MRP
-
ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగు. పురుషుల ఫ్యాషన్ వస్తువులను తయారు చేసే ఇటాలియన్ కంపెనీ ‘బిలియనీర్ కూటూర్’ దీనిని ప్రత్యేకంగా మొసలి తోలుతో రూపొందించింది. దీనిని కొనుగోలు చేయాలంటే, ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ల ఒత్తిడి పెరిగితే, ఈ గొడుగు చేతికి అందడం కొంత ఆలస్యం కూడా కావచ్చు.‘బిలియనీర్ కూటూర్’ తయారు చేసే విలాసవంతమైన వస్తువుల కోసం పోటీపడే అపర కుబేరులు ఈ గొడుగు కోసం కూడా పోటీ పడుతున్నారు. దీని ధర 50 వేల డాలర్లు (రూ.41.54 లక్షలు). అత్యంత ఖరీదైన గొడుగుల్లో ఇప్పటి వరకు ఈ మొసలి తోలు గొడుగుదే రికార్డు. ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఇప్పటి వరకు ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.ఇవి చదవండి: ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే? -
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి
మనం నిత్యజీవితంలో ప్రతి రోజూ బస్ స్టేషన్స్‌లో, రైల్వే స్టేషన్స్ వద్ద లేదా ఇతర ప్రాంతాలలో MRP ధరలకే అన్ని అందుబాటులో ఉంటాయనే బోర్డులు చూస్తూనే ఉంటాము. అయితే దుకాణదారుడు నిర్దేశించిన ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మీరు లీగల్ మెట్రాలజీ విభాగానికి కంప్లైంట్ చేయవచ్చు. భారతదేశంలో ఒక దుకాణదారుడు రిటైల్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే అది చట్టవిరుద్ధం, దీనిపైన బాధితుడు కంప్లైట్ చేస్తే తప్పకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం.. ఉత్పత్తి మీద లేదా వస్తువు మీద ముద్రించిన ధరకే విక్రయాలు జరపాలి. (ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!) నిజానికి ఒక వస్తువు రిటైల్ ప్రైస్ అనేది కొనుగోలు చేయడానికి కస్టమర్‌కు ఛార్జ్ చేసిన ధర. ఇందులో అన్ని పన్నులు, ఉత్పత్తి ఖర్చు, రవాణా, తయారీదారుకు అయ్యే ఖర్చు వంటివి లెక్కించి నిర్దారిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారుని స్పష్టత కోసం ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు. ఎమ్ఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎలా కంప్లైంట్ చేయాలి? దుకాణదారుడు మీకు నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించాడని తెలిసినప్పుడు లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000/ 1915కి కాల్ చేయవచ్చు, లేదా మీ జిల్లాలోని కన్జ్యుమర్ ఫోరమ్‌లో కంప్లైంట్ చేయవచ్చు. బాధితుడు 8800001915కు SMS పంపవచ్చు లేదా NCH యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కాల్, ఎస్ఎమ్ఎస్ వద్దనుకున్నప్పుడు https://consumerhelpline.gov.in/user/signup.php ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. దీనికి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. మీరు కంప్లైంట్ చేయడానికి పైన అన్ని మార్గాలను అనుసరించినప్పటికీ సమాధానం రానప్పుడు NCDRC వెబ్సైట్, స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ కమిషన్ వంటి వినియోగదారు కమిషన్‌ను సంప్రదించవచ్చు. విచారణ తరువాత కూడా దుకాణదారుడు మళ్ళీ అలాంటి ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా బాధితుడు కూడా భారీ మొత్తంలో నష్టపరిహారం పొందవచ్చు. -
ప్యాకేజ్డ్ కమోడిటీ: అంకెల మాయాజాలానికి చెక్
న్యూఢిల్లీ: బిస్కెట్ ప్యాకెట్‌పై బరువు ఎంత ఉందని చూస్తే.. 88 గ్రాములుగా కనిపిస్తుంది. అదే గోధుమ పిండి ప్యాకెట్ 3.5 కేజీలతో ఉంటుంది. ఈ తరహా అనుభవాలు వినియోగదారులకు సర్వ సాధారణం. ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత కనిపించదు. దీనివల్ల ధరలను పోల్చుకోవడం వినియోగదారులకు సాధ్యపడదు. అందుకనే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసరాల ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్కులను అనుసరిస్తుంటాయి. కానీ, ఇకపై ఇవి కుదరవు. ప్రతీ ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) ఉండాల్సిందే. అలాగే, యూనిట్ ధర ఎంతన్నదీ ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీలు) నిబంధనలు, 2011కు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సవరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సంబంధిత శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ధరలు ఇలా ముద్రించాలి.. కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్పీతోపాటు. ఒక కిలో ధర ఎంతన్నదీ ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై ఎంఆర్పీతోపాటు.. ఒక గ్రాము ధర ఎంతన్నదీ ప్రచురించాలి. ఏ పరిమాణంలో అయినా సరే.. షెడ్యూల్2 రద్దు కానుంది. కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5కిలోల పరిమాణాల్లోనే 19 రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్2 నిర్ధేశిస్తోంది. వీటికి భిన్నమైన పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో.. కంపెనీలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణ తీసుకొచ్చారు. రూపాయిల్లో పేర్కొంటే చాలు.. ప్రస్తుతం ఉత్పత్తులపై ఎంఆర్పీని పైసలతోపాటు పేర్కొనాల్సి ఉండగా.. ఇకమీదట రూపీల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. అలాగే, ప్యాకెట్‌పై నంబర్లలో లేదా యూనిట్లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదంటే ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. ఇక దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక మీదట తయారీ తేదీ ఒక్కటే తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తయారీతేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకొచ్చారు. -
మద్యం వ్యాపారులకు షాక్
లక్నో : మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై యూపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్ధేశిత ఎంఆర్పీపై ఎట్టిపరిస్థితుల్లోనూ అధిక ధరలకు విక్రయించరాదని ఎక్సైజ్ మంత్రి రాంనరేష్ అగ్రిహోత్రి ఆదేశించారు. ఈ మేరకు కఠిన ఉత్తర్వులు జారీ చేశామని, మద్యం కొనుగోలు చేసేవారు బాటిల్స్‌పై ముద్రించిన ఎంఆర్పీ పరిశీలించాకే నగదు చెల్లించాలని..అంతకుమించి మద్యం విక్రేతకు చెల్లించవద్దని ప్రిన్సిపల్ కార్యదర్శి (ఎక్సైజ్) సంజయ్ తెలిపారు. మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడితే రూ 75,000 రెండోసారి పట్టుబడితే రూ 1.5 లక్షల జరిమానా విధిస్తామని, మూడోసారి ఇదే నేరానికి పాల్పడితే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ జిల్లా, క్షేత్రస్ధాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చదవండి : మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు -
కేసులే.. ఫైన్లు లేవ్..
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్లలో ఎమ్మార్పీ అమలు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం ప్యాకేజ్డ్ కమొడిటీస్ చట్టం అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ నెల 1 నుంచి ఎమ్మార్పీ అమలు చేయాలని ఆయా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన సైతం కల్పించినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారింది. నిబంధనల అమలుపై నిరంతర తనిఖీలు చేపడతామని హెచ్చరించినా కనీస స్పందన కరువైంది.దీనిని తీవ్రంగా పరిగణించిన తూనికలు, కొలతల శాఖ ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై దాడులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 107 కేసులు నమోదు గ్రేటర్ పరిధిలో మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో ఎమ్మార్పీ నిబంధనల ఉల్లంఘనపై తూనికలు, కొలతల శాఖ అధికారులు ఇప్పటి వరకు 107 కేసులు నమోదు చేశారు. నగరంలో సుమారు 28 మల్టీప్లెక్స్‌లు ఉండగా ఈ నెల 2న, 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించి, 18 థియేటర్లపై 54 కేసులు నమోదు చేసింది. 3న 8 మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 6 మల్టీప్లెక్స్‌లపై 19 కేసులు, 21 సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించి14 థియేటర్లపై 17 కేసులు నమోదు చేశారు. తాజాగా ఆదివారం 17 మల్టీప్లెక్స్‌లలో రెండో దఫా తనిఖీలు నిర్వహించగా నిబంధనలు పాటించని 12 మల్టీప్లెక్స్‌లపై 17 కేసులు నమోదు చేశారు. ఫిర్యాదుల వెల్లువ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి తూనికల కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబర్, వాట్సప్ నంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. రెండురోజుల్లోనే దాదాపు రెండు వందలకు పైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించకుండా ఎమ్మార్పీకి మించి ధరలు వసూ లు చేస్తే వాట్సప్ నంబర్ 7330774444, టోల్ ఫ్రీ నంబర్ 180042500333లకు ఫిర్యాదు చేయా లని తూనికలు, కొలతల శాఖ సూచించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లపై ఎక్కువగా ఫిర్యాదులు అందడం విశేషం. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని తూనికల కొలతల శాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కేసులు సరే... జరిమానా ఏదీ?... మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలుతల శాఖ కేవలం కేసుల నమోదుతో చేతులు దులుపుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష తప్పవని హెచ్చరించింది. కాగా మల్టీప్లెక్స్, థియేటర్లపై వరసగా రెండురోజులు జరిపిన దాడుల్లో నిబంధనల ఉల్లంఘనపై సుమారు 88 కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
వినియోగదారులను మోసం చేస్తే కేసు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్‌తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
ఎమ్మార్పీ ఉఫ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ విఫలమవుతోంది. ఎమ్మార్పీకి మించి జరుగుతున్న విక్రయాలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా వైన్స్‌ల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ మద్యం దుకాణాదారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం దుకాణాల యజమానులు దండుకోవడంలో ఆబ్కారీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. మద్యం దుకాణం నిర్వాహకులు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎమ్మార్పీపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. క్వార్టర్ సీసాకు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కు రూ.20, బీర్‌పై రూ.10 అదనంగా వారినుంచి నొక్కుతున్నారు. వైన్స్‌ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న వీరు.. గ్రామాల్లో మందుబాబులకు మరింత ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చూసీ చూడనట్లుగా.. జిల్లాలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 113, శంషాబాద్ ఈఎస్ పరిధిలో 74 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ (లైసెన్స్ ఫీజు) చెల్లించి కొనసాగుతున్న మద్యం దుకాణాలు విధిగా ఎమ్మార్పీని అమలు చేయాలి. ఈవిషయమై ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వైన్స్ దుకాణం ఎదుట మద్యం ధరల ఎమ్మార్పీలు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే బ్రాండ్, పరిమాణం వారీగా లిక్కర్ ధరలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ లిక్కర్ యాప్’ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అధిక ధరల అమ్మకాలపై సులభంగా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సైతం రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. ఇదంతా అమల్లోకి వచ్చినా అధిక ధరల నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తుండగా.. ఇంకొన్ని మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అక్కడి రూటే సపరేటు! జిల్లా పరిధిలోని మాడ్గుల మండల జనాభా సుమారు 50 వేలు. మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో మరో 11 అనుబంధ గ్రామాలు, 27 తండాలు ఉన్నాయి. ఈ పల్లెలన్నింటికీ స్థానిక వైన్స్ నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. వైన్స్ నిర్వాహకులే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి బెల్టు షాపులకు మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతివారం దాదాపు అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నా అటు ఆబ్కారీశాఖ అధికారులు గాని, సివిల్ పోలీసులుగాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మూడు హాఫ్‌లు.. ఆరు ఫుల్ బాటిళ్లు అన్నవిధంగా సాగుతున్నా దాడులు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రతినెలా వైన్స్ నిర్వాహకుల నుంచి మామూళ్లు పుచ్చుకుంటున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన మండలాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా సరఫరా లేకపోయినప్పటికీ ఎమ్మార్పీని తుంగలో తొక్కుతున్నారు. రెండు ఫిర్యాదులు అందాయి.. కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు అందాయని సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం తెలిపారు. రెండు చోట్ల దాడులు చేసి మద్యం దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంకేమైనా ఫిర్యాదులు అందింతే.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మార్పీకి మించి మద్యంపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, ఆకస్మికంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. వాస్తవంగా బెల్టు షాపులు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ ఉంటే నిర్వాహకులపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ నిర్వాహకులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. -
జీఎస్టీ స్టిక్కర్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: పాత పన్ను వ్యవస్థ కాలంలో తయారై, అమ్ముడుపోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కూడిన ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువిచ్చింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌తో ముగియాల్సి ఉంది. కానీ, నవంబరు 15 నుంచి 150కిపైగా వస్తువులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీంతో కొత్త స్టిక్కర్లను అతికించేందుకు గడువును మార్చి వరకు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లు నీళ్ల సీసాలను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టులో త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామని పాశ్వాన్ చెప్పారు. -
వాటర్ బాటిళ్లకు ఎమ్మార్పీ వర్తించదు!
సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. నీటిసీసాల అమ్మకాలకు ‘న్యాయబద్ధమైన కొలతలు, తూనికల చట్టం’ వర్తించదని జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హోటళ్లలో వస్తువుల అమ్మకంతోపాటు వినియోగదారులకు సేవలు కూడా అందుతాయనీ, ఎవ్వరూ కేవలం నీటిసీసాను కొనడానికే హోటళ్లకు వెళ్లరని వ్యాఖ్యానించింది. సేవలతోపాటు రెస్టారెంట్లలో ఉండే వాతావరణాన్ని ఆస్వాదించేందుకే వినియోగదారులు అక్కడకు వెళ్తారనీ, అందుకోసం యజమానులు పెట్టబుడి పెడుతుండటం వల్ల ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటు తీసుకోవచ్చంది. భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య వేసిన ఓ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. -
రెస్టారెంట్లకు, మాల్స్‌కు కేంద్రం తాజా ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రెస్టారెంట్లకు, మాల్స్‌కు, షాపింగ్ అవుట్లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది. వీరు అందించే ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే ఎంఆర్పీని ముద్రించే విధంగా ఆదేశాలు జారీచేయబోతుంది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థికమంత్రుల గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సీనియర్ అధికారి ధృవీకరించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన పూర్తిగా అన్ని ఉత్పత్తులపై ధరలు మారిపోయాయి. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని ఓ వైపు కేంద్రం చెబుతుంటే, వ్యాపారులు మాత్రం ధరలు బాదేస్తున్నారు. కొంతమంది రిటైలర్లు ఉత్పత్తుల ఎంఆర్పీ కంటే ఎక్కువగా జీఎస్టీ విధిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రుల గ్రూప్ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎంఆర్పీ అనేది గరిష్ట చిల్లర ధర అని, ఈ ధరకే రిటైలర్ ఉత్పత్తులను అమ్మాలని, దానికంటే అదనంగా ఏ ఛార్జీలు వేసినా నేరం చేసినట్టు గుర్తించాలని మంత్రుల గ్రూప్ సూచించింది. ఎంఆర్పీ కంటే ఏదీ ఎక్కువ అమ్మకూడని స్పష్టం చేసింది. వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. నవంబర్ 10న జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రుల ప్రతిపాదించిన ఈ సిఫారసును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించనుంది. -
జీఎస్టీని కలిపే ఎమ్మార్పీని ముద్రించాలి
న్యూఢిల్లీ: కచ్చితంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ను కలుపుకునే ఒక వస్తువు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను ముద్రించాలని జీఎస్టీ సవరణలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం సూచించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులనైనా మాల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు వంటి ఏ దుకాణంలోనైనా సరే ఎమ్మార్పీకి మించి అమ్మితే నేరంగా పరిగణించి కేసు నమోదు చేయాలని మంత్రివర్గ సంఘం స్పష్టం చేసింది. వస్తువు అసలు ధర ఎంత, దానిపై పడుతున్న పన్ను ఎంత, మొత్తం ధర ఎంత అనే విషయాలను వాణిజ్య సంస్థలు బిల్లుల్లో స్పష్టంగా ముద్రించాలనీ, వస్తువుపై ఉన్న ఎమ్మార్పీకన్నా మొత్తం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. అలాగే పన్ను రిటర్నుల దాఖలులో జాప్యమైతే ప్రస్తుతం జరిమానాగా రోజుకు రూ.100 విధిస్తుండగా, దానిని రూ.50కి తగ్గించాలని సిఫారసు చేసింది. నవంబర్ 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి గువాహటిలో సమావేశం కానుంది. మంత్రివర్గం సిఫారసులను ఆ భేటీలో జీఎస్టీ మండలి పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. అమలును వికేంద్రీకరించండి: బిమల్ దేశంలో పేద, ధనిక రాష్ట్రాల ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయనీ, కాబట్టి జీఎస్టీ అమలును వికేంద్రీకరించాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ బిమల్ జాలాన్ పేర్కొన్నారు. జీఎస్టీ సరిగ్గా అమలవ్వడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. జీఎస్టీ విధానంలో తక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు తక్కువ ఆదాయం, ఎక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వస్తుందని బిమల్ చెప్పారు. -
రేట్ల పెరుగుదలపై ప్రకటనలివ్వాలి
ట్రేడర్లు, వ్యాపార సంస్థలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రజానీకం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల ఎంఆర్పీ(గరిష్ట చిల్లర ధర) పెరిగిన పక్షంలో ఆ విషయం అందరికీ తెలిసేలా వ్యాపారులు, వ్యాపార సంస్థలు తక్షణం ప్రకటనలు జారీ చేయాలని కేంద్రం సూచించింది. సవరించిన ఎంఆర్పీని కనీసం రెండు స్థానిక దినపత్రికల్లో ప్రకటించాల్సి ఉంటుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన స్టాక్స్‌పై కొత్త ధరను స్టిక్కర్ రూపంలో అతికించి విక్రయించే వెసులుబాటు కల్పించినట్లు అధియా తెలిపారు. జీఎస్టీ విధానంలో నిర్ధిష్ట ఇన్వాయిస్ స్వరూపమేదీ నిర్దేశించ లేదన్నారు. అయితే, ఇన్వాయిస్లో సదరు ట్రేడరు జీఎస్టీఐఎన్, బిల్లు మొత్తం కచ్చితంగా ఉండాలని చెప్పారు. తప్పనిసరిగా డిజిటైజ్డ్ బిల్లు ఇవ్వాలనే నిబంధనేది పెట్టలేదని.. మాన్యువల్ ఇన్వాయిస్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించినట్లు వివరించారు. ప్రస్తుతం 11,000 పైచిలుకు ఉత్పత్తుల్లో ఒకోదానికి ప్రత్యేక కోడ్‌ను (హెచ్ఎస్ఎన్) కేటాయించామని, రూ. 1.5 కోట్ల పైగా టర్నోవరు గల వ్యాపార సంస్థలు ఇన్వాయిస్లలో దీన్ని పొందుపర్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రియ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీఈసీ) ఆవిష్కరించిన వెబ్సైట్లో వ్యాపార సంస్థలు ఈ కోడ్లను సెర్చి చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
ఎక్కడైనా ఒకటే రేటు
♦ స్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్‌ల రేట్లపై కేంద్రం నోటిఫికేషన్ ♦ మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లలో అధిక ధరలతో విక్రయాలకు చెక్ ♦ 2018 జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి న్యూఢిల్లీ: శీతల పానీయాలు, స్నాక్స్ మొదలైన వాటిని ఎక్కడైనా ఒకే ఎంఆర్పీకి విక్రయించాలని, ప్రదేశాన్ని బట్టి అధిక ధరలకు అమ్మరాదని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ద్వంద్వ ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) విధానాన్ని నిషేధిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. దీంతో జనవరి 1 నుంచి విమానాశ్రయాలు, హోటళ్లు, మాల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మొదలైన వాటిని అధిక రేటుకు విక్రయించడానికి ఉండదు. మహారాష్ట్ర లీగల్ మెట్రోలజీ ఆర్గనైజేషన్ (ఎల్ఎంవో) విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ద్వంద్వ ఎంఆర్పీ విధానాలు పాటించొద్దంటూ కోకకోలా, పెప్సీ, రెడ్ బుల్ తదితర వినియోగవస్తువుల తయారీ కంపెనీలకు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఎల్ఎంవో కొత్తగా నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆయా కంపెనీలు వివిధ మార్గాల్లో వీటిని దాటవేసేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో మొదలైన వాటిల్లో విక్రయించే స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి వాటి రేట్లకు.. మాల్స్, హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లాంటి ప్రదేశాల్లో విక్రయించే ధర మధ్య వ్యత్యాసముంటోంది. ప్రీమియం ప్రదేశాల్లో అమ్మే వాటికి వేరుగా అధిక ఎంఆర్పీ ముద్రించి కంపెనీలు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ విధానాలు కూడదంటూ గతంలోనూ అనేక సార్లు ఆదేశించినా ఇలాంటి రెండు రకాల ఎంఆర్పీ విధానంపై నిర్ధిష్ట చట్టంలో ప్రత్యేక నిబంధనలేమీ లేవంటూ పెద్ద కంపెనీలు కోర్టులకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేవని ఎల్ఎంవో కంట్రోలర్ అమితాబ్ గుప్తా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒకే ఉత్పత్తికి రెండు రకాల ఎంఆర్పీలు విధించకుండా సదరు చట్టాన్ని సవరించినట్లు చెప్పారు. ఒకవేళ కంపెనీలు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే... తమకు ఫిర్యాదు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు. -
కొత్త రేటు ముద్రించకపోతే చర్యలు
♦ జీఎస్టీపై తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరిక ♦ మూడు నెలల గడువుంటుందని వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తదనుగుణంగా ఉత్పత్తులన్నింటిపైనా సవరించిన గరిష్ట చిల్లర ధరను (ఎంఆర్పీ) ముద్రించకపోతే చర్యలు తప్పవని తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం సెప్టెంబర్ దాకా మూడు నెలల పాటు గడువు ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. గడువులోగా కొత్త రేట్లు ముద్రించని పక్షంలో తయారీ సంస్థలు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆయన ‘ట్వీటర్’లో పేర్కొన్నారు. జీఎస్టీ రాకతో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గగా, మరికొన్ని పెరిగాయని మంత్రి వివరించారు. తగ్గిన రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాల్సిందేనని, లేకపోతే చర్యలు ఉంటాయన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రేట్ల తీరుతెన్నుల గురించి కొనుగోలుదారులకు స్పష్టంగా తెలిసేలా ప్రతీ ఉత్పత్తిపై సవరించిన ధర ఉండాల్సిందేనని పాశ్వాన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ దాకా స్టిక్కర్స్ ఉపయోగించవచ్చు.. జీఎస్టీ అమలు తేదీకి ముందు అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ఉత్పత్తుల ధరలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రీప్యాకేజ్డ్ ఐటమ్స్‌పై ముద్రించిన ఎంఆర్పీకి పక్కనే జీఎస్టీ రాకతో మారిన కొత్త ధరను సూచించేలా స్టిక్కర్స్ రూపంలో అతికించి విక్రయించుకోవచ్చని సూచించింది. స్టాంపింగ్ లేదా స్టిక్కర్ వేయడం లేదా ఆన్లైన్ ప్రింటింగ్ రూపంలో కొత్త ఎంఆర్పీని తెలియజేయాల్సి ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, సెప్టెంబర్ 30 దాకా మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని.. ఆ తర్వాత కచ్చితంగా కొత్త రేటును ముద్రించే విక్రయించాలని, యాడ్ ఆన్ స్టిక్కర్స్‌ను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. మిగులు స్టాక్స్ ధరల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చాలా మటుకు సంస్థలకు దీంతో స్పష్టత లభించినట్లయింది. అమ్ముడవకుండా ఇంకా మిగిలిపోయిన స్టాక్స్ ధరలు పెరిగే పక్షంలో తయారీదారు లేదా ప్యాకర్ లేదా దిగుమతిదారు సదరు మార్పుల గురించి రెండు లేదా అంతకన్నా ఎక్కువ దినపత్రికల్లో కనీసం రెండు ప్రకటనలైనా ఇవ్వాల్సి ఉంటుంది. -
సినిమాహాల్స్, మాల్స్, ఎయిర్‌పోర్టులకు చెక్
న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే పన్ను ఎలానో ఒకే ఉత్పత్తి.. ఒకే ఎంఆర్పీ ఉండాలని కూడా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఒకే ఉత్పత్తిని వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ ధరల్లో విక్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒకే ఉత్పత్తి, ఒకే ఎంఆర్పీ అనే విధానాన్ని తీసుకొస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టులో, మాల్స్‌లో, సినిమా హాల్స్‌లో ఇన్నిరోజులు ఎంఆర్పీలో విపరీతంగా చెల్లించే ఛార్జీల నుంచి వినియోగదారులకు విముక్తి లభించనుంది. లీగల్ మెట్రోలాజీ(ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు 2011కు మార్పులు చేసిన ప్రభుత్వం 2018 జనవరి1 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. వీటిపై విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత సమతుల్య విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ పేర్కొంది. స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ పరిగణనలోకి తీసుకుని, వినియోగదారుల రక్షణను లక్ష్యంగా ఈ రూల్స్‌ను సవరణలు తీసుకొచ్చామన్నారు. ఈ నిబంధనల కింద ఎలాంటి వ్యక్తి వివిధ రకాల ఎంఆర్పీలు ఛార్జ్ చేయడానికి వీలులేదని కన్జ్యూమర్స్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. దీంతో సినిమా హాలు, ఎయిర్‌పోర్టులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మొత్తంలో ఎంఆర్పీలు వేస్తున్నారనే ఫిర్యాదుల నుంచి విముక్తి కలిగి, వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిసింది. అయితే ఈ రూల్స్ తమకు చెందవని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. జీఎస్టీ కింద వీటిని తాము అప్లయ్ చేయమని, ఈ తాజా నోటిఫికేషన్ కేవలం కౌంటర్లో కొనుగోలు చేసే రిటైల్ సర్వీసులకు మాత్రమేనని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాహుల్ సింగ్ చెప్పారు. స్టెంట్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, సిరంజీలు, ఆపరేషన్స్ టూల్స్ వంటి మెడికల్ సర్వీసుల ఎంఆర్పీలను కూడా బహిర్గతం చేయాలని కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. కచ్చితంగా వీటి ధరలను వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుందని డీఓపీ సెక్రటరీ జై ప్రియె ప్రకాశ్ చెప్పారు. దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై ఎంఆర్పీలను డిస్ ప్లే చేయరు. -
నిబంధనలు గాలికి..
► ఎమ్మార్పీ కంటే అధికరేట్లకు పుస్తకాల విక్రయాలు ► కార్పొరేట్ స్కూళ్లలో ఇదీ తీరు ► పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పాఠశాలలు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఆలయాలు. ప్రసుతం అవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు వాటి అర్థం మారుస్తున్నాయి. ఒక్కో తరగతికి ఒక్కో ధర నిర్ణయించి ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో పుస్తకాలను పాఠశాలల్లోనే విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి. టెక్నో, ఈటెక్నో, ఒలింపియాడ్ పేర్లతో మెటీరియల్ తయారు చేసినట్లు చెబుతూ వేలకు వేలు ఫీజులు గుంజుతున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు వాపోతున్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రచార ఆర్భాటాలతో ప్రైవేటు సంస్థలు విద్యార్థులను ఆకర్షిస్తాయి. వీరిని పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేవలం బోధన ఫీజు మాత్రమే అని చెబుతారు. తర్వాత అసలు కథ మొదలవుతుంది. అడ్మిషన్ ఫీజు చెల్లించాక మిగిలిన రసుంల గురించి వివరించటంతోపాటు పాఠ్యపుస్తకాలు కిట్ పాఠశాలలోనే కొనుగొలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు.చేసేదేంలేక అడిగినంత చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకూడదు. అయితే వీటిని పట్టించుకోకుండా విద్యార్థుల తల్లితండ్రులను దోచుకుంటున్నారు. దడపుట్టిస్తున్న ధరలు: పుస్తకాల ధరలు ఒక్కో పాఠశాలకు ఓ రేటు నిర్ణయించారు. కొన్ని పాఠశాలల్లో నర్సరీ పుస్తకాల కిట్ రూ.15 వందల నుంచి రూ.3 వేలు. యూకేజీకి రూ. 3200, ఎల్కేజీకి రూ. 3500. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు రూ. 4 వేల నుంచి రూ. 6500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ తదితర పేర్లు పెట్టి మరో వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ: నిబంధనలకు విరుద్ధంగా చాలా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు పుస్తకాలు విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యççపుస్తకాలు తక్కువ ధరలకు ఇస్తున్నా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం వేలకువేలు గుంజుతూ విద్యార్థుల తల్లితండ్రుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఇçప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పరిశీలిస్తాం: కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల్లో పుస్తకాల విక్రయం గురించి కడప డిప్యూటీ డీఈఓ జిలానీబాషాతో మాట్లాడగా సంబంధిత సమస్య మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వస్తువులపై ఇక ఎంఆర్పీ స్టాంప్ ఉండదా?
నిత్య వాడుకలో వినియోగించే వస్తువులపై ఇన్నిరోజులు కనిపించే ఎంఆర్పీ(మ్యాక్సిమర్ రిటైల్ ప్రైస్) లేబల్ ఇక మనకు కనిపించదు. గ్లోబల్ రిటైలర్లకు నిబంధనలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎంఆర్పీ స్టాంప్ కు శరాఘతం పలికేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఎంఆర్పీ ఉండాలనే నిబంధనను తీసివేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉందని కానీ స్టోర్‌లో అందించే ప్రతి వస్తువుపైనే ఎంఆర్పీ స్టాంప్ ఉండాలనే ప్రక్రియ చాలా గజిబిజిగా ఉందని సింగిల్ బ్రాండు రిటైలర్లు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. చాలా దేశాల్లో ఎంఆర్పీ ట్యాగ్ ఉండదు. కేవలం భారత్ లో మాత్రమే దీన్ని అమలుచేస్తున్నారు. వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయించకుండా.. సింగిల్ బ్రాండు స్టోర్లలో విక్రయించే వస్తువులపై ఎంఆర్పీ ట్యాగ్ కచ్చితమనే నిబంధనను వినియోగదారుల వ్యవహారాల డిపార్ట్ మెంట్ అమలుచేస్తోంది. చాలా స్టోర్లు ఎంఆర్పీ ధరల కంటే తక్కువగానే వస్తువులను విక్రయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఎంఆర్పీ ట్యాగ్ నే పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తీసివేయడానికి ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా భారత్ నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా కేంద్రబడ్జెట్ లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును తొలగిస్తున్నట్టు ప్రకటించి, ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత సులభతరం చేశారు. ప్రస్తుతం ఎంఆర్పీ ట్యాగ్ ను కూడా తొలగించి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
ఎమ్మార్పీకి మించితే రూ.5 లక్షల జరిమానా
మద్యం సిండికేట్ల వ్యవహారమంతా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) చుట్టూ తిరుగుతుంటుంది. మద్యం వ్యాపారులంతా కూటమి కట్టి మద్యం ధరలు పెంచి అమ్మడం సర్వసాధారణం. ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు మద్యం వ్యాపారులపై ఎమ్మార్పీ ఉల్లంఘన కేసు నమోదు చేస్తే రూ.5 లక్షల అపరాధ రుసుం (కాంపౌండింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న రూ.లక్ష వరకు ఉన్న ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఇటీవలే జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే చట్టం చేసేందుకు ఏపీ శాసనసభ ఆమోదించాలి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మద్యం వ్యాపారులకు విధించే అపరాధ రుసుం ఐదు రెట్లు కట్టాల్సి ఉంటుంది. -
మూణ్ణాళ్ల ముచ్చటే!
ఎమ్మార్పీకి మద్యం విక్రయం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలనుంది. రాజమండ్రిలో మద్యం మామూళ్ల పంపకాల్లో అధికార, మిత్రపక్షం నేతల మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికారపార్టీ కీలకనేత ఒకరు సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ తెరపైకి తీసుకువచ్చారు. త్వరలో జిల్లా పర్యటనకు వచ్చే దీనిపై చర్చించి షరా ‘మాములు’గానే అమ్మకాలను పునరుద్ధరిస్తారని సిండికేట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మండపేట : జిల్లాలో దాదాపు 504 వరకు మద్యం దుకాణాలు, 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారు రూ. 1.85 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా లిప్టింగ్ (మునుపటి ఏడాది నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయడం) విధానాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటు పరం చేసింది. అమ్మకాలను పెంచేందుకు ఎమ్మార్పీ, బెల్టుషాపుల ఏర్పాటు విషయాల్లో వ్యాపారులకు అధికారులు స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక్కో మద్యం బాటిల్‌పై రూ. 15 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తివేస్తామంటూ సీఎం చేసిన రెండవ సంతకాన్ని నీరు గారుస్తూ జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నందుకు, బెల్టుషాపుల ఏర్పాటుకు అటు ఎక్సైజ్, పోలీసులకు సిండికేట్ వర్గాలు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటున్నాయి. అది కాకుండా వారు తాజాగా అధికారపార్టీ ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ ఘటనతో.. ఐదు నెలల క్రితం విజయవాడలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అప్పట్లో ప్రభుత్వం ఎమ్మార్పీని అమలులోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షరా మామూలుగానే ఎమ్మార్పీకి మించి అమ్మకాలు మొదలైపోయాయి. అయితే మద్యం మామూళ్ల విషయంలో రాజమండ్రిలో అధికార, మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఈ విషయం అధికారపార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇటీవల సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దాంతో ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలివ్వడంతో ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీకి విక్రయాలు మళ్లీ అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని మద్యం సిండికేట్లు ఆ ముఖ్యనేతతో ఈ విషయమై సంప్రదించగా కొన్ని రోజుల పాటు ఎమ్మార్పీ కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంతో ఈ విషయం మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొద్ది రోజుల్లో షరా మాములుగానే అమ్మకాలు జరుగుతాయన్న ఆశతో సిండికేట్ వర్గాలుఉన్నాయి. -
మళ్లీ సప‘రేటు’
జిల్లాలో మద్యం వ్యాపారుల పంథా మారింది. వ్యాపారులు మళ్లీ సిండికేటు అవతారమెత్తారు. ఏసీబీ దాడులతో కొంత కాలంగా స్తబ్దుగా వ్యవహరించిన ‘మద్యం సిండికేట్లు’ తమ రూపాన్ని మార్చుకున్నారు. ‘హోల్‌సేల్-రిటైల్’ పేరుతో కొత్త రకం వ్యాపారానికి తెరతీశారు. గతంలో ఎమ్మార్పీ ధరలను ఉల్లంఫుంచిబాహాటంగానే లిక్కర్ దందా సాగించిన వ్యాపారులు ఈ సారి కొత్తరూటు వెతుక్కున్నారు. మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ వేస్తున్న ఎత్తులను వ్యాపారులు చిత్తు చేస్తున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ప్రోత్సాహంతోనే సిండికేట్లు మళ్లీ జీవం పోసుకున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. - నీలగిరి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్.. ప్రభుత్వం అమలు చేసిన కొత్త మద్యం పాలసీ వ్యాపారులకు కలిసిరాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేశారు. దుకాణాల వద్ద బాటిల్‌పై ము ద్రించిన (ఎమ్మార్పీ) ధరలకే మద్యం అమ్ముతున్న వ్యాపారులు బెల్టుషాపులను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామానికి కనీసం రెండు లేదా మూడు బెల్టుషాపులు న డుస్తున్నాయి. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు తాము కొనుగోలు చేసిన మ ద్యంపై ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి రూ.10 లు ఎక్కువ ధరకు అమ్ముతున్నా రు. గతంలో వ్యాపారులు పొందిన ఈ లాభాన్ని బెల్టుషాపులు ఆర్జిస్తుండటంతో వ్యాపారులు జీర్ణించులేకపోతున్నారు. దీంతో మండల, పట్టణ కేంద్రాల్లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి బెల్టుషాపులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సిండికేట్ జూలు విదుల్చుకుంది. కో దాడ సిండికేట్‌లో వ్యాపారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీతత్వం ఏర్పడి ఎమ్మారీ కంటే తక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటం గమనార్హం. దందా తీరిది.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే బ్రాండ్లు, వ్యాపారులకు డిసౌంట్ల రూపం లో కలి సొచ్చే బ్రాండ్లను మాత్రమే డిపోల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బెల్టుషాపులకు సరుకు అమ్మేటప్పుడు ఒక్కో బాటిల్‌పై ఎమ్మా ర్పీ మించి రూ.5 నుంచి 10 వసూలు చేస్తున్నా రు. గ్రామా ల్లో బెల్టుషాపులు వసూలు చేస్తున్న మొత్తాన్ని వ్యా పారులు దుకాణాల వద్దనే లాగేస్తున్నారు. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు కూడా వ్యాపారులు వసూలు చేస్తున్న దానిపై అదనంగా రూ.5లు పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. ఉదాహరణకు ఏదేని ఒక కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.110లు ఉన్న వాటిపై వ్యాపారులు రూ.10లు పెంచి బెల్టు షాపులకు అమ్ముతున్నారు. దీంతో దుకాణం వద్దనే క్వార్టర్ ధర రూ.120 లకు పెరుగుతుంది. అదేవిధంగా ఆఫ్ బాటిల్ ధర రూ.215 ఉన్న వాటిపై రూ.235 లకు, ఫుల్ బాటిల్ ధర రూ.430లు ఉన్న వాటిపై రూ. 40లు పెంచి రూ.470 లకు అమ్ముతున్నారు. దీనిని రాబట్టుకునేందుకు బెల్టుషాపు నిర్వహకులు క్వార్టర్ కు రూ.5 పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. అంటే దుకాణం వద్ద రూ.430లు ఉన్న ఫుల్ బాటిల్ ధర చేతుల మారి గ్రామానికి వచ్చే సరికి రూ.490 లకు చేరుతుంది. ఒక్కో బాటిల్‌పై నిర్ణయించిన ధర కంటే రూ.60లు ఎక్కువ అమ్ముతున్నారు. ఈ అక్రమ దందా వల్ల వ్యాపారులు, బెల్టుషాఫులు నడిపేవారు బాగుపడుతున్నా...మందుబాబుల జేబులకు చిల్లుపడుతున్నాయి. మామూళ్లే...మామూళ్లు.. అక్రమ మద్యం వ్యాపారం, సారా విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈఎస్ పరిధిలో ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించారు. కానీ ఈ రెండు వింగ్‌లు వ్యాపారుల అక్రమ దందాకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్ దందాలో అన్ని షాపుల సరుకు మొత్తం ఒకే దుకా ణం వద్ద నిల్వ ఉంచి బెల్టుషాపులకు అమ్ముతుంటారు. ఈ రెండు నిఘా వర్గాలు దాడి చేస్తే సిండికేట్ గుట్టును రట్టు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ అధికారులకు తెలిసే ఇదంతా జ రుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ విగ్ బెల్టుషాపులను వదిలేసి సారా విక్రయేతరల పైనే దాడులు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రోద్బలంతో జరుగుతున్నట్లు వస్తున్న ఈ ప్రచారంలో సివిల్ పోలీస్‌లకు భాగం ఉన్నట్లు వినికిడి. -
లిక్కర్ సిండికేట్లకు రెక్కలు
మంత్రుల కనుసన్నల్లో అక్రమ దందా! యథేచ్చగా గరిష్ట చిల్లర ధర ఉల్లంఘన... ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రం బాధ్యులైన అధికారులపై చర్యలకు కమిషనర్ సమాయత్తం కమిషనర్‌నే బదిలీ చేయించే పనిలో సిండికేట్ల ‘పెద్దలు’ సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేటు మళ్లీ రెక్కలు విప్పింది. తెలంగాణపై నిర్ణయానంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అదనుగా, ఎక్సైజ్ కమిషనర్ బదిలీైపై వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో యథేచ్చగా ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతోంది. క్వార్టర్ మద్యం సీసాకు ఏకంగా రూ.30 వరకు, ఫుల్‌బాటిల్ మీద రూ.80 వరకు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తేలింది. ఇటీవల మద్యం విక్రయాల రేటు గణనీయంగా పడిపోవడంతో అనుమానం వచ్చిన కమిషన ర్ సమీర్‌శర్మ మద్యం విక్రయాల తీరుపై రహస్య విచారణ జరిపించడంతో సిండి‘కేటు’ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఆయన చర్యలకు సిద్ధమవుతుండటంతో ఏకంగా కమిషనర్‌నే బదిలీపై పంపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రముఖ నేత అయిన మంత్రి, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పలు జిల్లాల నుంచి అందిన లిఖితపూర్వక, ఫోన్ ఫిర్యాదుల ఆధారంగా గత జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగిన మద్యం విక్రయాల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనపై ఆయన విచారణ చేయించారు. ఊహించని విధంగా లిక్కర్ సిండికేటు బలపడినట్టు, పెద్దయెత్తున ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో ప్రముఖుడు లిక్కర్ సిండికేటుకు ఊతమిస్తున్నట్టు తేలింది. తెలంగాణ జిల్లాల్లోనూ నెల రోజుల నుంచి మద్యం విక్రయాలలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్లపై చర్యలకు సిద్ధం ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ కమిషనర్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఎమార్పీ ఉల్లంఘన కేసులో రెండుకంటే ఎక్కువసార్లు చార్జి మెమోలు అందుకున్న ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని, రెండు మెమోలు అందుకున్నవారిని బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే జరిగితే దాదాపు 12 మంది ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు, 30 మంది అధికారులపై బదిలీ వేటు పడనుంది. దీంతో కమిషనర్‌నే బదిలీపై పంపాలని ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ప్రముఖ నేత, మరో ఇద్దరు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సమీర్‌శర్మను తమ రాష్ట్రానికి పంపాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కోరుతున్నందున ఆయన్ను అక్కడికి పంపించేందుకు అనుమతించాలని వీరు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్ట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు మంత్రులకు సీఎంతో సరైన సఖ్యత లేకపోవడంతో ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. చర్యలు తీసుకోబోతున్నారనే సమాచారంతో 100 మందికి పైగా ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్లు గురువారం హైదరాబాద్‌లో కమిషనర్‌ను కలిశారు. దుకాణాల్లో పనిచేసే నౌకరి నామాలు (వర్కర్లు) ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే తమను బాధ్యులను చేయడం తగదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోందని నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మద్యం విక్రయాలు కూడా తగ్గాయి. విచారణ జరిపితే ఉల్లంఘన నిజమే అని తేలింది. ఉల్లంఘనలను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయడమో... బదిలీ చేయడమో జరుగుతుంది..’ అని కమిషనర్ సమీర్‌శర్మ స్పష్టం చేశారు.