మంత్రుల కనుసన్నల్లో అక్రమ దందా!
యథేచ్చగా గరిష్ట చిల్లర ధర ఉల్లంఘన...
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రం
బాధ్యులైన అధికారులపై చర్యలకు కమిషనర్ సమాయత్తం
కమిషనర్‌నే బదిలీ చేయించే పనిలో సిండికేట్ల ‘పెద్దలు’
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేటు మళ్లీ రెక్కలు విప్పింది. తెలంగాణపై నిర్ణయానంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అదనుగా, ఎక్సైజ్ కమిషనర్ బదిలీైపై వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో యథేచ్చగా ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతోంది. క్వార్టర్ మద్యం సీసాకు ఏకంగా రూ.30 వరకు, ఫుల్‌బాటిల్ మీద రూ.80 వరకు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తేలింది. ఇటీవల మద్యం విక్రయాల రేటు గణనీయంగా పడిపోవడంతో అనుమానం వచ్చిన కమిషన ర్ సమీర్‌శర్మ మద్యం విక్రయాల తీరుపై రహస్య విచారణ జరిపించడంతో సిండి‘కేటు’ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఆయన చర్యలకు సిద్ధమవుతుండటంతో ఏకంగా కమిషనర్‌నే బదిలీపై పంపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రముఖ నేత అయిన మంత్రి, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
పలు జిల్లాల నుంచి అందిన లిఖితపూర్వక, ఫోన్ ఫిర్యాదుల ఆధారంగా గత జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగిన మద్యం విక్రయాల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనపై ఆయన విచారణ చేయించారు. ఊహించని విధంగా లిక్కర్ సిండికేటు బలపడినట్టు, పెద్దయెత్తున ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో ప్రముఖుడు లిక్కర్ సిండికేటుకు ఊతమిస్తున్నట్టు తేలింది. తెలంగాణ జిల్లాల్లోనూ నెల రోజుల నుంచి మద్యం విక్రయాలలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇన్‌స్పెక్టర్లపై చర్యలకు సిద్ధం
ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ కమిషనర్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఎమార్పీ ఉల్లంఘన కేసులో రెండుకంటే ఎక్కువసార్లు చార్జి మెమోలు అందుకున్న ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని, రెండు మెమోలు అందుకున్నవారిని బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే జరిగితే దాదాపు 12 మంది ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు, 30 మంది అధికారులపై బదిలీ వేటు పడనుంది. దీంతో కమిషనర్‌నే బదిలీపై పంపాలని ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ప్రముఖ నేత, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సమీర్‌శర్మను తమ రాష్ట్రానికి పంపాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కోరుతున్నందున ఆయన్ను అక్కడికి పంపించేందుకు అనుమతించాలని వీరు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్ట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు మంత్రులకు సీఎంతో సరైన సఖ్యత లేకపోవడంతో ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. చర్యలు తీసుకోబోతున్నారనే సమాచారంతో 100 మందికి పైగా ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్లు గురువారం హైదరాబాద్‌లో కమిషనర్‌ను కలిశారు. దుకాణాల్లో పనిచేసే నౌకరి నామాలు (వర్కర్లు) ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే తమను బాధ్యులను చేయడం తగదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోందని నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మద్యం విక్రయాలు కూడా తగ్గాయి. విచారణ జరిపితే ఉల్లంఘన నిజమే అని తేలింది. ఉల్లంఘనలను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయడమో... బదిలీ చేయడమో జరుగుతుంది..’ అని కమిషనర్ సమీర్‌శర్మ స్పష్టం చేశారు.
లిక్కర్ సిండికేట్లకు రెక్కలు
Published Sat, Sep 21 2013 1:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement