సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పర్యటనలో టీడీపీ నేతల వర్గ విభేదాలు బయటపడ్డాయి. మల్యాలలోని హంద్రీనీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు జయసూర్య, కేఈ శ్యాంబాబు పరిశీలించారు.
అయితే, మంత్రి రామానాయుడు పర్యటనకు టీడీపీ నాయకులు ఎంపీ బైరెడ్డి శబరి,టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ దూరంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు
మరోవైపు, ‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు వెళ్లగక్కారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చి వంద రోజులే అయ్యిందని, మమ్మల్ని ప్రశ్నించే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేశారో చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.
జగన్ తరఫున సాక్షి పత్రికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట వంద రోజుల పాలన పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పేపర్ చదవొద్దని చెప్పారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామన్నారు.
మహిళల నుంచి స్పందన నిల్..
రాష్ట్రంలో వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టామని.. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నిమ్మల వివరించగా కార్యక్రమానికి హాజరైన మహిళల్లో ఒక్కరు కూడా హర్షధ్వానాలు తెలుపకపోవడం మంత్రితో పాటు టీడీపీ నాయకులను విస్మయానికి గురిచేసింది.
అంతకుముందు మాట్లాడిన జనసేన నేత యు.ప్రేమ్‌కుమార్ మంత్రి గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు స్పందించలేదు. దీంతో ప్రేమ్‌కుమార్.. అమ్మా మీరు చప్పట్లు కొడితే మంత్రిగారిని అభినందించినట్లు అవుతుందని అనగా.. కొద్దిమంది మాత్రమే మొక్కుబడిగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment