alla nani
-
ఆళ్ల నాని చేరికను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ శ్రేణులు అధిష్టానానికి తీవ్ర నిరసన తెలపడంతో చేరిక వాయిదా పడింది. 9న తుది నిర్ణయం తీసుకుని అందరికి ఆమోదం ఉంటేనే చేర్చకుంటామని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆళ్ల నాని పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అప్పటి నుంచి ఏలూరు రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు స్థానికంగా కూడా అందుబాటులో లేకుండా విశాఖపట్నానికే పూర్తిగా పరిమితమయ్యారు. తాజాగా ఆళ్ళ నాని మనసు మార్చుకుని తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమయ్యారు. విజయనగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు సమాచారం. దానికనుగుణంగా మంగళవారం టీడీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాతో పాటు నగరంలోని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకు మంగళవారం సీఎంఓ నుంచి పిలుపువచ్చింది. సోమవారం సాయంత్రం ఏలూరు ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సీఎంఓకు రావాల్సిందిగా సూచించారు. ఆళ్ల నాని జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో చేరేలా అంతా సిద్ధం చేశారు. కట్‌చేస్తే... కేబినేట్ సమావేశం ఆలస్యం కావడం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు మంగళవారం ఉదయం నుంచి ఆళ్ల నానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీఎంఓకు, మంత్రి లోకేష్‌కు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఫిర్యాదులు చేసింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి అభ్యంతరం రావడంతో సీఎంఓకు వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మంత్రి కొలుసు పార్థసారథి ఎవరినీ కలువకుండానే వెనుదిరిగారు. టీడీపీ శ్రేణుల ఇళ్లు ధ్వంసం చేశారని, 20 మందికిపైగా నాయకులపై కేసులు పెట్టి వేధించారని, వ్యాపారాలకు కూడా ఇబ్బందులు పెట్టారంటూ నానిపై చంటి వర్గం ఫిర్యాదుల చేసింది. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక 9న అందరితో మాట్లాడి చేర్చుకుంటామని మాజీ మంత్రి ఆళ్ల నానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో వైపు పరిణామాలు చక్కదిద్ది అందరితో మాట్లాడాల్సిన బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించారు. -
ఆళ్లనానిపై భగ్గుమంటున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
ప్రతిపక్షాలు సీఎం జగను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి: ఆళ్ల నాని
-
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
‘వలంటీర్ల వ్యవస్థపై విషం.. చంద్రబాబు, పవన్ కుట్రలను తిప్పికొట్టాలి’
సాక్షి, ఏలూరు జిల్లా: వలంటీర్ల వ్యవస్థపై కొంతమంది విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. వలంటీర్ల వ్యవస్థను కూల్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నాడు. వలంటీర్ వ్యవస్థ అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. మహిళల అక్రమ రవాణాకు, వలంటీర్లకు సంబంధం ఏంటి? అంటూ ఆళ్ల నాని ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘తణుకు సభలో పవన్ తీరు పరాకాష్టకు చేరింది. ఉన్మాదిలా,అసాంఘిక శక్తిలా మాట్లాడాడు. వలంటీర్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడాడు. మామిడి పళ్ల బుట్టలో రెండు కుళ్లి పోతే వాటిని తేసి బయట పడేస్తారు.. బుట్ట మొత్తం పారేయరు. పవన్ రెండు నాలుకల ధోరణి ప్రజలు గమనించాలి. పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు మనుకోవాలి. వలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు. -
‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..?’
సాక్షి, ఏలూరు: పవన్ కల్యాణ్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?, పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే. జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్‌ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆళ్ల నాని ఏమన్నారంటే.. రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్ వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్‌కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్‌కళ్యాణ్ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని తన అక్కసు వెళ్లగక్కిన పవన్‌కళ్యాణ్ తీరు అందరూ చూస్తున్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న పవన్‌కళ్యాణ్ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్‌కళ్యాణ్ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్‌కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు సభలో పవన్‌కళ్యాణ్ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్‌కళ్యాణ్‌కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్‌కళ్యాణ్ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..? గతంలో ఒకసారి ఇదే పవన్‌కళ్యాణ్ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..? వందజన్మలెత్తినా జగన్ గారి స్థాయికి చేరుకోలేవు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారితో పవన్‌కళ్యాణ్‌కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్‌కళ్యాణ్ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. పవన్ అబద్ధాలకు అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది? పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్‌కళ్యాణ్‌లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్‌గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్‌కళ్యాణ్‌లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్‌కళ్యాణ్. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు. వాలంటీర్లపై నీచపు మాటలా? వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్‌కళ్యాణ్..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్‌కు ఇష్టమేమో..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్‌కళ్యాణ్‌కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్ వ్యవస్థంటే పవన్‌కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్‌కళ్యాణే పెద్దక్రిమినల్ కోవిడ్ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ లు.. హైదరాబాద్‌లో తమ ప్యాలెస్‌లలో కూర్చొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్ని కోవిడ్ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్ అంటూ పవన్‌కళ్యాణ్ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్ అని చెబుతున్నాను. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్‌కళ్యాణ్ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్‌గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్‌గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్‌కళ్యాణ్ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్‌ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్‌గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్‌కళ్యాణ్ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి, అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్‌కళ్యాణ్ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్ఆర్సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్‌కళ్యాణ్ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్‌కళ్యాణ్ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను. -
సీఎం జగన్‌పై బురద చల్లేందుకే పవన్ యాత్ర: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: పవన్ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, సీఎం జగన్‌పై బురద చల్లేందుకే పవన్ యాత్ర అంటూ మాజీ మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి మాకు అధికారం ఇస్తే పలానా మేలు చేస్తామని చెప్పుకుంటారు. కానీ పవన్ మాత్రం సీఎం జగన్‌ను దూషించటానికే యాత్ర చేస్తున్నారు’’ అని ఆళ్ల నాని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుని ఎలాగైనా సీఎం చేయాలనే ఉద్దేశంతో పవన్ పని చేస్తున్నారు. ఎన్నిరకాలుగా మమ్మల్ని దూషిస్తున్నా మేము సహనంతో ఉన్నాం. అంతేతప్ప చేతగానితనం కాదు. మా నాయకులేనే కాదు.. ప్రజలను కూడా దూషిస్తున్నారు. గత ఎన్నికలలో తనను ఓడించారనే అక్కసుతో మాట్లాడుతున్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమ గూండాలు అంటూ ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేదే లేదన్న సంగతి రాష్ట్రమంతటా తెలుసు. కానీ తన స్వార్దం కోసం కులాలు, ప్రాంతాలను వాడుకుంటున్నారు’’ అంటూ ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. ‘‘అంతర్వేదిలో రథం దగ్ధమైతే సీబిఐ విచారణకు జగన్ ఆదేశించారు. అంతేకాదు కొత్త రథాన్ని తయారు చేయించి ఆయనే స్వయంగా ప్రారంభించారు. టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను జగన్ పునఃనిర్మించారు. అంతర్వేది రథం టీడీపీ హయాంలో దగ్ధం అయితే దాన్ని నిస్సిగ్గుగా జగన్ మీద వేసేవాడు. కానీ మేము ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద వేయలేదు. వారాహి యాత్రని ఇలాగే కుట్రలతో కొనసాగితే మీకు గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా జనం గెలవనీయరు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒకోసారి ఒక్కడినైనా గెలిపించండి అంటాడు. ఇంకోసారి జగన్‌ను దించటమే లక్ష్యం అంటాడు. ఆ మర్నాడే తానే సీఎంని అంటాడు. ఇలాంటి నిలకడలేని మాటలు పవన్ కళ్యాణ్ కే సాధ్యం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది ఒకే గొంతు, ఒకే నాలుక. ఇద్దరూ కూడబలుక్కునే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ అనేది కేవలం ఉభయగోదారి జిల్లాకే పరిమితమా?. మిగతా రాష్ట్రంతో పనిలేదా?. వైసీపీ ఓట్లు చీల్చటానికి పవన్, చంద్రబాబు గోదావరి జిల్లాలో ఎన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపును ఆపలేరు’’ అని ఆళ్ల నాని స్పష్టం చేశారు. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. ‘‘పోలవరం ప్రాజెక్టు పురోగతి లేదని పవన్ ఎలా మాట్లాడతారు?. అసలు పోలవరమే కాదు, ఏ విషయం గురించి మీకు పూర్తిగా తెలుసు?. ఏదైనా అధ్యయనం చేసి పవన్ మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన పోలవరాన్ని జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. గాంధీ సిద్దాంతాలను అవమానించేలా పవన్ మాట్లాడతారు. పవన్ తన తీరు మార్చకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అన్నదమ్ముల్లాగా గోదావరి జిల్లాలో ప్రజలు ఉన్నారు. కానీ వారి మధ్య చిచ్చు పెట్టి, ఓట్లను చీల్చాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారు. పవన్ మీద రెక్కీ నిర్వహించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. సానుభూతి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడున్నారు.పవన్ ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా జగన్‌ని ఆపలేరు. గతంలో కూడా జగన్‌ని సీఎంని కానివ్వను అన్నారు ఏమైందో జనం చూశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఇది ఖాయం’’ అని ఆళ్ల నాని చెప్పారు. చదవండి: ఏపీలో వింతరాజకీయం.. పొత్తుల్లేని చెట్టాపట్టాల్ -
గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ కుటుంబ సభ్యులను హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పార్టీ కోసం గంజి ప్రసాద్ ఎంతో సేవ చేశారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కుటుంబ సభ్యులు చెప్తున్న బజారీ అనే వ్యక్తిపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ హత్యకు కారకులు, ప్రేరేపించినవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుదని హోం మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. హత్యకు సంబంధించిన వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాము. ఏ పార్టీ అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అసలైన నిందితులకు శిక్ష పడేలా చూస్తాము. గ్రామంలోని నాయకులు సంయమనం పాటించాలి. వారి కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత' అని మాజీ మంత్రి ఆళ్ల నాని అన్నారు. చదవండి👉 (వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య) ఇదిలా ఉంటే శనివారం ఉదయం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ (55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో దాడిచేసి ఆయనను హత్యచేశారు. అనంతరం వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల ముసుగులో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యేను పక్కనే ఉన్న పాఠశాలలో నిర్బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పోలీస్ యంత్రాంగం రంగప్రవేశం చేసి, నాలుగు గంటల అనంతరం ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. -
తప్పుదోవ పట్టిస్తారా?
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ఇదీ వాస్తవం.. ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్ హెమరేజ్‌తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు. వినే ఓపికా లేదా?: బుగ్గన టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు. -
టీడీపీ సభ్యులపై కొయ్యే మోషేన్‌రాజు సీరియస్
-
సహజ మరణాలపై శవ రాజకీయాలా?
సాక్షి, అమరావతి: సహజ మరణాలపై ప్రతిపక్ష పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవి సారా మరణాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఘటనపై సోమవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. విషయం తెలియగానే సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి స్వయంగా అక్కడికి వెళ్లామని చెప్పారు. పరిస్థితి చూసి వెంటనే తగిన చర్యలు తీసుకున్నా విపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈనాడు దినపత్రిక లేనిపోని అవాస్తవాలు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. గుండెనొప్పితో ఉపేంద్ర మృతి.. రాజకీయంగా లబ్ధి పొందాలన్న చంద్రబాబు కుట్రలకు ఆ పత్రిక వంత పాడుతోందని మంత్రి నాని ధ్వజమెత్తారు. ఈ నెల 12న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఉపేంద్రకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఈసీజీ తీశారని తెలిపారు. ఉపేంద్ర గుండెనొప్పితో చనిపోయాడని డాక్టర్లు స్పష్టంగా చెప్పినా ఈనాడు పత్రిక అవాస్తవాలు రాసిందన్నారు. తన భర్త నాలుగైదు రోజులుగా మద్యం తాగలేదని ఉపేంద్ర భార్య చెప్పారని, ఈమేరకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రిలో, పోలీసు రికార్డుల్లోనూ ఉందన్నారు. మృతుల జాబితా సేకరించి.. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో అందరూ ఒకేసారి చనిపోలేదని, వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రి నాని తెలిపారు. తొలుత 16 మంది మరణించగా అందులో 15 మంది తమ ఇళ్లలోనే చనిపోయారన్నారు. దహన సంస్కారాలు జరిగాక టీడీపీ నాయకులు శ్మశానం వద్దకు వెళ్లి వారం రోజుల్లో చనిపోయిన వారి జాబితా సేకరించి సారా మరణాల్లో చేర్చారని వెల్లడించారు. నాడు ఏరులైన మద్యం... నిజానికి చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు వెలిశాయని మంత్రి నాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మద్యాన్ని నియంత్రిస్తూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటే వినియోగం తగ్గుతుందని సీఎం భావించారని తెలిపారు. ఆ తర్వాత మద్యం రేట్లు తగ్గించాలని అందరూ కోరడంతో అంగీకరించారన్నారు. జీలుగుకల్లు మరణాలపై మాట్లాడరేం? కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శవ రాజకీయం చేశారని తెలిపారు. టీడీపీ ఇన్చార్జి సోదరుడే కల్లులో విషం కలిపాడని తేలడంతో తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో యనమల ఆధ్వర్యంలో చంద్రబాబు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఎక్కడ అక్రమ మద్యం ఉన్నా, దాని వెనక ఎవరున్నా ఉపేక్షించవద్దని సీఎం గట్టిగా చెప్పారన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కూడా ఏర్పాటైందన్నారు. సారా వల్ల ఏ కుటుంబానికీ హాని కలగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వారం రోజులుగా తినకుండా తాగడంతో.. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారిలో ఒక వ్యక్తి వారం రోజుల నుంచి ఏమీ తినకుండా మద్యం తాగడంతో మరణించాడని, ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నా విపక్షం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. శ్మశానానికి ఏ శవం వచ్చినా సారాతోనే చనిపోయారంటూ టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారన్నారు. అవసరమైతే ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే, వైద్య శిబిరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. పరామర్శా.. బల ప్రదర్శనా? ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శ కోసం కాకుండా బల ప్రదర్శన మాదిరిగా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను తరలించి ఒక యుద్ధానికి వెళ్లినట్లుగా జంగారెడ్డిగూడెం వెళ్లారని మంత్రి నాని పేర్కొన్నారు. నిజంగా ప్రజలను ఓదార్చేందుకు వెళ్లే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. సభలోనూ టీడీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అదే నిజమైతే పోస్టుమార్టం చేస్తారా? అప్పారావు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొస్తే అరగంటలో చనిపోయాడని, ఆ వెంటనే అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై ఫిర్యాదు చేయలేదన్నారు. అంత్యక్రియలు పూర్తైన 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ చేశారని చెప్పారు. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. అది 16వ మరణం కాగా ఆ తర్వాత మరో రెండు మరణాలు ఆస్పత్రిలో నమోదైనా ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి పోస్టుమార్టం చేయించామని, తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఒకవేళ మరణాలకు సారా కారణమైతే తామే ఎందుకు పోస్టుమార్టమ్ చేయిస్తామని ప్రశ్నించారు. ఆ నివేదికలు రాగానే టీడీపీ కుట్రలు వెలుగులోకి వస్తాయన్నారు. -
సహజ మరణాలపై కూడా అపోహలు సృష్టిస్తున్నారు: మంత్రి ఆళ్లనాని
-
సహజ మరణాలపై టీడీపీ అపోహలు
-
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్‌సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్‌సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీల తరహాలోనే యూపీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్‌సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్‌సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్‌సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్‌సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్‌సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్‌సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
పెనుమూరు/కార్వేటినగరం (చిత్తూరు): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగరరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.13.5 కోట్లతో నూతనంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు. -
కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్ టీకాలు, 71.76 శాతం రెండో డోస్ టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ గుర్తించే పరీక్షలు చేయాలని, విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పర్యాటకులను రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు. మెడికల్ హబ్స్ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్ డోస్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు పరిష్కారమని సీఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించామన్నారు. మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈనెలాఖరు నాటికి 144 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నాడు– నేడు పనుల ప్రగతిపై సీఎం సమీక్ష ►విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం ►నాడు – నేడు కింద చేపడుతున్న ఏ కార్యక్రమమైనా గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలి: సీఎం ►గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో.. ఫొటోగ్రాఫ్‌లను చూపాలి: సీఎం ►కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం ►ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుంటూ పనులు జోరుగా నడిపించాలన్న సీఎం ►ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయమై అందరికీ అవాగాహన కల్పించాలి ►గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలి ►ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్నదానిపై వారికి అందుబాటులో సమాచారం ఉండాలి ►విలేజ్ క్లినిక్స్ అనేది రిఫరల్ పాయింటల్ కావాలి ►విలేజ్ క్లినిక్స అందుబాటులోకి వచ్చేంతవరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఈ బాధ్యత తీసుకోవాలి ►ఏ ఆస్పత్రికి వెళ్లాలి, ఎక్కడ ఆరోగ్య శ్రీ సేవలు చేయించుకోవాలన్నదానిపై వారికి సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇవ్వాలి ►108 ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలి ►ఇలాంటి సేవలకు కూడా 104ను డెవలప్ చేయాలి ►ఆరోగ్య శ్రీలో రిఫరెల్ అన్నది చాలా కీలకమైన విషయం ►ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుంది ►అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి ►క్యాన్సర్ రోగులకు సూపర్‌స్పెషాల్టీ సేవలు అందాలి: సీఎం ►మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాల్టీ ఆస్పత్రులు ఉండాలి: సీఎం ►దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదు ►అంతేకాకుండా క్యాన్సర్ రోగులకు చికిత్సలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శ్రీ కింద సేవలు అందాలి ►కొత్తగా తీసుకు వస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయి ►అవి కాకుండా క్యాన్సర్ చికిత్సకోసం మరో మూడు సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలి ►వీటితో పాటు ఇదివరకే చెప్పిన విధంగా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం: ►ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి ►రోగులకు సమర్థవంతంగా సేవలు అందేలా వ్యవస్థ అందాలి ►108, 104 వాహనాలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని సీఎం ఆదేశం ►నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదన్న సీఎం ►రోగులకు సమర్ధవంతంగా సేవలు అందించడంలో వాహనాల నిర్వహణ కీలకమన్న సీఎం ►జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని బఫర్ వెహికల్స్ పెట్టుకుని, ఎప్పటికప్పుడు వాహనాలను మెయింటినెన్స్ చేయాలన్న సీఎం ►ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జి అయిన రోజునుంచే వారికి డబ్బు అందాంటూ పునరుద్ఘాటించిన సీఎం. ►విశాఖపట్నంలో కొత్త ఎంఐఆర్ఐ, కాకినాడలో ఎంఐఆర్ఐ, కాథ్ ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్‌పపాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్ మరియు ఈఎన్టీ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ►దాదాపు రూ. 37.03 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం ►సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ►ఇందులో సందేహాలను నివృత్తిచేసే ఏర్పాటూ ఉండాలన్న సీఎం ►యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఇవ్వనున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ►వారికి సెల్ఫోన్లు సమకూర్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ►విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపైన నిరంతరం నివేదికలు రావాలన్న సీఎం ►ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ►కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలన్న సీఎం ►రక్త హీనతను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు ►ఆరు రకాల చర్యలను తీసుకుంటున్నామన్న అధికారులు ►రక్త హీనత నివారణా చర్యల్లో దేశంలోనే ఏపీ నంబర్ ఒన్‌గా నిలిచిందన్న అధికారులు ►75.3 పాయింట్లతో ఇండెక్స్‌లో ప్రథమస్థానంలో నిలిచిందన్న అధికారులు ►అంగన్వాడీలు, విలేజ్‌క్లినిక్స్ .. వీటన్నింటి ద్వారా రక్తహీనత నివారణా కార్యక్రమాలు చురుగ్గా సాగాలన్న సీఎం ►డీ వార్మింగ్‌కు వినియోగించే మందుల నాణ్యతపై అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం ►జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్న ముఖ్యమంత్రి ►ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం ►ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు ►ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యుల సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు కూడా ఉంచాలన్న సీఎం ►సిబ్బంది లేమి వల్ల ఈ సేవలు అందలదేన్న మాట వినిపించకూడదన్న సీఎం ►ఆసత్పుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, తగిన సిబ్బంది ఉండచడం.. ఈరెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం ►అధికారులు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను ప్రజలకు అందించడంలో సిబ్బంది సహకారం, భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం ►ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రజలకు సేవలందించడంలో లక్ష్యాలను వారికి వివరించాలన్న సీఎం ►వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలన్న సీఎం -
తుపాను గండం: అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. -
ఒమిక్రాన్’పై ఏపీ అప్రమత్తం: విదేశాల నుంచి వస్తే ‘ఆర్టీపీసీఆర్’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న ‘ఒమిక్రాన్’పై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ కొత్త వేరియంట్ విషయంలో విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించి, పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తామన్నారు. 104 సహా అవసరమైన సహాయ చర్యల సన్నద్ధతపై చర్చించారని, అలాగే జనవరి 15లోగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసు నమోదు కాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. చదవండి: (వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!) -
వేవ్ వచ్చినా.. వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
గుంటూరు మెడికల్: మన రాష్ట్రానికి ఏ వేవ్ వచ్చినా, ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్య కళాశాల ప్రారంభమై 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు గుర్తుగా కళాశాలలో సోమవారం పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పైలాన్‌కు శంకుస్థాపన చేయడం వైద్య, ఆరోగ్యశాఖలో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ పైలాన్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పడిందని, ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన ఎంతో మంది దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా స్థిరపడిపోయి దేశానికి మంచి పేరు తెస్తున్నట్టు తెలిపారు. వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం ప్రత్యేక దృష్టి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో కళాశాల, ఆస్పత్రిలో పలు వార్డుల ఆధునికీకరణ, నూతన వైద్య విభాగాల నిర్మాణం కోసం సీఎం రూ.500 కోట్లు కేటాయించి.. నిర్మాణాలు చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, మేయర్ మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్ షేక్ సజీలా, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం జగన్ సమీక్ష నిర్వాహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి రాష్ట్రాని వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. చదవండి: వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15లోపు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో వసతులు, సౌకర్యాలు పెంచుతూ.. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపారని చెప్పారు. కోవిడ్ విషయంలో గతంలో తీసుకున్న అన్ని చర్యలను అధికారులు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించానట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసి, కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు ఏపీలో నమోదు కాలేదని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొత్త వేరియంట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో అన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. -
వరద బాధితులకు మెరుగైన సేవలందించండి
సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వరద ముంపు జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి క్యాంపులో సీనియర్ వైద్యుల బృందం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వరద బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వరద తగ్గిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించాలని, అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మెడికల్ క్యాంపుల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్ చంద్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు ►పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు ►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు ►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం ►సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు ►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు ►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం 16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం ►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు ►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు ►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు: ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059 ♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు. ♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి. ♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు. ♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు ♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం. ♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం. వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష ♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం ♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం ♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు ♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు ♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు. ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం ♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు ♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦మొత్తం పాజిటివ్ కేసులు 3366 ♦పాజిటివిటీ రేటు 0.7 శాతం ♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 ♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ♦15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు వ్యాక్సినేషన్ ♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458 ♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 ♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 ♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.