ram vilas pashwan
-
పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు
న్యూఢిల్లీ: బిహార్‌లోని లోక్‌జనశక్తి పార్టీలో బాబాయ్, అబ్బాయిల మధ్య పోరాటం కొత్త పరిణామాలకు దారి తీసింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కి తానే అసలు సిసలైన వారసుడినని చెప్పుకోవడానికి, పార్టీపై పట్టు పెంచుకోవడానికి చిరాగ్ ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. ఆదివారం ఢిల్లీలోని చిరాగ్ నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. చిరాగ్ ఇక తాను ప్రజల్లోకి వెళ్లి బాబాయ్ పశుపతి పరాస్ నీచ రాజకీయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. జూలై 5న రామ్‌విలాస్ పాశ్వాన్ జయంతి రోజున హజీపూర్ నుంచి ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. పరాస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే జనంలోకి వెళ్లి వాస్తవాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు ఈ సమావేశం పాశ్వాన్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేసింది. సమావేశం ముగిసిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆవేశంగా చెప్పారు. ‘‘వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 90 శాతం నా వైపే ఉన్నారు. ఢిల్లీ, కశ్మీర్ పార్టీ అధ్యక్షులు మినహాయించి మిగిలిన వారంతా ఆ వైపు ఉన్నారు. పశుపతి పరాస్ వైపు 9 శాతం మంది మాత్రమే ఉన్నారు’’అని చిరాగ్ వెల్లడించారు. మరోవైపు పరాస్ ఆ సమావేశానికి చట్టబద్ధత లేదన్నారు. సమావేశానికి హాజరైన వారంతా పార్టీ సభ్యులే కారని ఆరోపించారు. ఎవరిది అసలైన పార్టీ్టయో ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని విలేకరులతో చెప్పారు. పార్టీ ఎంపీలను తన వైపు తిప్పుకొని పరాస్ తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పటికీ బిహార్‌లో 6 శాతం జనాభా ఉన్న పాశ్వాన్ వర్గం ఇప్పటికీ చిరాగ్‌నే పార్టీ నాయకుడిగా చూస్తోంది. అంతేకాదు లాలూ ప్రసాద్ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ కూడా పాశ్వాన్ జూనియర్‌కే మద్దతిస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
పాశ్వాన్‌కు కన్నీటి వీడ్కోలు
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం బిహార్ రాజధాని పట్నాలో ముగిశాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న జనార్దన్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్య క్రియలు నిర్వహించారు. పాశ్వాన్ చితికి ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిప్పంటించారు. బిహార్ సీఎం నితీశ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, అధిక సంఖ్యలో పాశ్వాన్ అభిమానులు తరలివచ్చారు. పాశ్వాన్ స్వస్థలం హాజీపూర్ నుంచి జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. చితికి నిప్పపెట్టాక చిరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూ లిపోయాడు. కొంతసేపు అచేతన స్థితికి చేరుకున్నాడు. చిరాగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సమీప బంధువులు తెలిపారు. -
ముగిసిన కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు
-
పాశ్వాన్ బాధ్యతలు చేపట్టిన పీయుష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలను శుక్రవారం అప్పగించారు. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ శాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలను పీయుష్ గోయల్ కు అప్పగించారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇటీవలే గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన సహచరులు జేపీ నడ్డాతో కలిసి పాశ్వాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పొయామని మోదీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
బీజేపీ వ్యూహం : నితీష్‌కు చెక్..!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలు సైతం కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య సీట్ల పంపకం ఇప్పటికే ఓ కొలిక్కి రాగా.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజీస్వీ యాదవ్ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరుకు కూటమిలో సీట్లు సర్థుబాటు కూడా పూర్తయ్యింది. మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. (వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్జేపీ ఇదిలావుండగా కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తిపార్టీ (ఎల్జేపీ) నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్న ప్రకటించింది. ఈ మేరకు ఎన్డీయే నుంచి తాము బయటకు వస్తున్నట్లు పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించడం బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అయితే తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పార్టీ నాయకత్వానికి విధేయులుగానే కొనసాగుతామని పాశ్వాన్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బిహార్‌లో సొంతంగా బరిలోకి దిగుతామని ప్రకటించిన ఎల్జేపీ నాయకత్వం తమ పోటీ జేడీయూపైనే అనే స్పష్టం చేసింది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష్టి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. బిహార్‌లో నితీష్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్జేపీని విశ్లేషిస్తున్నారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే) జేడీయూపై ఎల్జేపీ పోటీ.. పాశ్వాన్ నిర్ణయం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని, ఈ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎ పీఠాన్ని అదిష్టించాలన్నదే కమళనాథుల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్‌లో ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన పాశ్వాన్ బీజేపీ నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రకటించడం వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నదని వారి అభిప్రాయం. దీనిలో భాగంగానే ఎల్జేపీ అభ్యర్థులను జేడీయూపై పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఎల్జేపీ నేతలు నితీష్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శల దాడికి దిగుతున్నారు. జేడీయే అభ్యర్థుల ఓటమే తమ లక్ష్యమని ఇదివరకే ప్రకటించారు. దీంతో బీజేపీ కావాలనే ఎల్జేపీని తమపై పోటీకి దింపుతోందని పలువురు జేడీయూ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఈ ఎత్తులను నితీష్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది బిహార్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. -
ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ
పట్నా : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావడంతో సీట్ల పంపకాలపై చర్చలు షూరు అయ్యాయి. విపక్షాలైన కాంగ్రెస్-ఆర్జేడీ ఇదివరకే ఓ అవగాహన కుదుర్చుకోగా.. ఆ కూటమిలో మరికొన్ని పార్టీలు వచ్చిచేరే అవకాశం ఉంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. బీజేపీ-జేడీయూ మధ్య చర్చలు సానుకూలంగా ఉన్నా.. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని మూడో భాగస్వామ్యపక్షం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో అసలు చిక్కొచ్చి పడుతోంది. జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్మాలాను తమకు వర్తింపచేయాలని పట్టుపడుతోంది. లేదంటే తమదారి తాము చేసుకుంటామని సవాలు విసురుతోంది. ఎల్జేపీ డిమాండ్స్‌పై అధికార జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు తమ కూటమిలో లేనేలేరని తాము భావిస్తున్నామని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం ఓ లేఖరాశారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే) సీట్ల పంపకాలపై నాన్చుడు ధోరణి ఇక సాగదని, తమకు ఇచ్చేందేంటో వెంటనే చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. జేడీయూ తీరుతో తమ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయారని భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగితే కూటమిలో ప్రసక్తేలేదని వాపోయినట్లు సమచారం. తమనక నష్టం జరుగున్న కూటమిలో తాము ఇక ఉండలేని చెప్పిట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందని చిరాక్ లేఖలో స్పష్టం చేశారు. ఇక ఇదే లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం పంపించారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. ముడు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. (వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!) -
సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా కొద్ది పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో పోటీ మొదలు పొత్తులు, సీట్ల పంపకాల అంశాలపై చర్చించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య ముందునుంచే ఒప్పందం కుదిరినా.. అధికార ఎన్డీయే కూటమి సీట్ల పంపకం మాత్రం ఓ కొలిక్కి రావడంలేదు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతిపాదిస్తున్న 50-50 పార్మూలా తమకు వర్తించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను బిహార్ రాజకీయాల్లో కీలకశక్తిగా తయారుచేయాలని దృఢసంకల్పంతో ఉన్న రాంవిలాస్.. ఆ మేరకు తగిన ప్రణాళికలను రచిస్తున్నారు. నితీష్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనిలోభాగంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ నుంచి చిరాగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కూటమితో ఎన్నుకునే సీఎంకు ప్రజల మద్దతు ఉన్నట్లు కాదని, నేరుగా ప్రజల ద్వారానే ఎన్నికైన నాయకుడే నిజమైన సీఎం అని ఎల్జేపీ పేర్కొంది. (చాణిక్యుడి చతురత.. వృద్ధ నేత వ్యూహాలు) దశాబ్ధాలుగా బిహార్ రాజకీయాలను ఏలుతున్న నితీష్ కుమార్‌కు ప్రజల్లో సరైన ఆధరణలేదని, ఇప్పటికీ బీజేపీ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారని వాదిస్తోంది. తమకు బీజేపీ ఎంతటి కీలకమైన భాగస్వామ్య పార్టీనో.. జేడీయూకు కూడా అంతేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎల్జేపీపై నితీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పార్టీని తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా గుర్తించడంలేదని, వారి అవసరం తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. బీజేపీ ప్రతిపాధించిన 50-50 ఫార్మాలాకు తాము కట్టుబడి ఉన్నామని, ఎల్జేపీకి మాత్రం తాము సీట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే బీజేపీకి దక్కిన వాటలో వారు సీట్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఇక ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని బీజేపీ ఏవిధంగా పరిష్కరిస్తోందో వేచిచూడాలి. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నేడు (శుక్రవారం) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
తయారీ ఎక్కడో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఏ దేశంలో ఉత్పత్తి తయారైందన్న సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేసే విధంగా (ఈ–కామర్స్ సంస్థలు/ఆన్లైన్ వేదికగా విక్రయించేవి) నూతన నిబంధనలు ఈ వారం చివరి నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. నిబంధనలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో నమోదైన అన్ని ఎల్రక్టానిక్ సంస్థలతోపాటు, విదేశాల నుంచి భారతీయ వినియోగదారులకు ఉత్పత్తులను ఆఫర్ చేసే సంస్థలకు కూడా ‘వినియోగదారు పరిరక్షణ నిబంధనలు, 2020’ వర్తిస్తాయని పాశ్వాన్ పేర్కొన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద రూపొందించిన చాలా వరకు నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని, ఈ– కామర్స్ నిబంధనలను వారం చివర్లో నోటిఫై చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా విక్రయించే దుకాణాలకు నిబంధనల అమలుకు సమయం పడుతుందన్నారు. కొత్త నిబంధనల కింద ఉత్పత్తి మొత్తం ధర, సేవలు, అన్ని రకాల చార్జీలు, రిటర్న్, రిఫండ్, ఎక్సేంజ్, వారంటీ, గ్యారంటీ, చెల్లింపుల విధానాలు, ఫిర్యాదుల పరిష్కారం వివరాలను విడిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఏ దేశంలో తయారైంది, గడువు తీరే తేదీ వివరాలను కూడా ఇవ్వడం వల్ల వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది. ఒకవేళ ఆర్డర్ చేసిన తర్వాత వినియోగదారుడు మనసు మార్చుకుని దాన్ని రద్దు చేసుకుంటే ఎటువంటి చార్జీలను విధించకూడదు. ఇలా రద్దు చేయడం వల్ల ఈ కామర్స్ సంస్థపై చార్జీల భారం పడనప్పుడే ఈ నిబంధన వర్తిస్తుంది. -
వలస కూలీలకు ఉచిత రేషన్
న్యూఢిల్లీ: వలస కూలీలకు ఉచిత రేషన్‌ను వెంటనే అందజేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది వలస కూలీలకు రెండు నెలలకు అవసరమైన ఆహారధాన్యాలు, పప్పులను గోదాముల నుంచి తీసుకుని 15 రోజుల్లోగా పంపిణీ చేయాలని కేంద్రం ఆహార శాఖ మంత్రి పాశ్వాన్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డులు లేని వలస కూలీలు కూడా అర్హులేనన్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలో చొప్పున గోధుమలు లేదా బియ్యం, 1 కిలో శనగలు మే, జూన్ రేషన్‌గా అందివ్వాలన్నారు. ప్రస్తుత అంచనా 8 కోట్లకు మించి వలస కూలీలున్నట్లయితే అదనంగా కూడా రేషన్‌ను కేంద్రం కేటాయిస్తుందనీ, వాస్తవ లబ్ధిదారులను రాష్ట్రాలు గుర్తించాలని, ఆ వివరాలను కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ, గుజరాత్‌లకు గోధుమలతోపాటు బియ్యాన్ని, రాజస్తాన్, పంజాబ్, ఛండీగఢ్‌లకు గోధుమలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బియ్యం కేటాయింపులు జరిగాయి. -
కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి
న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ఉన్న 75 కోట్ల లబ్ధిదారులు 6 నెలల రేషన్ సరుకులను ఒకేసారి తీసుకోవచ్చని కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు గరిష్టంగా 2 నెలల వరకు రేషన్ సరుకులను తీసుకునేందుకు అవకాశం ఉండగా.. పంజాబ్ ఇప్పటికే ఆరు నెలల సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘గోదాముల్లో సరిపడా సరుకులున్నాయి. పేద వారికి ఆరు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం’అని పాశ్వాన్ చెప్పారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 435 లక్షల టన్నుల మిగులు ఆహార ధాన్యాలున్నాయని, అందులో 272.19 లక్షల టన్నుల బియ్యం, 162.79 లక్షల టన్నుల గోధుమలున్నాయని పేర్కొన్నారు. -
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్‌విలాశ్ పాశ్వాన్ తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడానికి గల కారణాలపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మోదీ చెప్పలేదు. కోర్టు తీర్పుకోసం వేచి ఉండాలనే చెప్పారు. దేశంలో 18,000 గ్రామాలను నిర్ణీత గడువులోగా విద్యుదీకరణ చేశాం. అలాగే గడువులోపలే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేశాం. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీసెస్‌ను కేంద్రం తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తోంది. ఈ మాట పార్లమెంటులో చెప్పాను కాబట్టి సరిపోయింది కానీ బయట చెప్పిఉంటే కోర్టు ధిక్కారం అయ్యేది. కోలీజియం వ్యవస్థలో సైతం పారదర్శకత లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భర్తీలాగే జడ్జీల నియామకంలోనూ పారదర్శకత రావాలి’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. -
ప్రమోషన్లలో కోటా కోసం సుప్రీంకు కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్డినెన్స్ రూపంలో ప్రమోషన్లలో కోటా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్లలో ఈ వర్గాలకు రిజర్వేషన్ అమలుకు అవరోధంగా ఉన్న గతంలో న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తుందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. కోటా కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ముందుగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దళితుల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందంలో సభ్యుడైన పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న రెండు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పాశ్వాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సుప్రీం సమ్మతించినా పలు షరతులు విధించడంతో కోటా మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేకపోతున్నాయని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జీఎస్టీ స్టిక్కర్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: పాత పన్ను వ్యవస్థ కాలంలో తయారై, అమ్ముడుపోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కూడిన ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువిచ్చింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌తో ముగియాల్సి ఉంది. కానీ, నవంబరు 15 నుంచి 150కిపైగా వస్తువులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీంతో కొత్త స్టిక్కర్లను అతికించేందుకు గడువును మార్చి వరకు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లు నీళ్ల సీసాలను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టులో త్వరలోనే రివ్యూ పిటిషన్ వేస్తామని పాశ్వాన్ చెప్పారు. -
కొత్త చట్టం.. ఇక సెలబ్రిటీలకు కష్టమే!
-
కొత్త చట్టం.. ఇక సెలబ్రిటీలకు కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారు రక్షణ చట్టం 2017కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాడ్ కంపెనీలు చేసే తప్పుడు ప్రచారాల వల్ల మోసపోయే వినియోగదారుల హక్కుల పరిరక్షణకై చట్టానికి సవరణలు చేసిన విషయం తెలిసిందే. గతంలోనే (ఆగష్టు 2015లో) కేంద్రం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా కొన్ని సవరణలు తెరపైకి రావటంతో దాని స్థానంలో కొత్త బిల్లును రూపొందించింది. ఈ మేరకు నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లు-2017కు ఆమోదం తెలిపింది. తద్వారా వినియోగదారు రక్షణ చట్టం-1986కి 30 ఏళ్ల తర్వాత కొత్తది తీసుకొచ్చినట్లయ్యింది. ఇక వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. తాజా చట్టంలో శిక్షలను కూడా చేర్చారు. సెలబ్రిటీలు నటించిది తప్పుడు ప్రకటన అని తేలితే తొలిసారి 10 లక్షల రూపాయల ఫైన్‌తో, మరియు ఏడాదిపాటు ఎలాంటి ఎండోర్స్మెంట్ చేయకుండా నిషేధిస్తారు. రెండోసారి కూడా అదే పని చేస్తే.. 50 లక్షల రూపాయల ఫైన్.. మూడేళ్ల బ్యాన్ పడుతుంది. ఇక కంపెనీలకు కూడా శిక్షలు ఉన్నాయి. మొదటిసారికి గానూ 10 లక్షల రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారస్కి 50 లక్షల ఫైన్‌తోపాటు ఐదేళ్ల శిక్ష విధిస్తారు. వీటితోపాటు నష్టపరిహారం అంశాన్ని ఆయా కేసుల తీవ్రతను బట్టి పరిశీలిస్తారు. జనాల్లో సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ను వాడుకుని పలు సంస్థలు యాడ్లు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా వారు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకానోక సమయంలో ఫ్రోఫెషనల్‌గా కంటే ఇలా ఎండోర్స్‌మెంట్లతోనే వారికి వచ్చే ఆదాయం ఎక్కువ. అయితే ప్రజలను మభ్యపెట్టే తప్పుడు ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడం సరికాదన్న వాదన గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజా చట్టంతో దానికి బ్రేక్ పడనుంది. -
ఆహార వృధా హోటళ్లలోనేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రేడియోలో ‘మన్ కీ బాత్’ వినిపిస్తూ దేశంలో ఎంతో ఆహారం వృధా అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకొన్న కేంద్ర ఆహారం, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో ఆహారం వృధా అవుతోందని, దీనిపై తాను తగిన చర్యలు తీసుకుంటానంటూ ఆగమేఘాల మీద స్పందించారు. రెండు ఇడ్లీలు తినే వ్యక్తికి హోటళ్లలో నాలుగు ఇడ్లీలు వడ్డిస్తున్నారని, ఆ వ్యక్తి రెండు ఇడ్లీలను వృధా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కూడా ఆయన మీడియా వద్ద వాపోయారు. రెస్టారెంట్లలో ఏ టిఫిన్ ఎంతివ్వాలో, ఏ భోజనం ఎంతుండాలో పరిమాణాన్ని నిర్దేశిస్తూ ప్రమాణాలను జారీ చేయడానికి తన ముందు హాజరు కావాల్సిందిగా హోటల్ యాజమాన్య సంఘాలకు హుకుం కూడా జారీ చేశారు. హోటళ్లలోనే ఆహారం వృధానా? సగానికి పైగా జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న భారత్ లాంటి దేశంలో సగం ఆహారం వృధా అవడం నరేంద్ర మోదీ, పాశ్వాన్‌లను కలిచివేసే విషయమే కాదు.. సగం భారతీయుల కడుపు తరుక్కుపోయే విషయం కూడా. నిజంగా దేశంలో కేవలం రెస్లారెంట్లు, హోటళ్లలోనే ఆహారం వృధా అవుతోందా? అవి వినియోగదారుడు తినేకన్నా ఎక్కువ వడ్డిస్తున్నాయా? హోటళ్లపై చర్య తీసుకుంటే ఆహార వృధాను అరికట్టవచ్చా? వాస్తవానికి ఆహారం ఎక్కడ వృధా అవుతోంది? ఎప్పుడైనా పాలకులు దీనిపై చిత్తశుద్ధితో ఆలోచించారా? రూ. 92,651 కోట్ల ఆహారం వృధా వాస్తవానికి హోటళ్లలో కన్నా ఉత్పత్తి, సరఫరాలోనే ఎక్కువ మొత్తాల్లో ఆహారం వృధా అవుతోంది. అధికార లెక్కల ప్రకారమే 2013 - 2015 సంవత్సరాల మధ్య, అంటే రెండేళ్లలో భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రూ. 40 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. దేశంలో చాలినన్ని శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని భారత ఆహార సంస్థ పేర్కొంది. పంట దిగుబడి సందర్భంలో, ఆ తర్వాత మార్కెట్‌కు తరలించాక ఏటా దేశంలోని వ్యవసాయోత్పత్తుల్లో 92,651 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తుల నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం కొత్తగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎంతో ఎక్కువ. 2016–2017 సంవత్సరానికి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు కేటాయించిన విషయం తెల్సిందే. రూ. 40,811 కోట్ల పండ్లు, కూరగాయలు వృధా 2012 - 2014 సంవత్సరాల మధ్య దేశంలో ఉత్పత్తయిన పండ్లు, కూరగాయల్లో 16 శాతం, అంటే హోల్‌సేల్ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 40, 811 కోట్ల నష్టం వాటిల్లిందని లూధియానాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ వెల్లడించింది. ఒక్క కూరగాయల్లోనే ఏటా 5 - 12 శాతం వృధా అవుతోందని 2015లో కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనాలు తెలియజేస్తున్నాయి. మాంసం, పాలు, గుడ్లు, పప్పు దినుసులు, తృణధాన్యాలు అన్నీ వృధా అవుతున్నాయి. 2014–2016 సంవత్సరాల మధ్య శీతల గిడ్డంగుల వద్ద రూ. 3,942 కోట్ల విలువైన మాంసం వృధా అయిందని ఆహారశుద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్పత్తి దగ్గరి నుంచి వినియోగదారుడికి చేరేలోపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతోంది. దీన్ని పక్కన పెట్టి హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని అరికడతామని కేంద్ర మంత్రి చెప్పడం అంటే ‘ఏనుగులు పోయే దారిని వదిలేసి చీమలు దూరే దారిని మూసినట్లు’ ఉంది. ప్రజలెంత తినాలో వాళ్లు చెబుతారట వాస్తవానికి ఇప్పుడు హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కువ ఆహారం వృధా కావడం లేదు. ఖరీదైన హోటళ్లలో వినియోగదారుడికి చాలా తక్కువనే వడ్డిస్తారు. పలు రకాల డిషెస్ ఆర్డర్ ఇచ్చి, వాటిని తినకపోవడం వల్ల కొంత వృధా అవుతుంది. చిన్న హోటళ్లలో వినియోగదారుడికి తలుపులు మూశాకే సిబ్బంది తింటారు గనుక అక్కడ పెద్దగా వృధా కాదు. హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని కూడా ఎన్నో ఎన్జీవోలు ఇప్పుడు సేకరించి పేదలకు, అనాథలకు, అన్నార్తులకు వడ్డిస్తున్నాయి. తమిళనాడులో పుట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన ‘నో ఫుడ్ వేస్ట్’ ఎన్జీవో అలాంటిదే. పెళ్లిళ్లు, పేరంటాల్లో వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి సద్వినియోగం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన ఇలాంటి పనులను పబ్లిక్ చేస్తుంటే పబ్లిక్ ఎంత తినాలన్న ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తానంటోంది. -
అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్‌ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది. -
మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి
బిహార్‌లో మద్య నిషేధం కోసం సరికొత్త చట్టాన్ని తెచ్చినందున.. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే సీఎం నితీష్‌కుమార్‌ను అరెస్టుచేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. మద్యాన్ని నిషేధిస్తూ ఏప్రిల్ 5న చేసిన చట్టాన్ని పట్నా హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. నితీష్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించిన విషయం తెలిసిందే. దాంతో ఈ అంశంపై తాజాగా పాశ్వాన్ స్పందించారు. ఇంట్లో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ జైలుకు పంపిస్తామని ఈ కొత్త చట్టంలో ఉందని, అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో మద్యనిషేధానికి తమ పార్టీ లో్క్జనశక్తి కూడా అనుకూలమేనని, అయితే కొత్త మద్యనిషేధ చట్టంలో పెట్టిన కొన్ని నిబంధనలను మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని పాశ్వాన్ అన్నారు. ఇంట్లో మద్యం కనిపిస్తే కుటుంబ పెద్దలను అరెస్టుచేయడం లాంటి నిబంధనలపైనే ఆయన వ్యాఖ్యానించారు. ఇక బాలికపై అత్యాచారం కేసులో్ నిందితుడైన ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్‌ను కలిసిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మీద కూడా పాశ్వాన్ మండిపడ్డారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఎమ్మెల్యేకు లాలు మద్దతు ఇవ్వడం సరికాదని, ఆయనను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.