
- కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వలంటీర్లు
- విజయవాడలో భారీ ధర్నా
- ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తుత్తి హామీలిచ్చారా?.. 2.60 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు
- ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా?
- గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామనలేదా?
- ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఈ వ్యవస్థే లేదనడం దుర్మార్గం
- హామీని నిలుపుకోండి.. లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం
- స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసే రోజొస్తుందని వలంటీర్ల హెచ్చరిక
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలిచ్చి.. తమను నమ్మించి వంచించారని వలంటీర్లు మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, తొమ్మిది నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 వేలకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సత్తా ఏపాటిదో భవిష్యత్‌లో కూటమి నేతలకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం వారు విజయవాడ అలంకార్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడానికి, కూటమి ప్రభుత్వ పెద్దలు 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ మనుగుడలో లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు 2024 మే నెల వేతనాలను జూన్ ఒకటిన ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.
తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గత మార్చిలో హామీ ఇవ్వడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో ఆ వ్యవస్థ అమలులో లేకపోతే, దానిపై 2024 మార్చిలో ఎలా హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టి, 2014–19 మధ్య ఉన్న జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకొచ్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
పుట్టని బిడ్డతో ఓట్లెలా వేయించుకున్నారు?
వలంటీర్ల విషయంపై ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడం అన్యాయం అని వలంటీర్ల సంఘం ప్రతినిధులు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే మాట చెప్పారని, ఆ తర్వాత నెల రోజులకే మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటప్పుడు పుట్టని బిడ్డకు ఎలా మాయ మాటలు చెప్పారని, వారితో ఎలా ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన వలంటీర్లను తాము నెత్తిన పెట్టుకొని మోయాలా.. అని మంత్రి లోకేశ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారికి పార్టీలతో సంబంధం ఉండదని గుర్తు చేశారు. వలంటీర్లలో ఎక్కువ మంది ఆడపడుచులే ఉన్నందున, తాము వారికి అన్యాయం చేయమంటూ ఎన్నికల ముందు మాట్లాడిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. తమకిచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
సీఐటీయూ అనుబంధ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లంతా సంఘటితమై సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరావు మాట్లాడుతూ మొన్నటి విజయవాడ వరదల్లోనూ వలంటీర్ల సేవలు వినియోగించుకున్న ప్రభుత్వం, ఇపుడు ఆ వ్యవస్థ లేదని మాట్లాడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ ధర్నాకు వలంటీర్ల సంఘ ప్రతినిధులు పిజానీ, శ్యామలా ప్రసాద్ అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment