భారీ దోపిడీకి పక్కా డీల్
మద్యం ఆదాయంలో అడిగినంత
ఇవ్వాల్సిందేనని టీడీపీ సిండికేట్ హుకుం
అంతా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యుల కనుసన్నల్లోనే..
లాటరీ ద్వారా లైసెన్స్ దక్కితే ఇవ్వాల్సిన కమీషన్ ఫిక్స్
లేదంటే దుకాణం వదిలేయాలని ఎక్కడికక్కడ బెదిరింపులు
మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకునే కుట్ర
నేడు లాటరీ ద్వారా లైసెన్సుల కేటాయింపు
లాటరీ ప్రక్రియను హైజాక్ చేసేందుకూ ఎత్తుగడ
లైసెన్స్ దక్కకపోతే గొడవలు, దాడులకూ వ్యూహం
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్‌లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు.
అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు.
‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది.
అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ.
ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్‌కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది.
నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం
⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.
⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు.
⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్‌రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు.
అంతటా అవే బెదిరింపులు
⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది.
⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు.
⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్‌గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్‌రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది.
⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్‌కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు.
⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్‌గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు.
⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్‌కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది.
⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్‌గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్‌వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది.
దుకాణానికి 26 దరఖాస్తులే..
రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.
‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..
మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు.
ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర.
రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం
⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్‌లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.
⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు.
⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.
భారీ దోపిడీకి పక్కా డీల్
భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్‌పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు.
అందులో ఒక్కో బాటిల్‌పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్‌లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది.
Comments
Please login to add a commentAdd a comment