ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్‌లోని దౌద్‌నగర్‌లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్‌ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!)
ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్‌లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు)
అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్‌లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్‌ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు.
అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment