇబ్బందిపడుతున్నారంటూ అడ్డగోలు కథనం ప్రచురించారు. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పరిహారంతో పాటు పలు సంక్షేమ పథకాలు తమకు అందాయని వారు తెలిపారు.


రూ. లక్ష బీమాతో పాటుపింఛన్‌
నా భర్త చింతపల్లి సూరిబాబు మృతిచెందాక బీమా రూ.­లక్ష ఇచ్చారు. నాకు వితంతు  పింఛన్‌ రూ.3 వేలు వస్తోంది. పట్టణంలో జగనన్న లేఅవుట్‌లో ఇచ్చిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఫినిషింగ్‌ పనులు జరుగుతున్నాయి. మా పెద్దబ్బాయి రమేష్‌ ఐటీఐ చదివాడు.  రెండేళ్లు జగనన్న విద్యాదీవెన అందింది. చిన్న కొడుకు కౌశిక్‌కి గతేడాది 10వ తరగతి పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి అందించారు.  – చింతపల్లి రత్నకుమారి,  జంగారెడ్డిగూడెం 

అన్ని విధాలా ‘చేయూత’ 
నా భర్త బంకూరు రాంబాబు మృతిచెందాక నాకు రూ.3 వేలు పింఛను వస్తోంది. చేయూత పథకంలో నాలుగు విడతలుగా ఏటా రూ.18,750 చొప్పున వస్తోంది. డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు.   – బంకూరి నాగేశ్వరమ్మ, జంగారెడ్డిగూడెం 

పథకాలతో ఆదుకున్నారు 
నా భర్త మృతిచెందే నాటికి నేను, నా భర్త విడిగా ఉంటున్నాం. అప్పటి నుంచి నాకు ఒంటరి మహిళ పింఛన్‌ వస్తోంది. నా తండ్రి బంకూరి రాంబాబు, నా భర్త ఆనంద్‌ అదే సమయంలో మృతిచెందారు. నాకు ప్రస్తుతం రూ.3 వేలు పింఛన్‌ వస్తోంది. నా కొడుకు బీటెక్‌ చదువుకుంటున్నాడు. మూడేళ్లుగా వరుసగా విద్యా దీవెన అందుతోంది. నాకు డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది.   – తలారి రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement