సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ.. నగరవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటిలోనూ ఈ విధానంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బోయిన్‌పల్లి మార్కెట్‌లో పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఆ శాఖ.. 10 టన్నుల చెత్తతో 550 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మార్కెట్ అవసరాలన్నింటికీ ఈ కరెంట్ సరిపోతుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహాయంతో చెత్తను బయోగ్యాస్‌గా మార్చిన నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇతర మార్కెట్లలోనూ అవలంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.
ఈ క్రమంలో ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఒకడుగు ముందుకేసి.. ప్లాంట్‌ను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్‌తో క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ 500 కిలోల చెత్తను బయోగ్యాస్ మార్చడం ద్వారా.. ఈ పవర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్‌లో వ్యర్థాలను తరలించేందుకు నెలకు సుమారు రూ.1.5 లక్షల మేర ఖర్చు చేసేవారు. పవర్‌ప్లాంట్ రాకతో సుమారు రూ.70వేల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది.
బోయిన్‌పల్లే ఆదర్శం..
బోయిన్‌పల్లి తరహాలో గుడిమల్కాపూర్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ సరూర్‌నగర్ రైతు బజార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించిందని ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. ఇప్పటికే మెహిదీపట్నం రైతుబజార్‌లో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఎన్‌టీఆర్ కూరగాయల మార్కెట్, అల్వాల్ రైతుబజార్‌లో ఎర్రగడ్డ తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
చదవండి: కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ
బోయిన్‌పల్లి ప్లాంట్..
►1500 ఎరువు ఉత్పత్తి రూ.3 కోట్లతో బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్ విశేషాలు
►నిత్యం 10 టన్నుల చెత్తను ఇంధనంగా మార్చుతోంది. రోజుకు 1220–1400 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి
► 550 ఎల్‌పీజీ గ్యాస్‌తో సమానం
►నగరంలోని వివిధ హోల్‌సేల్ మార్కెట్లలో చెత్త ఎత్తడానికి నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.20 లక్షలు
బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్..
►10 టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్తుగా ఎలా మారుస్తోంది.
►ఆహారం వృథా: ఐక్యరాజ్య సమితి 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని అంచనా.
►వీటిలో 61శాతం గృహాల నుండి, 26 శాతం ఆహార సేవ నుండి, 13 శాతం చిల్లర వర్తకం (రిటైల్) నుండి వృథా అయ్యాయి.
►భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాల సంవత్సరానికి 68.7 మిలియన్ టన్నులు అని ఆ నివేదిక తెలిపింది.
బోయిన్‌పల్లి మార్కెట్
►హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన పద్ధతిలో రోజువారీగా 10 టన్నుల వ్యర్థాన్ని నిర్వహిస్తోంది.
►ఇది ఆహారం, కూరగాయ వ్యర్థాలను బయోగ్యాస్, విద్యుత్తుగా మారుస్తోంది.
► వీధి దీపాల దుకాణాలకు విద్యుత్తునందిస్తోంది
► గత కొన్ని నెలలుగా, 500 యూనిట్ల విద్యుత్తును వినియోగించడం జరుగుతోంది.
►120 వీధి దీపాలకు విద్యుత్తు
►170 దుకాణాలకు విద్యుత్తు
►శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజ్ యూనిట్)కి విద్యుత్తు.
ఎల్‌పీజీ స్థానంలో..
► గ్యాస్ హరిత విద్యుత్తు సేంద్రీయ ఎరువు వెచ్చదనం
► ప్లాంట్ వద్ద అదే వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతోంది.
►ఇది మార్కెట్ క్యాంటీన్‌లో ఉపయోగించే ఎల్‌పీజీ వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేస్తోంది.
►ఈ క్యాంటీన్ రోజుకు 800 మందికి భోజనాలను వడ్డిస్తుంది.
ఈ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది?
► మార్కెట్ నుంచి వ్యర్థాల సేకరణ
►ప్లాంట్‌కు వాటిని తీసుకురావడం
► వ్యర్థాల మక్కించడం
► ఫీడ్ తయారీ ట్యాంక్‌లో నానబెట్టడం
► ముద్దగా మార్చడం
►ఏరోబిక్ బయో మీథనేషన్ ప్రక్రియకు గురికావడం
► ప్రత్యేక ట్యాంకుల్లో బయోగ్యాస్ సేకరణ
►బయోగ్యాస్‌ను వంటగదికి పంపడం
►బయో ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్‌లోకి సరఫరా చేయడం
► నీటి పంపునకు, శీతల గిడ్డంగులకు, వీధి దీపాలు, దుకాణాలకు కరెంట్ సరఫరా
► హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ తీసుకున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు.
► ‘హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందో తెలుసుకుని ఆనందిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
► సహజ వాయువుకు ప్రతిగా బయోగ్యాస్, అమెరికాలో సహజ వాయువు కన్నా బయోగ్యాస్ 5 రెట్లు అధిక ధర పలుకుతుంది.
► విద్యుత్తు డిమాండ్‌కు తగినంతగా వృథా లేనందున సహజ వాయువు స్థాయిని బయోగ్యాస్ భర్తీ చేయలేదు. కానీ ఇది వ్యర్థాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment