సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు.
త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్‌మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు.
ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.
చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా?
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు.
చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు.
‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం
లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment