
మంత్రి నిమ్మల నియోజకవర్గం పాలకొల్లులో బాటిల్‌పై రూ.10 అదనం
రాత్రి పది దాటితే రూ.20 పైమాటే
కూలింగ్ చార్జీలంటూ బీర్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు
ఎక్కడా నిబంధనలు పాటించని వ్యాపారులు
ఇష్టారాజ్యంగా సిట్టింగ్, బెల్టు షాపులు
వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా ధరలు పెంచే పనిలో లిక్కర్ సిండికేట్లు
ఇప్పటికే మద్యం ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం
ఇప్పుడు వ్యాపారుల పెంపుతో మందుబాబుల జేబులు గుల్ల
సాక్షి, భీమవరం: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మద్యం సిండికేట్ ఇష్టారాజ్యంగా మారింది. మందుబాబుల జేబులు గుల్ల చేస్తూ ఎంఆర్‌పీ ధరలకు మించి మద్యం అమ్ముతున్నారు. రాత్రి 10 దాటితే మరింత పెంచి అమ్ముతున్నారు. జిల్లాలో 175 మద్యం దుకాణాలుండగా పాలకొల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 వరకు ఉన్నాయి. షాపుల నిర్వహణ మొత్తం టీడీపీ నాయకుల సిండికేట్ పర్యవేక్షిస్తోంది. ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఎంఆర్‌పీ ధరలకు మించి వసూలు చేయకూడదు.
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలి. బెల్టు అమ్మకాలు, లూజ్ సేల్స్ చేయకూడదు. షాపుల వద్ద మద్యం సేవించే ఏర్పాట్లు చేయకూడదు. ఇక్కడ మాత్రం ఈ నిబంధనలేవీ ఉండవు. సిండికేట్‌దే రాజ్యం. వారు నిర్ణయించిన ధరలు వసూలు చేస్తారు. రాత్రీ పగలూ తేడా లేకుండా అమ్మేస్తున్నారు. పలుచోట్ల దుకాణాల వద్దే మద్యం సేవించేలా టేబుళ్లు, కుర్చీలు వేశారు.
మందులోకి సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు. పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ ఉంటాయి. మొత్తంగా చాలా షాపులు బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేస్తున్నారు. ప్రతి క్వార్టర్ బాటిల్‌కు ఎంఆర్‌పీపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. బీరుకు కూలింగ్ చార్జీలంటూ బాటిల్‌కు రూ.20 వరకు అదనంగా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
రాత్రి 10 దాటితే షాపు మూసివేసి వెనుక వైపు నుంచి బ్రాండ్‌ను బట్టి బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేసి అమ్ముతున్నారు. గ్రామగ్రామానా బెల్టు షాపులు, దుకాణాల వద్ద లూజ్ సేల్స్ నిరాఘాటంగా సాగిపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ అధికారులు వీటివైపు కన్నెత్తి చూడటంలేదు.
జిల్లా వ్యాప్తంగా అమలుకు యోచన
పాలకొల్లులో అదనంగా వసూళ్లు చేస్తుండటంతో జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నరసాపురం, ఉండి నియోజకవర్గాల్లో నిబంధనలు పాటించకుండా సిండికేట్లు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నాయి.
ఇప్పటికే బెల్టుషాపుల్లో బాటిల్‌పై రూ.10 పెంచి అమ్ముతున్నారు. నరసాపురం, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని షాపుల్లోనూ ధరలు పెంచి అమ్ముతున్నారు. మరో వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని షాపుల్లో అదనపు ధరలపై అమ్మకాలు చేసే ఆలోచనలో సిండికేట్ వర్గాలు ఉన్నట్టు తెలిసింది.
బాదుడే బాదుడు..
ఇప్పటికే ప్రభుత్వం లిక్కర్ సిండికేట్లకు మేలు చేసేలా అమ్మకాలపై 10 శాతం ఉన్న మార్జిన్‌ను 14 శాతానికి పెంచింది. ఆ భారాన్ని మందుబాబులపై మోపుతూ మద్యం ధరలను 15 శాతం వరకు పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు అధికంగా సేవించే రూ.120, రూ.130, రూ.150, రూ.180, రూ.190 క్వార్టర్ బాటిళ్లు రూ.10 వంతున పెరిగాయి.
దీనికి అదనంగా లిక్కర్ సిండికేట్ మరో రూ.10 పెంచి అమ్ముతోంది. తన నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నా మంత్రి నిమ్మల పట్టించుకోవడంలేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment