ఆహార వృధా హోటళ్లలోనేనా? | central government to take up drive against food wastage | Sakshi
Sakshi News home page

ఆహార వృధా హోటళ్లలోనేనా?

Published Wed, Apr 12 2017 5:13 PM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

ఆహార వృధా హోటళ్లలోనేనా? - Sakshi

ఆహార వృధా హోటళ్లలోనేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రేడియోలో ‘మన్‌ కీ బాత్‌’ వినిపిస్తూ దేశంలో ఎంతో ఆహారం వృధా అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకొన్న కేంద్ర ఆహారం, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్, దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో ఆహారం వృధా అవుతోందని, దీనిపై తాను తగిన చర్యలు తీసుకుంటానంటూ ఆగమేఘాల మీద స్పందించారు. రెండు ఇడ్లీలు తినే వ్యక్తికి హోటళ్లలో నాలుగు ఇడ్లీలు వడ్డిస్తున్నారని, ఆ వ్యక్తి రెండు ఇడ్లీలను వృధా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కూడా ఆయన మీడియా వద్ద వాపోయారు. రెస్టారెంట్లలో ఏ టిఫిన్‌ ఎంతివ్వాలో, ఏ భోజనం ఎంతుండాలో పరిమాణాన్ని నిర్దేశిస్తూ ప్రమాణాలను జారీ చేయడానికి తన ముందు హాజరు కావాల్సిందిగా హోటల్‌ యాజమాన్య సంఘాలకు హుకుం కూడా జారీ చేశారు.

హోటళ్లలోనే ఆహారం వృధానా?
సగానికి పైగా జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న భారత్‌ లాంటి దేశంలో సగం ఆహారం వృధా అవడం నరేంద్ర మోదీ, పాశ్వాన్‌లను కలిచివేసే విషయమే కాదు.. సగం భారతీయుల కడుపు తరుక్కుపోయే విషయం కూడా. నిజంగా దేశంలో కేవలం రెస్లారెంట్లు, హోటళ్లలోనే ఆహారం వృధా అవుతోందా? అవి వినియోగదారుడు తినేకన్నా ఎక్కువ వడ్డిస్తున్నాయా? హోటళ్లపై చర్య తీసుకుంటే ఆహార వృధాను అరికట్టవచ్చా? వాస్తవానికి ఆహారం ఎక్కడ వృధా అవుతోంది? ఎప్పుడైనా పాలకులు దీనిపై చిత్తశుద్ధితో ఆలోచించారా?

రూ. 92,651 కోట్ల ఆహారం వృధా
వాస్తవానికి హోటళ్లలో కన్నా ఉత్పత్తి, సరఫరాలోనే ఎక్కువ మొత్తాల్లో ఆహారం వృధా అవుతోంది. అధికార లెక్కల ప్రకారమే 2013 - 2015 సంవత్సరాల మధ్య, అంటే రెండేళ్లలో భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రూ. 40 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. దేశంలో చాలినన్ని శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని భారత ఆహార సంస్థ పేర్కొంది.  పంట దిగుబడి సందర్భంలో,  ఆ తర్వాత మార్కెట్‌కు తరలించాక ఏటా దేశంలోని వ్యవసాయోత్పత్తుల్లో 92,651 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తుల నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం కొత్తగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన బడ్జెట్‌ కేటాయింపుల కన్నా ఎంతో ఎక్కువ. 2016–2017 సంవత్సరానికి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు కేటాయించిన విషయం తెల్సిందే.

రూ. 40,811 కోట్ల పండ్లు, కూరగాయలు వృధా
2012 - 2014 సంవత్సరాల మధ్య దేశంలో ఉత్పత్తయిన పండ్లు, కూరగాయల్లో 16 శాతం, అంటే హోల్‌సేల్‌ మార్కెట్‌ లెక్కల ప్రకారం రూ. 40, 811 కోట్ల నష్టం వాటిల్లిందని లూధియానాలోని ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ వెల్లడించింది. ఒక్క కూరగాయల్లోనే ఏటా 5 - 12 శాతం వృధా అవుతోందని 2015లో కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనాలు తెలియజేస్తున్నాయి. మాంసం, పాలు, గుడ్లు, పప్పు దినుసులు, తృణధాన్యాలు అన్నీ వృధా అవుతున్నాయి. 2014–2016 సంవత్సరాల మధ్య శీతల గిడ్డంగుల వద్ద రూ. 3,942 కోట్ల విలువైన మాంసం వృధా అయిందని ఆహారశుద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్పత్తి దగ్గరి నుంచి వినియోగదారుడికి చేరేలోపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతోంది. దీన్ని పక్కన పెట్టి హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని అరికడతామని కేంద్ర మంత్రి చెప్పడం అంటే ‘ఏనుగులు పోయే దారిని వదిలేసి చీమలు దూరే దారిని మూసినట్లు’ ఉంది.

ప్రజలెంత తినాలో వాళ్లు చెబుతారట
వాస్తవానికి ఇప్పుడు హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కువ ఆహారం వృధా కావడం లేదు. ఖరీదైన హోటళ్లలో వినియోగదారుడికి చాలా తక్కువనే వడ్డిస్తారు. పలు రకాల డిషెస్‌ ఆర్డర్‌ ఇచ్చి, వాటిని తినకపోవడం వల్ల కొంత వృధా అవుతుంది. చిన్న హోటళ్లలో వినియోగదారుడికి తలుపులు మూశాకే సిబ్బంది తింటారు గనుక అక్కడ పెద్దగా వృధా కాదు. హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని కూడా ఎన్నో ఎన్జీవోలు ఇప్పుడు సేకరించి పేదలకు, అనాథలకు, అన్నార్తులకు వడ్డిస్తున్నాయి. తమిళనాడులో పుట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన ‘నో ఫుడ్‌ వేస్ట్‌’ ఎన్జీవో అలాంటిదే. పెళ్లిళ్లు, పేరంటాల్లో వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి సద్వినియోగం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన ఇలాంటి పనులను పబ్లిక్‌ చేస్తుంటే పబ్లిక్‌ ఎంత తినాలన్న ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తానంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement