సీఎంఓ నుంచి లోకేష్ వరకు ఫిర్యాదులు చేసిన ఎమ్మెల్యే చంటి వర్గం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ శ్రేణులు అధిష్టానానికి తీవ్ర నిరసన తెలపడంతో చేరిక వాయిదా పడింది. 9న తుది నిర్ణయం తీసుకుని అందరికి ఆమోదం ఉంటేనే చేర్చకుంటామని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆళ్ల నాని పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
అప్పటి నుంచి ఏలూరు రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు స్థానికంగా కూడా అందుబాటులో లేకుండా విశాఖపట్నానికే పూర్తిగా పరిమితమయ్యారు. తాజాగా ఆళ్ళ నాని మనసు మార్చుకుని తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమయ్యారు. విజయనగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు సమాచారం. దానికనుగుణంగా మంగళవారం టీడీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాతో పాటు నగరంలోని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకు మంగళవారం సీఎంఓ నుంచి పిలుపువచ్చింది.
సోమవారం సాయంత్రం ఏలూరు ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సీఎంఓకు రావాల్సిందిగా సూచించారు. ఆళ్ల నాని జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో చేరేలా అంతా సిద్ధం చేశారు. కట్‌చేస్తే... కేబినేట్ సమావేశం ఆలస్యం కావడం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు మంగళవారం ఉదయం నుంచి ఆళ్ల నానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీఎంఓకు, మంత్రి లోకేష్‌కు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఫిర్యాదులు చేసింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి అభ్యంతరం రావడంతో సీఎంఓకు వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, మంత్రి కొలుసు పార్థసారథి ఎవరినీ కలువకుండానే వెనుదిరిగారు.
టీడీపీ శ్రేణుల ఇళ్లు ధ్వంసం చేశారని, 20 మందికిపైగా నాయకులపై కేసులు పెట్టి వేధించారని, వ్యాపారాలకు కూడా ఇబ్బందులు పెట్టారంటూ నానిపై చంటి వర్గం ఫిర్యాదుల చేసింది. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక 9న అందరితో మాట్లాడి చేర్చుకుంటామని మాజీ మంత్రి ఆళ్ల నానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో వైపు పరిణామాలు చక్కదిద్ది అందరితో మాట్లాడాల్సిన బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment