శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మీద వేస్తున్న టీడీపీ సభ్యులు
(సాక్షి అమరావతి, ఏలూరు): ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఏ స్థాయికైనా దిగజారవచ్చన్న తెలుగుదేశం సిద్ధాంతం సోమవారం అటు అసెంబ్లీలోను, ఇటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోను స్పష్టంగా కనిపించింది. శ్మశానంలోని కాటికాపరి ద్వారా యథాలాపంగా వెల్లడైన మరణాల తాలూకు సమాచారాన్ని సోషల్ మీడియా ముఖంగా రచ్చ చేసి... ఆ తరవాత అసెంబ్లీకి తీసుకువచ్చి శవ రాజకీయం చేస్తున్నారంటే దీనికన్నా దిగజారుడుతనం వేరొకటి ఉండదన్నది చెప్పకనే తెలుస్తుంది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రతి అంశానికీ అడ్డు తగులుతూ... తామడిగిన అంశంపై మంత్రి సమాధానమిస్తున్నా కూడా వినకుండా కాగితాలు చించి స్పీకరుపైకి విసిరారు. సభకు పదేపదే అడ్డు తగులుతూ అదే తమ ఎజెండా అని బయటపెట్టుకున్నారు. మరోవంక వారి నాయకుడు చంద్రబాబు నాయుడు జంగారెడ్డి గూడేనికి వెళ్లి... అక్కడ శవ రాజకీయం మొదలెట్టారు.
అసలక్కడ ఏం జరిగిందంటే...
జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ఏరియాకు ముఖద్వారమని చెప్పాలి. 75కు పైగా గ్రామాలకు అదో ప్రధాన పట్టణం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మున్సిపాలిటీ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి పట్టణ జనాభా 67,800. ఇందులో 10 వేల మందికి పైగా వలస వచ్చినవారే. ఉపాధి, వ్యవసాయ పనుల కోసం చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినవారే. సాధారణంగా చూస్తే ఇక్కడి జనాభా నేపథ్యంలో నెలకు సగటున 25కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి రికార్డుల్లో నమోదవుతున్నాయి కూడా. అధికారిక లెక్కల ప్రకారం జనవరిలో 37, ఫిబ్రవరిలో 24 మంది, మార్చి 11 వరకు నలుగురు మరణించారు. ఈ వాస్తవాలన్నీ పాతిబెట్టి... గత 15 రోజుల్లో 18 మంది చనిపోయారని చెబుతూ పద్ధతి ప్రకారం అబద్ధాలకు ఆజ్యం పోస్తోంది టీడీపీ.
టీడీపీ మద్యం సిండికేట్లే...
తెలుగుదేశం నేతలు కొందరు గత లిక్కర్ సిండికేట్‌లో కీలక భాగస్వాములు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ సిండికేట్‌కు తెర వేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకొచ్చింది. దీంతో వారికొచ్చే కోట్ల ఆదాయం పడిపోయింది. దీంతో సిండికేట్‌లోని ముఖ్యులు కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో... అనారోగ్యం వల్ల సంభవించిన మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించారు. పట్టణంలోని 4 శ్మశానవాటికల్లో కాటి కాపరులు, స్థానికుల నుంచి సమాచారం సేకరించామని, ఇదంతా నిజమేనని ప్రచారానికి తెరలేపారు. దానికి బలం చేకూరేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేశారు. ఎలాంటి సహజ మరణం జరిగినా సారా మరణమంటూ హడావిడి చేస్తున్నారు. ఒకరోజు సారా కారణంగా 16 మంది చనిపోయారని... తరవాత 18 మంది చనిపోయారని చెబుతూ హడావిడి చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై డోర్ టు డోర్ సర్వే నిర్వహించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని సైతం దీనిపై సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో మరణించిన నలుగురికి పోస్టుమార్టం నిర్వహించేలా అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీలో... బయట బాబు వ్యూహం!!
ఏ అంశం దొరికినా దాన్ని పెద్దది చేసి రచ్చచేయాలన్న చంద్రబాబు ప్లాన్ ప్రకారం... సోమవారం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు నినాదాలు, అరుపులతో తీవ్ర గందరగోళం సృష్టించారు. తొలుత వారడిగిన ప్రశ్నకు గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు సమాధానమిస్తున్నా పట్టించుకోకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు. గంటన్నర తర్వాత తిరిగి సమావేశంకాగా అదే వైఖరి కొనసాగించారు. కాగితాలు చించి స్పీకర్ ముఖంపై పదేపదే విసిరారు. ఒక దశలో కాగితాలు అయిపోవడంతో అచ్చెన్నాయుడు బయటకు వెళ్లి కాగితాలు తెచ్చి మరీ తమ సభ్యులకు అందించారు. ఈ తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు వాయిదా వేసినా సభకు ఆటంకాలు కల్పిస్తూనే వచ్చారు. చివరకు గత్యంతరం లేక సభ సజావుగా సాగేందుకు ఐదుగురు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మరోవంక చంద్రబాబునాయుడు సోమవారం జంగారెడ్డి గూడేనికి వచ్చారు. గత కొద్ది రోజులుగా 26 మంది చనిపోయారని, ఆ జాబితా తమ వద్ద ఉందని చెప్పారు. మున్సిపల్ అధికారిక లెక్కల ప్రకారం కేవలం నలుగురే మరణించారు. శ్మశాన సిబ్బంది నుంచి తీసుకున్న వివరాల ప్రకారమైనా.. 18 మంది మరణించారు. వీరిలో ఆరుగురు 60 ఏళ్లు, 70 ఏళ్లు పైబడ్డ వారే. మిగిలిన వారిలో మరో 8 మంది వివిధ రకాల వ్యాధులతో తమ ఇళ్లలోనే మరణించారు. నలుగురు మాత్రం ఆసుపత్రిలో మరణించగా వారి శవాలను అధికారులు పోస్టుమార్టం చేస్తున్నారు కూడా. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా అంతా సారా తాగే మృతి చెందారని, వీటిని సారా మరణాలుగా అన్వయిస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారంతో స్థానికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాన్ని నిజంగా మార్చడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ విశ్లేషకుల్ని నివ్వెర పరుస్తున్నాయి.
దూషిస్తూ.. చేయి చేసుకుని
స్పీకర్ ఆదేశాలను పాటిస్తున్న మార్షల్స్‌పైనా ఒకదశలో టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. వారిని దూషించడంతోపాటు తోసేశారు. సస్పెండైన ఐదుగురు సభ్యులను బయటకు పంపిన తర్వాత కూడా మిగిలిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలుచుని నినాదాలు చేశారు. తమ స్థానాల వద్దకు తీసుకెళుతున్న మార్షల్స్‌ను వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరు సాంబశివరావు తదితరులు దూషిస్తూ చేయి చేసుకున్నారు. ఈ గందరగోళం మధ్యే మంత్రి ఆళ్ల నాని ప్రకటన, సీఎం ప్రసంగం అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడింది.
మహిళల అక్రమ రవాణాలో టీడీపీ సర్కారు నంబర్ వన్
జంగారెడ్డిగూడెం ఘటనపై తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఓ పత్రిక కథనం ప్రచురించిందని, ఈ డ్రామాకు సూత్రధారి రామోజీరావు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. శవ రాజకీయాలు టీడీపీకి పేటెంట్‌గా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అనుకూల మీడియాలో కథనాలు ప్రచురించుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ మండిపడ్డారు.
ప్రశ్నోత్తరాల్లో వివరణాత్మకంగా సమాధానం చెబితే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం గురించి ప్రజలకు తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. టీడీపీ నాయకులు మద్యం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వ్యాఖ్యానించారు. మహిళల అక్రమ రవాణా, వేధింపుల్లో టీడీపీ హయాంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. అప్పట్లో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటన వెనుక టీడీపీ హస్తం ఉందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి, విజయవాడలో పడవ ప్రమాదం మరణాలకు చంద్రబాబు కారణం కాదా? అని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment