Alla Nani Slams Pawan Kalyan - Sakshi
Sakshi News home page

‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..?’

Published Mon, Jul 10 2023 4:45 PM | Last Updated on Mon, Jul 10 2023 5:10 PM

Alla Nani Slams Pawan Kalyan - Sakshi

సాక్షి, ఏలూరు: పవన్‌ కల్యాణ్‌ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ కల్యాణ్‌.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?,  పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే.

జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్‌ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్‌ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు.

ఆళ్ల నాని ఏమన్నారంటే..

రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్
వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్‌కళ్యాణ్‌ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై  బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్‌కళ్యాణ్‌ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని  తన అక్కసు వెళ్లగక్కిన పవన్‌కళ్యాణ్‌ తీరు అందరూ చూస్తున్నారు. 

వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న  పవన్‌కళ్యాణ్‌ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్‌కళ్యాణ్‌ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

ఏలూరు సభలో పవన్‌కళ్యాణ్‌ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్‌కళ్యాణ్‌కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్‌కళ్యాణ్‌ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. 

గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..?
గతంలో ఒకసారి ఇదే పవన్‌కళ్యాణ్‌ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర  చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..?

వందజన్మలెత్తినా జగన్‌ గారి స్థాయికి చేరుకోలేవు
3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారితో పవన్‌కళ్యాణ్‌కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్‌ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్‌కళ్యాణ్‌ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. 

పవన్‌ అబద్ధాలకు అంబేద్కర్‌ ఆత్మక్షోభిస్తుంది?
పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్‌కళ్యాణ్‌లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్‌గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్‌కళ్యాణ్‌లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్‌ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్‌కళ్యాణ్‌. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్‌ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు.  

వాలంటీర్లపై నీచపు మాటలా?
వాలంటీర్‌ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్‌ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్‌ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్‌కళ్యాణ్‌..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్‌ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. 

జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్‌కళ్యాణ్‌కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్‌ వ్యవస్థంటే పవన్‌కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్‌ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం  చెప్పాలి. 

పవన్‌కళ్యాణే పెద్దక్రిమినల్
కోవిడ్‌ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ లు.. హైదరాబాద్‌లో తమ ప్యాలెస్‌లలో కూర్చొన్నారు. అయితే,  ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్ని కోవిడ్‌ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్‌ అంటూ పవన్‌కళ్యాణ్‌ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్‌ అని చెబుతున్నాను.

వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి
పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్‌ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్‌లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే
పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్‌కళ్యాణ్‌ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్‌గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్‌గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్‌కళ్యాణ్‌ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్‌ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్‌గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి,  అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్‌కళ్యాణ్‌ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్‌ఆర్‌సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. 

ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా
నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్‌కళ్యాణ్‌ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్‌ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్‌కళ్యాణ్‌ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం.  ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement