అసెంబ్లీ సమావేశాలకు ముందు వరకు సారా, లిక్కర్, లిక్కర్ బ్రాండ్లు, డిస్టిలరీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టు, సంక్షేమాభివృద్ధి పథకాలపైనా విషం చిమ్మారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆయా అంశాలపై జరిగే చర్చలో పాల్గొంటే తమ బండారం బట్టబయలవుతుందని ప్రతిపక్ష టీడీపీ భయపడింది. రోజూ ఏదో ఒక రీతిలో గందరగోళం సృష్టించి, తమపై సస్పెన్షన్ వేటు పడేలా వ్యూహం రచించుకుని అమలు చేసింది. మొత్తంగా టీడీపీ పలాయనవాదాన్ని, అధికార పక్షం చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనించారు.
సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చిత్రీకరించి, వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాలను శాసనసభ వేదికగా సాక్ష్యాధారాలతో తిప్పికొట్టడంలో అధికార పక్షం విజయం సాధించింది. మద్యం బ్రాండ్ల నుంచి పోలవరం ప్రాజెక్టు ఎత్తు వరకూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న అసత్య ఆరోపణలే నిజమని ప్రజలను నమ్మించేలా ఎల్లో మీడియా కథనాలను వండివార్చుతుండటాన్ని ఆధారాలతో ఎండగట్టింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో 2020, 2021లో బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయిన ప్రభుత్వం.. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 12 రోజులపాటు పూర్తి స్థాయిలో సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో ప్రతిపక్షం విఫలమైంది. జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలను నాటు సారా మరణాలుగా చిత్రీకరిస్తూ.. వాటిపై చర్చకు పట్టుబడుతూ.. మద్యం బ్రాండ్లపై అవాస్తవాలు వల్లిస్తూ.. ఈలలు వేస్తూ.. తాళాలతో భజన చేస్తూ.. తాళిబొట్లను ప్రదర్శిస్తూ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా దిగజారి వ్యవహరించి ఉభయ సభల్లోనూ ఘోరంగా పరువు పోగొట్టుకుంది.
ప్రతిపక్షం అజెండాపై చర్చకు సిద్ధమన్నా..
బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితి. ప్రసంగ ప్రతుల్లో ఏముందో కూడా తెలుసుకోక ముందే... వాటిని చింపి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌పై విసిరేస్తూ ప్రతిపక్ష సభ్యులు దాడికి పాల్పడ్డ తీరును రాజకీయ పరిశీలకులు తప్పు పడుతున్నారు. వ్యవస్థలపై ప్రతిపక్ష టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదన్నది మరోసారి బహిర్గతమైందని వారు ఎత్తిచూపుతున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం సరి కాదని హితవు పలికారు. అధికారపక్షం ప్రతిపాదించిన అజెండా కాకుండా, 25 అంశాలతో ప్రతిపక్షం ప్రతిపాదించిన అజెండాపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమావేశాలు హుందాగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. కానీ ప్రతిపక్షం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు.
చంద్రబాబు సైంధవ పాత్ర
గత సమావేశాల్లో తన కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనకున్నా, దుర్భాషలాడినట్లు చిత్రీకరించి.. సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సభ్యులను మాత్రమే ఉభయ సభలకు పంపారు. జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలను నాటుసారా మరణాలుగా చిత్రీకరించి.. వక్రీకరించి.. సభల్లో గందరగోళం సృష్టించి.. సస్పెండై బయటకు రావాలని ప్రతిపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేసి మరీ సభకు పంపారు. దాన్నే ఎల్లో మీడియా ప్రాధాన్యతతో ప్రచురించేలా చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలపై చర్చను ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం.
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. 2020, 2021లో దేశంలో సుపరి పాలనలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని స్కోచ్ సంస్థ ప్రకటించడం ఇందుకు తార్కాణం. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, నగదు బదిలీ ద్వారా నేరుగా రూ.1.32 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి సంక్షేమ పథకాలు దోహదం చేస్తున్నాయని సామాజిక వేత్తలు ప్రశంసిస్తుండటాన్ని సభలో అధికారపక్షం ప్రస్తావించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రూ.2.56 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై చర్చించి.. ప్రజాభ్యుదయానికి దోహద పడాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షానికి వీసమెత్తు కూడా లేదని స్పష్టమైందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాలు చేసే అధికారం చట్టసభలదే
రాజధాని వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టసభల అస్థిత్వాన్ని దెబ్బతీసేదిగా ఉందని, ఏ వ్యవస్థ అధికారాలు ఏమిటో సభలో చర్చించాలని సీనియర్ శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణపై సభలో చర్చ చేపట్టారు. చట్టాలు చేసే అధికారం, బాధ్యత చట్ట సభలకే ఉందని అధికార పక్షం స్పష్టం చేసింది. హైకోర్టుపై తమకు అపార గౌరవం ఉందని, అదే సమయంలో చట్టసభల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతా తమపై ఉందని తేల్చి చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం జగన్ పునరుద్ఘాటించడం ద్వారా ప్రభుత్వ విధానంపై అన్ని వర్గాలకూ స్పష్టత ఇచ్చారు.
అవన్నీ చంద్రబాబు బ్రాండ్లే..
► రాష్ట్రంలో లభిస్తున్న మద్యం బ్రాండ్లన్నీ జె బ్రాండ్ అంటూ కొద్ది రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. జంగారెడ్డిగూడెంలో విచిత్రమైన పేర్లున్న బ్రాండ్ల లిక్కర్ తాగి ప్రజలు మరణిస్తున్నారని పేర్కొంటోంది.
► వాస్తవానికి ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి విచిత్రమైన పేర్లతో ఉన్న బ్రాండ్లకు, డిస్టిలరీలకు 2014 నుంచి 2019 మధ్య అనుమతి ఇచ్చింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారేనని సాక్ష్యాధారాలతో సహా వివరిస్తూ శాసనసభలో సీఎం జగన్.. ప్రతిపక్షం చేస్తున్న దు్రçష్పచారాన్ని తిప్పికొట్టారు.
► అత్యధికంగా ఆ బ్రాండ్లన్నీ తయారవుతున్నది టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, ఆదికేశవులు నాయుడు, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, ఎస్పీవై రెడ్డిలకు అనుమతి ఇచ్చిన డిస్టిలరీల్లోనేనని తేల్చి చెప్పారు. అవన్నీ చంద్రబాబు బ్రాండ్లేనని అభివర్ణించారు.
► రాష్ట్రంలో నాటుసారా ఈనాటిది కాదని, చంద్రబాబు హయాంలో లేనట్లుగా మాట్లాడుతున్నారని.. కేసులు సహా వివరించారు. ఇప్పుడు దాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) ఏర్పాటు చేశామని చెప్పారు. అందువల్లే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు.
► చంద్రబాబు, ఎల్లో మీడియా.. నాటు సారా మరణాలుగా చిత్రీకరించినవన్నీ సహజ మరణాలేనని సాక్ష్యాధారాలు, వీడియోల ద్వారా స్పష్టం చేశారు.
ఎత్తు తగ్గేది పోలవరం కాదు.. చంద్రబాబే
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనే లేదని గతంలోనే సీఎం వైఎస్ జగన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు శాసనసభ, పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లో మీడియా పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారని.. దాంతో ఆ ప్రాజెక్టు ఉత్త బ్యారేజీగానే మిగిలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని సాక్ష్యాధారాలతో సహా సీఎం జగన్ తిప్పికొట్టారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని అస్తవ్యస్తంగా మార్చితే.. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ మూడేళ్లలో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్న తీరును సభలో ఫొటోలు, వీడియోలు ప్రదర్శిస్తూ వివరించారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదని.. ఎత్తు తగ్గేది చంద్రబాబేనని.. 2024 ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోయి మరుగుజ్జు అవుతారని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. 2023 ఖరీప్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. ఫలాలను రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలో పాల్గొంటే తాము చేస్తున్నది దుష్ప్రచారమేనన్నది తేలిపోతుందని భావించిన ప్రతిపక్ష సభ్యులు చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు సభలో గందరగోళం సృష్టించి, సస్పెన్షన్ వేటు పడేలా చేసుకున్నారు.
పెగసస్‌పై సభా సంఘంతో విచారణ
టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, డేటా చోరీ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేసింది. న్యాయస్థానంలో కేసులు కూడా వేసింది. అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై విచారణ చేసి.. ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. పెగసస్ స్పైవేర్‌ను చంద్రబాబు సర్కార్ కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా చెప్పడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావును అడ్డుపెట్టుకుని చంద్రబాబు.. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, పార్టీ మారేలా చేసిన దమనకాండను సభ వేదికగా ప్రజలకు అధికారపక్షం వివరించింది. ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment