రుచుల రివ్యూ.. సిటీకి క్యూ | Foreigners Visiting The City Are Interested In Hyderabad Food, Became Famous For Food Reviews Videos | Sakshi
Sakshi News home page

రుచుల రివ్యూ.. సిటీకి క్యూ

Jan 30 2025 8:01 AM | Updated on Jan 30 2025 10:03 AM

foreigners Interest Hyderabad Food

నగరానికి వస్తున్న విదేశీయులకు సిటీ ఫుడ్‌పై ఆసక్తి

సోషల్‌ మీడియాలో సిటీ వంటకాలపై పోస్టులు

నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న రివ్యూలు.. చర్చోపచర్చలు

తాజాగా తన రివ్యూల ద్వారా ఆసక్తి రేపిన స్కాట్‌లాండ్‌వాసి  

విభిన్నమైన ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌... ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చారిత్రక విశేషాల ద్వారా మాత్రమే కాకుండా చవులూరించే ఘుమఘమల ద్వారా కూడా ఆకర్షిస్తోంది. అలా వచ్చి వెళ్లేవారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న అనుభవాలు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీ రుచులకు సంబంధించి ఉన్న అభిప్రాయాలపై 
చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి.                          

నగరానికి ఉన్న గొప్ప వంటల వారసత్వం పుణ్యమాని.. మొఘలాయ్, తెలుగు హైదరాబాదీ రుచులను మిళితం చేసిన సిటీ ఫుడ్‌ వెరైటీ రుచులను ఇష్టపడే ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. బిర్యానీల నుంచి ఇరానీ చాయ్‌ వరకు, బిస్కెట్ల నుంచి డబుల్‌ కా మీఠా వరకూ.. ఆహార ప్రియులకు హైదరాబాద్‌ స్వర్గధామం. ఈ నేపథ్యంలో నగరాన్ని సందర్శించే చాలా మంది విదేశీ సందర్శకులు సిటీ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయడం సోషల్‌ మీడియాలో స్పందనను పంచుకోవడం కూడా పరిపాటిగా మారింది.  

స్కాట్‌లాండ్‌ సే ఆయే మేరా దోస్త్‌..  
సాధారణంగా నగరాన్ని సందర్శించే విదేశీయులు మన రుచుల్ని పొగుడుతూనో, లేదా అరుదుగా బాగోలేదు అనో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అయితే తాజాగా ఒక (స్కాట్‌లాండ్‌) స్కాటిష్‌ ట్రావెలర్‌ మాత్రం భిన్నంగా స్పందించి సోషల్‌ మీడియాలో తన పోస్ట్‌ల ద్వారా సిటీ ఫుడీస్‌ని ఆకర్షించాడు. స్కాటిష్‌ అయిన హ్యూ అబ్రాడ్‌ అనే విదేశీయుడు నగరాన్ని సందర్శించాడు. నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వంటకాలు రుచి చూశాడు. అనంతరం వీటిని అందిస్తున్న హోటల్స్‌ రెస్టారెంట్స్‌పై తనదైన రీతిలో వీడియో పోస్టులు చేశాడు. అయితే ఇవి ఏదో యథాలాపంగా చేసినట్టు కాకుండా ఈ పోస్టులు చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 



రేటింగ్స్‌ సైతం..  
హ్యూ అబ్రాడ్‌ తన వీడియోలలో హోటల్‌ షాదాబ్‌లో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీని తాను రుచి చూసినట్లు తెలిపాడు. ఆ రుచి అమోఘం అంటూ మెచ్చుకుని షాదాబ్‌ బిర్యానీకి 10/10 రేటింగ్‌ ఇచ్చాడు. అదే సమయంలో అనేక మంది ఇష్టంగా తినే నిమ్రా కేఫ్‌లోనిఉస్మానియా బిస్కెట్‌ రుచిని మాత్రం తీసిపారేశాడు. అదొక ‘డ్రై’గా అతను పోస్ట్‌లో పేర్కొన్నాడు. అలాగే షహ్రాన్‌ హోటల్‌  కబాబ్‌ల కోసం మొజాంజాహీ మార్కెట్‌ను సందర్శించాడు. అక్కడి బోటీ, కబాబ్‌ రుచికరమైందిగా అంటూనే.. అందులో ఒక కబాబ్‌ ముక్కలో వైర్‌ను కనుగొనడంతో తానిచ్చే రేటింగ్‌ నుంచి ఒక పాయింట్‌ తగ్గించాడు. అదేవిధంగా మొజాంజాహీ మార్కెట్‌లోని ఒక దుకాణంలో పిస్తా ఐస్‌క్రీమ్‌ను కూడా టేస్ట్‌ చేసి ‘నేను ఇప్పటి వరకు రుచి చూసిన వాటిలో అత్యంత నకిలీ పిస్తా’ ఇది అంటూ విమర్శించాడు. రుచి అతి కృత్రిమంగా ఉందని దానికి 3/10 రేటింగ్‌ ఇచ్చాడు. ఇంకా ఇరానీ చాయ్, బిస్కెట్లు, బుర్హాన్‌పూర్‌ ఖోవా జిలేబి, మిలన్‌ జ్యూస్‌ సెంటర్‌లోని షెహదూద్‌ మలై ఇంకా ఇతర స్ట్రీట్‌ ఫుడ్స్‌పై కూడా ఇలాగే రివ్యూలను, రేటింగ్స్‌ను రివ్యూ అందించాడు.  

లైక్స్‌.. కామెంట్స్‌.. 
స్కాట్‌లాండ్‌వాసి హ్యూ అబ్రాడ్‌ పోస్టులకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. అనేక మంది ఈ వీడియోలను లైక్‌ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోల శ్రేణి హైదరాబాదీల మధ్య పరస్పరం చర్చకు సైతం దారి తీసింది. చాలామంది స్థానికులు ఆ పోస్టుల్లో నిజాయితీ ఉందని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం అతను నగరంలోని మరింత ఉత్తమమైన, మరింత ప్రమాణాలు పాటించే ఆహార కేంద్రాలను సందర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు సిటీ వంటకాల నిజమైన సారాన్ని అందించే మరికొన్ని వంటలు, వాటి చిరునామాలను సూచించారు. అంతేకాదు స్థానిక భాషలో విక్రేతలతో ఎలా సంభాíÙంచాలనే దానిపై చిట్కాలను కూడా అతడికి అందించారు. ఏదేమైనా మన రుచులపై విదేశీయుల అభిప్రాయాలకు దక్కుతున్న స్పందనకు స్కాటిష్‌ టూరిస్ట్‌ పోస్టులు అద్దం పట్టాయని చెప్పొచ్చు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement