Pawan Kalyan Volunteer Comments Self Damage Include CBN - Sakshi
Sakshi News home page

Pawan Kalyan: ఏం.. భయ పెడుతున్నారా? భయ పడుతున్నారా?

Published Wed, Jul 12 2023 5:57 PM | Last Updated on Wed, Jul 12 2023 6:31 PM

Pawan Kalyan Volunteer Comments Self Damage Include CBN - Sakshi

ఎవరి మనుషులు.. ఏ పార్టీ వారు.. అన్న సంగతి పక్కన పెడితే, వాలంటీర్ల వ్యవస్థ మాత్రం అద్భుతమైన క్రియేషన్. అందులో సందేహం లేదు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసాయన్నది వాస్తవం. గ్రామీణ జనాలు మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వ్యవస్థను చంపేసే ప్రయత్నం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం. అయితే అది నేరుగా చేయకుండా జనసేన భుజం మీద తుపాకీ వుంచి కాల్చే ప్రయత్నం చేస్తోంది. 

✍️ గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అంటూ పెట్టారు. అవి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చాయే తప్ప మంచి పేరు కాదు. ప్రజలు ఈ కమిటీలతో విసిగి పోయారు. తెలుగుదేశం పార్టీ ఓటమిలో కొంత శాతం వాటా ఈ జన్మభూమి కమిటీలదే. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్‌లో ఉంది. 

✍️ వలంటీర్ల వ్యవస్థ ప్రజలను ఆకట్టుకుంది. ఇది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. రిక్రూట్ మెంట్ పూర్తి పారదర్శకంగా జరగడంతో పాటు.. పని బాధ్యతలను స్పష్టంగా నిర్వచించారు. దీని వల్ల ప్రతి వలంటీర్ కు చేయాల్సిన పనిపై స్పష్టత ఉంది. దాంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించి జవాబుదారీగా ఉంటున్నారు. దీని వల్ల సమాజంలో అందరికీ వలంటీర్లు అంటే అడుగు దూరంలో ఉన్న పరిపాలన/ప్రభుత్వం అన్న నమ్మకం ఏర్పడింది. 

✍️ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి రెండు సమస్యలు. ఒకటి అదృష్టం బాగుండి తాము అధికారంలోకి వస్తే, ఈ వ్యవస్థను ఎలా రద్దు చేయాలా? అన్నది. రెండవది ఈ వ్యవస్ధ వల్ల వైఎస్సార్ సిపికి ఎన్నికల్లో ప్రయోజనం వుంటుందేమో అన్న భయం రెండోది. ఈ రెండూ పరిష్కారం కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అదే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కానీ, దాని మూలాల్లో దాగిన సామాజిక వర్గానికి కానీ వచ్చిన విద్య ఒక్కటే. బురద వేసేయడం. ‘‘మేం బురద వేసాం. మీరు కడుక్కోండి’’ అనే విద్య బాగా వచ్చు.

✍️ సీఎం జగన్ మీద కావచ్చు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కావచ్చు లేటెస్ట్ గా వలంటీర్ల మీద కావచ్చు. అడ్డగోలుగా బురద వేసేయడం. సైలంట్ అయిపోవడం. తాము ఇంజెక్ట్ చేయాలనుకున్న విషం జనాల్లోకి పంపేయడం, తమకే పాపం తెలియదు ఆన్నట్లు ఊరుకోవడం. అయితే.. 

✍️ జనాలకు పనికి వస్తున్న వలంటీర్ల వ్యవస్థ ను తాము టార్గెట్ చేస్తే సమస్య అవుతుందని తెలుగుదేశం పార్టీకి తెలుసు. అందుకే ఈ పనిని పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. 

✍️ ఈస్ట్-వెస్ట్ జిల్లాల్లో YSRCPని పక్కకు తప్పించే బాధ్యత, వెళ్లిన ప్రతి చోటా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే అసైన్ మెంట్ ఎలా అప్పగించారో, అలాగే వలంటీర్ల మీద బురదేసే బాధ్యత కూడా పవన్ కు అప్పగించినట్లు కనిపిస్తోంది. దాంతో పాటు దీనిని కొనసాగించే బాధ్యత తెలుగుదేశం అనుకూల మీడియా కూడా తీసుకున్నట్లుంది.

✍️ జనాల్లోకి ఓ అనుమానం పంపించేసారు. సందేహం క్రియేట్ చేస్తారు. "మీ సంగతులు అన్నీ వలంటీర్ల ద్వారా క్రిమినల్స్ కు చేరిపోతున్నాయి" అనే అనుమానాన్ని బాగా ప్రచారం చేయడం పవన్ వంతు. జనాల మనసుల్లో ఓ భయాన్ని నాటాలి. అమాయక జనం భయపడాలి. ఆ విధంగా వలంటీర్ల వ్యవస్ధ వల్ల YSRCPకి ఏదో జరుగుతుంది అనేది వుంటే అది కాస్తా న్యూట్రల్ కావాలి. అదే దీని వెనకున్న కుట్ర.

✍️ కానీ పవన్ కు అయినా, TDPకి అయినా తెలియని సంగతి, గమనించని సంగతి ఏమిటంటే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ వున్నారు. ఈ వాలంటీర్ ఎక్కడి నుంచో వచ్చిన వాలంటీర్ కాదు. వాళ్ల ఇళ్ల మధ్య వున్న వాళ్లనే ఎంపిక చేసారు.

✍️ ‘‘మావయ్యా.. బావా.. అన్నా.. అక్కా’’ అనే వాళ్లే. అందువల్ల వీళ్ల గురించి వాళ్లకీ తెలుసు. వాళ్ల గురించి వీళ్లకూ తెలుసు. అందువల్ల ఈ విషబీజాలు అంత సులువుగా నాటుకోవు. కానీ దీనివల్ల తెలుస్తోంది ఏమిటంటే, వాలంటీర్ల గురించి భయపడేలా చెప్పే ప్రయత్నం చేస్తున్న పవన్, తేదేపా వర్గాల మనసుల్లో వున్న భయం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ భయం రెట్టింపు అవుతుంది. ఇప్పుడే ఇన్ని సమస్యలు తీసుకొస్తున్న చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ మళ్లీ ఎన్నికల్లో ఓటేయమని వస్తే.. ఏ రకంగాను ఎవరూ సపోర్ట్ చేయరని రెండు పార్టీలకు అర్థమయింది. 

:::పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement