liquor syndicate
-
మంత్రి ఇలాకాలో మత్తుదిగే ధరలు
సాక్షి, భీమవరం: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మద్యం సిండికేట్ ఇష్టారాజ్యంగా మారింది. మందుబాబుల జేబులు గుల్ల చేస్తూ ఎంఆర్పీ ధరలకు మించి మద్యం అమ్ముతున్నారు. రాత్రి 10 దాటితే మరింత పెంచి అమ్ముతున్నారు. జిల్లాలో 175 మద్యం దుకాణాలుండగా పాలకొల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 వరకు ఉన్నాయి. షాపుల నిర్వహణ మొత్తం టీడీపీ నాయకుల సిండికేట్ పర్యవేక్షిస్తోంది. ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఎంఆర్పీ ధరలకు మించి వసూలు చేయకూడదు.ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలి. బెల్టు అమ్మకాలు, లూజ్ సేల్స్ చేయకూడదు. షాపుల వద్ద మద్యం సేవించే ఏర్పాట్లు చేయకూడదు. ఇక్కడ మాత్రం ఈ నిబంధనలేవీ ఉండవు. సిండికేట్‌దే రాజ్యం. వారు నిర్ణయించిన ధరలు వసూలు చేస్తారు. రాత్రీ పగలూ తేడా లేకుండా అమ్మేస్తున్నారు. పలుచోట్ల దుకాణాల వద్దే మద్యం సేవించేలా టేబుళ్లు, కుర్చీలు వేశారు. మందులోకి సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు. పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ ఉంటాయి. మొత్తంగా చాలా షాపులు బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేస్తున్నారు. ప్రతి క్వార్టర్ బాటిల్‌కు ఎంఆర్పీపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. బీరుకు కూలింగ్ చార్జీలంటూ బాటిల్‌కు రూ.20 వరకు అదనంగా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. రాత్రి 10 దాటితే షాపు మూసివేసి వెనుక వైపు నుంచి బ్రాండ్‌ను బట్టి బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేసి అమ్ముతున్నారు. గ్రామగ్రామానా బెల్టు షాపులు, దుకాణాల వద్ద లూజ్ సేల్స్ నిరాఘాటంగా సాగిపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ అధికారులు వీటివైపు కన్నెత్తి చూడటంలేదు.జిల్లా వ్యాప్తంగా అమలుకు యోచనపాలకొల్లులో అదనంగా వసూళ్లు చేస్తుండటంతో జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నరసాపురం, ఉండి నియోజకవర్గాల్లో నిబంధనలు పాటించకుండా సిండికేట్లు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే బెల్టుషాపుల్లో బాటిల్‌పై రూ.10 పెంచి అమ్ముతున్నారు. నరసాపురం, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని షాపుల్లోనూ ధరలు పెంచి అమ్ముతున్నారు. మరో వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని షాపుల్లో అదనపు ధరలపై అమ్మకాలు చేసే ఆలోచనలో సిండికేట్ వర్గాలు ఉన్నట్టు తెలిసింది.బాదుడే బాదుడు..ఇప్పటికే ప్రభుత్వం లిక్కర్ సిండికేట్లకు మేలు చేసేలా అమ్మకాలపై 10 శాతం ఉన్న మార్జిన్‌ను 14 శాతానికి పెంచింది. ఆ భారాన్ని మందుబాబులపై మోపుతూ మద్యం ధరలను 15 శాతం వరకు పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు అధికంగా సేవించే రూ.120, రూ.130, రూ.150, రూ.180, రూ.190 క్వార్టర్ బాటిళ్లు రూ.10 వంతున పెరిగాయి. దీనికి అదనంగా లిక్కర్ సిండికేట్ మరో రూ.10 పెంచి అమ్ముతోంది. తన నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నా మంత్రి నిమ్మల పట్టించుకోవడంలేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. -
సర్కారు వారి కమీషన్ 30%
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్‌లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు. అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ. ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్‌కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది. నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం ⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు. ⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్‌రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు. అంతటా అవే బెదిరింపులు ⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది. ⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు. ⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్‌గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్‌రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్‌కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు. ⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్‌గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు. ⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్‌కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది. ⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్‌గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది. దుకాణానికి 26 దరఖాస్తులే..రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు. ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర. రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం ⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్‌లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.భారీ దోపిడీకి పక్కా డీల్భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్‌పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు. అందులో ఒక్కో బాటిల్‌పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్‌లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది. -
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్‌వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్‌ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్‌వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్‌లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
మద్యం సిండికేట్లకు డాన్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: మద్యం సిండికేట్లకు డాన్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, పీవీవీ సూర్యనారాయణరాజు, రమేశ్ యాదవ్, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి దువ్వాడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చేలా లోకేశ్ అండ్ కో ప్రవర్తించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాల వారికి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తే తమను మాట్లాడనీయకుండా పథకం ప్రకారం టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని అన్నారు. చివరికి మీ అంతు చూస్తామంటూ సభలో లోకేశ్ హెచ్చరికలు చేయడం చూస్తుంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందన్నారు. మైనా ర్టీకి చెందిన రుహుల్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోను ఆందోళనలు చేశారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉందా అన్ని ప్రశ్నించారు. -
రక్తి కట్టని శవ రాజకీయం
(సాక్షి అమరావతి, ఏలూరు): ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఏ స్థాయికైనా దిగజారవచ్చన్న తెలుగుదేశం సిద్ధాంతం సోమవారం అటు అసెంబ్లీలోను, ఇటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోను స్పష్టంగా కనిపించింది. శ్మశానంలోని కాటికాపరి ద్వారా యథాలాపంగా వెల్లడైన మరణాల తాలూకు సమాచారాన్ని సోషల్ మీడియా ముఖంగా రచ్చ చేసి... ఆ తరవాత అసెంబ్లీకి తీసుకువచ్చి శవ రాజకీయం చేస్తున్నారంటే దీనికన్నా దిగజారుడుతనం వేరొకటి ఉండదన్నది చెప్పకనే తెలుస్తుంది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రతి అంశానికీ అడ్డు తగులుతూ... తామడిగిన అంశంపై మంత్రి సమాధానమిస్తున్నా కూడా వినకుండా కాగితాలు చించి స్పీకరుపైకి విసిరారు. సభకు పదేపదే అడ్డు తగులుతూ అదే తమ ఎజెండా అని బయటపెట్టుకున్నారు. మరోవంక వారి నాయకుడు చంద్రబాబు నాయుడు జంగారెడ్డి గూడేనికి వెళ్లి... అక్కడ శవ రాజకీయం మొదలెట్టారు. అసలక్కడ ఏం జరిగిందంటే... జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ఏరియాకు ముఖద్వారమని చెప్పాలి. 75కు పైగా గ్రామాలకు అదో ప్రధాన పట్టణం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మున్సిపాలిటీ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి పట్టణ జనాభా 67,800. ఇందులో 10 వేల మందికి పైగా వలస వచ్చినవారే. ఉపాధి, వ్యవసాయ పనుల కోసం చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినవారే. సాధారణంగా చూస్తే ఇక్కడి జనాభా నేపథ్యంలో నెలకు సగటున 25కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి రికార్డుల్లో నమోదవుతున్నాయి కూడా. అధికారిక లెక్కల ప్రకారం జనవరిలో 37, ఫిబ్రవరిలో 24 మంది, మార్చి 11 వరకు నలుగురు మరణించారు. ఈ వాస్తవాలన్నీ పాతిబెట్టి... గత 15 రోజుల్లో 18 మంది చనిపోయారని చెబుతూ పద్ధతి ప్రకారం అబద్ధాలకు ఆజ్యం పోస్తోంది టీడీపీ. టీడీపీ మద్యం సిండికేట్లే... తెలుగుదేశం నేతలు కొందరు గత లిక్కర్ సిండికేట్‌లో కీలక భాగస్వాములు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ సిండికేట్‌కు తెర వేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకొచ్చింది. దీంతో వారికొచ్చే కోట్ల ఆదాయం పడిపోయింది. దీంతో సిండికేట్‌లోని ముఖ్యులు కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో... అనారోగ్యం వల్ల సంభవించిన మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించారు. పట్టణంలోని 4 శ్మశానవాటికల్లో కాటి కాపరులు, స్థానికుల నుంచి సమాచారం సేకరించామని, ఇదంతా నిజమేనని ప్రచారానికి తెరలేపారు. దానికి బలం చేకూరేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేశారు. ఎలాంటి సహజ మరణం జరిగినా సారా మరణమంటూ హడావిడి చేస్తున్నారు. ఒకరోజు సారా కారణంగా 16 మంది చనిపోయారని... తరవాత 18 మంది చనిపోయారని చెబుతూ హడావిడి చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై డోర్ టు డోర్ సర్వే నిర్వహించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని సైతం దీనిపై సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో మరణించిన నలుగురికి పోస్టుమార్టం నిర్వహించేలా అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో... బయట బాబు వ్యూహం!! ఏ అంశం దొరికినా దాన్ని పెద్దది చేసి రచ్చచేయాలన్న చంద్రబాబు ప్లాన్ ప్రకారం... సోమవారం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు నినాదాలు, అరుపులతో తీవ్ర గందరగోళం సృష్టించారు. తొలుత వారడిగిన ప్రశ్నకు గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు సమాధానమిస్తున్నా పట్టించుకోకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు. గంటన్నర తర్వాత తిరిగి సమావేశంకాగా అదే వైఖరి కొనసాగించారు. కాగితాలు చించి స్పీకర్ ముఖంపై పదేపదే విసిరారు. ఒక దశలో కాగితాలు అయిపోవడంతో అచ్చెన్నాయుడు బయటకు వెళ్లి కాగితాలు తెచ్చి మరీ తమ సభ్యులకు అందించారు. ఈ తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు వాయిదా వేసినా సభకు ఆటంకాలు కల్పిస్తూనే వచ్చారు. చివరకు గత్యంతరం లేక సభ సజావుగా సాగేందుకు ఐదుగురు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవంక చంద్రబాబునాయుడు సోమవారం జంగారెడ్డి గూడేనికి వచ్చారు. గత కొద్ది రోజులుగా 26 మంది చనిపోయారని, ఆ జాబితా తమ వద్ద ఉందని చెప్పారు. మున్సిపల్ అధికారిక లెక్కల ప్రకారం కేవలం నలుగురే మరణించారు. శ్మశాన సిబ్బంది నుంచి తీసుకున్న వివరాల ప్రకారమైనా.. 18 మంది మరణించారు. వీరిలో ఆరుగురు 60 ఏళ్లు, 70 ఏళ్లు పైబడ్డ వారే. మిగిలిన వారిలో మరో 8 మంది వివిధ రకాల వ్యాధులతో తమ ఇళ్లలోనే మరణించారు. నలుగురు మాత్రం ఆసుపత్రిలో మరణించగా వారి శవాలను అధికారులు పోస్టుమార్టం చేస్తున్నారు కూడా. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా అంతా సారా తాగే మృతి చెందారని, వీటిని సారా మరణాలుగా అన్వయిస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారంతో స్థానికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాన్ని నిజంగా మార్చడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ విశ్లేషకుల్ని నివ్వెర పరుస్తున్నాయి. దూషిస్తూ.. చేయి చేసుకుని స్పీకర్ ఆదేశాలను పాటిస్తున్న మార్షల్స్‌పైనా ఒకదశలో టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగారు. వారిని దూషించడంతోపాటు తోసేశారు. సస్పెండైన ఐదుగురు సభ్యులను బయటకు పంపిన తర్వాత కూడా మిగిలిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలుచుని నినాదాలు చేశారు. తమ స్థానాల వద్దకు తీసుకెళుతున్న మార్షల్స్‌ను వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరు సాంబశివరావు తదితరులు దూషిస్తూ చేయి చేసుకున్నారు. ఈ గందరగోళం మధ్యే మంత్రి ఆళ్ల నాని ప్రకటన, సీఎం ప్రసంగం అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడింది. మహిళల అక్రమ రవాణాలో టీడీపీ సర్కారు నంబర్ వన్ జంగారెడ్డిగూడెం ఘటనపై తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఓ పత్రిక కథనం ప్రచురించిందని, ఈ డ్రామాకు సూత్రధారి రామోజీరావు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. శవ రాజకీయాలు టీడీపీకి పేటెంట్గా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అనుకూల మీడియాలో కథనాలు ప్రచురించుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో వివరణాత్మకంగా సమాధానం చెబితే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం గురించి ప్రజలకు తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. టీడీపీ నాయకులు మద్యం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. మహిళల అక్రమ రవాణా, వేధింపుల్లో టీడీపీ హయాంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. అప్పట్లో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం ఘటన వెనుక టీడీపీ హస్తం ఉందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి, విజయవాడలో పడవ ప్రమాదం మరణాలకు చంద్రబాబు కారణం కాదా? అని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రశ్నించారు. -
మద్యం దందాకు..గుడ్‌విల్ టెండర్
-
‘చల్లచల్లగా’ దోచేస్తున్నారు
బీరుపై రూ.15 పెంచి అమ్మకాలు మద్యం ప్రియుల జేబులకు చిల్లులు నెలకు రూ.4.82 కోట్లకు పైగా దోపిడీ చిత్తూరు: రోహిణి కార్తె రాకముందే ఎండలు రోళ్లు పగిలేలా కాస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటుతోంది. ఈ తరుణంలో మందుబాబులు చల్లని కిక్కు కోసం బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని మద్యం వ్యాపారులు సిండికేట్ అయి రేట్లు పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కూలింగ్ పేరుతో.. జిల్లాలో 382 మద్యం షాపులు, 26 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ డివిజన్లుగా విభజించారు. ఈ డివిజన్ల నుంచే ఆ పరిధిలోని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏప్రిల్‌లో సుమారు 2 లక్షల 68 వేల బీరు కేసులను అమ్మారు. ఒక్కో బీరు కేసులో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో బీరుపై సుమారు రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కూలింగ్ కోసం పెంచామని సమాధానమిస్తున్నారు. ఇలా వసూలు చేయడం వల్ల జల్లా వ్యాప్తంగా రూ.4.82 కోట్లు మద్యం బాబులపై అదనపు భారం పడుతోంది. నిబంధనలు గాలికి.. మద్యం షాపుల దగ్గర ఇచ్చే పర్మిట్ రూములకు కేవలం మందు తాగడానికే అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇవి అన్ని చోట్లా దాబాలుగా మారిపోయాయి. మాంసం, ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో బీర్లు, మద్యంపై రూ.10 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ దందా గురించి ఎక్సైజ్ పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు అందుతుండటంతోపట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు.. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశాం. మద్యం అధిక ధరలకు విక్రయించకుండా ఆన్లైన్ బిల్లింగ్ పద్ధతిని త్వరలో ప్రవేశపెడుతున్నాం. - సత్యప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ శాఖ, చిత్తూరు. -
రాజధానిలో లిక్కర్ సిండికేట్ రేట్ షురూ..
రాజధానిలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలయింది. సిండికేట్ వ్యాపారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య పరస్పర ఆర్థిక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో ప్రభుత్వం మద్యం ధరలను పెంచి అమలులోకి తెచ్చిన రోజు నుంచే సిండికేట్లు సరికొత్త రేట్లను సిద్ధం చేసి విక్రయాలు సాగిస్తున్నాయి. ఎమ్మార్పీ ఉల్లంఘన ఎక్కడా జరగదని తరచూ చెప్పే అధికారులు, మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించడంతో సిండికేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి బహిరంగంగా రూ.కోట్లలో విక్రయాలు సాగిస్తున్నారు. విజయవాడ : గుంటూరు, కృష్ణా జిల్లాలో మద్యం సిండికేట్ హవా కొనసాగుతోంది. అధికార పార్టీ మంత్రులు డివిజన్ల వారీగా పంచుకొని సిండికేట్ల నుంచి కొంత తీసుకొని పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. కొందరైతే ప్రత్యక్షంగా సిండికేట్‌లో భాగస్వాములుగా ఉండి సిండికేట్‌ను తెరవెనుక ఉండి నడిపిస్తుండగా, మరికొందరు ఎంతోకొంత తీసుకొని కొమ్ముకాస్తున్నారు. ఇక రెండు జిల్లాలోని అధికారులు అయితే పూర్తిగా వ్యాపారులకు సహకరించి నెలవారీలు తీసుకుంటున్నారు. దీంతో ఎమ్మార్పీ ఉల్లంఘనకు వ్యాపారులు పాల్పడుతూ ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్మకాలు సాగించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో 342 వైన్ షాప్‌లు, రెండు రోజుల క్రితం మంజూరైన కొత్త వైన్ షాపులు 9 కలిపి 351 వైన్ షాపులు ఉన్నాయి. అలాగే 152 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు అధికారికంగా 2.30 లక్షల కేసుల మద్యం విక్రయాలు సాగుతున్నారుు. వీటి విలువ సగటున రూ.120 కోట్లు పైనే ఉంటుంది. అలాగే కృష్ణాజిల్లాలో 297 వైన్ షాపులు ఉన్నాయి. ఇటీవల మంజూరైన వాటిలో నాలుగు కొత్త వైన్ షాలు కలుపుకొని 301 వైన్ షాపులు ఉన్నాయి. అలాగే 167 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 2.10 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగి వీటి ద్వారా సగటున రూ.105 నుంచి రూ.110 కోట్లు విక్రయాలు జరుగుతున్నారుు. అలాగే గుంటూరులో 35 ప్రభుత్వ మద్యం దుకాణాలు, కృష్ణా జిల్లాలో 33 ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి. రెండు జిల్లాలోని షాపుల ద్వారా రూ.20 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నారుు. ఈక్రమంలో విజయదశమి పండుగ మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్ని 5శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని రకాల మద్యం ధరలు కొంత పెరిగాయి. ఇదే సరైన సమయంగా వ్యాపారులు భావించి అధికారులతో ముందుస్తుగా చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా పెరగిన ధరలతో పాటే సిండికేట్ ధరల్ని పెంచేశారు. మామూళ్లతో దాడులకు బ్రేక్ 10 రోజులగా రెండు జిల్లాలో ఇది కొనసాగుతున్నా కనీసం జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు కాని, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కాని దృష్టి సారించి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖాలాలు లేవు. అధికార పార్టీ అండదండలు ఉండటం, అధికారులను మామూళ్లతో మాట్లాడుకోవడంతో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా పెంచగా ఆఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు, క్యార్టర్ సీసాపై రూ.5 నుంచి రూ.15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రెండు జిల్లాలో కలిపి నెలకు రూ.230 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నారుు. పెంచిన సిండికేట్ ధరల వల్ల రెండు జిల్లాలోని సిండికేట్ వ్యాపారులకు రూ.40 కోట్లు అదనపు లాభం చేకూరుతుంది. -
రేయిని బట్టి
జిల్లాలో లిక్కర్ సిండికేటుకు మళ్లీ జీవం ⇒ ‘సాక్షి’ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడి ⇒ జిల్లా వ్యాప్తంగా 52 దుకాణాల్లో శాంపిల్స్ సేకరణ ⇒ ప్రతి క్వార్టర్ మీద కనిష్టంగా రూ.5 అదనం ⇒ జోగిపేటలో రాత్రి అవుతున్న కొద్దీ మద్యం ధరకు రెక్కలు ⇒ పల్లీలు, పుట్నాల పేరుతో చిల్లర దోపిడీ ⇒ వ్యాపారులకు ‘స్వేచ్ఛ’ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లిక్కర్ సిండికేటు జిల్లాలో మళ్లీ జీవం పోసుకుంది. అవినీతి నిరోధక శాఖ దెబ్బకు రెండేళ్లుగా కొద్దిగా తగ్గినా...! కొత్త రాష్ట్రం ఏర్పాటు వెసులుబాటుతో మళ్లీ పాత జమానా మొదలైంది. మద్యం దుకాణాల యజమానులు ప్రాంతాల వారీగా సిండికేటు కట్టారు. మద్యం ఎమ్మార్పీ నిబంధనను ఉల్లంఘించి క్వార్టర్ మీద రూ. 5 పెంచి అమ్ముతున్నారు. ఏసీబీ దాడులు.. కేసుల నేపథ్యంలో కొంతకాలం భయం నటించిన ఎక్సైజ్ అధికారులు, తాజాగా జూలు విధిల్చారు. లిక్కర్ సిండికేటుకు అండగా నిలబడ్డారు. పీడించకుండా అందిన కాడికి దండుకోం డని సలహా ఇచ్చారు. అధికారుల మాటతో మద్యం వ్యాపారులు ఓ రేటు ‘ఫిక్స్’ చేశారు. అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. క్వార్టర్ మద్యం సీసాకు రూ.5, అంత కంటే ఎక్కువ పరిమాణంలోని మద్యం బాటిళ్లకు వీలును బట్టి అదనంగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎమ్మార్పీని ( గరిష్ట చిల్లర ధర) మించి మద్యం అమ్ముతున్నారని, ఎక్సైజ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించి 52 మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసింది. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట , నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ప్రతి క్వార్టర్ మీద రూ.5 అదనంగా తీసుకోగా, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్, దుబ్బాకలో ‘చిల్లర’ దోపీడీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. క్వార్టర్, ఫుల్ బాటిళ్లను కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ. 5, రూ.10, రూ.15 వరకు చిల్లర ఇవ్వాల్సి వస్తే వాటికి బదులుగా వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, పల్లీలు, పుట్నాలు అంటగడుతున్నారు. జోగిపేటలో రేయిని బట్టి మద్యం రేటు పెరుగుతోంది. రాత్రిని బట్టీ రేటు.... జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చీకటి పడుతుంటే మద్యం ధర పెరుగుతుంది. సాధారణంగానే ప్రతి దుకాణంలో ఎమ్మార్పీ మీద రూ.5 ఎక్కువ గా తీసుకుంటున్నారు. దుకాణం మూసిన తర్వాతదుకాణం పక్కనే ఉన్న చిన్న దుకాణంలోకి సరుకు పెడతారు. ఈ దుకాణం తెల్లవార్లూ నడుస్తూనే ఉంటుంది. అయితే రేటు మాత్రం స్థిరంగా ఉండదు. డిమాండ్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది. జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్టు షాపులు కూడా ఎక్కువగానే కొనసాగుతున్నాయి. ప్రతి బ్రాండ్‌పై రూ.10 నుంచి రూ.15 అదనంగా తీసుకుంటున్నారు. బెల్టు దుకాణాలు మద్యం దుకాణాల యాజమాన్యం కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. మొత్తం దుకాణాలను ఒకే ఒక సిండికేటు నాయకుడు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఖేడ్‌లో మద్యం కొంటే జేబులు ఖాళీ నారాయణఖేడ్‌లో 4 మద్యం దుకాణాలున్నాయి. ఓసీ క్వార్టరుకు రూ.85 ధర ఉండగా రూ.95, ఏసీపీ ఆఫ్ బాటిల్‌కు రూ.215 ఉండగా రూ.225, రాయల్ స్టాగ్ క్వార్టర్ రూ.145 ఉండగా రూ.150, బీరు రూ.95 ఉండగా రూ.100లకు విక్రయిస్తున్నారు. అదనంగా డబ్బు వసూలు చేయడంతో ఓ వినియోగదారుడు ‘సాక్షి’ బృందం ముందే దుకాణం మేనేజర్‌తో వాదనకు దిగారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం వ్యాపారం చేస్తుండడం వల్లే ఈ అదనపు మోతకు అంతులేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేటలో చిల్లర దందా సిద్దిపేట మండల పరిధి, పట్టణ శివారులో 11 దుకాణాలు, చిన్నకోడూరు మండలంలో రెండు , నంగునూరు మండలంలో 2 మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం కోసం రూ .100 నోటు ఇచ్చి చిల్లర ఆశించడం అత్యాశే అవుతోంది. చిల్లర బదులుగా పల్లీలు, పుట్నాలు చేతిలో పెడుతున్నారు. సిద్దిపేటలో జాతీయ రహదారి పక్కనే దాబాలు నడుస్తున్నాయి. ఇక్కడ 24 గంటలు లిక్కర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ అనుమతి ఉన్న బార్లు రాత్రి 11 గంటలకు మూసి వేస్తున్నారు కానీ, ఇక్కడ నడుస్తున్న ‘అక్రమ బార్ల’కు సమయ పాలన అంటూ లేదు. బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని దుకాణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. గజ్వేల్‌లో ఇదో జిమ్మిక్కు.... గజ్వేల్‌లో విచిత్ర పరిస్థితి. ఎమ్మార్పీ ఉల్లంఘనఉన్నట్టు లేదు... లేనట్టు లేదు. ‘సాక్షి’బృందం సభ్యుడు రూ.150 ఇచ్చి క్వార్టర్ రాయల్ స్టాగ్ కొనగా,. దాని ఎమ్మార్పీ రూ.145 ఉంది. దుకాణ యజమాని తిరిగి ఇవ్వాల్సిన రూ. 5 చిల్లర ఇవ్వలేదు. చిల్లర ఇస్తారేమో అని కొద్ది సేపు నిలబడినా క్యాష్ మేనేజర్ నుంచి ఉలుకులేదు, పలుకు లేదు. ఈ సమయంలోనే ఒక వ్యక్తి ఎంసీ డైట్ ఫుల్ బాటిల్ కొన్నాడు. దాని ఎమ్మార్పీ ధర రూ.430 ఉంది. ఆయనకు చిల్లర ఇవ్వలేదు. ‘నాకు రూ. 5 చిల్లర వస్తాయి కదా’ అని అడిగ్గా.. ఓ రకంగా చూస్తూ పల్లీ పాకెట్ చేతిలో పెట్టాడు. పరాష్కం ఆడకురి...... మెదక్ పట్టణంలో 5 వైన్స్ షాపులుండగా ఇందులో 4 దుకాణాలు ఒక రాజకీయ నాయకుడి ఆధీనంలో సిండికేట్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా చిల్లర దోపిడీ కనిపించింది. రూ.100 వంద ఇచ్చి కింగ్ ఫిషర్ బీరు కొనగా, ఎమ్మార్పీ రూ 95 ఉంది. రూ.5 చిల్లర ఇవ్వమని అడిగితే రెండు ప్లాస్టిక్ గ్లాసులు ఇచ్చారు. బిల్లు ఇవ్వమని అడిగితే ‘‘నువ్వు కొన్న ఒక్క సీసాకు బిల్లు కావాలా?’’ అని వెటకారం ఆడారు. ‘పోనీ కేసు కొంటాం బిల్లు ఇస్తావా?’ అని అడిగితే ‘‘బేరం వచ్చేటప్పుడు పరాష్కం ఆడకు పో..., తీసుకుంటే తీసుకో లేకుంటే ఆడ పడేసి పో’’ అంటూ విసుక్కున్నారు. జహీరాబాద్‌లో జేబులు గుళ్ల..... జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో కలిపి 12 వైన్స్ దుకాణాలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలో 8, కోహీర్‌లో 2, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఒక్కోటి చొప్పున దుకాణాలున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో దాదాపు అన్ని వైన్స్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే బాటిల్‌పై రూ.5 అదనంగా తీసుకున్నట్లు తేలింది. అంతా మా ఇష్టం ‘సాక్షి’ బృందం సభ్యులు ఓ ఔత్సాహిక మద్యం వినియోగదారునితో సిగ్నేచర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయించారు. సదరు వినియోగ దారుడు క్వార్టర్ ఎంతా అని అడిగితే రూ. 215 అని దుకాణ నిర్వాహకుడు తెలిపారు. ఫుల్‌బాటిల్ ఇవ్వాలని రూ. 1000 నోటిస్తే దుకాణ నిర్వాహకుడు రూ.120 ఇచ్చారు. దాని ఎమ్మార్పీ రూ. 860 ఉంది. ఇదేం లెక్క అంటే అది అంతే అన్నారు. మండల కేంద్రాల్లో అయితే ఎక్సైజ్ అధికారుల అజమాయిషీ ఉండదు కాబట్టి వైన్స్ నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారని అనుకోవచ్చు, డిప్యూటీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంటు కమిషనర్ ఉండే జిల్లా కేంద్రంలోనే దందా కొనసాగుతుందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. తనిఖీలు చేస్తున్నాం ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితేనే కేసులు నమోదుచేస్తాం. ఇటీవల నారాయణఖేడ్, పటాన్చెరు ప్రాంతాల్లో పలు దుకాణాలపై కేసులు పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌షాపులు నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. వైన్స్‌లో కేవలం మద్యం మాత్రమే విక్రయించాలి. నీళ్ల బాటిళ్లు, గ్లాసులు, ఇతర తినుబండారాలు విక్రయించకూడదు. - సయ్యద్ యాసిన్ ఖురేషి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, సంగారెడ్డి -
‘లిక్కర్ సిండికేట్’!
సాక్షి, ఖమ్మం : మద్యం సిండికేట్ వ్యవహారం జిల్లాలో మరోసారి తెరపైకి వచ్చింది. నూతన విధానంలో మద్యం షాపులకు టెండర్లు పిలిచిన రెండు రోజుల్లోనే జిల్లాలోని రాజకీయ నాయకుల కన్ను పడడంతో ఈసారి టెండర్ల ప్రక్రియ కొత్తరంగు పులుముకుంది. జిల్లాలో ఉన్న షాపులకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున టెండర్లు దాఖలు చేస్తున్నారన్న సమాచారంతో వారిని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనతో స్థానిక వ్యాపారులు కొందరు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సిండికేట్ ఎలా కావాలనే దానిపై వీరు వ్యూహరచనలు చేసుకుంటున్నారు. ఇందులో ఖమ్మం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ అన్నీ తానై నడిపిస్తుండగా, మరో ఇద్దరు సివిల్ కాంట్రాక్టర్లు తెరవెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా జిల్లా మద్యం వ్యాపారాన్ని ‘చే’జిక్కించుకోవాలన్న ఆలోచనతో వీరు రాజకీయ నాయకులతో సమావేశమవుతున్నారని సమాచారం. ఈ సమావేశాలకు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులు కూడా హాజరయ్యారని, స్థానిక వ్యాపారులతో కలిసి వీరంతా సిండికేట్‌ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారని తెలుస్తోంది. ఆంధ్రావ్యాపారులు ‘టెండర్’ పెడుతున్నారని.... అసలీ ‘సిండికేట్’వ్యవహారం తెరపైకి వచ్చేందుకు ఓ సంఘటన కారణమనే చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఆంధ్ర ప్రాంతంలోని దుకాణాలకు టెండర్ వేసేందుకు గాను డీడీ తీసేందుకు వె ళ్లగా, అక్కడి వ్యాపారులు ఖమ్మం జిల్లాలోని మెజారిటీ షాపులకు ‘టెండర్’ పెడుతున్నారని ఉప్పందింది. ఆంధ్ర ప్రాంత వ్యాపారులు జిల్లాలో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో పెట్టుకోవడాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో సదరు వ్యాపారి ఖమ్మం వచ్చి రాజకీయ నాయకుల సహకారాన్ని అడిగినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులతో కలిసి ఖమ్మంలో మంగళవారం సమావేశం నిర్వహించగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులను ఆహ్వానించినా వారు రాలేదని సమాచారం. మరోవైపు గతంలో సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ నిందితుల్లో ఒక వ్యాపారి మళ్లీ తన బినామీలతో రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలోని మొత్తం 147 షాపులకు ఈయన టెండర్ దాఖలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేల అండతో జిల్లాలో మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సాధ్యమవుతుందా? వ్యాపారుల రహస్య సమావేశాల్లో భాగంగా సిండికేట్ అయ్యేందుకు గల మార్గాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. గత టెండర్లలో ఒక్కో వ్యాపారి 50 షాపులకు దరఖాస్తు చేసినా ఒకటి, రెండు షాపులే లాటరీలో రావడంతో దరఖాస్తు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఈ నేపథ్యంలో షాపుల వారీగా దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలను సేకరించి, వారితో మాట్లాడాలని, అవసరమైతే ఎమ్మెల్యేల చేత సిఫారసు చేయించాలనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, టెండర్ల కంటే ముందే సిండికేట్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆంధ్ర వ్యాపారులను అడ్డుకునే అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వం హయాంలోనే మద్యం షాపుల పర్మిట్లను మరో ఆరునెలలు పొడిగించుకుని ఉంటే సమస్య ఉండేది కాదని, అది చేసుకోకుండా మళ్లీ ఇప్పుడు టెండర్లు కాకుండానే సిండికేట్ ఎలా సాధ్యమవుతుందని ఓ వ్యాపారి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో 57 దుకాణాలకు గిరిజనులే టెండర్లు వేయాలని, వీటికి చాలా కాలం నుంచి బినామీలే టెండర్లను వేస్తున్నారని, దీనిని ఎలా అడ్డుకోగలుగుతామనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమయింది. స్థానిక వ్యాపారులే ఆంధ్ర వ్యాపారుల సహకారంతో టెండర్ పె డితే ఏమీ చేయలేమని, ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత లాటరీలో దుకాణాలు వచ్చినవారందరినీ పిలిపించి సిండికేట్ గురించి ఆలోచిద్దామని కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ, సిండికేట్‌గా ఏర్పడి టెండర్ వేద్దామని, మనకే వస్తే తర్వాత కూడా ఇబ్బంది ఉండదని కొందరు సూచించారని, ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి గండి... ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చేదే. ఎంత ఎక్కువ మంది నుంచి టెండర్ దరఖాస్తులు తీసుకుంటే ప్రభుత్వానికి అంత ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే వ్యాపారులు సిండికేట్ అయితే ఈ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడే అవకాశం ఉంది. సిండికేట్ విధానంతో ఇటు మైదాన, అటు ఏజెన్సీలో వ్యాపారం బాగా జరిగే దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు పడతాయి. ఈ టెండర్లు వేసే వారు కూడా సిండికేట్ రింగ్ నుంచే ఉంటారు. ఒక్కో టెండర్ దరఖాస్తుకు రూ.25వేలు చెల్లించాలి. టెండర్ దక్కినా, దక్కకపోయినా ఈ డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తుంది. సిండికేట్ వ్యవహారంతో ఒక్కో దుకాణానికి తక్కువగా టెండర్లు పడితే ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే మందుబాబుల జేబుకు చిల్లు పడనుంది. జిల్లా వ్యాప్తంగా, లేదంటే ప్రాంతాల వారీగా సిండికేట్ కావడం ద్వారా మద్యం ధరలను విపరీతంగా పెంచి కోట్లాది రూపాయల మద్యం తాగించి సొమ్ములు లాక్కునే ప్రయత్నాలకు ఎక్సైజ్ అధికారులు ఎలా చెక్పెడతారో, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
మద్యం మాఫియా పని పట్టండి
లిక్కర్ సిండికేట్ స్కాంలో 34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఏసీబీకి గవర్నర్ నరసింహన్ ఆదేశాలు నిందితుల్లో ఎక్సైజ్, పోలీసు అధికారులు హైదరాబాద్: రాష్ర్టంలో సంచలనం కలిగించిన లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో పాత్ర ఉన్న 34 మంది అధికారులను విచారించేందుకు గవర్నర్ నరసింహన్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అనుమతిచ్చారు. ఈ మేరకు మంగళవారం రాజ్‌భవన్ నుంచి ఏసీబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు సంవత్సరాల క్రితం మద్యం మాఫియా సిండికేట్‌గా మారి తమకు అనుకూలమైన వారికి వైన్‌షాపులను ఇప్పించుకోవడంతోపాటు, ప్రభుత్వాదాయానికి భారీఎత్తున గండికొట్టిన విషయం వెలుగుచూడడం తెలిసిందే. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని వస్తుండగా ఏసీబీ అధికారులు ఖమ్మంలో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ స్కాం బయటపడింది. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించడంతో ఖమ్మంలో దొరికిన తీగ డొంక విజయనగరంలో కదిలింది. దీని వేర్లు తెలంగాణ, రాయలసీమ, హైదరాబాద్ తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయని తెలిసి ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేశారు. మద్యం మాఫియాతో అధికారుల మిలాఖత్ ఖమ్మంలో లిక్కర్ సిండికేటర్ నున్న రమణ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ నెలవారీగా ఎవరెవరికి మామూళ్లు చెల్లిస్తున్న వైనాన్ని బయటపెట్టింది. ఇందులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌కు చెందిన కొందరు అధికారులతోపాటు సివిల్ పోలీసు అధికారులు కూడా మిలాఖత్ అయి సిండికేట్ల నుంచి భారీ ఎత్తున దండుకోవడం కూడా బయటపడింది. ఇక విజయనగరంలో అయితే పదిలక్షల నుంచి ముప్పై లక్షల విలువైన వైన్‌షాపులు తెల్లరేషన్‌కార్డుదారుల పేరిట ఉండడం ఏసీబీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. వీరిని బినామీలుగా పెట్టి కొందరు రాజకీయ ప్రముఖులు, లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ సిండికేట్లతో మిలాఖత్ అయిన ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు ఏసీపీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలతోపాటు మరికొందరు పోలీసు అధికారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు. అధికారుల బదిలీపై హైకోర్టు అక్షింతలు సంచలనాత్మకమైన లిక్కర్ సిండికేట్ కేసు పర్యవేక్షిస్తున్న అధికారుల బదిలీ అంతకంటే ఎక్కువ సంచలనం కలిగించింది. అధికారుల బదిలీపై స్పందించిన హైకోర్టు కేసు దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామంటూ ముందుకు రావడంతో ఈ కుంభకోణం అనేక మలుపులు తిరిగింది. చివరగా కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు పకడ్బందీగా ముందుకు సాగించారు. ఈ నేపథ్యంలోనే తాము అరెస్టుచేసిన ఎక్సైజ్, పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు దాదాపు రెండేళ్లక్రితమే ప్రభుత్వాన్ని కోరారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించాక ఏకే ఖాన్ మరోసారి లేఖ రాశారు. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ నరసింహన్ ఎట్టకేలకు 34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు. కాగా, ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ నుంచి తమకు ఆదేశ పత్రాలు అందగానే దీనిపై తదుపరి చర్యలకు దిగుతామని ఏసీబీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రాసిక్యూషన్ కోసం పంపిన అధికారులకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని, వారికి సంబంధించిన ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. -
'మద్యం సిండికేట్‌లో అధికారుల ప్రాసిక్యూషన్'
-
'మద్యం సిండికేట్‌లో అధికారుల ప్రాసిక్యూషన్'
మద్యం సిండికేట్ వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించారు. ఆ వ్యవహారంలో 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై 180 మంది అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అనాటి వ్యవహారంపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించి... ఉన్నతాధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలకు గవర్నర్ రంగంలోకి దిగారు. అందులోభాగంగా మొదటగా 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. -
మూలమూలనా మహమ్మారే
మద్యం మార్కెటింగ్‌లో ప్రభుత్వం దూసుకెళ్తోంది: హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూలమూలలా, వాడవాడలా మద్యం మహమ్మారి వేళ్లూనుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ వ్యంగ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మద్యం విధానాలకు సంబంధించి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందంటూ మండిపడింది. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఉదంతానికి ప్రభుత్వాన్నే బాధ్యు రాలిని చేసింది. తల్లిని కోల్పోయిన బాధిత చిన్నారుల కు ఒక్కొక్కరి పేరుపై రూ. 2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యానికి బానిసైన వరంగల్ జిల్లా అర్పణపల్లి నివాసి ఘనపురపు రవి... భార్యను కిరాతకంగా హింసించి, కిరోసిన్ పోసి తగులపెట్టాడు. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన వారి ఆరేళ్ల కుమారుడు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఆరో అదనపు సెషన్స్ జడ్జి గోవర్దన్‌రెడ్డి.. రవికి జీవితఖైదు విధిస్తూ 2008లో తీర్పు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ రవి హైకోర్టు లో దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న తర్వాత రవి అప్పీల్‌ను కొట్టివేసింది. తండ్రి ఘాతుకానికి తల్లిని కోల్పోయిన మైనర్లకు ఒక్కొక్కరి పేరు మీద మూడు నెలల్లోగా రూ.2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘దురదృష్టవశాత్తూ ఓ యువకుడు తన భవిష్యత్తును పణంగా పెట్టి మద్యానికి బానిసయ్యాడు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా మద్యం దొరికేలా ప్రభుత్వం దూసుకుపోయే మార్కెట్ శైలిని అనుసరిస్తోంది. ఇందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి అంశాలకు సంబంధించే అత్యధిక స్థాయిలో అప్పీళ్లు దాఖలవుతుండటం ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. మద్యానికి బానిసై యువకులు జీవితాలను నాశనం చేసుకుంటుంటే, దాని ఫలితాన్ని అమాయక మహిళలు అనుభవించాల్సి వస్తోంది. మద్యం మాటున వారి జీవితాలు దారుణంగా బలవుతున్నాయి. ప్రభుత్వ బాధ్యతా రహిత విధానాలతో కుటుంబాలను విచ్ ఛిన్నం చేస్తోంది. ముఖ్యంగా సమాజంలోని బలహీనవర్గాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి. దీనిపై ఎప్పటికిప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాం. బాధ్యతా రహిత, సంఘ వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంద’’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. -
మళ్లీ సిండి‘కేటు’
* పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం దిగుమతి *రాష్ట్రంలో మైనస్‌లోకి ఏపీబీసీఎల్ మద్యం విక్రయాలు *డీల్ కుదురుస్తున్న ప్రజా ప్రతినిధులు *నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం *ఏసీబీకి సిఫారసు చేస్తామంటూ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైలవరం, అమలాపురం తరహా కల్తీ మద్యం సంఘటనలు మళ్లీ పునరావృతం కానున్నాయా? మద్యం తాగే అలవాటున్న ప్రజల ప్రాణాలు గాలిలో దీపమై ఊగుతున్నాయా? లిక్కర్ సిండికేటు ఒక్కసారిగా తెగబడిన తీరు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరికలు చూస్తుంటే ప్రజల ప్రాణాలకు మళ్లీ ముప్పు వచ్చిందని తెలుస్తోంది. ఏసీబీ దెబ్బకు 22 నెలల పాటు సెలైంట్‌గా ఉన్న లిక్కర్ సిండికేటు మళ్లీ జూలు విదిల్చడమే దీనికి కారణం. సిండికేటు దెబ్బతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా నకిలీ మద్యం పల్లెలకు చేరుతోంది. రెక్టిఫైడ్ స్పిరిట్‌తో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి గుప్పిస్తున్నారు. ఈ సిండికేటు దెబ్బకు రాష్ట్రంలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు మైనస్‌లోకి పడిపోయాయి. పాత కమిషనర్ సమీర్‌శర్మ బదిలీపై వెళ్లడం, కొత్త కమిషనర్ ఇంకా శాఖపై పట్టు సాధించకపోవడంతో సిండికేట్లు మళ్లీ పాత జమానా మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యవర్తులుగా ఉంటూ సిండికేట్ ‘డీల్’ కుదురుస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ ఏరియాల్లోని దుకాణాల్లో వాటాలు తీసుకొని అక్రమ దందాకు తెరలేపారు. వీళ్లకు స్థానిక ఎక్సైజ్ అధికారుల వత్తాసు ఉందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ ఇటీవల అధికారుల సమావేశం నిర్వహించి ఎస్‌హెచ్‌వో స్థాయిలో ఏదో జరుగుతుందని, అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే ఏసీబీకి సిఫారసు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం హడావుడిగా జిల్లాలు తిరుగుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. పెరగాల్సిన విక్రయాలు తగ్గాయి! రాష్ట్రంలో నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే చవక, మధ్యతరహా బ్రాండ్ల మద్యం విక్రయాలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం (ఎన్డీపీఎల్) దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్‌షాపుల్లో పెట్టి అమ్మడం వల్లనే ప్రభుత్వ మద్యం విక్రయాలు తగ్గుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని కొంతమంది ముఠాగా ఏర్పడి పక్కరాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అధికారుల అంచనా మేరకైనా, గత రికార్డులను బట్టి చూసినా మద్యం విక్రయాలు ఏటా కనీసం 10 శాతం చొప్పున పెరగాలి. అందుకు తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ బ్రివరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) వివిధ రకాల బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో గత పదేళ్లుగా తేడా రాలేదు. కానీ గడచిన 18 రోజులలో ఏపీబీసీఎల్లో మద్యం అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో కూడా విక్రయాల రేటు బాగానే ఉంది. మద్యం ధరలు రెండుసార్లు పెరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. పై లీన్ తుపాను, సమైక్య ఉద్యమం జరిగిన సమయంలో కూడా మద్యం విక్రయాల రేటు పెరుగుతూనే వచ్చింది. కానీ ఎకై ్సజ్ కమిషనర్ సమీర్‌శర్మ మారిన తరువాత ఈ నెల మొదటి వారం నుంచీ అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా మైనస్‌లోకి పడిపోయాయి. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు భారీగా తగ్గడం, మిగిలిన జిల్లాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఎన్డీపీఎల్ మద్యం దిగుమతిని నిర్ధారిస్తోంది. ఆ నాలుగు రాష్ట్రాల నుంచీ దిగుమతి.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒడిశా నుంచి.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తమిళనాడు నుంచి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాకు గోవా నుంచి అక్రమంగా ఎన్డీపీఎల్ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీల ద్వారా ఇక్కడకు తరలిస్తున్నారు. మీడియం లిక్కర్‌ను కేసు (12 ఫుల్ బాటిల్స్) రూ.1,100 చొప్పున కొనుగోలు చేసి రాష్ట్రంలో రూ.4,200 చొప్పున అమ్ముతున్నారు. రోజుకు కనీసం 5 నుంచి 7 లారీల మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు అంచనా. చౌక మద్యంతో ప్రజల ఆరోగ్యానికి హాని ఉన్నా ఎక్సైజ్ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా చూస్తున్నారు. -
సర్కారు అండతో.. సిండికేటు దగా!
సాక్షి, హైదరాబాద్: మెమో నంబర్ 17,317. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు ఒకరికి ‘ముఖ్య’నేత నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన దసరా కానుక. ఎక్సైజ్ శాఖలో ఇప్పుడిది హాట్ టాపిక్. ‘ముఖ్య’ నేత అండదండలుంటే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కవచ్చని, కోట్లకు కోట్లు కొల్లగొట్టవచ్చని ఇది రుజువు చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో నాలుగు మద్యం దుకాణాలకు.. నారాయణవనంలో మూడు, పాలమంగళంలో ఒక షాపు ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయి. ఈ నాలుగు దుకాణాలకు లెసైన్స్‌లు కేటాయించడం కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం లాటరీ నిర్వహించగా దాదాపు 60 మంది వ్యాపారులు పోటీపడ్డారు. విచిత్రంగా ఈ నాలుగూ ఒకే కుటుంబానికి దక్కాయి. ఈ సిండికేటుకు అధినేత పి.గుణవంతరావు. తెలుగుదేశం జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు. ఆయన పేరిట ఒక షాపు, భార్య జ్యోతి పేరు మీద మరో దుకాణం, కుమారుడు గిరి, కోడలు కస్తూరి పేర్ల మీద చెరో దుకాణం వచ్చాయి. ఇలా ఒకే వ్యక్తికి నాలుగు దుకాణాలు రావడంతో ఎక్సైజ్ శాఖ తీరుపై అప్పట్లోనే పలు విమర్శలు వచ్చాయి. ఒక్కొక్క షాపుకు రూ.34 లక్షల చొప్పున లెసైన్స్ ఫీజును చెల్లించారు. ఇక్కడినుంచి అసలు కథ ప్రారంభమయ్యింది. నాలుగు దుకాణాల్లో.. భార్య పేరిట నారాయణవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన దుకాణం తెరవకముందే తెలుగు మహిళా సంఘం వారితో ఫిర్యాదు చేయించాడు. ఆ ఫిర్యాదునే సాకుగా చూపించి అసలు దుకాణమే తెరవలేదు.మూడు దుకాణాలతోనే వ్యాపారం నడిపించారు. ఎక్సైజ్ అధికారులు కూడా దుకాణం తెరవమని గుణవంతరావును ఒత్తిడి చేయలేదు. దాన్ని మరో ప్రాంతానికి మార్చడమో.. లేదా మరొకరికి అప్పగించడమో కూడా చేయలేదు. నాలుగు నెలలు గడిచిన తరువాత గుణవంతరావు ఆ దుకాణం తాను నడపలేనని, దుకాణం కోసం తాను చెల్లించిన రూ.34 లక్షల లెసైన్స్ ఫీజును తిరిగివ్వాలని కోరుతూ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మీకు లెసైన్స్ కేటాయించామని, దుకాణం నడకపోవడం మీ తప్పేనని, మీరు దుకాణం నడపకపోవడంతో మద్యం విక్రయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రాకుండా పోయిందని చెప్తూ ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ ఆయన వినతిని తిరస్కరించారు. దీనితో ‘ముఖ్య’నేత రంగంలోకి దిగారు. పట్టుబట్టి ఆ ఫైల్‌ను ఓకే చేయించడంతో గత సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం గుణవంతరావుకు రూ.34 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తూ మెమో నంబర్ 17,317ను జారీ చేసింది. మరో రూ.2 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి! గత ఏడాది ఆయన నడిపించిన 3 మద్యం దుకాణాలూ తమ లెసైన్స్ ఫీజుకు 6 రెట్లు అంటే రూ 2.04 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిపినట్టు ఎక్సైజ్ రికార్డులు చెప్తున్నాయి. అయినా గుణవంతరావు ఈ ఏడాది 2 దుకాణాల లెసైన్స్‌లను పునరుద్ధరించుకోలేదు. తన పేరిట ఉన్న దుకాణాన్నే నడపుతున్నారు. అంటే మొత్తం 3 మద్యం దుకాణాలను మూతేశారు. ‘ముఖ్య’నేత అండదండలుండటంతో ఇక్కడ మరెవరూ తనకు పోటీ రాకుండా గుణవంతరావు చక్రం తిప్పారనే అనుమానాలున్నాయి. ఈ విధంగా ఆయన రూ.1.02 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అంటున్నారు. మద్యం విక్రయాలు జరగకపోవడం వలన మరో రూ.కోటి వరకు ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతుందని అంచనా. పథకం ప్రకారం ఖజానాకు గండికొడుతున్న లిక్కర్ సిండికేటుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా అండగా నిలబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. నారాయణవనం మండలంలో మంచి పట్టున్న గుణవంతరావు సహకార, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించినందుకు ప్రతిఫలంగానే ‘ముఖ్య’నేత ఈ నజరానా ఇచ్చారని, ఎక్సైజ్ శాఖలో అవినీతిపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ కమిషనర్ ఈ విషయంలో తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
లిక్కర్ సిండికేట్లకు రెక్కలు
మంత్రుల కనుసన్నల్లో అక్రమ దందా! యథేచ్చగా గరిష్ట చిల్లర ధర ఉల్లంఘన... ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రం బాధ్యులైన అధికారులపై చర్యలకు కమిషనర్ సమాయత్తం కమిషనర్‌నే బదిలీ చేయించే పనిలో సిండికేట్ల ‘పెద్దలు’ సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేటు మళ్లీ రెక్కలు విప్పింది. తెలంగాణపై నిర్ణయానంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అదనుగా, ఎక్సైజ్ కమిషనర్ బదిలీైపై వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో యథేచ్చగా ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతోంది. క్వార్టర్ మద్యం సీసాకు ఏకంగా రూ.30 వరకు, ఫుల్‌బాటిల్ మీద రూ.80 వరకు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తేలింది. ఇటీవల మద్యం విక్రయాల రేటు గణనీయంగా పడిపోవడంతో అనుమానం వచ్చిన కమిషన ర్ సమీర్‌శర్మ మద్యం విక్రయాల తీరుపై రహస్య విచారణ జరిపించడంతో సిండి‘కేటు’ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఆయన చర్యలకు సిద్ధమవుతుండటంతో ఏకంగా కమిషనర్‌నే బదిలీపై పంపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రముఖ నేత అయిన మంత్రి, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పలు జిల్లాల నుంచి అందిన లిఖితపూర్వక, ఫోన్ ఫిర్యాదుల ఆధారంగా గత జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగిన మద్యం విక్రయాల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనపై ఆయన విచారణ చేయించారు. ఊహించని విధంగా లిక్కర్ సిండికేటు బలపడినట్టు, పెద్దయెత్తున ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో ప్రముఖుడు లిక్కర్ సిండికేటుకు ఊతమిస్తున్నట్టు తేలింది. తెలంగాణ జిల్లాల్లోనూ నెల రోజుల నుంచి మద్యం విక్రయాలలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్లపై చర్యలకు సిద్ధం ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ కమిషనర్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఎమార్పీ ఉల్లంఘన కేసులో రెండుకంటే ఎక్కువసార్లు చార్జి మెమోలు అందుకున్న ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని, రెండు మెమోలు అందుకున్నవారిని బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే జరిగితే దాదాపు 12 మంది ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు, 30 మంది అధికారులపై బదిలీ వేటు పడనుంది. దీంతో కమిషనర్‌నే బదిలీపై పంపాలని ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ప్రముఖ నేత, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సమీర్‌శర్మను తమ రాష్ట్రానికి పంపాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కోరుతున్నందున ఆయన్ను అక్కడికి పంపించేందుకు అనుమతించాలని వీరు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్ట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు మంత్రులకు సీఎంతో సరైన సఖ్యత లేకపోవడంతో ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. చర్యలు తీసుకోబోతున్నారనే సమాచారంతో 100 మందికి పైగా ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్లు గురువారం హైదరాబాద్‌లో కమిషనర్‌ను కలిశారు. దుకాణాల్లో పనిచేసే నౌకరి నామాలు (వర్కర్లు) ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే తమను బాధ్యులను చేయడం తగదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోందని నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మద్యం విక్రయాలు కూడా తగ్గాయి. విచారణ జరిపితే ఉల్లంఘన నిజమే అని తేలింది. ఉల్లంఘనలను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయడమో... బదిలీ చేయడమో జరుగుతుంది..’ అని కమిషనర్ సమీర్‌శర్మ స్పష్టం చేశారు. -
మద్యం మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతోంది