jaggareddy gudem
-
అవి సహజ మరణాలే
సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెంలో ఇటీవల మృతి చెందిన వారివి సహజ మరణాలేనని సంబంధిత కుటుంబాల వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను చూపించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పక్షవాతంతో బాధపడుతూ.. మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. – మృతుడు వేమవరపు గురుబ్రహ్మం కుమార్తె, దేవాయగూడెం ఆరోగ్యం చెడిపోయి మృతి వెంకటరమణను 2018 నుంచి ఆస్పత్రికి తిప్పుతున్నాం. అంతకు ముందే మద్యం అలవాటుంది. ఆస్పత్రిలో పరీక్షలు చేస్తే గుండె, లివర్, ఎముకలు పాడయ్యాయన్నారు. మద్యం తాగడం వల్లనే ఇలా జరిగిందని, ఎక్కువ రోజులు బతకవని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికైనా మద్యం మానకపోతే వైద్యం చేయమని కోప్పడ్డారు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడం వల్లే ఇప్పుడు చనిపోయాడు. – మృతుడి సోదరి, తల్లి, జంగారెడ్డిగూడెం సారా అలవాటే లేదు అప్పారావు కూలి పనులకు గుడివాడ వెళ్లాడు. అక్కడ పడిపోవడంతో వైద్యం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇబ్బంది రావడంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లిన అరగంటకే చనిపోయాడు. కానీ పేపర్లలో నాటు సారా తాగి చనిపోయాడని రాశారు. అతడికి సారా అలవాటే లేదు. మా పరువు తీశారు. – మృతుడి కుటుంబ సభ్యులు, ఉణుదుర్రు ఆస్తమా జబ్బుతో చనిపోయాడు సత్యనారాయణకు పదేళ్లుగా దగ్గు, ఆయాసం ఉన్నాయి. 73 ఏళ్లు. 6వ తేదీన ఆయాసం ఎక్కువవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. ఆయనకు మద్యం అలవాటు లేనేలేదు. కానీ పేపర్లు, టీవీల్లో సారా తాగి చనిపోయాడని ప్రచారం చేశారు. ఇప్పుడు మేం బయటకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. – మృతుడి కుటుంబ సభ్యులు, బుట్టాయిగూడెం పురుగుల మందు తాగి.. నాగరాజు దంపతుల మధ్య గొడవలున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను బెదిరిద్దామని పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇతనికి మద్యం తాగే అలవాటైతే ఉంది. కానీ పురుగుల మందు తాగడం వల్లే చనిపోయాడు. కానీ నాటు సారా తాగి చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. – మృతుడి కుటుంబ సభ్యులు, గుండుగొలను -
ముమ్మాటికీ ఇది కుతంత్రమే
సాక్షి, అమరావతి: ‘ఏ అంశంపై అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. సరైన ఫార్మాట్లో వస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదన్న కుతంత్రం తప్ప మరో ఆలోచన వాళ్లకు లేదు. వాళ్లంతా పథకం ప్రకారమే వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని గలాటా చేస్తున్నారు. ఎంత చెప్పినా వాళ్ల బుద్ధి మారడం లేద’ంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే.. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. తగిన ఫార్మాట్లో వస్తే ప్రభుత్వం సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకూండా టీడీపీ సభ్యులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి, పోడియం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి చైర్మన్ కల్పించుకుని ‘మీరు ఏదో ప్రత్యేక అజెండాతో వచ్చినట్టు ఉందే తప్ప సమస్యలపై చర్చించేందుకు వచ్చినట్టు లేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మీ అజెండా ఇక్కడ అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. క్వశ్చన్ అవర్‌లో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని, క్వశ్చన్ అవర్‌ను అడ్డుకుని లైవ్ కవరేజ్ ద్వారా ఏదో సాధించాలన్న తపనతో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, డైరెక్షన్, స్క్రీన్‌ప్లే అంతా బయట నుంచి వస్తోందని, ఆ ప్రకారమే సభలో టీడీపీ సభ్యులు యాక్షన్ చేస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎంత చెప్పినా వాళ్ల బుద్ధి మారడం లేదన్నారు. కావాలనే గలాటా చేసేందుకు వచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు ఆగలేక పోతున్నారని, శవాలపై పేలాలు ఏరుకోవడమే తప్ప సమస్యలపై చర్చిద్దామన్న ఆలోచన వారికి లేదన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం ఎత్తివేసింది మీ తండ్రేనని, ముందు దానిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ లోకేశ్‌ను నిలదీశారు. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రభుత్వం తరçఫున స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. పలుమార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యుల తీరు మారకపోవడంతో సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని, ప్రభుత్వం తరఫున మంత్రి స్టేట్మెంట్ వద్దంటే మీ ఇష్టం అంటూ సభను చైర్మన్ మోషేన్‌రాజు మంగళవారం నాటికి వాయిదా వేశారు. -
సహజ మరణాలపై శవ రాజకీయాలా?
సాక్షి, అమరావతి: సహజ మరణాలపై ప్రతిపక్ష పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవి సారా మరణాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఘటనపై సోమవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. విషయం తెలియగానే సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి స్వయంగా అక్కడికి వెళ్లామని చెప్పారు. పరిస్థితి చూసి వెంటనే తగిన చర్యలు తీసుకున్నా విపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈనాడు దినపత్రిక లేనిపోని అవాస్తవాలు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. గుండెనొప్పితో ఉపేంద్ర మృతి.. రాజకీయంగా లబ్ధి పొందాలన్న చంద్రబాబు కుట్రలకు ఆ పత్రిక వంత పాడుతోందని మంత్రి నాని ధ్వజమెత్తారు. ఈ నెల 12న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఉపేంద్రకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఈసీజీ తీశారని తెలిపారు. ఉపేంద్ర గుండెనొప్పితో చనిపోయాడని డాక్టర్లు స్పష్టంగా చెప్పినా ఈనాడు పత్రిక అవాస్తవాలు రాసిందన్నారు. తన భర్త నాలుగైదు రోజులుగా మద్యం తాగలేదని ఉపేంద్ర భార్య చెప్పారని, ఈమేరకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రిలో, పోలీసు రికార్డుల్లోనూ ఉందన్నారు. మృతుల జాబితా సేకరించి.. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో అందరూ ఒకేసారి చనిపోలేదని, వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రి నాని తెలిపారు. తొలుత 16 మంది మరణించగా అందులో 15 మంది తమ ఇళ్లలోనే చనిపోయారన్నారు. దహన సంస్కారాలు జరిగాక టీడీపీ నాయకులు శ్మశానం వద్దకు వెళ్లి వారం రోజుల్లో చనిపోయిన వారి జాబితా సేకరించి సారా మరణాల్లో చేర్చారని వెల్లడించారు. నాడు ఏరులైన మద్యం... నిజానికి చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు వెలిశాయని మంత్రి నాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మద్యాన్ని నియంత్రిస్తూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటే వినియోగం తగ్గుతుందని సీఎం భావించారని తెలిపారు. ఆ తర్వాత మద్యం రేట్లు తగ్గించాలని అందరూ కోరడంతో అంగీకరించారన్నారు. జీలుగుకల్లు మరణాలపై మాట్లాడరేం? కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శవ రాజకీయం చేశారని తెలిపారు. టీడీపీ ఇన్చార్జి సోదరుడే కల్లులో విషం కలిపాడని తేలడంతో తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో యనమల ఆధ్వర్యంలో చంద్రబాబు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఎక్కడ అక్రమ మద్యం ఉన్నా, దాని వెనక ఎవరున్నా ఉపేక్షించవద్దని సీఎం గట్టిగా చెప్పారన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కూడా ఏర్పాటైందన్నారు. సారా వల్ల ఏ కుటుంబానికీ హాని కలగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వారం రోజులుగా తినకుండా తాగడంతో.. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారిలో ఒక వ్యక్తి వారం రోజుల నుంచి ఏమీ తినకుండా మద్యం తాగడంతో మరణించాడని, ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నా విపక్షం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. శ్మశానానికి ఏ శవం వచ్చినా సారాతోనే చనిపోయారంటూ టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారన్నారు. అవసరమైతే ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే, వైద్య శిబిరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. పరామర్శా.. బల ప్రదర్శనా? ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శ కోసం కాకుండా బల ప్రదర్శన మాదిరిగా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను తరలించి ఒక యుద్ధానికి వెళ్లినట్లుగా జంగారెడ్డిగూడెం వెళ్లారని మంత్రి నాని పేర్కొన్నారు. నిజంగా ప్రజలను ఓదార్చేందుకు వెళ్లే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. సభలోనూ టీడీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అదే నిజమైతే పోస్టుమార్టం చేస్తారా? అప్పారావు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొస్తే అరగంటలో చనిపోయాడని, ఆ వెంటనే అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై ఫిర్యాదు చేయలేదన్నారు. అంత్యక్రియలు పూర్తైన 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ చేశారని చెప్పారు. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. అది 16వ మరణం కాగా ఆ తర్వాత మరో రెండు మరణాలు ఆస్పత్రిలో నమోదైనా ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి పోస్టుమార్టం చేయించామని, తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఒకవేళ మరణాలకు సారా కారణమైతే తామే ఎందుకు పోస్టుమార్టమ్ చేయిస్తామని ప్రశ్నించారు. ఆ నివేదికలు రాగానే టీడీపీ కుట్రలు వెలుగులోకి వస్తాయన్నారు. -
రక్తి కట్టని శవ రాజకీయం
(సాక్షి అమరావతి, ఏలూరు): ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఏ స్థాయికైనా దిగజారవచ్చన్న తెలుగుదేశం సిద్ధాంతం సోమవారం అటు అసెంబ్లీలోను, ఇటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోను స్పష్టంగా కనిపించింది. శ్మశానంలోని కాటికాపరి ద్వారా యథాలాపంగా వెల్లడైన మరణాల తాలూకు సమాచారాన్ని సోషల్ మీడియా ముఖంగా రచ్చ చేసి... ఆ తరవాత అసెంబ్లీకి తీసుకువచ్చి శవ రాజకీయం చేస్తున్నారంటే దీనికన్నా దిగజారుడుతనం వేరొకటి ఉండదన్నది చెప్పకనే తెలుస్తుంది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రతి అంశానికీ అడ్డు తగులుతూ... తామడిగిన అంశంపై మంత్రి సమాధానమిస్తున్నా కూడా వినకుండా కాగితాలు చించి స్పీకరుపైకి విసిరారు. సభకు పదేపదే అడ్డు తగులుతూ అదే తమ ఎజెండా అని బయటపెట్టుకున్నారు. మరోవంక వారి నాయకుడు చంద్రబాబు నాయుడు జంగారెడ్డి గూడేనికి వెళ్లి... అక్కడ శవ రాజకీయం మొదలెట్టారు. అసలక్కడ ఏం జరిగిందంటే... జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ఏరియాకు ముఖద్వారమని చెప్పాలి. 75కు పైగా గ్రామాలకు అదో ప్రధాన పట్టణం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మున్సిపాలిటీ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి పట్టణ జనాభా 67,800. ఇందులో 10 వేల మందికి పైగా వలస వచ్చినవారే. ఉపాధి, వ్యవసాయ పనుల కోసం చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినవారే. సాధారణంగా చూస్తే ఇక్కడి జనాభా నేపథ్యంలో నెలకు సగటున 25కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి రికార్డుల్లో నమోదవుతున్నాయి కూడా. అధికారిక లెక్కల ప్రకారం జనవరిలో 37, ఫిబ్రవరిలో 24 మంది, మార్చి 11 వరకు నలుగురు మరణించారు. ఈ వాస్తవాలన్నీ పాతిబెట్టి... గత 15 రోజుల్లో 18 మంది చనిపోయారని చెబుతూ పద్ధతి ప్రకారం అబద్ధాలకు ఆజ్యం పోస్తోంది టీడీపీ. టీడీపీ మద్యం సిండికేట్లే... తెలుగుదేశం నేతలు కొందరు గత లిక్కర్ సిండికేట్‌లో కీలక భాగస్వాములు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ సిండికేట్‌కు తెర వేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకొచ్చింది. దీంతో వారికొచ్చే కోట్ల ఆదాయం పడిపోయింది. దీంతో సిండికేట్‌లోని ముఖ్యులు కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో... అనారోగ్యం వల్ల సంభవించిన మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించారు. పట్టణంలోని 4 శ్మశానవాటికల్లో కాటి కాపరులు, స్థానికుల నుంచి సమాచారం సేకరించామని, ఇదంతా నిజమేనని ప్రచారానికి తెరలేపారు. దానికి బలం చేకూరేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేశారు. ఎలాంటి సహజ మరణం జరిగినా సారా మరణమంటూ హడావిడి చేస్తున్నారు. ఒకరోజు సారా కారణంగా 16 మంది చనిపోయారని... తరవాత 18 మంది చనిపోయారని చెబుతూ హడావిడి చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై డోర్ టు డోర్ సర్వే నిర్వహించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని సైతం దీనిపై సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో మరణించిన నలుగురికి పోస్టుమార్టం నిర్వహించేలా అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో... బయట బాబు వ్యూహం!! ఏ అంశం దొరికినా దాన్ని పెద్దది చేసి రచ్చచేయాలన్న చంద్రబాబు ప్లాన్ ప్రకారం... సోమవారం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు నినాదాలు, అరుపులతో తీవ్ర గందరగోళం సృష్టించారు. తొలుత వారడిగిన ప్రశ్నకు గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు సమాధానమిస్తున్నా పట్టించుకోకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు. గంటన్నర తర్వాత తిరిగి సమావేశంకాగా అదే వైఖరి కొనసాగించారు. కాగితాలు చించి స్పీకర్ ముఖంపై పదేపదే విసిరారు. ఒక దశలో కాగితాలు అయిపోవడంతో అచ్చెన్నాయుడు బయటకు వెళ్లి కాగితాలు తెచ్చి మరీ తమ సభ్యులకు అందించారు. ఈ తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు వాయిదా వేసినా సభకు ఆటంకాలు కల్పిస్తూనే వచ్చారు. చివరకు గత్యంతరం లేక సభ సజావుగా సాగేందుకు ఐదుగురు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవంక చంద్రబాబునాయుడు సోమవారం జంగారెడ్డి గూడేనికి వచ్చారు. గత కొద్ది రోజులుగా 26 మంది చనిపోయారని, ఆ జాబితా తమ వద్ద ఉందని చెప్పారు. మున్సిపల్ అధికారిక లెక్కల ప్రకారం కేవలం నలుగురే మరణించారు. శ్మశాన సిబ్బంది నుంచి తీసుకున్న వివరాల ప్రకారమైనా.. 18 మంది మరణించారు. వీరిలో ఆరుగురు 60 ఏళ్లు, 70 ఏళ్లు పైబడ్డ వారే. మిగిలిన వారిలో మరో 8 మంది వివిధ రకాల వ్యాధులతో తమ ఇళ్లలోనే మరణించారు. నలుగురు మాత్రం ఆసుపత్రిలో మరణించగా వారి శవాలను అధికారులు పోస్టుమార్టం చేస్తున్నారు కూడా. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా అంతా సారా తాగే మృతి చెందారని, వీటిని సారా మరణాలుగా అన్వయిస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారంతో స్థానికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాన్ని నిజంగా మార్చడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ విశ్లేషకుల్ని నివ్వెర పరుస్తున్నాయి. దూషిస్తూ.. చేయి చేసుకుని స్పీకర్ ఆదేశాలను పాటిస్తున్న మార్షల్స్‌పైనా ఒకదశలో టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. వారిని దూషించడంతోపాటు తోసేశారు. సస్పెండైన ఐదుగురు సభ్యులను బయటకు పంపిన తర్వాత కూడా మిగిలిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలుచుని నినాదాలు చేశారు. తమ స్థానాల వద్దకు తీసుకెళుతున్న మార్షల్స్‌ను వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరు సాంబశివరావు తదితరులు దూషిస్తూ చేయి చేసుకున్నారు. ఈ గందరగోళం మధ్యే మంత్రి ఆళ్ల నాని ప్రకటన, సీఎం ప్రసంగం అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడింది. మహిళల అక్రమ రవాణాలో టీడీపీ సర్కారు నంబర్ వన్ జంగారెడ్డిగూడెం ఘటనపై తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఓ పత్రిక కథనం ప్రచురించిందని, ఈ డ్రామాకు సూత్రధారి రామోజీరావు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. శవ రాజకీయాలు టీడీపీకి పేటెంట్గా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అనుకూల మీడియాలో కథనాలు ప్రచురించుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో వివరణాత్మకంగా సమాధానం చెబితే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం గురించి ప్రజలకు తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. టీడీపీ నాయకులు మద్యం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. మహిళల అక్రమ రవాణా, వేధింపుల్లో టీడీపీ హయాంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. అప్పట్లో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటన వెనుక టీడీపీ హస్తం ఉందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి, విజయవాడలో పడవ ప్రమాదం మరణాలకు చంద్రబాబు కారణం కాదా? అని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రశ్నించారు. -
బాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా!
పోలీసు అధికారులందరూ జంగారెడ్డిగూడెం స్టేషన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఇక్కడికి వస్తే కొద్దికాలానికే టాటా చెప్పేయాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి వేటు పడటం, స్వల్పకాలంలోనే బదిలీ అవుతుండటం దీనికి ఊతమిస్తోంది. జంగారెడ్డిగూడెం: అయ్యబాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా..! ఇదీ కొత్తగా ఇక్కడకు రావాలంటే అధికారుల పరిస్థితి. ఈ ఠాణాకు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడా ది కూడా పనిచేయట్లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది?. ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి పూర్తి కాలం కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటేనే అధికారులు భయపడుతున్నారు. (చదవండి: ఊరు ఒకటే.. పంచాయతీలు రెండు) ఈనేపథ్యంలో జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది! పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని ప్రజలు, సిబ్బంది చర్చించుకుంటున్నా రు. 2007 నుంచి 13 ఏళ్లలో 14 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో జరగడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానిస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన తక్కువ కాలంలో పలువురు సస్పెండ్ కావడం లేదా బదిలీ అవడం జరిగిపోతోంది. ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో, కొత్త గా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. కొంతమంది బదిలీపైనా వెళితే.. మరికొందరు సస్పెన్షన్ గురికావడం, ఇంకొందరు చిన్న కారణాలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇవిగో నిదర్శనాలు ♦2007లో సీఐ ఎం.వెంకటేశ్వరరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఒక మహిళ కేసు విషయంలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణం. ♦2008 జనవరిలో సీఐ చింతా రాంబాబు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మరణించడంతో వీరిపై వేటు పడింది. ♦తెలంగాణ నుంచి ఎంవీఎస్ మల్లేశ్వరరావు ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఐదునెలల తర్వాత ఓ కేసు నమోదు విషయంలో జాప్యం చేశారని ఆయనను సస్పెండ్ చేశారు. ♦ఆ తరువాత ఎస్సైగా వచ్చిన ఏఎన్ఎన్ మూర్తిని 2009 మేలో వీఆర్‌కు, తరువాత సస్పెన్షన్‌కు గురయ్యారు. ♦2014 జనవరిలో వచ్చిన ఎస్సై సీహెచ్ రామచంద్రరా వు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కారణం. ♦2016లో ఎస్సై ఆనందరెడ్డి ఏడాదిన్నర పనిచేసి వీఆర్‌కు వెళ్లారు. ♦2016 అక్టోబర్‌లో వచ్చిన ఎస్సై ఎం.కేశవరావు 10 నెలలకే వీఆర్‌కు, అక్కడి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ♦2017 సెప్టెంబర్‌లో ఎస్సైగా వచ్చిన జీజే విష్ణువర్దన్ 9 నెలలు పనిచేసి వీఆర్‌కు వెళ్లారు. ♦2018 జూలైలో వచ్చిన ఎస్సై అల్లు దుర్గారావు కూడా వీఆర్‌కు వెళ్లారు. ♦ఈ ఏడాది మార్చిలో ఎస్సై ఎస్ఎస్ఆర్ గంగాధర్ స్వల్పకాలంలోనే ఆరోపణలతో తాజాగా వీఆర్‌కు వెళ్లారు. ఈయనతో పాటు సీఐ బీఎన్ నాయక్‌ను కూడా ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. -
చిక్కిన చీటింగ్ ముఠా
సాక్షి, పశ్చిమగోదావరి(జంగారెడ్డిగూడెం) : కరెన్సీ చీటింగ్ ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఒకటికి రెండు నుంచి మూడు రెట్లు ఇస్తామని ప్రజలను, ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న డబ్లింగ్ కరెన్సీ ముఠా సభ్యుడొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. ముగ్గురు యువకులు పరారీ కాగా, దొరికిన యువకుడి నుంచి రూ.34 లక్షల చిల్డ్రన్ బ్యాంక్ కరెన్సీ నోట్లు, ఒక కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100 విలువ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్ కరెన్సీ నోట్లను మోసం చేసేందుకు వినియోగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 15న ‘సాక్షి’లో ‘డబ్లింగ్ కరెన్సీ ముఠా హల్చల్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పట్లోనే పోలీసులను అప్రమత్తం చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ ముఠా నివశిస్తున్న నివాసంలో ఐడీ పార్టీ పోలీసులు సోదాలు చేయగా కరెన్సీ పేరుతో మోసాలు చేసేందుకు, బెదిరించేందుకు ముఠా వినియోగించే పోలీసు యూనిఫాం, పోలీస్ బెల్టు లభించాయి. దీంతో కొందరు యువకులను, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న కారును అప్పుడే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ, ఈ సభ్యులను మూడు నాలుగు రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి పంపించి వేశారు. దీంతో ఈ ముఠా ఆగడాలు మరింత పెరిగి రెచ్చిపోయాయి. రాత్రి సమయంలో చీకట్లో అసలు నోట్లను పోలిన చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. చివరకు ఈ నెల 4వ తేదీ రాత్రి స్థానిక రామచంద్రపురంలో కారులో వచ్చిన నలుగురు యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని నిలదీశారు. దీంతో నలుగురిలో ముగ్గురు పారిపోగా, ఒకరిని, కారును, రూ. 34 లక్షల అసలు నోట్లను పోలిన చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుడు మండలంలోని మైసన్నగూడెంకు చెందిన వ్యక్తిగా తెలిసింది. ముఠా కార్యకలాపాలు ఇలా.. జంగారెడ్డిగూడెం కేంద్రంగా డబ్లింగ్ కరెన్సీ ముఠా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. లక్షకు మూడు లక్షల రూపాయలు దొంగనోట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మకాం వేసి వీరి కార్యకలాపాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ ముఠాలో ఎక్కువగా యువకులు ఉండటం గమనార్హం. సుమారు 30 మంది వరకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని యువకులు ఒక ముఠాగా ఏర్పడి డబ్లింగ్ కరెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. రెండు మూడు కార్లను వినియోగిస్తూ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీరి చేతిలో పడి ఇప్పటికే చాలా మంది మోసపోయినట్లు తెలిసింది. స్థానిక ఉప్పలమెట్ట, డాంగేనగర్ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులు, పాతబస్టాండ్‌కు చెందిన ఒక వ్యక్తి తూరల లక్ష్మీపురానికి చెందిన కొంతమంది, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన వారు సుమారు 30 మంది ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. ఒకటికి మూడు రెట్లు ఇస్తామని నమ్మించి డబ్బులిచ్చే సమయంలో పోలీస్ సైరన్వాహనంతో వచ్చి భయబ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారు. వీరు వినియోగించే కార్లకు రకరకాల నెంబరు ప్లేట్లు వినియోగించి, మరికొన్నిసార్లు నెంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతూ యథేచ్ఛగా ఈ డబ్లింగ్ కరెన్సీ ముఠా దోచుకుంటోంది. గతంలో పట్టణానికి చెందిన ఒక యువకుడు వీరి చేతిలో మోసపోయాడు. లక్షకు మూడు లక్షల రూపాయలు ఇస్తాననడంతో ఆశపడిన ఆ వ్యక్తి రూ. 50 వేలు ఇచ్చి మోసపోయాడు. రూ. 50 వేలకు రూ. లక్షన్నర ఇస్తానని బేరం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తిని రూ.50 వేలు తీసుకుని నల్లజర్ల మండలం పోతవరం రమ్మనడంతో అక్కడికి వెళ్లాడు. ఒక కారులో వచ్చిన డబ్లింగ్ కరెన్సీ ముఠా ఆ వ్యక్తి నుంచి రూ.50 వేలు తీసుకుని లెక్కిస్తుండగా, వెనుక నల్లరంగు కారు ఒకటి పోలీస్ సైరన్‌తో వచ్చి బెదిరించారు. దీంతో కంగారుపడిన రూ.50 వేలు ఇచ్చిన వ్యక్తి పారిపోగా, రూ.50 వేలు తీసుకుని డబ్లింగ్ కరెన్సీ ముఠా రెండు కార్లలో పారిపోయారు. అతని సెల్‌ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. చివరకు ఆ వ్యక్తి కొద్ది రోజులు వారి చుట్టూ తిరిగి తూరల లక్ష్మీపురంలోని ఒక వ్యక్తిని ఆశ్రయించగా, ఆ వ్యక్తి డబ్లింగ్ కరెన్సీ ముఠా సభ్యులను పిలిచి చివరకు రూ.20 వేలు ఇప్పించారు. అలాగే నల్లజర్ల మండలం సింగరాజుపాలెంకు చెందిన ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయలు ఈ డబ్లింగ్ కరెన్సీ ముఠా దోచుకున్నట్లు తెలిసింది. అంతేగాక గతంలో జంగారెడ్డిగూడెం కార్ స్టాండ్‌లో ఒక వ్యక్తికి చెందిన కారును ఈ ముఠాసభ్యులు సొంత డ్రై వింగ్ (సెల్ఫ్ డ్రై వింగ్) పేరుతో వేసుకుని వెళ్లి కొద్ది రోజులు రాకపోవడంతో అనుమానం వచ్చిన కారు స్టాండ్‌లోని డ్రైవర్లు ఎట్టకేలకు భీమడోలు వద్ద కారును పట్టుకుని నానా అవస్థలు పడి కారును వెనక్కి తెచ్చుకున్నారు. ఈ ముఠా ఎక్కువగా ఒక తెలుపు, నలుపు కార్లను ఫ్యాన్సీ నెంబర్లతో వాడుతున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వీరు చేసిన మోసాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. -
స్వామీ.. కావూరికి మంచి బుద్ధిని ప్రసాదించు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కేంద్ర మంత్రి పదవి రాక ముందు ఒక రకంగా.. పదవి వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు మంచి బుద్ధిని ప్రసాదించమని మద్ది ఆంజనేయస్వామిని కోరినట్లు వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే చింతలపూడి నియోజకవర్గమే ఎక్కువగా నష్టపోతుందన్నారు. తమ్మిలేరు, ఎర్ర కాలువలు పూర్తిగా ఎండిపోతాయని, రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. చింతలపూడి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కావూరిని లోక్‌సభలో సమైక్యవాదం వినిపించాలని కోరేందుకు వెళ్లగా తమపై ఆయన తిట్ల పురాణం ఎత్తుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌చేసి విడుదల చేశారని, కావూరి అదేరోజు రాత్రి జిల్లా అధికారులతో మాట్లాడి రెండోసారి అరెస్ట్ చేయించారని చెప్పారు. ఒకే కేసుపై రెండుసార్లు ఎవరూ అరెస్టు అయిన దాఖలా లేదన్నారు. తమపై ఎన్నికేసులు బనాయించినా ఓర్చుకుంటామని, ఆయన మాత్రం సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా చేస్తే ఆయనపై పూలజల్లు కురస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంటేనే పార్టీ విజయం సులభం అవుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మేనేజర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు, వలంటీర్లు పోలింగ్ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనిల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యులు బీవీఆర్ చౌదరి, పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు తల్లాడి సత్తిపండు, పొల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు, రాఘవరెడ్డి ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.