పట్నా/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాను హనుమంతుడి వంటి భక్తుడినని లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. తన గుండెల్లో ఆయనే ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకుంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చిరాగ్‌పాశ్వాన్ స్పందించారు.
‘సీఏఏను, ట్రిపుల్ తలాఖ్‌ను, ఎన్‌ఆర్‌సీని, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన సీఎం నితీశ్‌కే ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానితో ఆయనే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తన అనుబంధం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తరువాత బిహార్‌లో బీజేపీ– ఎల్జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ ఓట్లను చీల్చే వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ సీనియర్‌నేతలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో బీజేపీ జేడీయూ, హెచ్‌ఏఎం, వీఐపీ పార్టీలతో కలిసి పోటీ చేస్తోందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో 12 ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని బిహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment