
న్యూఢిల్లీ: పాత పన్ను వ్యవస్థ కాలంలో తయారై, అమ్ముడుపోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కూడిన ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువిచ్చింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌తో ముగియాల్సి ఉంది. కానీ, నవంబరు 15 నుంచి 150కిపైగా వస్తువులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీంతో కొత్త స్టిక్కర్లను అతికించేందుకు గడువును మార్చి వరకు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లు నీళ్ల సీసాలను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టులో త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామని పాశ్వాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment