బిహార్‌ పోరు రసవత్తరం | Bihar assembly elections 2020 | Sakshi
Sakshi News home page

బిహార్‌ పోరు రసవత్తరం

Published Mon, Oct 12 2020 3:41 AM | Last Updated on Mon, Oct 12 2020 3:51 AM

Bihar assembly elections 2020 - Sakshi

ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణం.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జేపీ.. బిహార్‌ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు.  

కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్‌ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది.

పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్‌జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్‌ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్‌ ప్రభావం నితీశ్‌ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ మహాగuŠ‡బంధన్‌ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.  

మోదీకే ప్రతిష్టాత్మకం  
ఈసారి బిహార్‌ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్‌ కుమార్‌ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్‌ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్‌ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్‌ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్‌ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్‌ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్‌ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్‌ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు.  

ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు
► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ మహాగuŠ‡బంధన్‌ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.  
 
► కోవిడ్‌ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది

► దేశవ్యాప్త లాక్‌డౌన్‌ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.  

► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి.  

► బిహార్‌ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది.  


మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243
పోలింగ్‌ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు  
అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7
ఓట్ల లెక్కింపు : నవంబర్‌ 10

2015 ఎన్నికల ఫలితాలు
ఆర్‌జేడీ              80
జేడీ (యూ)        71
బీజేపీ                53
కాంగ్రెస్‌              27
ఇతరులు             8
స్వతంత్రులు         4

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement