సాక్షి, అమరావతి: సహజ మరణాలపై ప్రతిపక్ష పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవి సారా మరణాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఘటనపై సోమవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. విషయం తెలియగానే సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి స్వయంగా అక్కడికి వెళ్లామని చెప్పారు. పరిస్థితి చూసి వెంటనే తగిన చర్యలు తీసుకున్నా విపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈనాడు దినపత్రిక లేనిపోని అవాస్తవాలు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు.
గుండెనొప్పితో ఉపేంద్ర మృతి..
రాజకీయంగా లబ్ధి పొందాలన్న చంద్రబాబు కుట్రలకు ఆ పత్రిక వంత పాడుతోందని మంత్రి నాని ధ్వజమెత్తారు. ఈ నెల 12న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఉపేంద్రకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఈసీజీ తీశారని తెలిపారు. ఉపేంద్ర గుండెనొప్పితో చనిపోయాడని డాక్టర్లు స్పష్టంగా చెప్పినా ఈనాడు పత్రిక అవాస్తవాలు రాసిందన్నారు. తన భర్త నాలుగైదు రోజులుగా మద్యం తాగలేదని ఉపేంద్ర భార్య చెప్పారని, ఈమేరకు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆస్పత్రిలో, పోలీసు రికార్డుల్లోనూ ఉందన్నారు.
మృతుల జాబితా సేకరించి..
వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో అందరూ ఒకేసారి చనిపోలేదని, వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రి నాని తెలిపారు. తొలుత 16 మంది మరణించగా అందులో 15 మంది తమ ఇళ్లలోనే చనిపోయారన్నారు. దహన సంస్కారాలు జరిగాక టీడీపీ నాయకులు శ్మశానం వద్దకు వెళ్లి వారం రోజుల్లో చనిపోయిన వారి జాబితా సేకరించి సారా మరణాల్లో చేర్చారని వెల్లడించారు.
నాడు ఏరులైన మద్యం...
నిజానికి చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు వెలిశాయని మంత్రి నాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మద్యాన్ని నియంత్రిస్తూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటే వినియోగం తగ్గుతుందని సీఎం భావించారని తెలిపారు. ఆ తర్వాత మద్యం రేట్లు తగ్గించాలని అందరూ కోరడంతో అంగీకరించారన్నారు.
జీలుగుకల్లు మరణాలపై మాట్లాడరేం?
కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శవ రాజకీయం చేశారని తెలిపారు. టీడీపీ ఇన్‌చార్జి సోదరుడే కల్లులో విషం కలిపాడని తేలడంతో తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో యనమల ఆధ్వర్యంలో చంద్రబాబు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఎక్కడ అక్రమ మద్యం ఉన్నా, దాని వెనక ఎవరున్నా ఉపేక్షించవద్దని సీఎం గట్టిగా చెప్పారన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కూడా ఏర్పాటైందన్నారు. సారా వల్ల ఏ కుటుంబానికీ హాని కలగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
వారం రోజులుగా తినకుండా తాగడంతో..
జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారిలో ఒక వ్యక్తి వారం రోజుల నుంచి ఏమీ తినకుండా మద్యం తాగడంతో మరణించాడని, ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నా విపక్షం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. శ్మశానానికి ఏ శవం వచ్చినా సారాతోనే చనిపోయారంటూ టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారన్నారు. అవసరమైతే ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే, వైద్య శిబిరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు.
పరామర్శా.. బల ప్రదర్శనా?
ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శ కోసం కాకుండా బల ప్రదర్శన మాదిరిగా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను తరలించి ఒక యుద్ధానికి వెళ్లినట్లుగా జంగారెడ్డిగూడెం వెళ్లారని మంత్రి నాని పేర్కొన్నారు. నిజంగా ప్రజలను ఓదార్చేందుకు వెళ్లే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. సభలోనూ టీడీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
అదే నిజమైతే పోస్టుమార్టం చేస్తారా?
అప్పారావు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొస్తే అరగంటలో చనిపోయాడని, ఆ వెంటనే అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై ఫిర్యాదు చేయలేదన్నారు. అంత్యక్రియలు పూర్తైన 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ చేశారని చెప్పారు. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. అది 16వ మరణం కాగా ఆ తర్వాత మరో రెండు మరణాలు ఆస్పత్రిలో నమోదైనా ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి పోస్టుమార్టం చేయించామని, తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఒకవేళ మరణాలకు సారా కారణమైతే తామే ఎందుకు పోస్టుమార్టమ్ చేయిస్తామని ప్రశ్నించారు. ఆ నివేదికలు రాగానే టీడీపీ కుట్రలు వెలుగులోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment