wastage at production
-
‘చెత్త’తో వెలుగులు.. ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ.. నగరవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటిలోనూ ఈ విధానంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బోయిన్పల్లి మార్కెట్లో పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఆ శాఖ.. 10 టన్నుల చెత్తతో 550 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మార్కెట్ అవసరాలన్నింటికీ ఈ కరెంట్ సరిపోతుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహాయంతో చెత్తను బయోగ్యాస్‌గా మార్చిన నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇతర మార్కెట్లలోనూ అవలంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలో ఎర్రగడ్డ రైతుబజార్లో ఒకడుగు ముందుకేసి.. ప్లాంట్‌ను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్‌తో క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ 500 కిలోల చెత్తను బయోగ్యాస్ మార్చడం ద్వారా.. ఈ పవర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్లో వ్యర్థాలను తరలించేందుకు నెలకు సుమారు రూ.1.5 లక్షల మేర ఖర్చు చేసేవారు. పవర్‌ప్లాంట్ రాకతో సుమారు రూ.70వేల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. బోయిన్పల్లే ఆదర్శం.. బోయిన్పల్లి తరహాలో గుడిమల్కాపూర్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ సరూర్‌నగర్ రైతు బజార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించిందని ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. ఇప్పటికే మెహిదీపట్నం రైతుబజార్లో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్, అల్వాల్ రైతుబజార్లో ఎర్రగడ్డ తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ బోయిన్పల్లి ప్లాంట్.. ►1500 ఎరువు ఉత్పత్తి రూ.3 కోట్లతో బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్ విశేషాలు ►నిత్యం 10 టన్నుల చెత్తను ఇంధనంగా మార్చుతోంది. రోజుకు 1220–1400 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ► 550 ఎల్పీజీ గ్యాస్‌తో సమానం ►నగరంలోని వివిధ హోల్‌సేల్ మార్కెట్లలో చెత్త ఎత్తడానికి నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.20 లక్షలు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్.. ►10 టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్తుగా ఎలా మారుస్తోంది. ►ఆహారం వృథా: ఐక్యరాజ్య సమితి 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని అంచనా. ►వీటిలో 61శాతం గృహాల నుండి, 26 శాతం ఆహార సేవ నుండి, 13 శాతం చిల్లర వర్తకం (రిటైల్) నుండి వృథా అయ్యాయి. ►భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాల సంవత్సరానికి 68.7 మిలియన్ టన్నులు అని ఆ నివేదిక తెలిపింది. బోయిన్పల్లి మార్కెట్ ►హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన పద్ధతిలో రోజువారీగా 10 టన్నుల వ్యర్థాన్ని నిర్వహిస్తోంది. ►ఇది ఆహారం, కూరగాయ వ్యర్థాలను బయోగ్యాస్, విద్యుత్తుగా మారుస్తోంది. ► వీధి దీపాల దుకాణాలకు విద్యుత్తునందిస్తోంది ► గత కొన్ని నెలలుగా, 500 యూనిట్ల విద్యుత్తును వినియోగించడం జరుగుతోంది. ►120 వీధి దీపాలకు విద్యుత్తు ►170 దుకాణాలకు విద్యుత్తు ►శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజ్ యూనిట్)కి విద్యుత్తు. ఎల్పీజీ స్థానంలో.. ► గ్యాస్ హరిత విద్యుత్తు సేంద్రీయ ఎరువు వెచ్చదనం ► ప్లాంట్ వద్ద అదే వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ►ఇది మార్కెట్ క్యాంటీన్లో ఉపయోగించే ఎల్పీజీ వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేస్తోంది. ►ఈ క్యాంటీన్ రోజుకు 800 మందికి భోజనాలను వడ్డిస్తుంది. ఈ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ► మార్కెట్ నుంచి వ్యర్థాల సేకరణ ►ప్లాంట్‌కు వాటిని తీసుకురావడం ► వ్యర్థాల మక్కించడం ► ఫీడ్ తయారీ ట్యాంక్‌లో నానబెట్టడం ► ముద్దగా మార్చడం ►ఏరోబిక్ బయో మీథనేషన్ ప్రక్రియకు గురికావడం ► ప్రత్యేక ట్యాంకుల్లో బయోగ్యాస్ సేకరణ ►బయోగ్యాస్‌ను వంటగదికి పంపడం ►బయో ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్లోకి సరఫరా చేయడం ► నీటి పంపునకు, శీతల గిడ్డంగులకు, వీధి దీపాలు, దుకాణాలకు కరెంట్ సరఫరా ► హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ తీసుకున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు. ► ‘హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందో తెలుసుకుని ఆనందిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ► సహజ వాయువుకు ప్రతిగా బయోగ్యాస్, అమెరికాలో సహజ వాయువు కన్నా బయోగ్యాస్ 5 రెట్లు అధిక ధర పలుకుతుంది. ► విద్యుత్తు డిమాండ్‌కు తగినంతగా వృథా లేనందున సహజ వాయువు స్థాయిని బయోగ్యాస్ భర్తీ చేయలేదు. కానీ ఇది వ్యర్థాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. -
ఆహార వృధా హోటళ్లలోనేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రేడియోలో ‘మన్ కీ బాత్’ వినిపిస్తూ దేశంలో ఎంతో ఆహారం వృధా అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకొన్న కేంద్ర ఆహారం, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో ఆహారం వృధా అవుతోందని, దీనిపై తాను తగిన చర్యలు తీసుకుంటానంటూ ఆగమేఘాల మీద స్పందించారు. రెండు ఇడ్లీలు తినే వ్యక్తికి హోటళ్లలో నాలుగు ఇడ్లీలు వడ్డిస్తున్నారని, ఆ వ్యక్తి రెండు ఇడ్లీలను వృధా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కూడా ఆయన మీడియా వద్ద వాపోయారు. రెస్టారెంట్లలో ఏ టిఫిన్ ఎంతివ్వాలో, ఏ భోజనం ఎంతుండాలో పరిమాణాన్ని నిర్దేశిస్తూ ప్రమాణాలను జారీ చేయడానికి తన ముందు హాజరు కావాల్సిందిగా హోటల్ యాజమాన్య సంఘాలకు హుకుం కూడా జారీ చేశారు. హోటళ్లలోనే ఆహారం వృధానా? సగానికి పైగా జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న భారత్ లాంటి దేశంలో సగం ఆహారం వృధా అవడం నరేంద్ర మోదీ, పాశ్వాన్‌లను కలిచివేసే విషయమే కాదు.. సగం భారతీయుల కడుపు తరుక్కుపోయే విషయం కూడా. నిజంగా దేశంలో కేవలం రెస్లారెంట్లు, హోటళ్లలోనే ఆహారం వృధా అవుతోందా? అవి వినియోగదారుడు తినేకన్నా ఎక్కువ వడ్డిస్తున్నాయా? హోటళ్లపై చర్య తీసుకుంటే ఆహార వృధాను అరికట్టవచ్చా? వాస్తవానికి ఆహారం ఎక్కడ వృధా అవుతోంది? ఎప్పుడైనా పాలకులు దీనిపై చిత్తశుద్ధితో ఆలోచించారా? రూ. 92,651 కోట్ల ఆహారం వృధా వాస్తవానికి హోటళ్లలో కన్నా ఉత్పత్తి, సరఫరాలోనే ఎక్కువ మొత్తాల్లో ఆహారం వృధా అవుతోంది. అధికార లెక్కల ప్రకారమే 2013 - 2015 సంవత్సరాల మధ్య, అంటే రెండేళ్లలో భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రూ. 40 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. దేశంలో చాలినన్ని శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని భారత ఆహార సంస్థ పేర్కొంది. పంట దిగుబడి సందర్భంలో, ఆ తర్వాత మార్కెట్‌కు తరలించాక ఏటా దేశంలోని వ్యవసాయోత్పత్తుల్లో 92,651 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తుల నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం కొత్తగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎంతో ఎక్కువ. 2016–2017 సంవత్సరానికి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు కేటాయించిన విషయం తెల్సిందే. రూ. 40,811 కోట్ల పండ్లు, కూరగాయలు వృధా 2012 - 2014 సంవత్సరాల మధ్య దేశంలో ఉత్పత్తయిన పండ్లు, కూరగాయల్లో 16 శాతం, అంటే హోల్‌సేల్ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 40, 811 కోట్ల నష్టం వాటిల్లిందని లూధియానాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ వెల్లడించింది. ఒక్క కూరగాయల్లోనే ఏటా 5 - 12 శాతం వృధా అవుతోందని 2015లో కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనాలు తెలియజేస్తున్నాయి. మాంసం, పాలు, గుడ్లు, పప్పు దినుసులు, తృణధాన్యాలు అన్నీ వృధా అవుతున్నాయి. 2014–2016 సంవత్సరాల మధ్య శీతల గిడ్డంగుల వద్ద రూ. 3,942 కోట్ల విలువైన మాంసం వృధా అయిందని ఆహారశుద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్పత్తి దగ్గరి నుంచి వినియోగదారుడికి చేరేలోపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతోంది. దీన్ని పక్కన పెట్టి హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని అరికడతామని కేంద్ర మంత్రి చెప్పడం అంటే ‘ఏనుగులు పోయే దారిని వదిలేసి చీమలు దూరే దారిని మూసినట్లు’ ఉంది. ప్రజలెంత తినాలో వాళ్లు చెబుతారట వాస్తవానికి ఇప్పుడు హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కువ ఆహారం వృధా కావడం లేదు. ఖరీదైన హోటళ్లలో వినియోగదారుడికి చాలా తక్కువనే వడ్డిస్తారు. పలు రకాల డిషెస్ ఆర్డర్ ఇచ్చి, వాటిని తినకపోవడం వల్ల కొంత వృధా అవుతుంది. చిన్న హోటళ్లలో వినియోగదారుడికి తలుపులు మూశాకే సిబ్బంది తింటారు గనుక అక్కడ పెద్దగా వృధా కాదు. హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని కూడా ఎన్నో ఎన్జీవోలు ఇప్పుడు సేకరించి పేదలకు, అనాథలకు, అన్నార్తులకు వడ్డిస్తున్నాయి. తమిళనాడులో పుట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన ‘నో ఫుడ్ వేస్ట్’ ఎన్జీవో అలాంటిదే. పెళ్లిళ్లు, పేరంటాల్లో వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి సద్వినియోగం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన ఇలాంటి పనులను పబ్లిక్ చేస్తుంటే పబ్లిక్ ఎంత తినాలన్న ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తానంటోంది.