కొడుకు vs అల్లుడు @ 12 జన్పథ్
10 జన్పథ్.. రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేనివారికైనా ఈ చిరునామా తెలిసే ఉంటుంది. మరి, ఆ బంగళాకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న 12 జన్పథ్ గురించి ఎంతమందికి తెలసులు? అనే సందేహానికి 'ఎనిమిదిన్నర కోట్ల మంది' అని బదులు చెప్పొచ్చు. సెక్యూలరిజం, సోషలిజం, పాపులిజాలే ప్రధాన ఎజెండాగా ప్రారంభమై గడిచిన 15 ఏళ్లుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన విలక్షణ పాత్ర పోషిస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రధాన కార్యాలయం చిరునామా.. 12 జన్పథ్.
ప్రస్తుతం వారసత్వ కుంపటి రాజేసిన వేడి గాలులు.. 12 జన్పథ్ నుంచి బీహార్ మారుమూల పల్లెల వరకు వీస్తున్నాయి. పార్టీపై ఆధిపత్యం విషయంలో రాంవిలాస్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, అల్లుడు అనిల్ కుమార్ సాధూల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చిరకాలంగా పార్టీలో దళిత విభాగానికి నేతృత్వం వహిస్తున్న అనిల్ సాధూకు ఈసారి ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా దక్కకపోవడం 'కొడుకు- అల్లుళ్ల' విభేదాలకు పరాకాష్ట.
చదువు పూర్తయిందనిపించిన వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరాగ్ పాశ్వాన్ ఒకటీ అరా సినిమాల్లో నటించాడు. కనీసం బీహార్లో కూడా తన సినిమాలు ఆడకపోవడంతో రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఇటు ఢిల్లీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు రెండింటితో టచ్లో ఉంటూ రాంవిలాస్ బిజీ కాగా, అటు సొంత రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యతను తలకెత్తుకున్నాడు చిరాగ్. ఆఫీస్ బేరర్ల నియామకం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల వరకు అన్ని నిర్ణయాలూ ఆయనవే. ఈ క్రమంలోనే ఏళ్లుగా పాశ్వాన్నే నమ్ముకుని, పార్టీనే శ్వాసించిన కొందరు సీనియర్లు కూడా పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే చిరాగ్ చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలా చిన్నచూపునకు గురైనవారికి పెద్ద దిక్కుగా ఉంటూ 'మావయ్యతో అన్ని విషయాలు మాట్లాడతా' అంటూ సర్దిచెప్పుకొచ్చే రాంవిలాస్ అల్లుడు అనిల్ కుమార్ సాధూ కూడా ఇటీవల ఘోర అవమానాల పాలయ్యాడు. అసమ్మతి నేతలకు నాయకుడిగా ఉంటున్నాడనో మరే కారణమో తెలియదు గానీ అనిల్ సాధూకు టికెట్ నిరాకరించాడు చిరాగ్. అంతే.. సాధూ భగ్గున మండిపోయాడు.
'అసలా యువనేత నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకున్న ప్రజాదరణ మర్చిపోయాడా? 2010 ఎన్నికల్లో మసౌరీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచానన్న విషయం గుర్తులేదా? 15 ఏళ్లుగా పార్టీ బాగు కోసం అహోరాత్రాలు కష్టపడటం చూడలేదా?' అంటూ చిరాగ్ పాశ్వాన్పై నిప్పులు కురిపించాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేసి..ఈ ఎన్నికల్లో ఎల్జేపీ- బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు మామ పార్టీని దెబ్బకొట్టేలా సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీలు కొత్తగా ఏర్పాటుచేసిన కూటమిలోకి చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్లో ఎల్జేపీకి ఆరు స్థానాలు దక్కాయి. రాంవిలాస్ హజీపూర్ నుంచి, ఆయన తనయుడు చిరాగ్ జముయి నియోజకవర్గాల నుంచి గెలిచారు. కొడుకుకు ఉత్తమ రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకున్న రాంవిలాస్.. చిరాగ్ను ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ని చేశారు. అది పార్టీలో చిరాగ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎంపీలందరిపై చిరాగ్ చిందులేసేవారని విమర్శలు వచ్చాయి. ముంగర్ స్థానం నుంచి గెలిచిన మహిళా ఎంపీ వీణాదేవీ మీడియా ముందే చిరాగ్ పై విమర్శలు చేసి, ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఇక వైశాలీ ఎంపీ రామ్ సింగ్ మరో అడుగు ముందుకేసి పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపుల్లో తాను సూచించిన పేర్లను చిరాగ్ పాశ్వాన్ కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదన్నది సింగ్ ఆరోపణ. ఎంపీ, ఎమ్మెల్యే లేకాదు.. మండల, గ్రామ స్థాయి కార్యకర్తల్లోనూ చినబాబు చిరాగ్ పాశ్వాన్ తీరుపై అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ నేతనే చెబుతున్నారు.
వారసులను నిలబెట్టుకోవడం కోసం అప్పటికే పేరుపొందిన నేతలు పొరపాట్లు చేస్తుండటం (ఆ పార్టీ కార్యకర్తల దృష్టిలో) సహజమే అయినప్పటికీ అవి మొత్తం పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేవిగా మారితే అంతకన్నా విషాదం ఉండదు. వర్తమాన రాజకీయాల్లో పెళ్లికాని వారికి.. ఎట్ లీస్ట్.. వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకునే వారికే ప్రజాదరణ మెండుగా ఉందన్న సంగతి మోదీ, మాయ, మమత, నవీన్, రాహుల్ లాంటి వాళ్లను చూశాకైనా రాంవిలాస్ లాంటి 'పుత్రప్రేమికులకు' అర్థమవుతుందా?.. కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా!