ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వర రావు నియామకం
ఈరోజు సాయంత్రమే రిటైర్మెంట్
చంద్రబాబు అనుంగు డిజిపి ఎబివి రిటైర్మెంట్ నేడే
తనకుమాలిన ధర్మం ఎంత ప్రమాదం చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబు ప్రాపకం కోసం.. ఆయన ఆశీస్సుల కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని.. పదవిని.. ముప్పయ్యేళ్లపాటు చేస్తున్న ఉన్నత పదవిని ఫణంగా పెట్టి చివరకు పదవీభ్రష్టుడై.. తన తోటి సహచరులవద్ద చులకన అయిపోయి చివరకు ఎవరికీ తెలియని స్థితిలో రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఒక డీజీపీకి పట్టింది. ఆయన మరెవరో కాదు.. ఏబీ వెంకటేశ్వర రావు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ నిఘా విభాగం (ఇంటలిజెన్స్) చీఫ్‌గా పని చేసి చీప్ పనులకు దిగజారిపోయి నానా అనైతిక పనులకు పాల్పడ్డారు.
ఆయన ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నపుడు ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని అభియోగాలు ఉన్నాయి. దాంతోబాటు చంద్రబాబు హయాంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో సంచలనం లేపింది. వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న చంద్రబాబు దురాలోచనకు ఈ వెంకటేశ్వరరావు వెన్నుదన్నుగా నిలిచి ఆయా ఎమ్మెల్యేలను భయపెట్టి 23 మందిని టీడీపీలో చేర్చే విషయంలో ఎంతగానో సహాయపడ్డారు.
అప్పట్లో తానొక పోలీస్ ఉన్నతాధికారిని అని విస్మరించి అధికారపార్టీకి తొత్తుగా పనిచేసి, చంద్రబాబు మద్దతు ఉందని చెబుతూ డీజీపీలను, మంత్రులను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను సైతం చిటికెనవేళ్లమీద నడిపించారు. లొంగని వాళ్ళను భయపెట్టారు. మొత్తానికి ఐదేళ్లు ఏబీ వెంకటేశ్వరరావు ఒక రౌడీ పోలీస్ మాదిరిగా అధికారం చెలాయించారు. విధినిర్వహణ పేరిట పూర్తిగా సరిహద్దులను క్రాస్ చేసి ఇష్టానుసారం చెలరేగిపోయారు.
మళ్ళీ 2019లో టీడీపీ గెలిస్తే తానూ డీజీపీని అవుతానని కలలుగన్నారు. కానీ అప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలవడంతో ఏబీవి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చేసిన అరాచకాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆధారాలతో సహా వెలికితీసి సస్పెన్షన్ వేటు వేసింది. కోర్టుల చుట్టూ తిప్పించి ఐదేళ్లు పోస్టింగ్ లేకుండా ఆయన్ను మూడు చెరువుల నీళ్లు తాగించింది. గంగ మెల్లగా చంద్రముఖిగా మారిన విధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోయి వెంకటేశ్వర రావు చేసిన అనైతిక చర్యలకు మద్దతు పలకడమే కాకుండా ఆ అప్రజాస్వామిక చర్యలను దగ్గరుండి చేయించిన ఆయనకు ఈ ప్రభుత్వంలో అసలు కష్టం తెలిసొచ్చింది. కోర్టులు.. కేసులు.. సస్పెన్షన్లు అంటూ ఆయన ఈ ఐదేళ్లు యూనిఫామ్ వేసుకోకుండానే గడిపారు. డీజీపీ స్థాయి అధికారి తన స్థాయిని మరిచి అధికారపార్టీకి తాబేదారుగా పనిచేయడం అంటే తన ఆత్మగౌరవాన్ని, ఐపీఎస్ వృత్తి నిబంధనలను సైతం పరిహాసం చేయడమే అని తేలింది.
డీజీపీగా రిటైర్ కావాల్సిన ఉన్నతాధికారి.. ఐదేళ్లు ఉద్యోగం లేకుండా కోర్టులచుట్టూ తిరుగుతూ.. క్యాట్‌లో పిటిషన్లు వేస్తూ పోస్టింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆయన చేసిన తప్పిదాలు, ఘోరాలను కోర్టుల ముందు ఆవిష్కరించిన ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకోకుండా చేసింది. మొత్తానికి ఎట్టకేలకు ఏబీవికి మొన్న కేంద్ర పాలనా ట్రిబ్యునల్ (క్యాట్) పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఈరోజు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ వచ్చిందని సంతోషించాలో.. ఇదే రోజు సాయంత్రం రిటైర్ అవుతున్నందుకు విచారించాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబుకు కళ్ళు, ముక్కు, చెవులు అనేలా ప్రవర్తించిన ఏబీవి నేడు సాయంత్రం రిటైర్ అవుతున్నారు. పొద్దున్న పోస్టింగ్ వచ్చిన ఆయన సాయంత్రం ఉద్యోగ విరమణ చేయడం గమనార్హం.
:::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment