Lok Janashakti Party
-
ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్)!
పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నిత్యానంద రాయ్ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు. ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) చేరికపై నిత్యానంద రాయ్ నేరుగా స్పందించలేదు. చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు. -
ECI: చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు
న్యూఢిల్లీ: చీలికతో వివాదంగా మారిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు(ఇల్లు గుర్తు)ను చీలిక వర్గాలైన చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పారస్‌లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే. తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్ వర్గానికి ‘లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)’ పేరును, హెలికాప్టర్ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పారస్ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్ జన శక్తి’ పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది. ‘‘ బిహార్‌లో ఉప ఎన్నికల కోసం ఏ ఇతర పార్టీకి కేటాయించని ‘గుర్తుల జాబితా’లో ఉన్నవేవైనాకావాలంటే మీరు వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ, మీ రెండు వర్గాల గుర్తులు ఒకేలా మాత్రం ఉండకూడదు’’ అని ఈసీ స్పష్టంచేసింది. -
ఎల్జేపీ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ
పట్నా: లోక్ జనశక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ గుర్తు ‘బంగ్లా’ను చిరాగ్ పాశ్వాన్ వర్గం, కేంద్ర మంత్రి పశుపతి పారస్ వర్గాలు ఎవరూ ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్జేపీ గుర్తు కోసం చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్ వర్గాల మధ్య వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. బీహార్‌లోని కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ‘బంగ్లా’ గుర్తును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. జరగబోయే ఉప ఎన్నికల్లో ఉపయోగించే గుర్తు విషయంలో ఈసీ మూడు ఆప్షన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఆప్షన్లను సోమవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనున్నట్లు సమాచారం. -
మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం
పాట్నా: కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఓ మహిళ చేతిలో ఘోర అవమానం జరిగింది. అంతకుముందు ఆయన పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల నల్లజెండాలు ఎదురుపడ్డాయి. పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంకు కేంద్ర మంత్రిపై చల్లింది. మంత్రి కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి మంత్రి దుస్తులు మార్చుకుని యథావిధిగా కార్యక్రమం కొనసాగించారు. ఓ పార్టీలో చిచ్చు రేపడంతోనే ఈ తీవ్ర నిరసనకు కారణమని తెలుస్తోంది. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో బిహార్‌లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి చెందిన పశుపతి కుమార్ పారాస్ హాజీపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బిహార్‌లో రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా పశుపతి మారారు. ఆ ఫలితమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడానికి కారణం. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కించుకున్న పశుపతి తొలిసారి సొంత నియోజకవర్గం హాజీపూర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ క్రమంలోనే అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్జేపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను విబేధించాడు. ప్రస్తుతం పార్టీపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ చీల్చాడని పార్టీ వర్గాల్లో పశుపతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రిగా నియమితుడై తొలిసారిగా వస్తున్నప్పుడే ఈ పరాభవం ఎదురవడం గమనార్హం. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు -
ప్రధాని నా వైపు ఉంటారని ఆశించా.. కానీ: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ: కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా నిలబడతారని ఆశించానని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన రాముడి కోసం ఈ హనుమంతుడు చేయాల్సిందంతా మనస్ఫూర్తిగా చేశాడని, కానీ తాను ఆశించింది జరగలేదని పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్‌కు.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ను తొలగించడం సహా ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా ఆయనే ఉంటారని రెబల్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాశ్వాన్ అసలైన వారుసుడెవరో ప్రజలే తేలుస్తారంటూ జూలై 5 నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు చిరాగ్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతునిచ్చాం. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ వంటి అంశాలను స్వాగతించాం. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. అయితే, నేను కష్టకాలంలో ఉన్నపుడు నా ప్రధాని నావైపు ఉంటారని ఆశించాను. కానీ, అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని, ఎవరూ నాకు సహకారం అందించరని త్వరలోనే నాకు బోధపడింది. అంతేకాదు.. నేను వారి మద్దతు ఆశించేందుకు అర్హుడిని కూడా కాదని అర్థమైంది’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘నా సొంత కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి లాంటి మా బాబాయ్.. నా కొడుకు వంటి నా సోదరుడు(ప్రిన్స్ రాజ్) నాకు ద్రోహం చేశారు. మా బాబాయ్... మా నాన్నకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆయనను కూడా మోసం చేశారు. బాబాయ్.. నాకంటే పెద్దవారు కదా.. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం కనుగొనేవాళ్లం. కానీ ఆయన ఇలా చేయడం సరికాదు. నాకు మాత్రమే కాదు.. నాన్నకు కూడా ఆయన ద్రోహం చేశారు. ఇదంతా చూస్తూ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు’’ అని చిరాగ్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. చదవండి: పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?! -
ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం!
గతేడాది బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయేలో భాగస్వామ్యమైన చిరాగ్ పాశ్వాన్, మరో భాగస్వామి నితీశ్ కుమార్‌కు కంట్లో నలకలా మారారు. ఎన్డీయే కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీశ్‌కు చికాకులు తెచ్చారు. ఒకపక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీశ్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతికష్టం మీద ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా, దాదాపు 35 సీట్లను జేడీయూ కోల్పోయింది. దాంతో తొలిసారి మిత్రపక్షం బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎల్జేపీని బలహీన పర్చే ప్రయత్నాలను జేడీయూ ముమ్మరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి అదను కోసం చూస్తున్న నితీశ్ చాణక్యం వల్లనే తాజాగా ఎల్జేపీలో ముసలం పుట్టిందంటున్నారు. చిరాగ్‌ను ఒంటరి చేసేలా... మిగతా ఎంపీలకు దగ్గరవుతూ నితీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎల్జేపీకి ఉన్న 6గురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరు కుంపటి పెట్టుకొని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. లోక్ జనశక్తి అధినేత పదవిని సైతం చిరాగ్ వదులుకొని తన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు పగ్గాలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక నితీశ్ పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎల్జేపీ ఎంపీలతో నితీశ్ నేరుగా సంప్రదింపులు జరిపారని, ఈ వ్యవహారాన్ని జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ద్వారా నడిపించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రామ్‌విలాస్ మృతితో బీజాలు పశుపతి పరాస్తో మహేశ్వర్ హజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి, కొడుకు మధ్య విబేధాలున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం పశుపతికి, చిరాగ్‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల్లో విడిగా పోటీచేయాలన్న చిరాగ్ నిర్ణయాన్ని అప్పట్లోనే పశుపతి వ్యతిరేకించారు. అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పశుపతిని నితీశ్ దగ్గరకు తీశారని సదరువర్గాల సమాచారం. దీంతో పాటు తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఒకరైన వీణా సింగ్ జేడీయూ నుంచి సస్పెండయిన ప్రజాప్రతినిధి భార్య. తిరిగి నితీశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఈ నేత ఎంతో యత్నిస్తున్నారు. దాంతో వీణాసింగ్ మద్దతు సులభంగానే పరాస్‌కు లభించింది. అలాగే మరో ఎంపీ అనారోగ్యం పాలైనప్పుడు నితీశ్ వ్యక్తిగతంగా ఆయన బాగోగులపై ఆరా తీశారు. ఇలా ప్రతి ఎంపీతో ఏదోరకంగా సత్సంబంధాలు నెరపడం, అటు పశుపతిని దువ్వడం ద్వారా నితీశ్ తాను అనుకున్నది సాధించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఎల్జేపీకి ఉన్న ఏకైక ఎంఎల్ఏ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో జేడీయూకు మద్దతు పలికారు. నితీశ్ పంచన చేశారు. ఉన్న ఒక్క ఎంఎల్సీ బీజేపీలో చేరారు. అప్పుడైనా చిరాగ్ మేలుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను మోదీకి హనుమంతుడి లాంటివాడినని చిరాగ్ ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం నితీశ్‌తో సంధి తప్ప ఆయన్ను కాపాడే మార్గాలేవీ లేవంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో ఉంటూనే జేడీ (యూ)ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చనే వాదనలు అప్పట్లో వినిపించాయి. నితీశ్‌ను బలహీనపర్చి... తమపై ఆధారపడేలా చేసే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే చిరాగ్‌ను జేడీయూపైకి ప్రయోగించారని అంటారు. చివరకు అదే జరిగింది. జేడీయూకు కంటే బీజేపీకి ఎక్కవ స్థానాలు గెలిచినా... ఎన్నికలకు ముందు ప్రకటించిన మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసి... బీజేపీ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పుడు చిరాగ్... ఒంటరిగా మిగిలే పరిస్థితులు వచ్చినపుడు అది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ అంటోంది. రాజకీయాలు తెలిసి రావాలంటే చిరాగ్‌కు ఇంకా సమయం పడుతుందేమో. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యాచారం చేసి చంపేసేవాడు: అమీషా పటేల్
ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్‌లోని దౌద్‌నగర్‌లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్‌ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!) ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్‌లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్‌ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు. అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన. -
నేను మోదీ హనుమాన్‌ని!
పట్నా/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాను హనుమంతుడి వంటి భక్తుడినని లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. తన గుండెల్లో ఆయనే ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకుంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చిరాగ్‌పాశ్వాన్ స్పందించారు. ‘సీఏఏను, ట్రిపుల్ తలాఖ్‌ను, ఎన్ఆర్సీని, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన సీఎం నితీశ్‌కే ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానితో ఆయనే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తన అనుబంధం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తరువాత బిహార్‌లో బీజేపీ– ఎల్జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ ఓట్లను చీల్చే వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ సీనియర్‌నేతలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో బీజేపీ జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలతో కలిసి పోటీ చేస్తోందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో 12 ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని బిహార్ ఎన్నికల ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి చనిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్ హఠాణ్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాశ్వాన్ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్.. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. అతను అణగారిన వర్గాలవారికి స్వరం, అట్టడుగున ఉన్నవారికి విజయాన్ని అందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రామ్‌విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను. - ప్రధాని నరేంద్ర మోదీ రామ్ విలాస్ పాశ్వాన్ జీ అకాల మరణం బాధాకరం. పేదలు, అణగారిన వర్గాలు ఆయన మృతితో ఈ రోజు ఒక బలమైన రాజకీయ గొంతును కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత -
‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’
పట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ పాశ్వాన్, చిరాగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాక ‘కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘సుపరిపాలన’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని.. జాతీయ వేదికపై బిహార్‌కు ‘తగిన గౌరవం’ పొందడానికి సహాయపడుతుందని అన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చొద్దు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యచార నిరోధక చట్టాన్ని నీరుగార్చొద్దని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ రాం విలాస్ పాశ్వాన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, దాన్ని పునఃపరిశీలించాలంటూ మార్చి 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తీసుకు రాకుంటే తాము ఉద్యమబాట పడతామన్నారు. ఆగస్టు 9లోగా జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శ్ గోయెల్‌ను తొలగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతారనే 2014లో బీజేపీకి మద్దతిచ్చామని పాశ్వాన్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పునరుద్ధరించి యథావిధిగా అమలు చేయాలన్నారు. ఆగస్టు 9లోగా తమ డిమాండ్లను గనుక కేంద్రం నెరవేర్చకపోతే ఎన్డీయే నుంచి వైదొలగుతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చొద్దని కోరుతూ దేశవ్యాప్తంగా దళిత, గిరిజన సంఘాలు దేశవ్యాప్తంగా ఆగస్టు 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. -
కొడుకు vs అల్లుడు @ 12 జన్‌పథ్
10 జన్‌పథ్.. రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేనివారికైనా ఈ చిరునామా తెలిసే ఉంటుంది. మరి, ఆ బంగళాకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న 12 జన్‌పథ్ గురించి ఎంతమందికి తెలసులు? అనే సందేహానికి 'ఎనిమిదిన్నర కోట్ల మంది' అని బదులు చెప్పొచ్చు. సెక్యూలరిజం, సోషలిజం, పాపులిజాలే ప్రధాన ఎజెండాగా ప్రారంభమై గడిచిన 15 ఏళ్లుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన విలక్షణ పాత్ర పోషిస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రధాన కార్యాలయం చిరునామా.. 12 జన్‌పథ్. ప్రస్తుతం వారసత్వ కుంపటి రాజేసిన వేడి గాలులు.. 12 జన్‌పథ్ నుంచి బీహార్ మారుమూల పల్లెల వరకు వీస్తున్నాయి. పార్టీపై ఆధిపత్యం విషయంలో రాంవిలాస్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, అల్లుడు అనిల్ కుమార్ సాధూల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చిరకాలంగా పార్టీలో దళిత విభాగానికి నేతృత్వం వహిస్తున్న అనిల్ సాధూకు ఈసారి ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా దక్కకపోవడం 'కొడుకు- అల్లుళ్ల' విభేదాలకు పరాకాష్ట. చదువు పూర్తయిందనిపించిన వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరాగ్ పాశ్వాన్ ఒకటీ అరా సినిమాల్లో నటించాడు. కనీసం బీహార్‌లో కూడా తన సినిమాలు ఆడకపోవడంతో రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఇటు ఢిల్లీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు రెండింటితో టచ్‌లో ఉంటూ రాంవిలాస్ బిజీ కాగా, అటు సొంత రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యతను తలకెత్తుకున్నాడు చిరాగ్. ఆఫీస్ బేరర్ల నియామకం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల వరకు అన్ని నిర్ణయాలూ ఆయనవే. ఈ క్రమంలోనే ఏళ్లుగా పాశ్వాన్నే నమ్ముకుని, పార్టీనే శ్వాసించిన కొందరు సీనియర్లు కూడా పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే చిరాగ్ చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా చిన్నచూపునకు గురైనవారికి పెద్ద దిక్కుగా ఉంటూ 'మావయ్యతో అన్ని విషయాలు మాట్లాడతా' అంటూ సర్దిచెప్పుకొచ్చే రాంవిలాస్ అల్లుడు అనిల్ కుమార్ సాధూ కూడా ఇటీవల ఘోర అవమానాల పాలయ్యాడు. అసమ్మతి నేతలకు నాయకుడిగా ఉంటున్నాడనో మరే కారణమో తెలియదు గానీ అనిల్ సాధూకు టికెట్ నిరాకరించాడు చిరాగ్. అంతే.. సాధూ భగ్గున మండిపోయాడు. 'అసలా యువనేత నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకున్న ప్రజాదరణ మర్చిపోయాడా? 2010 ఎన్నికల్లో మసౌరీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచానన్న విషయం గుర్తులేదా? 15 ఏళ్లుగా పార్టీ బాగు కోసం అహోరాత్రాలు కష్టపడటం చూడలేదా?' అంటూ చిరాగ్ పాశ్వాన్‌పై నిప్పులు కురిపించాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేసి..ఈ ఎన్నికల్లో ఎల్జేపీ- బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు మామ పార్టీని దెబ్బకొట్టేలా సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీలు కొత్తగా ఏర్పాటుచేసిన కూటమిలోకి చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్‌లో ఎల్జేపీకి ఆరు స్థానాలు దక్కాయి. రాంవిలాస్ హజీపూర్ నుంచి, ఆయన తనయుడు చిరాగ్ జముయి నియోజకవర్గాల నుంచి గెలిచారు. కొడుకుకు ఉత్తమ రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకున్న రాంవిలాస్.. చిరాగ్‌ను ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ని చేశారు. అది పార్టీలో చిరాగ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎంపీలందరిపై చిరాగ్ చిందులేసేవారని విమర్శలు వచ్చాయి. ముంగర్ స్థానం నుంచి గెలిచిన మహిళా ఎంపీ వీణాదేవీ మీడియా ముందే చిరాగ్ పై విమర్శలు చేసి, ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఇక వైశాలీ ఎంపీ రామ్ సింగ్ మరో అడుగు ముందుకేసి పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపుల్లో తాను సూచించిన పేర్లను చిరాగ్ పాశ్వాన్ కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదన్నది సింగ్ ఆరోపణ. ఎంపీ, ఎమ్మెల్యే లేకాదు.. మండల, గ్రామ స్థాయి కార్యకర్తల్లోనూ చినబాబు చిరాగ్ పాశ్వాన్ తీరుపై అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ నేతనే చెబుతున్నారు. వారసులను నిలబెట్టుకోవడం కోసం అప్పటికే పేరుపొందిన నేతలు పొరపాట్లు చేస్తుండటం (ఆ పార్టీ కార్యకర్తల దృష్టిలో) సహజమే అయినప్పటికీ అవి మొత్తం పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేవిగా మారితే అంతకన్నా విషాదం ఉండదు. వర్తమాన రాజకీయాల్లో పెళ్లికాని వారికి.. ఎట్ లీస్ట్.. వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకునే వారికే ప్రజాదరణ మెండుగా ఉందన్న సంగతి మోదీ, మాయ, మమత, నవీన్, రాహుల్ లాంటి వాళ్లను చూశాకైనా రాంవిలాస్ లాంటి 'పుత్రప్రేమికులకు' అర్థమవుతుందా?.. కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా! -
ఎన్డిఏతో జతకట్టనున్న లోక్‌జనశక్తి