రేయిని బట్టి | Retailers 'freedom' of the excise officials | Sakshi
Sakshi News home page

రేయిని బట్టి

Published Sun, Jan 4 2015 12:52 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

రేయిని బట్టి - Sakshi

రేయిని బట్టి

జిల్లాలో లిక్కర్ సిండికేటుకు మళ్లీ జీవం
‘సాక్షి’ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడి
జిల్లా వ్యాప్తంగా  52 దుకాణాల్లో శాంపిల్స్ సేకరణ
ప్రతి క్వార్టర్ మీద కనిష్టంగా రూ.5 అదనం
జోగిపేటలో రాత్రి అవుతున్న కొద్దీ మద్యం ధరకు రెక్కలు
పల్లీలు, పుట్నాల పేరుతో చిల్లర దోపిడీ
వ్యాపారులకు ‘స్వేచ్ఛ’ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లిక్కర్ సిండికేటు జిల్లాలో మళ్లీ జీవం పోసుకుంది. అవినీతి నిరోధక శాఖ దెబ్బకు రెండేళ్లుగా కొద్దిగా తగ్గినా...!  కొత్త రాష్ట్రం ఏర్పాటు వెసులుబాటుతో మళ్లీ పాత జమానా మొదలైంది. మద్యం దుకాణాల యజమానులు ప్రాంతాల వారీగా సిండికేటు కట్టారు. మద్యం  ఎమ్మార్పీ నిబంధనను ఉల్లంఘించి క్వార్టర్ మీద రూ. 5 పెంచి అమ్ముతున్నారు.

ఏసీబీ దాడులు.. కేసుల నేపథ్యంలో కొంతకాలం భయం నటించిన ఎక్సైజ్ అధికారులు, తాజాగా జూలు విధిల్చారు. లిక్కర్ సిండికేటుకు అండగా నిలబడ్డారు. పీడించకుండా అందిన కాడికి దండుకోం డని సలహా ఇచ్చారు. అధికారుల మాటతో మద్యం వ్యాపారులు ఓ రేటు ‘ఫిక్స్’ చేశారు. అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి  సేకరించిన సమాచారం మేరకు..  క్వార్టర్ మద్యం సీసాకు రూ.5, అంత కంటే ఎక్కువ పరిమాణంలోని మద్యం బాటిళ్లకు వీలును బట్టి అదనంగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఎమ్మార్పీని ( గరిష్ట చిల్లర ధర) మించి మద్యం అమ్ముతున్నారని, ఎక్సైజ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం ‘సాక్షి’  క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించి 52 మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసింది.

సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట , నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ప్రతి క్వార్టర్ మీద రూ.5 అదనంగా తీసుకోగా, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్, దుబ్బాకలో ‘చిల్లర’ దోపీడీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. క్వార్టర్, ఫుల్ బాటిళ్లను కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ. 5, రూ.10, రూ.15 వరకు చిల్లర ఇవ్వాల్సి వస్తే వాటికి బదులుగా వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, పల్లీలు, పుట్నాలు అంటగడుతున్నారు. జోగిపేటలో రేయిని బట్టి మద్యం రేటు పెరుగుతోంది.
 
రాత్రిని బట్టీ రేటు....
జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చీకటి పడుతుంటే మద్యం ధర పెరుగుతుంది. సాధారణంగానే ప్రతి దుకాణంలో ఎమ్మార్పీ మీద రూ.5 ఎక్కువ గా తీసుకుంటున్నారు. దుకాణం మూసిన తర్వాతదుకాణం పక్కనే ఉన్న చిన్న దుకాణంలోకి సరుకు పెడతారు. ఈ దుకాణం తెల్లవార్లూ నడుస్తూనే ఉంటుంది. అయితే రేటు మాత్రం స్థిరంగా ఉండదు. డిమాండ్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది.
     
జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్టు షాపులు కూడా ఎక్కువగానే  కొనసాగుతున్నాయి. ప్రతి బ్రాండ్‌పై రూ.10 నుంచి రూ.15 అదనంగా తీసుకుంటున్నారు. బెల్టు దుకాణాలు మద్యం దుకాణాల యాజమాన్యం కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. మొత్తం దుకాణాలను ఒకే ఒక సిండికేటు నాయకుడు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఖేడ్‌లో మద్యం కొంటే జేబులు ఖాళీ
నారాయణఖేడ్‌లో 4 మద్యం దుకాణాలున్నాయి. ఓసీ క్వార్టరుకు రూ.85 ధర ఉండగా రూ.95, ఏసీపీ ఆఫ్ బాటిల్‌కు రూ.215 ఉండగా రూ.225, రాయల్ స్టాగ్ క్వార్టర్ రూ.145 ఉండగా రూ.150, బీరు రూ.95 ఉండగా రూ.100లకు విక్రయిస్తున్నారు. అదనంగా డబ్బు వసూలు చేయడంతో ఓ వినియోగదారుడు ‘సాక్షి’ బృందం ముందే దుకాణం మేనేజర్‌తో వాదనకు దిగారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం వ్యాపారం చేస్తుండడం వల్లే ఈ అదనపు మోతకు అంతులేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
సిద్దిపేటలో చిల్లర దందా
సిద్దిపేట మండల పరిధి, పట్టణ శివారులో 11 దుకాణాలు, చిన్నకోడూరు మండలంలో రెండు , నంగునూరు మండలంలో 2 మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం కోసం రూ .100 నోటు ఇచ్చి చిల్లర ఆశించడం అత్యాశే అవుతోంది.  చిల్లర బదులుగా పల్లీలు, పుట్నాలు చేతిలో పెడుతున్నారు. సిద్దిపేటలో జాతీయ రహదారి పక్కనే దాబాలు నడుస్తున్నాయి.

ఇక్కడ 24 గంటలు లిక్కర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ అనుమతి ఉన్న బార్లు రాత్రి 11 గంటలకు మూసి వేస్తున్నారు కానీ, ఇక్కడ నడుస్తున్న ‘అక్రమ బార్ల’కు సమయ పాలన అంటూ లేదు. బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని దుకాణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
 
గజ్వేల్‌లో ఇదో జిమ్మిక్కు....
గజ్వేల్‌లో విచిత్ర పరిస్థితి. ఎమ్మార్పీ ఉల్లంఘనఉన్నట్టు లేదు... లేనట్టు లేదు. ‘సాక్షి’బృందం సభ్యుడు  రూ.150  ఇచ్చి క్వార్టర్ రాయల్ స్టాగ్ కొనగా,. దాని ఎమ్మార్పీ రూ.145 ఉంది.  దుకాణ యజమాని తిరిగి ఇవ్వాల్సిన రూ. 5 చిల్లర ఇవ్వలేదు. చిల్లర ఇస్తారేమో అని కొద్ది సేపు నిలబడినా క్యాష్ మేనేజర్ నుంచి ఉలుకులేదు, పలుకు లేదు. ఈ సమయంలోనే ఒక వ్యక్తి ఎంసీ డైట్ ఫుల్ బాటిల్ కొన్నాడు. దాని ఎమ్మార్పీ ధర  రూ.430  ఉంది.  ఆయనకు చిల్లర ఇవ్వలేదు. ‘నాకు  రూ. 5 చిల్లర వస్తాయి కదా’ అని అడిగ్గా.. ఓ రకంగా చూస్తూ పల్లీ పాకెట్ చేతిలో పెట్టాడు.
 
పరాష్కం ఆడకురి......
మెదక్ పట్టణంలో 5 వైన్స్ షాపులుండగా ఇందులో 4 దుకాణాలు ఒక రాజకీయ నాయకుడి ఆధీనంలో సిండికేట్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా చిల్లర దోపిడీ కనిపించింది. రూ.100 వంద ఇచ్చి కింగ్ ఫిషర్ బీరు కొనగా, ఎమ్మార్పీ రూ 95 ఉంది. రూ.5  చిల్లర ఇవ్వమని అడిగితే రెండు ప్లాస్టిక్ గ్లాసులు ఇచ్చారు. బిల్లు ఇవ్వమని అడిగితే ‘‘నువ్వు కొన్న ఒక్క సీసాకు బిల్లు కావాలా?’’ అని వెటకారం ఆడారు. ‘పోనీ కేసు కొంటాం బిల్లు ఇస్తావా?’ అని అడిగితే ‘‘బేరం వచ్చేటప్పుడు పరాష్కం ఆడకు పో...,  తీసుకుంటే తీసుకో లేకుంటే ఆడ పడేసి పో’’  అంటూ విసుక్కున్నారు.
 
జహీరాబాద్‌లో జేబులు గుళ్ల.....
జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో కలిపి 12 వైన్స్ దుకాణాలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలో 8, కోహీర్‌లో 2, న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో ఒక్కోటి చొప్పున దుకాణాలున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో దాదాపు అన్ని వైన్స్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే బాటిల్‌పై రూ.5 అదనంగా తీసుకున్నట్లు తేలింది.  
 
అంతా మా ఇష్టం
‘సాక్షి’ బృందం సభ్యులు  ఓ ఔత్సాహిక మద్యం వినియోగదారునితో  సిగ్నేచర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయించారు. సదరు వినియోగ దారుడు  క్వార్టర్ ఎంతా అని అడిగితే రూ. 215 అని దుకాణ నిర్వాహకుడు తెలిపారు. ఫుల్‌బాటిల్ ఇవ్వాలని రూ. 1000 నోటిస్తే దుకాణ నిర్వాహకుడు రూ.120 ఇచ్చారు. దాని ఎమ్మార్పీ రూ. 860 ఉంది. ఇదేం లెక్క అంటే అది అంతే అన్నారు.  మండల కేంద్రాల్లో అయితే ఎక్సైజ్ అధికారుల అజమాయిషీ ఉండదు కాబట్టి వైన్స్ నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారని అనుకోవచ్చు, డిప్యూటీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంటు కమిషనర్ ఉండే జిల్లా కేంద్రంలోనే దందా కొనసాగుతుందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు.
 
తనిఖీలు చేస్తున్నాం
ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితేనే కేసులు నమోదుచేస్తాం. ఇటీవల నారాయణఖేడ్, పటాన్‌చెరు ప్రాంతాల్లో పలు దుకాణాలపై కేసులు పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌షాపులు నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. వైన్స్‌లో కేవలం మద్యం మాత్రమే విక్రయించాలి. నీళ్ల బాటిళ్లు, గ్లాసులు, ఇతర తినుబండారాలు విక్రయించకూడదు.  
- సయ్యద్ యాసిన్ ఖురేషి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement