సభా వేదికపై ‘సిద్ధం’ పోస్టర్లను విడుదల చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు.
110 ఎకరాల ప్రాంగణంలో..
ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్‌తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.
సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment