వలంటీర్లతో పనిలేకుండా పింఛన్ల పంపిణీ
వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో చూపించాం
వలంటీర్లు రూ.100 తీసుకునేవారు
గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీలో పవన్ కళ్యాణ్
పిఠాపురం: వలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యమన్నారని, కానీ వారి అవసరం లేకుండా పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచి్చన హామీ ప్రకారం ఒకటో తేదీన వలంటీర్లు లేకుండానే సచివాలయాలు, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.
గతంలో పింఛన్ల పంపిణీలో కొందరు వలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100కు తక్కువ కాకుండా తీసుకునేవారని తనకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. వలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా చేసి చూపించామన్నారు.
వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీరు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడం, ప్రతి ఇంటికీ లోటు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించి, ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని చెప్పారు. రక్షిత మంచి నీరు, ఉపాధి, సాగునీటి కాలువల పూడికతీత వంటివి చేసి, ప్రజలకు దగ్గర కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలనేది తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతోందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్‌కు పరాభవం
భీమవరం: పింఛన్ల పంపిణీ కరపత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్రించకపోవడం ఆయన్ని పరాభవించడమేనని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి వచి్చన చంద్రబాబు పింఛన్ల కరపత్రంపై కేవలం తన చిత్రాన్ని మాత్రమే ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరపత్రంపై పవన్ ఫొటో ముద్రించకుండా దారుణంగా అవమానించారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తాను మాత్రమే ప్రచారం పొందాలన్న యావ చంద్రబాబుకు ఇంకా పోలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్ల కరపత్రంపై ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా వేయకపోవడం గమనార్హం. దీనిపై ఎనీ్టఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment