ట్రేడర్లు, వ్యాపార సంస్థలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రజానీకం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల ఎంఆర్‌పీ(గరిష్ట చిల్లర ధర) పెరిగిన పక్షంలో ఆ విషయం అందరికీ తెలిసేలా వ్యాపారులు, వ్యాపార సంస్థలు తక్షణం ప్రకటనలు జారీ చేయాలని కేంద్రం సూచించింది. సవరించిన ఎంఆర్‌పీని కనీసం రెండు స్థానిక దినపత్రికల్లో ప్రకటించాల్సి ఉంటుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన స్టాక్స్‌పై కొత్త ధరను స్టిక్కర్ రూపంలో అతికించి విక్రయించే వెసులుబాటు కల్పించినట్లు అధియా తెలిపారు.
జీఎస్‌టీ విధానంలో నిర్ధిష్ట ఇన్‌వాయిస్ స్వరూపమేదీ నిర్దేశించ లేదన్నారు. అయితే, ఇన్‌వాయిస్‌లో సదరు ట్రేడరు జీఎస్‌టీఐఎన్, బిల్లు మొత్తం కచ్చితంగా ఉండాలని చెప్పారు. తప్పనిసరిగా డిజిటైజ్డ్ బిల్లు ఇవ్వాలనే నిబంధనేది పెట్టలేదని.. మాన్యువల్ ఇన్‌వాయిస్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించినట్లు వివరించారు. ప్రస్తుతం 11,000 పైచిలుకు ఉత్పత్తుల్లో ఒకోదానికి ప్రత్యేక కోడ్‌ను (హెచ్‌ఎస్‌ఎన్) కేటాయించామని, రూ. 1.5 కోట్ల పైగా టర్నోవరు గల వ్యాపార సంస్థలు ఇన్‌వాయిస్‌లలో దీన్ని పొందుపర్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రియ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీఈసీ) ఆవిష్కరించిన వెబ్‌సైట్లో వ్యాపార సంస్థలు ఈ కోడ్‌లను సెర్చి చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
రేట్ల పెరుగుదలపై ప్రకటనలివ్వాలి
Published Sat, Jul 8 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement
Advertisement