తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం  | ADJ Court started in Tadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం 

Published Mon, Jan 22 2024 5:10 AM | Last Updated on Mon, Jan 22 2024 3:43 PM

ADJ Court started in Tadepalligudem - Sakshi

తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదుల చిరకాల కోరిక అయిన ఏడీజే కోర్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, కోర్టును గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ అన్నారు. నూతనంగా మంజూరైన 11వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి (ఏడీజే) కోర్టును తాడేపల్లిగూడెం కోర్టు సముదాయం భవనాల్లోని ఒక బిల్డింగ్‌లో ఆదివారం ఉదయం జస్టిస్‌ కృష్ణమోహన్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ నైనాల జైసూర్య, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు, జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి సి.పురుషోత్తం కుమార్, ఏడీజే కోర్టు ఇన్‌చార్జి జడ్జి బి.సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన ఏడీజే కోర్టు కల నెరవేరిందన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు ఇది చక్కని అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు పరిధిలోని ప్రజలకు ఏడీజే కోర్టు రావడం వల్ల వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు.

బార్‌ అసోసియేషన్‌కు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి మాట్లాడుతూ ఇది రెండు దశాబ్దాల కల సాకారమైన రోజని అన్నారు. జస్టిస్‌ నైనాల జైసూర్య మాట్లాడుతూ యువ న్యాయవాదులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఏడీజే కోర్టు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏడీజే కోర్టు కల సాకరమైనందుకు తాడేపల్లిగూడెం వాసిగా గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement