
చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత యనమల ఆగ్రహం!
ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై అసంతృప్తి
సీనియర్ నేత అయిన తనను అవమానకరంగా సాగనంపడంపై నిరసన
మండలిలో వీడ్కోలు కార్యక్రమానికి గైర్హాజరు
చంద్రబాబుతో ఫొటో దిగడానికీ నిరాకరణ
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తనకు బలవంతంగా, అదీ.. అవమానకరంగా రిటైర్మెంట్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న యనమల మరికొన్నాళ్లు ప్రజాప్రతినిధిగా కొనసాగాలని భావించారు. ఇటీవలే ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు.
అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవినే రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబు తనను అవమానించినట్లు యనమల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తనను వాడుకుని చివరి దశలో అవమానకర పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారని ఆయన బాధపడుతున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో శాసన మండలిలో తన సభ్యత్వానికి ఆఖరి రోజు అయిన మంగళవారం ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఏడుగురు సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో మండలిలో వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టి వారికి ముందే సమాచారం ఇచ్చినా, యనమల మాత్రం వీడ్కోలు కార్యక్రమానికి రాకుండా నిరసన తెలిపినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం గ్రూప్ ఫొటో కార్యక్రమం ఉందని ముందే చెప్పినా, యనమల దానికీ రాకపోవడం గమనార్హం. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో గ్రూప్ ఫొటో దిగేందుకు ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది.
ప్రాధాన్యత లేకుండా చేసి..
చంద్రబాబు కుమారుడు లోకేశ్ పార్టీలో సీనియర్ నాయకులందరికీ పొగ పెడుతున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో యనమల పేరునూ చాలారోజుల క్రితమే చేర్చారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. 2019– 24 మధ్యలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు అప్పగించి, పని చేయించుకున్నప్పటికీ, గత ఏడాది తిరిగి అధికారంలోకి రాగా నే ఆయన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలోనూ అస్సలు ప్రాధాన్యత లేకుండా చేశారు.
ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు ఆయనపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేయించి మరింతగా అవమానించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా పలు అవమానాలకు గురి చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి వీడ్కోలు కార్యక్రమానికి, గ్రూప్ ఫొటోకు రాలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment