
సీఐడీ విచారణలో స్పష్టం చేసిన పోసాని కృష్ణమురళి
పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం
మోదీ, అమిత్ షాలపై బాబు విమర్శలనే ప్రస్తావించా
ఆ వీడియోలు చూసి నిర్ధారించుకున్నాకే మాట్లాడా..
చంద్రబాబు, లోకేశ్, పవన్ గురించి ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు
సాక్షి, అమరావతి/నగరంపాలెం (గుంటూరు వెస్ట్) :ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి గతంలో చంద్రబాబు చేసిన విమర్శలనే తాను ప్రస్తావించానని సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఐడీ అధికారులకు స్పష్టంచేశారు. అయ్యప్ప భక్తుల గురించి, మోదీకి భార్యలేదని విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల వీడియోలను చూసి నిర్థారించుకున్న తర్వాతే తాను మాట్లాడానని ఆయన తేల్చిచెప్పారు.
అలాగే, చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ గురించి తానెప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదని.. వారి గురించి అసభ్యకరంగా మాట్లాడాలని తనతో ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వెల్లడించారు. పోసాని గతంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై సీఐడీ అక్రమ కేసు నమోదుచేసి ఆయన్ని అరెస్టుచేసిన విషయం తెలిసిందే.
రిమాండ్‌లో ఉన్న ఆయన్ని సీఐడీ అధికారులు న్యాయస్థానం అనుమతితో మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. దాదాపు ముడు గంటలపాటు సాగిన ఈ విచారణలో పోసానికి మొత్తం 34 ప్రశ్నలు సంధించారు. వాటిన్నింటికీ ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు.
ముగిసిన సీఐడీ కస్టడీ: ఇదిలా ఉంటే.. పోసాని ఒకరోజు సీఐడీ కస్టడీ ముగిసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు సీఐడీ అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు పోసాని చెప్పిన సమాధానాలివీ..
సీఐడీ : ప్రెస్‌మీట్ నిర్వహించే ముందు ఎవర్నయినా కలిశారా?
పోసాని : ఎవర్నీ కలవలేదు.
సీఐడీ : సీఎం చంద్రబాబు అయ్యప్పస్వాములను అవహేళన చేశారంటూ మీరు విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఎందుకలా మాట్లాడారు?
పోసాని : అయ్యప్ప భక్తులు దీక్ష వహిస్తే మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని చంద్రబాబు ఓసారి అన్నారు. అందుకు సంబంధించిన వీడియో చూశా. అందుకే అలా మాట్లాడాను.
సీఐడీ : బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని చంద్రబాబు విమర్శించారని మీరు మాట్లాడారు.. దేని ఆధారంగా మాట్లాడారు?
పోసాని : చంద్రబాబు ఓసారి మసీదులో మాట్లాడుతూ.. ఇకపై బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తూ ఆ పార్టీతో ఇక పొత్తు పెట్టుకోనని విమర్శించారు. కానీ, ఆయన మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నేను అదే విషయాన్ని మాట్లాడాను.
సీఐడీ : ప్రధాని మోదీకి భార్యలేదని చంద్రబాబు అన్నారని మీరు మాట్లాడారు. దేని ఆధారంగా అలా మాట్లాడారు?
పోసాని : మోదీకి భార్యలేదని చంద్రబాబు విమర్శించడం నేను టీవీలో చూశాను. ఆ విషయాన్నే చెప్పాను.
సీఐడీ : మోదీ ఎవరు? అమిత్ షా ఎవరు? వారిని నేను గెలిపించానని చంద్రబాబు విమర్శించారని మీరు చెప్పారు. దేని ఆధారంగా అలా మాట్లాడారు?
పోసాని : చంద్రబాబు అలా మాట్లాడటం నేను టీవీలో చూశాను. అందుకే అలా మాట్లాడాను.
సీఐడీ : తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడారు? మీతో ఎవరు మాట్లాడించారు?
పోసాని : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి నేను విమర్శించలేదు. నాతో ఎవరూ అలా మాట్లాడించలేదు.
సీఐడీ : చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ గురించి అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు?
పోసాని : నేను చంద్రబాబు, లోకేశ్, పవన్ గురించి అసభ్యకరంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
సీఐడీ : మిమ్మల్ని ఇటీవల పోలీసులు విచారించినప్పుడు వైఎస్సార్‌సీపీలో ఎవరో చెబితేనే మాట్లాడినట్లు చెప్పారని పత్రికల్లో వార్తలొచ్చాయి కదా.. అలా మాట్లాడమని మీకెవరు చెప్పారు?
పోసాని : నాతో ఎవరో మాట్లాడించినట్లు నేను పోలీసులకు చెప్పలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. నాకెవరూ స్క్రిప్ట్ ఇవ్వరు. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలను చూసి నేనే నోట్ చేసుకుని మాట్లాడతాను.
Comments
Please login to add a commentAdd a comment