
సర్కారు అండతో.. సిండికేటు దగా!
సాక్షి, హైదరాబాద్: మెమో నంబర్ 17,317. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు ఒకరికి ‘ముఖ్య’నేత నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన దసరా కానుక. ఎక్సైజ్ శాఖలో ఇప్పుడిది హాట్ టాపిక్. ‘ముఖ్య’ నేత అండదండలుంటే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కవచ్చని, కోట్లకు కోట్లు కొల్లగొట్టవచ్చని ఇది రుజువు చేస్తోంది.
వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో నాలుగు మద్యం దుకాణాలకు.. నారాయణవనంలో మూడు, పాలమంగళంలో ఒక షాపు ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయి. ఈ నాలుగు దుకాణాలకు లెసైన్స్‌లు కేటాయించడం కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం లాటరీ నిర్వహించగా దాదాపు 60 మంది వ్యాపారులు పోటీపడ్డారు. విచిత్రంగా ఈ నాలుగూ ఒకే కుటుంబానికి దక్కాయి.
ఈ సిండికేటుకు అధినేత పి.గుణవంతరావు. తెలుగుదేశం జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు. ఆయన పేరిట ఒక షాపు, భార్య జ్యోతి పేరు మీద మరో దుకాణం, కుమారుడు గిరి, కోడలు కస్తూరి పేర్ల మీద చెరో దుకాణం వచ్చాయి. ఇలా ఒకే వ్యక్తికి నాలుగు దుకాణాలు రావడంతో ఎక్సైజ్ శాఖ తీరుపై అప్పట్లోనే పలు విమర్శలు వచ్చాయి. ఒక్కొక్క షాపుకు రూ.34 లక్షల చొప్పున లెసైన్స్ ఫీజును చెల్లించారు. ఇక్కడినుంచి అసలు కథ ప్రారంభమయ్యింది. నాలుగు దుకాణాల్లో.. భార్య పేరిట నారాయణవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన దుకాణం తెరవకముందే తెలుగు మహిళా సంఘం వారితో ఫిర్యాదు చేయించాడు.
ఆ ఫిర్యాదునే సాకుగా చూపించి అసలు దుకాణమే తెరవలేదు.మూడు దుకాణాలతోనే వ్యాపారం నడిపించారు. ఎక్సైజ్ అధికారులు కూడా దుకాణం తెరవమని గుణవంతరావును ఒత్తిడి చేయలేదు. దాన్ని మరో ప్రాంతానికి మార్చడమో.. లేదా మరొకరికి అప్పగించడమో కూడా చేయలేదు. నాలుగు నెలలు గడిచిన తరువాత గుణవంతరావు ఆ దుకాణం తాను నడపలేనని, దుకాణం కోసం తాను చెల్లించిన రూ.34 లక్షల లెసైన్స్ ఫీజును తిరిగివ్వాలని కోరుతూ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మీకు లెసైన్స్ కేటాయించామని, దుకాణం నడకపోవడం మీ తప్పేనని, మీరు దుకాణం నడపకపోవడంతో మద్యం విక్రయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రాకుండా పోయిందని చెప్తూ ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ ఆయన వినతిని తిరస్కరించారు. దీనితో ‘ముఖ్య’నేత రంగంలోకి దిగారు. పట్టుబట్టి ఆ ఫైల్‌ను ఓకే చేయించడంతో గత సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం గుణవంతరావుకు రూ.34 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తూ మెమో నంబర్ 17,317ను జారీ చేసింది.
మరో రూ.2 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి!
గత ఏడాది ఆయన నడిపించిన 3 మద్యం దుకాణాలూ తమ లెసైన్స్ ఫీజుకు 6 రెట్లు అంటే రూ 2.04 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిపినట్టు ఎక్సైజ్ రికార్డులు చెప్తున్నాయి. అయినా గుణవంతరావు ఈ ఏడాది 2 దుకాణాల లెసైన్స్‌లను పునరుద్ధరించుకోలేదు. తన పేరిట ఉన్న దుకాణాన్నే నడపుతున్నారు. అంటే మొత్తం 3 మద్యం దుకాణాలను మూతేశారు. ‘ముఖ్య’నేత అండదండలుండటంతో ఇక్కడ మరెవరూ తనకు పోటీ రాకుండా గుణవంతరావు చక్రం తిప్పారనే అనుమానాలున్నాయి.
ఈ విధంగా ఆయన రూ.1.02 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అంటున్నారు. మద్యం విక్రయాలు జరగకపోవడం వలన మరో రూ.కోటి వరకు ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతుందని అంచనా. పథకం ప్రకారం ఖజానాకు గండికొడుతున్న లిక్కర్ సిండికేటుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా అండగా నిలబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. నారాయణవనం మండలంలో మంచి పట్టున్న గుణవంతరావు సహకార, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించినందుకు ప్రతిఫలంగానే ‘ముఖ్య’నేత ఈ నజరానా ఇచ్చారని, ఎక్సైజ్ శాఖలో అవినీతిపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ కమిషనర్ ఈ విషయంలో తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.