
సాక్షి, అమరావతి: సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్ డెత్స్పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు.
సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశాం. మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు.