కొత్త రేటు ముద్రించకపోతే చర్యలు
♦ జీఎస్‌టీపై తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరిక
♦ మూడు నెలల గడువుంటుందని వెల్లడి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తదనుగుణంగా ఉత్పత్తులన్నింటిపైనా సవరించిన గరిష్ట చిల్లర ధరను (ఎంఆర్‌పీ) ముద్రించకపోతే చర్యలు తప్పవని తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం సెప్టెంబర్ దాకా మూడు నెలల పాటు గడువు ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. గడువులోగా కొత్త రేట్లు ముద్రించని పక్షంలో తయారీ సంస్థలు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆయన ‘ట్వీటర్’లో పేర్కొన్నారు.
జీఎస్‌టీ రాకతో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గగా, మరికొన్ని పెరిగాయని మంత్రి వివరించారు. తగ్గిన రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాల్సిందేనని, లేకపోతే చర్యలు ఉంటాయన్నారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక రేట్ల తీరుతెన్నుల గురించి కొనుగోలుదారులకు స్పష్టంగా తెలిసేలా ప్రతీ ఉత్పత్తిపై సవరించిన ధర ఉండాల్సిందేనని పాశ్వాన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ దాకా స్టిక్కర్స్ ఉపయోగించవచ్చు..
జీఎస్‌టీ అమలు తేదీకి ముందు అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ఉత్పత్తుల ధరలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రీప్యాకేజ్డ్ ఐటమ్స్‌పై ముద్రించిన ఎంఆర్‌పీకి పక్కనే జీఎస్‌టీ రాకతో మారిన కొత్త ధరను సూచించేలా స్టిక్కర్స్ రూపంలో అతికించి విక్రయించుకోవచ్చని సూచించింది. స్టాంపింగ్ లేదా స్టిక్కర్ వేయడం లేదా ఆన్‌లైన్ ప్రింటింగ్ రూపంలో కొత్త ఎంఆర్‌పీని తెలియజేయాల్సి ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్ శ్రీవాస్తవ తెలిపారు.
అయితే, సెప్టెంబర్ 30 దాకా మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని.. ఆ తర్వాత కచ్చితంగా కొత్త రేటును ముద్రించే విక్రయించాలని, యాడ్ ఆన్ స్టిక్కర్స్‌ను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. మిగులు స్టాక్స్ ధరల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చాలా మటుకు సంస్థలకు దీంతో స్పష్టత లభించినట్లయింది. అమ్ముడవకుండా ఇంకా మిగిలిపోయిన స్టాక్స్ ధరలు పెరిగే పక్షంలో తయారీదారు లేదా ప్యాకర్ లేదా దిగుమతిదారు సదరు మార్పుల గురించి రెండు లేదా అంతకన్నా ఎక్కువ దినపత్రికల్లో కనీసం రెండు ప్రకటనలైనా ఇవ్వాల్సి ఉంటుంది.